*మార్గదర్శకులు మహర్షులు -12*
🪷
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి
*కశ్యపప్రజాపతి -3*
మహర్షులందరూ తపస్సు చేసుకునేటటు వంటి నైమిశారణ్యానికి కశ్యపప్రజాపతి ఒకసారి వెళ్ళాడు. ఋషులందరూ ఆయన్ని గౌరవించి పూజించారు. వాళ్ళ యోగక్షేమాలన్నీ అడిగిన తరువాత, వాళ్ళు, 'మేము ఎక్కడో చిన్నచిన్న వాగులలో స్నానం చేస్తున్నాము. చెరువుల లో స్నానాలు చేస్తున్నాము. ప్రవహించే ఉదకంతో చక్కగా శాశ్వతంగా ఉండే ఒక నది మాకు లభిస్తే మా జపహోమాది అనుష్ఠానములన్నీ చక్కగా నదీ స్నానంతో బాగుండి పవిత్రమవుతాయి కదా స్వామీ? నీవు సర్వలోకాలను సంరక్షణ చేసేంత సమర్థుడవు. నీ పేరుతో పవిత్రగంగానదిని ఈ భూమిపైన ప్రవేశపెట్టి దాన్ని ఇక్కడ ప్రవహింపచేసి లోకక్షేమాన్ని కలిగించి మా కోరిక తీర్చు" అని ఆయనను అడిగారట.
అప్పుడు అభూతాద్రి అనే పర్వతం హిమాలయాల్లోనే ఉంది. కశ్యప ప్రజాపతి అక్కడికి వెళ్ళి ఘోరనిష్ఠతో శివుణ్ణి గూర్చి తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమయి వరం కోరుకోమంటే కశ్యపుడు గంగను భూలోకంలో ప్రవహింప చెయ్యమని అడిగాడు. అంతకుముందే భగీరథుడి యొక్క తపోబలం వలన, వియద్గంగను - ఆకాశగంగను శివుడు తన జటాజూటము నందు ధరించి ఉన్నాడు. ఒక శాఖను మాత్రమే వదిలిపెట్టాడు అప్పుడు. అది పాతాళానికి వెళ్ళిందని - సముద్రమైనదని చెప్పుకున్నాం కదా!
మరి ఇప్పుడు భూలోకంలో ప్రవహించ వలసిన గంగ కావలసివచ్చింది ఇక్కడ. అప్పుడు శివుడు వదిలిపెట్టిన గంగపాయ ఒకటి సగర పుత్రుల ఉత్తమగతుల కోసమని సముద్రంగా మారింది. అందుకని ఇప్పుడు శివుడు తన జటాజూటం నుంచి మళ్ళీ ఒక చిన్నపాయను - గంగాపాయను వదలిపెట్టగా అది ఆయన తపోవాటిక మీదుగా నైమిశారణ్యం వరకూ శివాను గ్రహంతో భూమి పైకి వచ్చిప్రవహించింది. ఆ గంగావాహినికి, చాలా యుగాలకు పూర్వం 'కాశ్యపి' అని పేరు పెట్టారు మహర్షులు. కశ్యప ప్రజాపతి తపోబలం చేత భూమిమీదికి వచ్చింది కాబట్టి దానికి 'కాశ్యపి' అనే పేరు పెట్టారు. ఆ నదికే కృత యుగంలో 'కృతవతి' అనే పేరు ఉంది. ఆ నది త్రేతాయుగంలో 'గిరికర్ణిక' అనే పేరు తోను, ద్వాపర యుగంలో 'చందన' అనే పేరుతోను, కలియుగంలో 'సాభ్రమతి' గాను విఖ్యాతిచెందింది.
ఈ విషయాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే, చాలా విలువైన సమాచారం తెలుస్తుంది. సాభ్రమతి ఎక్కడ ఉన్నది? గిరికర్ణిక ఏమిటి? వీటికి సమాధానాలు ఆలోచిస్తే అపురూపమయిన అత్యంత విలువయిన సమాచారం మనకు లభిస్తుంది. ఇదంతా విజ్ఞానమే! ఋషులచరిత్రే మహావిజ్ఞాన సంపద. నేటి భారతవర్షంలో ప్రవహించే నదులు, పర్వతములతో వాటిని సమన్వయం చేసుకుంటే పూర్వభారత జ్ఞానం కలుగుతుంది మనకు.
సాభ్రమతి అనేది కలియుగంలో వచ్చిన ఒక మహానది. ఇది సకలపాపసంహారిణి. ఈ నదీతీరంలోనే అనేకమంది మహర్షులు అవక్రీతుడు, రైభ్యుడు, అంగిరసుడు, దత్తాత్రేయుడు, విశ్వామిత్రుడు, భృగువు భరద్వాజుడు మొదలయినటువంటివారు తపస్సులు చేసి ఫలం పొందారు.
ఆ నదీతీరంలోనే నీలకంఠ తీర్థం, నందహ్రదం, రుద్రహ్రదం, రుద్రమహాలయం అనేటటువంటి తీర్థాలున్నాయి. మందాకినీ అచ్ఛోద, సాభ్రమతి అనే నదుల్లోనే ఆ తీర్థాలు అంతర్వాహినిగా ఉండి గూఢంగా ప్రవహిస్తున్నాయి. ఈ సాభ్రమతి నదివల్లనే అనేక తీర్థములు - బ్రహ్మచారి, వికీర్ణ, శ్వేత, గణాగ్ని, హిరణ్య, సంగమాప్సరస, కపితీర్థము, మంకితీర్ణము, పిప్పలాద, నింబార్కాది తీర్థములు -మొదలయినవి అనంతంగా ఏర్పడ్డాయి. తరువాత వచ్చినటువంటి పండితులు కూడా వీటిని సేవించారు. వాళ్ళు సేవించుటచేత ఆ తీర్థములు ఆ నదియందున్నవని చెప్పబడింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కశ్యపమహర్షి తపస్సు చేసిన తీర్థానికి 'కాశ్యపతీర్థం' అని పేరు వచ్చింది. అక్కడ కశ్యపమహర్షి నిర్మించిన కుండానికి 'కాశ్యప కుండము' అని పేరొచ్చింది. అక్కడ కుశేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడిని ఆయన స్థాపన చేసాడు. ఆ పరిసరాలలో ఒక నగరాన్ని కూడా ఆయన నిర్మాణం చేసాడట. కశ్యప ప్రజాపతికి సంబంధించిన ఏ క్షేత్రంలోనైనా, ఏ తీర్థంలో నైనా ఎవరు స్నానంచేసినా సకలపాప క్షయం అవుతుందని 'పద్మపురాణం'లో చెప్పబడిన కధ ఇది.
📖
ఆ తరువాత భూమిమీద నెమ్మదిగా రాజ వంశాలు పుట్టి పెరిగాయి. అయితే కొంత కాలానికి, భూమిమీద ధర్మం నశించిందట. అధర్మం పెరిగిపోయింది. బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులన్నీ మానేశారు. అకృత్యాలన్ని చేస్తున్నారు. ఈ మహా దోషాలతోటి భూమి పాతాళానికి దిగిపోతుంది. అంటే Sinking. భూమి కిందికి దిగిపోతోంది.
(ప్రస్తుతం కలకత్తానగరం కూడా సంవత్సరానికి ఒక అంగుళం కిందికి దిగిపోతున్నది. భూమి, క్రింద సముద్రంలో కలసిపోయే ప్రయత్నంలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది).
అలా దిగిపోతున్న భూమిని కశ్యపుడు, తన ఊరువులతో ధరించి పైకెత్తి జీవకోటిని రక్షించాడట. ఆ యుగంలో భూమి కశ్యప మహర్షికి నమస్కరించి, సుక్షత్రియులు మళ్ళీ పుట్టి వాళ్ల దండనీతితో ధర్మాన్ని సంరక్షించాలని కోరి ఆయన్ని వరం అడిగింది. అప్పుడు కశ్యపుడు పరశు రాముడి చేతుల్లో చావకుండా మిగిలిన క్షత్రియులెవరు అని అడిగాడు భూదేవిని. ఆమె, హైహయులు అని జవాబు చెప్పింది. పౌరవంశస్థుడైన విదూరథుని కుమారుడు ఋక్షపర్వతమున ఋక్షములు రక్షిస్తున్నాడు. పౌదాసుని వంశమువాడొకడు, పరాశరమహర్షి యజ్ఞంలో శూద్రకర్మలు చేస్తూ బ్రతికి ఉన్నాడు. శిబిమనుమడు గోపతి అనే వాడొకడు గోవులు రక్షించుకుంటూ బ్రతుకుతున్నాడు. ప్రతర్దనుడనే రాజు కొడుకు వత్సరాజు అలాగే జీవిస్తూ, ఎక్కడో ఉన్నాడు. ఆ అంకురాలు మిగిలాయని చెప్పింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
వాళ్ళను పిలిచి మళ్ళీ వాళ్ళకు క్షేత్రాన్ని ప్రసాదించి, రాజులని చెయ్యమని అడిగితే ఆ రాజపుత్రులందరినీ పిలిచి కశ్యపుడు భూమిని విభాగాలు చేసి వాళ్ళకు ఇచ్చి పరిపాలించమని చెప్పాడు. తరువాత ఆ క్షత్రియవంశాలు వృద్ధిపొందినవి. క్షత్రియ పరిపాలన మళ్ళీ సుస్థిరమయింది. వామనుడు కూడా కశ్యప ప్రజాపతి కుమారుడే! కశ్యపుడికి, ఆయన మొదటి భార్య అదితికి వామనుడు పుట్టాడు. అంటే, కశ్యప ప్రజాపతికి తరువాత వచ్చిన అవతారం వామనావతారం అని తెలుస్తోంది.
📖
కశ్యపమహర్షికి ఒకసారి గోవులమీద చాలా కోరిక కలిగింది. అందుకని సముద్రుడి దగ్గరికి వెళ్ళి తనకు గోవులనివ్వమని అడిగితే సముద్రుడిచ్చాడు. ఆప్రకారము వాటిని ఆశ్రమానికి తీసుకెళ్ళి వాటి పాలు తాగుతూ కొంతకాలం ఆ సుఖాన్ని అనుభవించాడు. కొంతకాలానికి సముద్రుడు వచ్చి తనగోవుల్ని తనకిమ్మని అడిగాడు. సరే ఇస్తానన్నాడు కశ్యపుడు. అయితే ఆయన భార్యలయిన అదితి, కపి అనేవాళ్ళకు ఆ గోవులను ఇవ్వటం ఇష్టం లేదు. వాళ్ళు కశ్యపుడితో, "గోవులను సముద్రుడి కిచ్చేస్తే మనకు ఇబ్బంది అవుతుంది. కదా! అందుకని తరువాత ఇస్తానని చెప్పి పంపండి!" అన్నారు.
సముద్రుడు మాత్రం ఏం చేస్తాడు! ఆయన ఇస్తే తీసుకెళ్ళాలి గాని, నిష్ఠూరంగా మాట్లాడటానికి వీలులేదు. కశ్యపుడు ప్రజాపతి, మహర్షి, జ్ఞాని, తపోబల సంపన్నుడు, దేవతలకు తండ్రి. ధేనువుల మీద ఆశతో ఉన్నాడు ఆయన. చేసేది లేక సముద్రుడు వెళ్ళి బ్రహ్మతో తన గోడు చెప్పుకున్నాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. దాంతో సముద్రుడు, “ఈ గోధనం మీద నీవు ఇంత లోభం కలిగిఉండి నాకు అన్యాయం చేసావు. ఒక పాపం, ఒక తప్పుచేసావు. నీకు వాటిమీద అంతలోభం ఉంది కాబట్టి నువ్వు గోపాలకుడివై భూమి మీద పుట్టు" అని కశ్యపుణ్ణి శపించాడు సముద్రుడు.
ఆ కారణంచేతనే కశ్యపుడు వసుదేవుడై జన్మించి, కంసుడి గోగణానికి అధిపతి అయ్యాడు. కంసుడి రాజ్యంలో వసుదేవు డికున్న అధికారమది. గోగణానికి, అంటే పశుసంపద కంతా కూడా ఆయన పాలకుడు. ''హరివంశం'లో ఈ గాథ ఉంది.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment