Tuesday, September 30, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
                 ▪️ *స్రీ శక్తి*▪️

*సృష్టికి మూలశక్తిగా అలరారే స్త్రీకి ఎక్కడ గౌరవనీయ స్థానముంటుందో అక్కడ శుభం, సౌభాగ్యం వర్ధిల్లుతాయి. అలాంటి స్త్రీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే అవుతుంది. ‘శక్తి రూపాలైన సీత గౌరీ వాగీశ్వరి వంటి వారి రూపంలో గాని ఉన్నావా రామా?’ అని ‘ఏతావునరా నిలకడ నీకు?’ అనే కీర్తనలో అడిగాడు త్యాగయ్య. పౌరాణిక గ్రంథాలు, కావ్యాలు సైతం మానవజాతి భవిష్యత్‌ అంతా స్త్రీ శక్తి మీద ఆధారపడి ఉంటుందని ముక్త కంఠంతో చెబుతున్నాయి.*

*సీతాన్వేషణలో భాగంగా లంకను చేరే ప్రయత్నంలో రాక్షసి అని తెలిసినా సురసను ఉద్దేశించి హనుమంతుడు ‘మాతా’ అని సంబోధించాడు. ‘రామకార్యం నెరవేర్చడానికి సహకరించమ’ని మర్యాదపూర్వకంగా ప్రార్థించాడు. సీత జారవిడిచిన ఆభరణాల* *ఉత్తరీయాన్ని పరిశీలించమంటే లక్ష్మణుడు... ‘నేను ఆమె ముఖం వైపు ఎప్పుడూ చూడలేదు. నిత్యం పాదాభివందనం చేసేవాణ్ని కనుక ఆమె పాదాలకు ధరించిన నూపురాలను మాత్రం గుర్తించగలన’ని చెప్పాడట. అదీ మన సంస్కృతి స్త్రీకి ఇచ్చిన గౌరవం. స్త్రీ... పురుషుడి వెనుక ఉంటే బలం. ముందుంటే కవచం. పక్కనే ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేసే అద్భుతం. అందుకే మహాశివుడు సైతం అర్ధనారీశ్వరుడు అయ్యాడు. భగవంతుడు ప్రతి ఇంట తాను ఉండే అవకాశం లేక తల్లిరూపంలో ఓర్పుగా నిలబడతాడని పెద్దల మాట. అందుకే ఉపనిషత్తులు ‘మాతృదేవోభవ’ అని చెప్పింది. మేనమామ ఇంటినుంచి అయోధ్యకు చేరిన భరత శత్రుఘ్నులకు తండ్రి మరణించడానికి, రాముడు వనవాసానికి వెళ్లడానికి కారణం కైకేయి అని, దానికి ప్రేరకురాలు మంధర అని తెలుస్తుంది. శత్రుఘ్నుడు పట్టలేని కోపంతో మంధర శిగను పట్టుకుని రాజ ప్రాంగణానికి ఈడ్చుకు వచ్చాడు. అప్పుడు భరతుడు రాముడిక స్త్రీలపై ఉన్న గౌరవాన్ని వివరించి, ఆమెను క్షమించి వదిలిపెట్టమని కోరాడు. ఇదీ మన సంస్కృతి విశిష్టత.*

*ఇంత గొప్పగా చెప్పుకొంటున్నా... నాణానికి రెండో వైపు అన్నట్టుగా స్త్రీలను హింసించి ఇబ్బందులకు గురి చేసేవారు, చెరబట్టి వినాశనాన్ని కొని తెచ్చుకునేవారూ కోకొల్లలు. ద్రౌపదిని తన అంకం మీద కూర్చోమని ఆజ్ఞాపించిన, ఆమెను నిండు సభకు తీసుకొచ్చిన దుర్యోధన దుశ్శాసనులు ఎటువంటి మరణాన్ని పొందారో, పరస్త్రీ వ్యామోహంతో రావణుడు ఏమయ్యాడో మనకు తెలుసు. మన చుట్టూ ఇటువంటి కీచకులూ ఉన్నారు. రామలక్ష్మణుల వంటి మర్యాదా పురుషోత్తములూ ఉన్నారు. సమాజానికి చీడవంటి నరకాసురులను దునుమాడటానికి సత్యభామ స్త్రీ శక్తిగా లోకానికి ప్రేరణ అయింది. మనుషుల్లోని ఇటువంటి రాక్షసులను వదిలించుకోవాలని, ‘స్త్రీల ఉద్ధరణ జరగకుండా భారతదేశం పురోగమించద’ని వివేకానందుడు అన్నాడు. దాన్ని నేటితరం అర్థం చేసుకోవాలి. మహిళలను చిన్నచూపు చూడటమంటే ‘అమ్మశక్తి’ని అవమానించడమేనని తెలుసుకోవాలి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment