Sunday, October 26, 2025

 260 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18 
శ్లోకము 48

వస్తుశ్రవణ మాత్రేన 
శుద్ధబుద్ధిర్ణిరాకులః|
నైవాచార మనాచారం ఔదాస్యం వాన పశ్యతి||

సత్యమైన ఆత్మ తత్వము గురించి విన్నంతమాత్రాన్నే,తెలివైన వాని బుద్ధి శుద్ధమయి శాంతంగా జీవిస్తాడు .అతనికి ఇది చేయదగినది ఇది చేయకూడనిది అన్న భావాలు ఉండవు .ఏదైనా చేస్తున్నానని కానీ చేయడం లేదని కానీ అతను అనుకోడు.

ఈ విధంగా శాంతంగా నిచ్చలము అయిన బుద్ధితో శాస్తృసారాన్ని ఒకసారి విన్నంత మాత్రాన్నే చిత్తశుద్ధి కలిగిన సాధకుడు శాస్త్రం సూచించే ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ అనుభవంలో ఉండిపోగలుగుతాడు. సాధకునిలో కోరికలు లేకపోవడంతో మనసులోని ఏ ఒక్క భావము కూడా విషయాలతో ముడిపడి మిగిలిపోదు. తన సర్వభావాలతోటి ఆత్మను అర్థం చేసుకొని ఆత్మనే తలపోసే అట్టి బుద్ధి అచిరకాలములోనే అనుభవములో నిశ్చలంగా బావ రహితంగా ఉండిపోగలుగుతుంది. భావ శూన్యస్థితిలో నిలవడమే జీవన్ముక్తి అదే ఆత్మానుభవం.

అట్టి జీవన్ముక్తునికి ఆచరించవలసినవి కానీ విసర్జించవలసినవి కానీ ఏవి ఉండవు .కర్మ అకర్మల ప్రమేయం ఉండదు. అతడు కర్తనని భోక్తను అని అనుకోడు .అతనిలో అహంకారం నశించింది అందుకే అతడు ఏ పనిని చేయనట్లే. అన్ని కర్మలు కూడా అతని సన్నిధిలో జరుగుతున్నాయి. ధర్మాధర్మాలు బుద్ధి నిర్ణయించే విలువలు మాత్రమే. బుద్ధితో తాదాత్మ్యం చెందే అహంకారం నశించిన అతనికి ధర్మాధర్మాలు ఉండవు. జాగృతుడైన వానికి స్వప్నములోని ధర్మాధర్మాలతో ఏం ప్రయోజనం ఉంటుంది .అదేవిధంగా ఆత్మ తత్వంలోనికి జాగుతుడైన జ్ఞాని విషయం కూడా అలాగే  ఉంటుంది. మనవలనే ప్రపంచంలో నివసిస్తున్న అతడు ప్రపంచానికి చెందడు. కేవలం అతిధి మాత్రమే.🙏🙏🙏

No comments:

Post a Comment