Sunday, October 26, 2025

 *మహామంత్రి మాదన్న - 19* 
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽

రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు


ఔరంగజేబు చకచక పావులు కదిపాడు. తన వెంట ఉన్న పెద్ద కొడుకు మహమ్మద్ సుల్తాన్ని సైన్యంతో సహా వాందేడ్ కి హుటాహుటి బయలుదేరమని చెప్పాడు. మొగలు సైన్యాధిపతి హదిదాద్ ఖాన్ కి వర్తమానం పంపాడు. మహమ్మద్ సుల్తాన్ తో కలవమని అతనిని ఆదేశించాడు. చక్రవర్తి కలుగచేసుకుని తన పథకానికి తూట్లు పొడవక ముందే గోలుకొండ తన గుప్పిటలోకి రావాలని కుయుక్తులు పన్నాడు.

మహమ్మద్ సుల్తాన్ సైన్యం నాందేడు నుంచి గోలుకొండ వైపు కదులుతున్న వైనం అబ్దుల్లా కుతుబ్షాహీకి అందింది. అతడికి ముచ్చెమటలు పట్టాయి. వెంటనే అమీన్ ని అతని కుటుంబాన్ని చెరసాల నుంచి విడుదల చేసాడు. ఆ విషయం మహమ్మద్ సుల్తాన్ కి వర్తమానం పంపాడు.

మహమ్మద్ సుల్తాన్ ఆ విషయాన్ని తండ్రి ఔరంగజేబుకి తెలియచేశాడు.

ఔరంగజేబు కొడుకుకి విపులంగా ఉత్తరం వ్రాశాడు. 'అమీన్ ని విడిచిపెట్టారు. ఐతే మీర్జాల ఆస్తులు విడుదల చేసినట్లు మనకి తెలియదు. కాబట్టి దండయాత్ర ఆపే అవసరం లేదు. ముందుకు కదులు. అమీన్ నీదగ్గరికి వచ్చినా నిన్ను కల్సుకునే అవకాశం ఇవ్వకు. మీర్జాల ఆస్తులు తిరిగి వారి చేతుల్లోకి వచ్చాయని అమీన్ ద్వారా నీకు, నీ ద్వారా నాకు తెలియకూడదు. ఈ విషయం మరిచిపోకు. మరొక్క విషయం. గోలుకొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా పిరికివాడు. ప్రతిఘటన చెయ్యలేని ఉత్త అసమర్థుడు. అతడు కేవలం పలాయనం మాత్రమే తెలిసిన పనికిరానివాడు. ఏమాత్రం కనికరం లేకుండా అతని మీద తెగబడు. మణిమయ కిరీటం ధరించిన అతని శిరస్సు బరువును మోసి మోసి అతని మెడ అలసిపోయింది. ఆ మెడకి ఉపశమనం కలిగించే బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. దీనికి కావల్సిందిల్లా ప్రజ్ఞ, శీఘ్రత, మెరుపు వేగంతో కదిలే చేతులు'.

తండ్రి జాబు చదివిన మహ్మద్ సుల్తాన్ కి కర్తవ్యం బోధపడింది. హైద్రాబాదు వైపు వేగంగా కదిలాడు. తొందరలో హైద్రాబాదు సమీపంలో ఉన్న హుస్సేన్సాగర్ తీరం చేరాడు. చక్కటి నీటి వసతి వున్న అక్కడ గుడారాలు దింపాడు.

వార్త తెలిసిన అబ్దుల్లా భయంతో గజగజ లాడిపోయాడు. ఎందరు వారిస్తున్నా  వినకుండా నగరం వదిలి కోటలోపలికి పారిపోయాడు. కోట తలుపులు గట్టిగా బిడాయించుకున్నాడు.

అధిపతి లేని నగరం అల్లకల్లోలం అయింది. బందిపోటులు తెగబడి నగరం మీద ఎగబడ్డారు. నగరవాసులు దిక్కులేని వారై హాహాకారాలు చేశారు. తోడేళ్లతో తరుమబడ్డ లేగల్లా పరుగులుపెట్టారు. దోపిడీలు, గృహదహనాలు, మాన భంగాలు యధేచ్ఛగా జరిగాయి. వందల మంది స్త్రీలు పిల్లలు బానిసలుగా అమ్ముడుపోవడానికి బందీలు అయ్యారు. తమ కంటపడ్డ ప్రతిదానిని వజ్రాల నుంచి వస్త్రాల దాకా దేనినీ వదలకుండా కబళించారు. అత్యంత విలువైన తివాసీ లను ఏకమొత్తంగా మోసుకెళ్లలేక వాటిని ముక్కలు ముక్కలుగా చేసి బండ్లకెత్తుకుని తీసుకుపోయారు ఆ దోపిడీ దొంగలు.
📖

భాగ్యనగరం ఇలా అతలాకుతలం అవుతుంటే, మహమ్మద్ సుల్తాన్ నగరం లో పరిస్థితిని చక్కదిద్దుదామని ప్రయత్నించాడు. మొగలు సైన్యాన్ని నగరంలోకి పంపాడు. గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చాడు అనుకున్నారు జనం. మొగలు సైనికులు దేనినీ వదలలేదు. ఎవరన్నా అడ్డుపడతా రేమో అన్న భయం లేదు కాబట్టి, వారు దుకాణాలు పగలకొట్టి మరీ దోచుకున్నారు. చేతికి అందిదల్లా సొంతం చేసుకున్నారు. బంగారం వెండి, వజ్రాలతో పాటు ఎన్నో విలువైన పుస్తకాలు కూడా దోపిడీకి గురి అయ్యాయి. తమ దోపిడీ పర్వం ముగిసాక మొగలు సైనికులు నగరంలో శాంతి భద్రతలు నెలకొల్పారు.

మహమ్మద్ సుల్తాన్ హదిదాద్ ఖాన్ నాయకత్వంలో మొగలు సైన్యం గోలుకొండ దాడికి వ్యూహం పన్నింది. కోటకి ఈశాన్యం లో వున్న చిన్న గుట్ట మీద హదీద్ ఖాన్ శతఘ్ని దళాన్ని నిలిపాడు.
📖

కోటలోని హయత్ బక్షీ బేగం మందిరం. హయత్ బక్షీ బేగం, సుల్తాన్ అబ్దుల్లా, రజా కులీ, మాదన్న సమావేశంలో ఉన్నారు.

'అబ్దుల్లా, మేమెంత చెప్పినా మా మాట పెడచెవిన పెట్టి నగరాన్ని వదిలి కోటలోకి వచ్చావు. ఇటుక ఇటుక పేర్చి నా తండ్రి నిర్మించిన భాగ్యనగరం అనాథ అయింది. ఆటవికుల ఆగడాలకి అల్లల్లాడిపోయింది. నిలువునా మండిపోయింది. ఈ దారుణం చూడటానికే దేవుడు నన్ను బతికించి వుంచాడేమో' హయత్ బక్షీ బేగం ఇంక మాట్లాడలేకపోయింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దాచుకోలేకపోయింది. కొంగుతో మొహం కప్పుకుంది.

అందరి మొహాలు గంభీరంగా విచారంగా మారాయి. దుఃఖంలో ఉన్న హయత్ బక్షీ బేగంని ఊరడించడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు.

కాసేపయ్యాక హయత్ బక్షీ బేగం తనను తనే సంబాళించుకుంది. అబ్దుల్లా మొహం లోకి చూస్తూ, 'రాజదాని భాగ్యనగరంలో, అసహాయులై అత్యాచారాలకి గురైన స్త్రీల శాపాలు కుతుబ్షాహీలకు తగలక మానవు. మానం కాపాడుకోవడానికి ఆర్తనాదాలు చేస్తూ, బావుల్లో, చెరువుల్లో దూకి ప్రాణాలు విడిచిన స్త్రీల ఉసురు మనకు ముట్టక మానదు. వృత్తి బందిపోటుల, మొగలు బందిపోటుల చేతులలో జరిగిన హైద్రాబాదు లూటీని హిందుస్థాన్ అంతటా కథలు కథలుగా చెప్పుకుంటున్నారట' హయత్ బక్షీ బేగం ఇహ మాట్లాడలేక పోయింది. దిగమింగిన దు:ఖం పైకెగసి గొంతుకి అడ్డుపడింది. ఆగని కన్నీళ్లు ఆమె చెంపల మీంచి జారాయి, రెండు చేతులతో మొహం కప్పుకుంది.

హయత్ బక్షీ బేగంను అలా చూసిన మిగతా ముగ్గురూ చలించిపోయారు. వారి మొహాలలో రంగులు మారాయి. తనంతట తనే దుఃఖం నుంచి తేరుకున్న హయత్ బక్షీ బేగం కొడుకు వైపు చూసింది.

అబ్దుల్లా తల వంచుకున్నాడు.

తల వంచుకోవడం వలన, మౌనం పాటించడం వలన మంట కలిసిన  మానాభిమానాలు మరలిరావు. ఈ రాజ్య ప్రజల బాగోగులకి నువ్వు జవాబుదారీవి. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించ వలసిన బాధ్యత నీ మీదే ఉందని మరిచి పోకు' అంది నిర్మొహమాటంగా.

'సంధి ఒక్కటే పరిష్కారం' అన్నాడు సుల్తాన్.

'జహాపనా, సంధికి పాకులాడే అవసరం లేదు. ఎనిమిది వేల గజాల పొడవున్న రెండు ప్రాకారాలు ఈ కోటకి వున్నాయి. రక్షణగా దుర్బేధ్యమైన ఎనిమిది ద్వారాలు ఉన్నాయి. కోట చుట్టూ లోతైన కందకం వుంది. కోటకి నాలుగు వందల బురుజులు ఉన్నాయి. బురుజుల లోపల బయట వున్న సైన్యం ప్రాణాలకి లెక్కించకుండా పోరులోకి దూకడానికి సిద్ధంగా వుంది' అన్నాడు రజా కులీ.

'అబ్దుల్లా నేను ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ తెలిసినవే. ఇంత బలమైన రక్షణ వ్యవస్థ ఉండి నువ్విలా బెంబేలు పడిపోవడం కుతుబ్షాహీలకు శోభనివ్వదు' అంది హయత్ బక్షీ బేగం.

'ప్రభూ, రాజమాత, రజా కులీ గారి మాటలు వినండి. కాస్త ఓపిక పట్టండి. ఆగ్రాలో మన రాయబారి తన యత్నాలు ముమ్మరం చేశాడు. చక్రవర్తి పెద్ద కొడుకు దారాషుకో కి, కూతురు జహనారాకి విలువైన కానుకలు అందజేశాడు. వారి ద్వారా చక్రవర్తికి విషయం విన్నవించి ఔరంగజేబును కట్టడిచేసే యత్నం చేస్తున్నాడు' అన్నాడు మాదన్న.

‘మాదన్నా, రాజమాత అన్నట్టు ఈ సమస్యకి పరిష్కారం నేనే చూపాలి. అందుకే నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం మొగలులని మనం కొంతకాలం పాటే నిలువరించగలుగుతాం. మనకి బయటి నుంచి సహాయం అందే అవకాశం లేదు. షాజహాను చక్రవర్తి ఔరంగజేబుని కట్టడి చేస్తాడని నమ్మకం ఏమిటి. ముట్టడి ముమ్మరం చెయ్యమని అదనపు బలాలు పంపిస్తే మనం నిలువునా మునిగిపోతాం'.

ఎవరూ మాట్లాడలేదు.

'మాదన్నా, వెంటనే వెళ్లి మీర్ ఫాసీని వెంటబెట్టుకురా'.

'మీర్ ఫాసీ ద్వారా రాయబారం పంపుతావా' అడిగింది హయత్ బక్షీ.

'అవును. రెండు వందల పెట్టెల నిండా మణులు నింపి మహమ్మద్ సుల్తాన్ కి కానుకగా పంపిస్తాను. మణులతో పాటు జీవమణిలా మెరిసిపోయే అందాలకుప్ప నా రెండో కూతురుని అతడికి భార్యగా సమర్పిస్తాను. మొగలులు పెట్టిన చిచ్చులో ఇప్పటికే కాలుతున్న నా రాజ్యం, పూర్తిగా బూడిదగా మారకుండా సుల్తాన్ గా, ఇదే నేను చెయ్యగలిగింది. నా నిర్ణయానికి తిరుగు లేదు' అన్నాడు.

ఎవరూ మాట్లాడలేదు.

'మాదన్నా, నువ్వు వెళ్లు' అన్నాడు సుల్తాన్ అధికారం నిండిన గొంతుతో.
📖

మొగలు సేనాని షాయిస్త ఖాన్ నాయకత్వం వహించిన సైన్యాన్ని వెంట బెట్టుకుని ఔరంగజేబు హైద్రాబాదు వచ్చాడు. వస్తూనే కార్యరంగంలోకి దూకాడు. తొలుత కోట రక్షణ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించాడు. తన వద్ద వున్న సైన్యంతో ఆయుధ వనరులతో కోటను పట్టుకోవడానికి యత్నించడం కొరివితో తల గోక్కోవడం తప్ప మరొకటి కాదని గ్రహించాడు. ఇంత దూరం వచ్చిన తను ఏ ప్రయోజనం లేకుండా వెనుతిరగకూడదు. అందుకే ఇతర మార్గాల అన్వేషణలో పడ్డాడు. సేనానులతో, కొడుకుతో గుడారంలో సమావేశమయ్యాడు.

మహమ్మద్ సుల్తాన్ తనకి వచ్చిన కానుకల గురించి చెప్పి, సుల్తాన్ కూతురుని తనకి వధువుగా ఇస్తానన్న విషయం చెప్పాడు. ఆ వజ్రాల పెట్టెలు తెప్పించి తండ్రికి చూపించాడు.

ఆ వజ్రాలు చూసిన ఔరంగజేబు కళ్లు రెండు వజ్రపు గనుల్లా మెరిశాయి. 'కానుకగా ఇన్ని వజ్రాలు పంపగల గోలుకొండ తన ఖజానాలో ఎన్ని వజ్రాలను కప్పెట్టుకుందో. ఆ సంపద నాకు కావాలి' అంటూ వజ్రాలను దోసిళ్లతో పెట్టెలలోంచి తీస్తూ, మళ్లీ పోస్తూ అలా కాసేపు వాటితో ఆడుకున్నాడు. కొడుకు మొహంలోకి చూస్తూ 'వజ్రాలు తీసుకున్నావు. చాలా సంతోషం. ఇంతకీ సుల్తాన్ కి ఏమని సమాధానం పంపావు' అని అడిగాడు.

'నేను స్వతంత్రుడిని కాదని, ఏ నిర్ణయమై నా దక్కను సుబేదారు, నా తండ్రి అయిన ఔరంగజేబు, ఆ పైన షాజహాను చక్రవర్తి మాత్రమే తీసుకోగలుగుతారని వాళ్ళకి సమాధానం తయారు చేశాను. మీకు చూపించి పంపవచ్చని ఆగాను' చెప్పాడు మహమ్మద్ సుల్తాన్.

'శభాష్ నాకు తగ్గ కొడుకనపించుకున్నావు. మన గురి వజ్రాల పెట్టెలు, అందాల పిట్టలు కాదు. మన గురి సుల్తాన్ మెడ మీద. అందుకు తగ్గ పథకం వేశాను'.

అంతా ఆసక్తిగా ఔరంగజేబు వైపు చూశారు.

'చెప్పండి' అడిగాడు మహమ్మద్ సుల్తాన్.

'సంధి విషయం చర్చించడానికి నీ రాయబారి వస్తున్నాడని సుల్తాన్ కి కబురు పంపు. ఇబ్రహీం బాగ్ లో కలవాలని చెప్పు' అన్నాడు ఔరంగజేబు.

'సుల్తాన్ వస్తాడా' సందేహం వెలిబుచ్చాడు షాయిస్త ఖాన్.

'వస్తాడు. స్వయంగా తనే వస్తాడు. మొగలుల రాయబారులంటేనే సుల్తాన్ కి వెన్నెముకలో చలి పుడుతుంది. వాళ్ల ముందు అగ్గగ్గలాడుతాడు' అన్నాడు ఔరంగజేబు.

'రాయబారిగా ఎవరిని పంపుతారు' అడిగాడు హదీదాద్ ఖాన్.

'ఎవరినీ పంపను. నేనే మారువేషంలో వెడతాను. సుల్తాన్ మెడకి వున్న భారం దించుతాను' అన్నాడు ఔరంగజేబు.

'అది చాలా ప్రమాదం' అన్నాడు షాయిస్త ఖాన్.

'కందకాలు దూకితేనే కోటలు చేతికి వస్తాయి. అపాయాల అందలాన్ని బోయీగా మోస్తేనే మనకి అశక్యాలు శక్యమవుతాయి' అన్నాడు ఔరంగజేబు.

'అయినా సరే. మీవెంట నేను వుంటాను. కొద్దిమంది మెరికలలాంటి యోధులతో ఇబ్రహీం బాగ్ దగ్గర కాచుకుని వుంటాను. మీకు ఏ అపాయమూ కలగకుండా చూడటం నా బాధ్యత' అన్నాడు హదిదాద్ ఖాన్.
👳🏽
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment