Wednesday, September 24, 2025

 🌺🌻🌸🪻🌷🪻🌸🌻🌺

*నాల్గోవ రోజు* 
*బతుకమ్మ పండుగలో*  
*"నానబియ్యం బతుకమ్మ"...!!*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగతో.. రాష్ట్రమంతటా కోలాహలం నెలకొంది.

మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. అచ్చమైన ఈ ప్రకృతి పండుగను తొమ్మిదిరోజుల పాటు జరుపుకుంటారు. తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని పూజిస్తారు.

*ఇవాళ నాలుగో రోజు సందర్భంగా...*

నానబియ్యం బతుకమ్మను చేస్తారు. 
నానేసిన బియ్యం , పాలు , బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
నాలుగంతరాల బతుకమ్మ
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో విధంగా గౌరమ్మను కొలుస్తూ... ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. 

నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మగా కొలుస్తారు. 
తంగేడు, గునుగు , బంతి , చామంతి వంటి ఒక్కోరకం పూలతో నాలుగంతరాల బతుకమ్మను పేరుస్తారు. 

శిఖరంపై పసుపుతో తయారుచేసిన గౌరమ్మను ఉంచుతారు. ఉదయం అమ్మవారికి పూజలు చేసి... సాయంత్రం వేళ గంగమ్మ ఒడికి చేరుస్తారు. 

ఇవాళ నానపెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చక్కెరతో కలిపి ముద్దలుగా తయారు చేసి... పంచుతారు.

*గంగమ్మ చెంతకు బతుకమ్మ*

సాయంత్రం వేళ విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమలను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. 

మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. 

*బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...* 
*బంగారు బతుకమ్మ ఉయ్యాలో...*
*ఒక్కేసి పువ్వేసి చందమామ...* 
*ఒక్కజాములాయే చందమామ...* 
*పసుపుల పుట్టింది గౌరమ్మా...*
*పసుపుల పెరిగింది గౌరమ్మా...* 

అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు , బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. చివరగా ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చుతారు...

...స్వస్తి...

🌺🌻🌸🪻🌷🪻🌸🌻🌺

No comments:

Post a Comment