Wednesday, October 22, 2025

 *మహామంత్రి మాదన్న - 15* 
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽

రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు


'రజా కులీ, సుల్తాన్ కి జరిగిన విషయాన్ని నివేదించు' అంది హయత్ బక్షీ బేగం.

'మీర్జా మహమ్మద్ సయ్యద్ ని ఒక కంట కనిపెట్టమని, అతని చర్యలు గమనించ మని మీరు ఆదేశించారు' మొదలుపెట్టాడు రజా కులీ.

'అవును. అతని గురించి, అతని ద్రోహ బుద్దిని గురించి మాదన్న నాకు ఉప్పు అందించాడు. అందుకే కుతుబ్షాహీలకి అత్యంత విశ్వాసపాత్రుడవయిన నీకు ఆ బాధ్యత అప్పగించడం జరిగింది' అంది హయత్ బక్షీ బేగం.

'విషయం చెప్పు' అన్నాడు సుల్తాన్.

'మీర్జా మహమ్మద్ సయ్యద్ గొప్ప సేనాని. పుట్టు సైనికుడు. అతని ఆధీనంలో వున్న గోలుకొండ సైన్యంతో పాటు, ఆయనకి సొంత సైన్యమూ వుంది. తన దండయాత్ర లలో ఎన్నో దేవాలయాలు కూలగొట్టాడు. అక్కడి కంచు రాగి విగ్రహాలను కరిగించి ఫిరంగులు చేయించాడు'.

సుల్తాన్ భృకుటి ముడిపడింది. 'ఊ చెప్పు' అన్నాడు.

'వజ్రాల గనులు అనేకం అతని ఆధీనంలోకి వచ్చాయి. ఆ వజ్రాలను తన సొంత ఆస్తి అనుకుంటున్నాడు. సాలీనా నలభై లక్షల హెూన్నుల ఆదాయం గల కర్నాటక ప్రాంతాన్ని తన సొంత జాగీరుగా భావిస్తున్నాడు' కులీ ఆపాడు.

'అబ్దుల్లా, ఈ విషయంలో నీ నిర్ణయం ఏమిటి' అడిగింది రాజమాత.

'తక్షణం రాజధానికి రమ్మని, మీర్ జుమ్లా మీర్జా సయ్యద్ కి ఆదేశం పంపుతాను' అన్నాడు అబ్దుల్లా.

“సరియైన నిర్ణయం తీసుకున్నావు. అంత గొప్ప సైన్యంతో, అపార సంపదతో అతన్ని రాజధానికి దూరంగా వుంచడం రాజనీతి కాదు. అతను సుల్తాన్ కి అందుబాటులో లేకుండా వుండటం ఎప్పటికయినా ప్రమాదమే' అంది రాజమాత.

'రాజమాత సరిగ్గా సెలవిచ్చారు. అయితే ఈ విషయంలో ఒక చిక్కు ఉంది' అన్నాడు రజా కులీ.

'ఏమిటది' అడిగాడు సుల్తాన్.

'మీర్ జుమ్లా సయ్యద్ గండికోటను తన జాగీరుగా చేసుకుని అక్కడ స్వతంత్ర ప్రభువుగా వ్యవహరిస్తున్నాడు. మీర్ జుమ్లా గానో, గొప్ప అమీరుగానో అతడు గోలుకొండ కొలువుకు రావడానికి అసలు ఇష్టపడడు. నేను గ్రహించిన దానిని బట్టి ఇప్పుడు అతను మొగలుల ప్రాపు కోసం ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే తొమ్మిది వందల రత్తీలు తూగే కొండలాంటి కాంతి గల అత్యంత విలువైన వజ్రాన్ని షాజహాన్ చక్రవర్తికి కానుకగా పంపాడు. ఈ విషయంలో మొగలు రాయబారి అబ్దుల్ లతీఫ్ అతనికి అన్ని విధాలా అండగా వున్నాడు'.

'ఆ గొప్ప వజ్రం గోలుకొండ సంపద. నీ రాజ్యంలో దొరికిన వజ్రాన్ని నీకు సమర్పించకుండా షాజహాను చక్రవర్తికి దోచిపెట్టడం నీచమైన నమ్మక ద్రోహం' అంది రాజమాత ఆగ్రహంతో ఊగిపోతూ.

సుల్తాన్ మొహం కోపంతో ఎర్రబడింది.

'మాదన్నా, ఆ అత్యాచారం ఎవరు చేశారో సుల్తానికి నివేదించు' ఆదేశించింది హయత్ బక్షీ బేగం.

'ప్రభూ, ఆ అమ్మాయిని అత్యాచారం చేసింది ఇక్కడ ఉప మీర్ జుమ్లాగా అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్న అతని కొడుకు మీర్జా అమీన్' చెప్పాడు మాదన్న.

సుల్తాన్ మొహంలో రంగులు మారాయి. 'అమీన్ ఎలాంటివాడు' అడిగాడు మాదన్నని.

'ప్రభూ, అమీన్ ధూర్తుడు. ఈ గోలుకొండ సామ్రాజ్యంలో తనకి తన తండ్రికి ఎదురు లేదని విర్రవీగుతున్నాడు. అందుకే ఒళ్లు పై తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇన్ని అవలక్షణాలున్నా అమీన్ తెలివి తక్కువ దద్దమ్మ కాదు. తండ్రి సూచనల ప్రకారం మొగలు ప్రతినిధి మీర్ మోమిన్ కి నిత్యం అందుబాటులో  వుంటాడు' అన్నాడు మాదన్న.

'వాడు, వాడి తండ్రి ఎంతటి వాళ్లయినా నేను లెక్కచెయ్యను' అన్నాడు సుల్తాన్ ఆవేశంగా.

'ప్రభూ, మీర్ జుమ్లాకి గోలుకొండ లో రహస్యాలు చాలా తెలుసు. మీరు ఆచి తూచి అడుగు వెయ్యాలి' అన్నాడు మాదన్న.

'మాదన్న తల పండిన రాజనీతిజ్ఞుడిగా మాట్లాడాడు. మీర్ జుమ్లా కీలకమైన వ్యక్తి. అతడు మొగలులతో చేతులు కలిపే అవకాశం ఇవ్వడం దొంగకి తాళం చెవి ఇచ్చినట్టే అవుతుంది. దీనికి విరుగుడు ఆలోచించాలి' అంది హయత్ బక్షీ బేగం.

అంతా ఆలోచిస్తూ వుండిపోయారు.

'అందరిలోకి మొదట తేరుకున్న హయత్ బక్షీ బేగం ‘మాదన్నా, నువ్వు చాలాకాలం మీర్జా సయ్యద్ పేష్కార్ గా వున్నావు కదూ'.

'అవును రాజమాతా'

'మీర్జా సయ్యద్, కొడుకు అమీన్ పట్ల ఎలా ఉంటాడు' అడిగింది.

'రాజమాతా, మీర్ జుమ్లాకి కొడుకు అంటే పంచ ప్రాణాలు. అందుకే కొడుకులో ఎన్ని అవలక్షణాలున్నా పెద్దగా పట్టించుకోడు. పైగా తన వారసుడని మురిసిపోతాడు. నా ఉద్దేశం ప్రకారం కొడుకు కోసం ఏదైనా చేస్తాడు. దేనికైనా సిద్ధపడతాడు' అన్నాడు మాదన్న.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'ఇంకేం. మన పని సగం అయింది. వెంటనే అమీన్ని దర్బారుకు పిలిపించు. నిండు సభలో అత్యాచారం విచారించు. అమీన్ అకృత్యం విన్న అమీరులకి, ఇతరులకి అతని పట్ల ఎంత మాత్రం సానుభూతి వుండదు. అతన్ని కారాగారంలోకి తొయ్యి. దాంతో మీర్ జుమ్లా మీర్జా సయ్యద్ కాళ్ల బేరానికి వస్తాడు. అలా వచ్చిన మీర్జాను..'

'ఏం చెయ్యమంటారు' అడిగాడు సుల్తాన్.

'విశ్వాసఘాతకుడు అతి ప్రమాదకరమైన శతృవు. మీర్జా లాంటి పరాక్రమశాలి, జిత్తులమారి ఇలాంటి విశ్వాసఘాతకానికి ఒడిగడితే మహా సామ్రాజ్యాలు పునాదుల తో సహా కూలిపోతాయి. అందుకే మీర్ జుమ్లా మీర్జా సయ్యద్ రాగానే విషం ఇచ్చి చంపడమో, గుడ్డివాడిని చేసి చెరసాలలో వెయ్యడమో చెయ్యాలి. మరో మార్గం లేదు' అంటూ రాజమాత ఆ సమావేశం ముగించింది.
📖

మొగలు రాయబారి అబ్దుల్ లతీఫ్, ప్రతినిధి మీర్ మోమిన్, అమీన్ కలిసి తాగుతున్నారు.

'దర్బారులో హాజరు కావాలని సుల్తాన్ ఫర్మానా పంపాడు' చెప్పాడు అమీన్.

'ఎందుకంట' అడిగాడు లతీఫ్.

'నాకు నచ్చిన ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చి నాలుగు రోజుల తర్వాత వదిలేశాను. అంతకంటే ఆ అమ్మాయికి ఏ హాని చెయ్యలేదు'.

'ఇది మామూలు విషయమే. దర్బారుకి పిలిపించి అడిగేటంత గొప్ప విషయం కాదు. ఇంతకీ ఆ ఫర్మానా నీకు అందించే ధైర్యం ఎవరు చేశారు' అడిగాడు మీర్ మోమిన్.

'మాదన్న. గతంలో మా నాన్న దగ్గర ఉద్యోగం చేశాడు. ఇప్పుడు హయత్ క్షీ బేగంకి గులాంగిరి చేస్తున్నాడు' అన్నాడు కోపంగా.

"ఇంతకీ దర్బార్ కి ఎప్పుడు వెళ్లాలి' అడిగాడు లతీఫ్.

'ఇవాళ సాయంత్రం. నాకు వెళ్లాలని లేదు' అన్నాడు అమీన్.

'భయపడుతున్నావా' అడిగాడు మీర్ మోమిన్.

అమీన్ సమాధానం చెప్పలేదు..

'ఏ మాత్రం భయపడే అవసరం లేదు. మీ తండ్రి మహావీరుడు, అతి సంపన్నుడు. ఆయనకి సాక్షాత్తు దక్కన్ సుబేదారు ఔరంగజేబు వెన్నుదన్నుగా వున్నాడు. నీ మీద ఈగ వాలదు' ధైర్యం చెప్పాడు మీర్ మోమిన్.

'అయినా నాకు వెళ్లాలని లేదు'

'నువ్వు వెళ్లి తీరాలి. ఇది మొగలు రాయబారి అభీష్టం. నా అభీష్టాన్ని తోసి రాజనడానికి సుల్తాన్ కూడా ధైర్యం చెయ్యడు' అన్నాడు అబ్దుల్ లతీఫ్.

'మీకెందుకంత పట్టుదల' అడిగాడు అమీన్.

'అది రాచకార్యం. తర్వాత నీకే తెలుస్తుంది. ధైర్యంగా వుండు. సుల్తాన్ని నువ్వు లెక్కచేసే అవసరం లేదు. వినయంగా ఉండే అవసరం అంతకన్నా లేదు.

మాటకి మాట అంటించు. గుండె జారకుండా వుండేందుకు ఇది పుచ్చుకో' అంటూ అమీన్ మధుపాత్ర మళ్లీ నింపాడు అబ్దుల్ లతీఫ్.

అలా ముగ్గురూ చాలాసేపు తాగారు.

“దర్బారుకి ఇప్పటికే ఆలస్యం అయింది' అన్నాడు లతీఫ్.

ముగ్గురూ బయటికి వచ్చి గుర్రాలెక్కారు.
📖

దర్బారులో సుల్తాన్ అబ్దుల్లా చాలా అసహనంగా వున్నాడు. అబ్దుల్లాకి ఎన్ని అవలక్షణాలున్నా హృదయ సంస్కారం లేకుండాపోలేదు. కళలను, సంగీతాన్ని ఆదరించే సున్నిత కళాత్మక మనస్తత్వం వుంది. దీనికి తోడు న్యాయం పట్ల గౌరవం వుంది. తల్లి తన తాతతండ్రుల న్యాయ విచక్షణను ప్రశంసించి తనను ఆక్షేపించడం అవమానంగా భావించాడు.

ఒకవైపు మీర్ జుమ్లా లాంటి కీలక పదవిలో నియమించిన తనకు, అత్యంత విశ్వాస పాత్రుడిగా మెలగవలసిన మీర్జా మహమ్మద్ సయ్యద్ ద్రోహబుద్ధితో తన హృదయాన్ని గాయపరిచాడు. మరోవైపు అతని కొడుకు ఉప మీర్ జుమ్లా అమీన్ నడిబజారులో ఎవరినీ లెక్క చెయ్యకుండా తెగపడటం తనకి పుండు మీద కారం జల్లినట్లయింది. సుల్తాన్ కోపంతో మసిలి పోయాడు. తను ఎవరో తన అధికారమే మిటో అమీన్ లాంటి పొగరుబోతులు, తిరుగుబోతులు గ్రహించాలి. తన ముందు నోరు విప్పడానికి గజగజ వణకాలి.

వింజామర వీస్తున్న బానిస యువతి చేతి కంకణాలు గలగలమని మ్రోగడంతో సుల్తాన్ ఆలోచనల నుంచి తెప్పరిల్లాడు. సర్ ఖేల్ సయ్యద్ ముజఫర్ వైపు చూశాడు. 'నేరస్తుడు హాజరు కాలేదా' చికాకుగా అడిగాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'జహాపనా, తమ ఫర్మానాని పేష్కార్ మాదన్న, అమీన్ కి తనే వెళ్లి ఇచ్చాడు' అన్నాడు సరేఖేల్.

ఇంతలో దర్బారు మందిరం బయట కోలాహలం వినిపించింది. కాసేపట్లోనే అబ్దుల్ లతీఫ్, మీర్ మోమిన్ చెరోవైపు నడుస్తుండగా అమీన్ సభలోకి వచ్చాడు. లేచినప్పటి నుంచి తప్ప తాగుతూ వుండటం వల్ల మనిషి తూలుతున్నాడు. సభని కలయజూసిన అతని మొహం కోపంతో భగ్గుమంది. మీర్ జుమ్లా తండ్రి తరపున తను ఉప మీర్ జుమ్లా. అంతటి ఉన్నత పదవిలో ఉన్న తనకి సభలో ఆసనం లేకపోవడం అవమానంగా భావించాడు.

'నువ్వు నేరస్తుడివి. తప్ప తాగి వచ్చావు. అదీ గోలుకొండ సామ్రాజ్యపు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా సభలోకి వచ్చావు. వినయంగా వంగి సలాం చెయ్యాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఈ ఒక్క నేరం చాలు నిన్ను ఉరికంబం ఎక్కించడానికి' అన్నాడు సుల్తాన్ ఆగ్రహంగా.

'నన్ను ఉరికంబం ఎక్కిస్తావా. ప్రపంచం లోనే అతి బలవంతమైన, సంపన్నమైన మొగలు చక్రవర్తి షాజహాను దూతలు నా ఇరువైపులా వున్నా నీకు కనిపించడం లేదా. లేక పస లేని పౌరుషంతో కళ్లకి పొరలు కమ్మాయా' మాటలు మింగుతూ ముద్దముద్దగా మాట్లాడాడు అమీన్.

ఆ మాటలకి సుల్తాన్ కళ్లు కోపంతో జ్వలించాయి. అనుకోకుండా చెయ్యి కత్తి మీదికిపోయింది. తన వైపే చూస్తున్న అబ్దుల్ లతీఫ్, మోమిన్లను చూడగానే ఆవేశం చప్పున చల్లారిపోయింది. అయినా, 'నీ పక్కన ఎవరున్నా, నువ్వు నా ముందు ఉన్నావు' అన్నాడు.

'నీ ముందు నన్ను నుంచోబెడతావా. నన్ను నిలువు జీతగాడిగా మారుస్తావా. నేను మీర్ జుమ్లా కొడుకుని. ఉప మీర్ జుమ్లాని' అన్నాడు మాటలు మధ్య మధ్యలో మింగుతూ.

పీష్వా కలుగచేసుకున్నాడు. 'అమీన్, నువ్వు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షాతో అలా మాట్లాడటం రాజద్రోహం' అన్నాడు.

‘ఈ సుల్తాన్ని నేను రాజుగా గుర్తించను. అప్పుడు అసలు రాజద్రోహం అనేదే వుండదు' ఇంకా ఏదో మాట్లాడబోయాడు అమీన్. ఎక్కిళ్లు అడ్డుపడ్డాయి, 'నన్ను నన్ను...' అంటూ సుల్తాన్ గద్దె వైపు అడుగులు వేశాడు. కళ్లు మూసి తెరిచేటం తలోనే మస్నద్ (బంగారు దారాలతో అల్లబడిన అలంకృతమైన తివాసీ (గద్దె))
మీద అడుగు వేశాడు.

సర్ ఖేల్ కత్తి దూసి ముందుకు దూకాడు. సభ అంతటా హాహాకారాలు చెలరేగాయి. సభలో వెనుక వరసలో తన స్థానంలో నుంచున్న మాదన్న మొలలోని పిడిబాకు సద్దుకున్నాడు. ముందున్న వాళ్లను తప్పించుకుంటూ గద్దె దగ్గరికి కదిలాడు.

'వీడిని బంధించండి' సుల్తాన్ కోపంగా అరిచాడు.

సర్ ఖేల్ సుల్తాన్ని చేరుకునే లోపలే అత్యంత ఖరీదైన, బంగారు దారాలతో అల్లిన అందమైన జరీతనం గల మస్నద్ మీద భళ్లున వాంతి చేసుకుని తెలివి తప్పి పడిపోయాడు అమీన్.

తాము ఎక్కించిన పురి, మరీ ఇంత బెడిసికొడుతుందని అనుకోని మొగలు దూతలు నిశ్చేష్టులయ్యారు.

సుల్తాన్ ఆగ్రహంతో నిలువెల్లా కంపించి పోయాడు. మస్నద్ మీద పడి గుర్రు కొడుతున్న అమీన్ ని ఎడమకాలితో బలంగా తన్నాడు. 'వీడిని, వీడి కుటుంబాన్ని కోవెలకోటలో బంధించండి. వీడి ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకోండి' అంటూ పీష్వాకి ఆదేశం ఇచ్చి సభలోంచి విసురుగా వెళ్లిపోయాడు.

అంతా మన మంచికే అనుకున్నారు మొగలు దూతలు. అగ్నికి ఆజ్యం దొరికింది అని ఆనందపడ్డారు.
👳🏽
*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment