*మార్గదర్శకులు మహర్షులు -7*
🪷
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి
*కర్దమమహర్షి -2*
వైవాహిక జీవితంలో కర్దముడు దేవహూతిని పరీక్షచేసాడు. ఆయన ఎప్పుడూ ఉదాసీన వైఖరిలో, ప్రవృత్తిలో ఉండేవాడు. ఆమెను స్వీకరించినట్లు కాదు, స్వీకరించనట్లు కాదు. ఆమె ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. చివరకు నిరాహారిగా ఉండిపోయింది. కుంగి కృశించి పోయింది. కృశించిన శరీరంతో శక్తిలేక ఉన్నా, యావచ్ఛక్తినీ కూడా ఆయన సేవకు ధారపోసింది.
అప్పటిదాకా ఆమెను పరీక్షించి ఆమెతో, "నాకు నీవు తపస్సు లాంటి సేవచేసావు. దీనికి నీకు ఫలం కలుగుతుంది. ఏమైనా కోరికలు కోరుకో. నీకు సమస్తభోగాలు లభిస్తాయి. సుఖంగా ఉండు” అని చెప్పి భార్యకు ఆశీర్వచనం ఇచ్చాడు. ఆమె చేసిన సేవాకాలంలో ఆమెకుగాని, తనకు గాని, ఆహారంగాని, నిద్రకాని లేదు. ఇద్దరూ కూడా కృశించిపోయారు. ఆయన వర ప్రసాదం చేత తరువాత అనేక సంపదలు, ఆరోగ్యము, బలము, యౌవనము ఆమెకు లభించాయి. ఒక దివ్యవిమానం, అనేక దివ్య భవనాలని సృష్టించాడు కర్దముడు. వాటన్నింటినీ సృష్టించిన తరువాత ఇవన్నీ నీకే అన్నాడు ఆమెతో! తనకి అవేమీ కనబడటంలేదు అన్నదావిడ. అంటే ఆమె తపస్సు చేసే కాలంలో భౌతికమైనటువంటి జడపదార్థభావమును కోల్పోయింది అని అర్థంచేసుకోవాలి.
తన భార్య ఎంతటి తపస్సు చేసిందో ఆయన అప్పుడు గ్రహించాడు! ఆమెకు సృష్టే కనబడటంలేదు! ఆమెకు తను చేసిందంతా మాయాప్రభావం చేత చేసినవే నని అనిపించింది. అప్పుడు ఆయన, సమీపంలో కనబడుతున్న బిందుసరోవరం లో ఆమెను స్నానంచేసి రమ్మన్నాడు. ఆమె అందులో స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికి అనేక వందలకొద్దీ దాసీ జనం సేవ చెయ్యటము, తనకున్న ఐశ్వర్యము అంతా ఆమెకు కనబడింది. ఇద్దరూ కలిసి దేవవిమానం ఎక్కి సమస్త లోకాలు విహరించారు. వంద సంవత్సరా లు అలాగే సుఖంగా ఉన్నారు. ఆ తర్వాత శ్రీహరి ఆజ్ఞప్రకారము ఆమెకి తొమ్మండు గురు కుమార్తెలు కలిగారు. తన పూర్వపు షరతుప్రకారం, కర్దముడు సంతానం కలుగగానే తను సన్యసించి వెళ్ళిపోతాను అన్నాడు ఆమెతో.
“మీరు వెళ్ళిపోతే ఈ కుమార్తెలకు పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు స్వామీ?" అన్నదామె. దాంతో ఆయన అప్పటికి సన్యాసప్రయత్నం మానుకున్నాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆమె మళ్ళీ గర్భం ధరించింది. కొడుకును కన్నది. ఆ పుట్టినవాడే శ్రీహరి అవతారమైన కపిలుడు. హరివంశంలోనే, విష్ణువు అంశలోనే పుట్టాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారమే జరిగింది.
ఆ తరువాత తన తొమ్మండుగురు కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసాడు కర్దముడు. మరీచిమహర్షికి కళను; అత్రిమహర్షికి అనసూయను; అంగీరసుడికి శ్రద్ధను; పులస్త్యుడికి హవిర్భువును; పులహుడికి గతిని; క్రతువుకు క్రియను; భృగువుకు ఖ్యాతి అనే కుమార్తెను; వసిష్ఠుడికి అరుంధతిని; అధర్వుడికి శాంతిని ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి భర్తలతో వాళ్ళను వాళ్ళ నివాసాలకి పంపించాడు.
కొంతకాలానికి, తను ఇంకా చిరంజీవిగా ఇలాగే ఉంటే ఈ సంసారం పునఃపూరణం తో బ్రహ్మ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని చెప్తాడేమో అని అనుమానం కలిగింది. మోక్షేచ్ఛతో, తను ఈ సృష్టిలో ఎక్కడా ఉండకూడదు అనుకున్నాడు. తను (కర్దముడు) ప్రజాపతిగా ఉన్నాడు. చాలా తపస్సుచేసాడు. అయినా, ముక్తిహేతువైన టువంటి విషయం బ్రహ్మ తనకు చెప్పడు. బ్రహ్మ, ప్రవృత్తి మార్గమే చెప్పుతాడు. ఆయన్ని ప్రార్థించి లాభంలేదు. విష్ణువేమో బ్రహ్మవాక్యపరిపాలన చేయమని తనను అడుగుతాడు. అందుకని విష్ణువే తన కొడుకుగా వచ్చాడు కాబట్టి ఆ ఆశతో ఆయనను అడిగాడు.
ఒకనాడు ఏకాంతంగా కుమారుడై పుట్టిన కపిలుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, “నీవు విష్ణువువే కదా! నాకు మోక్షోపదేశం చెయ్యి, బోధ చెయ్యి. నీ పుట్టుకతో నేను ఋణవిముక్తుడిని అయ్యాను" అన్నాడు. కపిలుడు ఆయనకు సకల తత్త్వములు బోధించాడు.
అంతకుముందే కర్దముడు పరమవిరాగిగా ఉండటంచేత, తపో మహిమ చాలా ఉన్నవాడు కాబట్టి, ఇంద్రియములను ఎప్పుడో నిగ్రహించినవాడు కాబట్టి, అతడికి కపిలుడు ఇలా బోధించాడు:
"సాంఖ్య, యోగ మార్గములు చెపుతున్నాను. నేను చెప్పే ఈ మార్గం మహోత్కృష్టమయినది. ఈ మార్గంలోనైతే నీకు ఎప్పుడూ విష్ణుదర్శనము, బ్రహ్మ దర్శనము లాంటి బంధనహేతువులు ఏవీ రావు. పరంజ్యోతిగా నన్ను చూస్తావు" అని చెప్పాడు.
ఎందుచేతనంటే, ఎంతకాలం సగుణమైన స్వరూపం దర్శనమిస్తుందో, మనతపస్సు కు మనలో ఉండే వృత్తే అలా దర్శనం ఇస్తుంది, కాని మనలో లేనిది దర్శనమివ్వ దు. సమస్తయోగాలలో ఒక్క రహస్య మేమిటంటే, మనం పొందేటటువంటి దర్శనానికి హేతువు, బీజం సంస్కార రూపంలో కోరికరూపంలో మన దగ్గర మన లోపలే ఉంటుంది. అదే బయటికి వచ్చి ఒక రూపదర్శనం అంటే ఒక రూపకల్పన చేసుకొని దర్శనమిస్తుంది. తపస్సు మనదే! ఆ కనబడేటటువంటి రూపము కూడా మనలోంచి ఉత్పన్నమైనటువంటి దే! మనం అడిగే కోరికలు మనవే! దాని ఫలం అనుభవించేది మనమే! లోపల పరతత్వం మాత్రం ఏమీకాదు. అది దేనికీ హేతువుకాదు. తటస్థంగా ఉండే వస్తువది.
అలా కపిలుడి నుంచి కర్దముడు బోధ పొందిన తరువాత, అతడికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ ప్రణామం చేసాడు. కొడుకు రూపంలో ఉన్న హరికి తనునమస్కరించా డంటే, అక్కడ హరి, హరిగానే దర్శనం ఇచ్చాడంటే, అది ప్రవృత్తి. ఆయన బోధాంశలో వచ్చాడు కాబట్టి ఇక్కడ ముక్తి మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఆ భగవంతుణ్ణి ముక్తిమార్గం కోసమే ఆశ్రయిస్తే, ఆయనే గురువుగా వస్తాడు. కోరికలు తీర్చుకోవటానికి ఆశ్రయిస్తే, పురాణంలో చెప్పిన రూపంలోనే వస్తాడు. ఆ కోరికలు తీరుస్తాడు. కానీ అదంతా బంధనహేతువు అవుతుందికాని ముక్తి మార్గం కానేరదు. ముక్తిని కోరితేనే భగవంతుడు గురుస్వరూపుడై వస్తాడని దాని తాత్పర్యం.
ఆ తరువాత కర్దముడు లోకం అంతా వాసుదేవమయంగా, పరంజ్యోతిమయం గా చూచాడు. చివరకు కర్దముడు మోక్షం తో లయం చెందాడని అంటారు. అంటే ఆయన ఇతర మునులవలె గాక, ఏ లోకం లోనూ ఉండకుండా వెళ్ళిపోయాడు.
(రేపు కపిల మహర్షి గురించి తెలుసుకుందాం)
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment