*మార్గదర్శకులు మహర్షులు -8*
🪷
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి
*కపిలమహర్షి-1*
కపిలుడి తల్లి అయిన దేవహూతి కుమారుడిని తనకు మార్గాన్ని చూపించ మని వేడుకుంది. కపిలుడు తల్లికి ఆత్మబోధ చేసి భాగవతమార్గాన్ని ఆమెకు బోధించాడు కపిలుడు.
తరువాత ఆయన 'సాంఖ్యయోగాన్ని' కూడా ఆమెకు చెప్పాడు. భక్తియోగం కూడా దేవహూతికి ఉపాసనామార్గంగా చెప్పాడు. కపిలుడు చెప్పిన మార్గంలో దేవహూతి భూమిని విడిచిపెట్టి ఆకాశంలో దూరంగా ఒకస్థితిని ఏర్పరచుకొని ఆయన చెప్పిన మార్గంలో తపస్సులో పరిణామం పొంది శ్రీహరిలో విలీనమయిపోయింది. ఆమె పేరుమీద భూమిపై 'సిద్ధిప్రద' మనే ఒక గొప్ప క్షేత్రం విలసిల్లింది.
అనేకమంది సిద్ధులు, సాధ్యులు, దేవతలు కూడా కపిలుడిని పూజించారు. సముద్రుడు స్వయంగావచ్చి స్తోత్రం చేసాడు. ఆ తరువాత కపిలుడు సాంఖ్య మార్గమును బోధచేస్తూ శాంతచిత్తుడై, ఇల్లువదిలిపెట్టి ఉత్తరదిశగా ప్రయాణమై వెళ్ళిపోయాడు.
పుండరీకుడు అనే మహారాజు వేటకోస మని అడవికి వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమానికి సమీపంగా, అక్కడి చెఱువులో చల్లని నీరుండటం చేత ఆ నీళ్ళను తాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన మృగయావినోదం కోసం వచ్చాడు కనుక, ఒక లేడిపిల్ల తన ముందరి నుంచీ పరిగెత్తు కుంటూ వెళ్ళటం చూసాక; ఊరికే కూర్చున్నవాడు కూర్చోక దానిమీద ఒక బాణం వేశాడు. ఆ లేడిపిల్ల కపిల మహా ముని పాదాల దగ్గరకు వెళ్ళి ప్రాణాలు వదిలిపెట్టింది. సాధారణంగా అడవిలో పెరిగే సాధుజంతువులను ఆశ్రమంలో ఎవరూ చంపరు అని రాజులకు తెలుసు. పొరపాటున ఆ రాజు ఈ లేడిపిల్లను చంపాడు. వెళ్ళి భయంతో గజగజ వణుకుతూ, "మహర్షీ! ఈ తప్పు నేనే చేసాను. నన్ను క్షమించవలసింది. నేను పుండరీకుడు అనే రాజును” అని తన కులగోత్రాలను చెప్పుకుని మన్నించమని వేడుకున్నాడు.
అందుకు కపిలమహర్షి, "ఓ రాజా! నీటి బుడగవలె క్షణం మాత్రమే బ్రతికేటటు వంటి మనుష్యుడు పశువుకంటే ఎక్కువ బుద్ధి, జ్ఞానం కలిగి ఉండికూడా, తానేం చిరకాలం జీవించబోవటం లేదు అనే విషయం తెలిసి ఉండి కూడా తనకంటే అల్పమయిన జీవిని - నోరులేని జీవిని - తనకెలాంటి అపకారం చెయ్యనటువంటి పశువును వధించి అమితమైన పాపం కట్టుకుంటున్నాడు. ఇలాంటి దారుణమైన కర్మను నువ్వెందుకు చేస్తున్నావు? చదువు కున్నవాడివి, విద్యావంతుడివి. ఈ దేశాన్ని పరిపాలించే రాజువుకూడా! ఈ ధర్మం నీకు తెలియదా?" అని శాంతంగా అడిగాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇంకా ఆయన, “నీకు రక్తమాంసాలు, ఆకలి, దప్పిక ఉండేటటువంటి నీ దేహం ఎలాంటిదో, దానికి దాని దేహం కూడా అలాంటిదే కదా! దానికీ ఆకలి, నిద్ర, మైథునక్రియ, సంతానం కలగటము, తన సంతానం యెడల ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. వాస్తవంగా నీకూ, దానికీ భేదమేమీ లేదు. నీ శరీరంమీద నీకు ఉండేటటువంటి మోహం ఎలాంటిదో, దాని శరీరం మీద దానికి ఉండే భ్రమ అలాంటిదేనని తెలిసి ఉండికూడా దాన్ని ఎందుకు చంపావు? ఎలాగ చంపగలిగావు నువ్వు?" అని అడిగాడు.
ఆయన మళ్ళీ అన్నాడు, "ఒకవేళ ఈ చంపాలనుకోవటం విలాసము, సరదా కోసము అంటావా! అందులో నీకొచ్చిన ఆనందమేమిటి? ఇంకొక జీవి హింసపడు తూంటే, అది విలవిలా తన్నుకుంటూ ప్రాణం వదులుతుంటే అది నీకు విలాస మెట్లా అవుతుంది! ఇంకొకరిని బాధించటం ఇంకొకరి దుఃఖము నీకు విలాసమెట్లా అవుతుంది! నీవు పండితుడవయిన రాజువుకదా! అయితే నిన్ను నేను శిక్షించను. ఎందుకు శిక్షించనంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలే నాకూ వర్తిస్తాయి. నువ్వు లేడిని చంపటం పాపమయితే, నేను నిన్ను చంపటమూ పాపమే అవుతుంది కదా! నీకు జ్ఞానమార్గం ఉపదేశించాను. బుద్ధిగా జాగ్రత్తగా బతుకు. ఈ తుచ్చమయిన శరీరము, ఈ విలాసాలు, ఆనందము, మొదలయిన వాటిమీద మనసు పెట్టుకోకు" అని ఆయన బోధచేసాడు.
అంతే! రాజులో పరివర్తనం వచ్చింది. తీవ్రమైన దుఃఖం కలిగింది. ఆ రాజుకు శూలాల్లాగా గుచ్చుకున్నాయి ఆయన మాటలు. తానుచేసిన నేరాన్ని గురించి ఆయన చెప్పిన మాటలతో, తనను తాను క్షమించుకోలేక పోయాడు. క్షమించమని అడగాల్సిన పనికూడా లేకపోయింది. నిన్ను వదిలేసానని ఆయనే అన్నాడు. శిక్షించి ఉన్నా బాగుండేది. నిన్ను ఏమీ చెయ్యను పొమ్మన్నాడు. ఆయన గొప్ప అహింసావాది అని దీనినిబట్టి మనకు తెలుస్తున్నది. బుద్ధుడివలె అహింసావాది. అపారమయిన క్షమ కలిగినవాడు.
రాజు వెంటనే ఒరలోంచీ కత్తిని తీసి, ఆత్మహత్య చేసుకుని నీపాదాల దగ్గరపడి చచ్చిపోతాను అని పొడుచుకోవడానికి సిద్ధమయ్యాడు. వెంటనే కపిలుడు ఆయన్ని వారిస్తూ, “ఈ ఆత్మహత్యవలన మరోపాపం చేయబోతున్నావు. నీ ప్రాణాన్ని రక్షించుకోవలసిన పని నువ్వు ఎలా చేస్తావో, ఆ లేడిపిల్ల కూడా అలాగే పారిపోయి చివరకు ప్రాణాన్ని రక్షించుకో లేక నా దగ్గరపడి చచ్చిపోయింది. నిన్ను నీవు చంపుకున్నా అదికూడా హింసే అవుతుంది. దీనివలన నీకు జ్ఞానమోక్షాలు ఎలా కలుగుతాయి?" అని అన్నాడు. ఆ రాజు వెంటనే తనకు జ్ఞానబోధ చెయ్యమని అడిగాడు.
“పోయినజన్మలో మనం ఏదో పుణ్యం చేస్తాము. సిరిసంపదలు అన్నీ వస్తాయి. భార్యాపిల్లలందరూ బాగుంటారు. సంతోషమే. దానిని అనుభవిస్తున్న సమయంలో సాత్వికగుణంతో, అంటే సత్యగుణప్రధానుడై అనుభవించాలి. దర్పంతో ఇదంతా తన ప్రయోజకత్వం అనే భావంతో కాదు. ఇతరులను తిరస్కరించి కాదు. ఇతరులను అవమానించి తాను ధనవంతుడినని విర్రవీగకూడదు. ఈ సంపదలన్నీ క్షణికములనే మాట గుర్తు పెట్టుకుంటూ వాటిని అనుభవించాలి. ఎందుకంటే, తనుండగానే తన పుణ్యం ఖర్చయిపోయి సంపదలన్నీ పోతాయి. సంపదలుండగానే ఆయుర్దాయం అయిపోతే, తను పోతాడు. కాబట్టి ఎలాగూ వియోగం తప్పదు. ఈ రెండు విషయములలో కూడా సంపదయొక్క అనుభవం క్షణికమే! ఏడుతరాలు అనుభవించగలిగిన ఆస్తి ఉండవచ్చు. కాని వ్యక్తి యొక్క అనుభవము క్షణికం మాత్రమే.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ముక్తిమార్గంలో వెళ్ళి అందులో ఉండే వాడికి, అందులోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇతర ఆలోచనలు ఉండకూడదు. 'ఏమిటో సన్యాసాశ్రమం తీసుకున్నాను కాని చిన్న పిల్లకు పెళ్ళి చేయలేదు' ఇట్లాంటి ఆలోచన లేవీ ఉండకూడదు. వాటివలన భ్రష్టత్వం వస్తుంది. ఒకానొక సమయంలో కలిగిన తీక్షణమయినటువంటి వైరాగ్య ప్రవృత్తిలో వెళ్ళిపోతే, మరి వెనుదిరిగి చూడకూడదు.
కపిలుడు ఇంకా కొనసాగించాడు: "కాబట్టి ఓ రాజా! సమస్త ధర్మములను పరిత్యాగం చేసి అంకురితుడిగా మోక్షమందు ఇచ్ఛ కలుగజేసుకో! నువ్వు ఆ మార్గంలో ప్రవేశిస్తే పుష్పితుడివి. సిద్ధిపొందితే ఫలితుడివి. అలా మూడు విధములయిన ముముక్షువులు ఉన్నారు" అని బోధించాడు.
తరువాత ఆ రాజు తన రాజ్యము, సంపదలను వదిలిపెట్టి కపిల మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి, తనను శిష్యుడిగా పరిగ్రహించమని ఆయన్ని వేడుకున్నాడు. కపిలుడు కన్నెత్తి కూడా అతడిని చూడలేదు, పలుకరించలేదు. వచ్చావా అని కూడా అడగలేదు. మామూలు మర్యాదలు కూడా ఆయనకు తెలియవా? అనుకోవచ్చు. కాని ఎవరిని ఎలా పలుకరించాలో, ఎవరిని వెంటనే ఆదరించాలో, ఎవరిని తిరస్కరించాలో, దానికి కూడా ఏదో కారణము ఉంటుందని, మహాత్ముల యొక్క చరిత్రలను నిదర్శనాలుగా తీసుకొని మనం అర్థం చేసుకోవచ్చు.
ఒకరకంగా కపిలుడు ఆ రాజును పరీక్షిస్తున్నాడా అన్నట్లుగా ఉంది ఆయన ప్రవర్తన. "ఇంకా ఈ రాజు తాత్కాలికమైన వైరాగ్యంతో నా దగ్గరికి వచ్చాడా? ఇతడికి ఏమాత్రం దీక్ష ఉంది? మోక్షేచ్ఛ నిజంగా ఉందా?” అనే ఉద్దేశ్యంతోనే, అతడిని చూడలేదు.
ఆ రాజు, 13 అహోరాత్రములు ఆ ఆశ్రమం ముందే నిలబడి ఉన్నాడట. కపిలుడు తనను చూడకపోయినా, కదలకమెదలక ఒక దోసెడు నీళ్ళు చెఱువు నుంచీ తీసుకొని రోజుకు ఒక్కమాటే తాగేవాడట! 13 రోజులూ అలా నిలబడే ఉన్నాడట. ఆయనను కపిలుడు ఆహ్వానించలేదు కూడా. అప్పటిదాకా 13 అహోరాత్రములు అలా ఉండటంచేత, అతడు దృఢమయిన
మనస్సుతోనే వచ్చాడు అని తెలుసుకుని కన్నెత్తి చూచి, “ఓహో! వచ్చావా నువ్వు!" అని పలుకరించాడట కపిలుడు.
"నా ఆశ్రమానికి ఎందుకు వచ్చావు? నీకు రాజ్యమున్నది. నీ తండ్రి నీకప్పగించిన రాజ్యంకదా! లోకంలో నువ్వు ధర్మశాసనం చెయ్యాలి! నీకు ఆ బాధ్యత ఉన్నది; నీవు క్షత్రియుడివి! పుత్రాదులకు పెళ్ళిళ్ళు చెయ్యాలి! భార్యను వదిలి పెట్టివస్తే అది అధర్మం కాదా! అలా అని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా!" అంటూ ఇట్లాంటి మాటలన్నీ చెప్పాడు కపిలుడు.
ఆ రాజువచ్చి 13రోజులు గడిచాయి. 14వ రోజు ధర్మబోధ చేసాడు. లౌకిక ధర్మబోధ అది. అది పరీక్ష. యథార్థమైన వైరాగ్యం అతడిలో ఉండటంచేత ఏమీ చలించ లేదు. సమాధానం చెప్పలేదు. అంజలి బద్ధుడై అక్కడ నిలబడి ఉన్నాడు.
అప్పుడు కపిలుడు - మనుష్యుడికి (జీవులకు) కర్మ, భక్తి, వైరాగ్యము, జ్ఞానము, యోగము అనేటటువంటి ఐదు పరిణామములు ఉంటాయి అనే విషయం బోధచేసి; అతడికి ముక్తిమార్గం
అనుగ్రహించాడు. ఆయన ఆ రాజుకు ఉపదేశించిన మహామంత్రం ఇలా ఉంది :
'పరాయ పరరూపాయ
పరమాత్మన్ పరాత్మనే
నమః పరమతత్యాయ
పరానందాయ ధీమహి'
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment