Monday, October 27, 2025

 _*💫 నవమణిమాల !!  ⚜️*_
➖➖➖➖➖➖✍️
*_-శ్రీరమణాశ్రమ లేఖలు_*
*_-శ్రీరమణ స్మృతులు_* 
®®®®®®®®®®®®®®
*_⚡భగవాన్ దీక్షాస్వీకార విషయమైన కథ చెప్పగా విన్న ఒక భక్తుడు ఈ ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి సమీపంలో కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ "పూర్వం, చిదంబరం నుండి కూడా ఎవరో వచ్చి నటరాజ దర్శనార్థం రావలసిందని భగవాన్ను తొందరించారట కదూ ?" అన్నాడు._*

*_"అవునవును, అదీ విరూపాక్ష గుహలో ఉండగానే. 1914 లేక 1915లోనో అనుకుంటాను. చిదంబరంలో వుండే దీక్షితుల అర్చకులలో ఒకరు మన సంగతంతా విని వచ్చి, పట్టణంలో బసచేసి, నిత్యం గుహకు వస్తూపోతూ ఉండేవారు._"*

*_వచ్చినప్పుడల్లా అదీ యిదీ మాట్లాడడంలో అప్పుడప్పుడు' స్వామీ ! ఈ దక్షిణాపథంలో ఉన్న పంచలింగాలలో అంబరలింగం గొప్పదికదా. తాము ఒక్కసారి అక్కడకి దయచేసి, నటరాజ దర్శనం చేసుకోరాదా ?దయచేయం'డని తొందరచేస్తూ వచ్చారు._* 

*_ఆ సందర్భంలోనే ఒకనాడు ఒక కాగితం మీద 'అచలనే యాయిను మచ్చవైతన్నిల్' అనే వెణ్పా పద్యం రాశాను. తాత్పర్యం ఏమంటే 'తండ్రి (శివుడు) అచలుడే అయినను ఆ సభ (చిదంబరం)లో అచలయైన అంబ ఎదుట ఆడును. (నటరాజ నృత్యమని భావం)._*

*_అచలరూపమందు ఆ శక్తి ఉపశమింపగా ప్రకాశించే వెలుగును అరుణాచలమని తెలియుము' అని. అంటే, చలించే అంబరలింగము కన్న చలనరహితమై ప్రకాశించే అరుణాచలమే శ్రేష్ఠమని భావం. ఆ పద్యం చూచిన తరువాత వారు నన్నక్కడకు రమ్మని పిలవడం మానివేశారు. తరువాత ఆ పద్యం నవమణిమాలకు మొదటిదిగా చేర్చాము” అనిసెలవిచ్చారు భగవాన్._* 

*_“నవమణిమాల పద్యాలన్నీ ఇదే విధంగా అప్పుడప్పుడు రాశారు కాబోలు ?” అన్నాడు వెంకటరత్నం. "అవునవును" అంటూ భగవాన్ చిరునవ్వుతో ఇలాసెలవిచ్చారు. “ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒకనాడు ఈశ్వరస్వామి ఏం చేశారనుకున్నారు._*

*_తమిళనాడులో ఒట్టకూత్తరు అనే ఒక మహాకవి, ప్రజలతో పందెం చరిచి పాడిన పద్యాలలో "ఇడుక్కప్పుంబడుం నిరుప్పుక్కొండుడన్' అన్న పద్యం చదివి 'భగవాన్ ఇదే భావంతో, ఇదే చందస్సులో, ఈ విధమైన యతిప్రాసలతోనే, ఒక పద్యం రాయాలి' అని పట్టుబట్టి కూర్చున్నారు._* 

*_ఒట్టకూత్తరు ఆ విధమైన యతిప్రాసలతో పద్యం రాస్తానని ప్రజలతో పందెం చరిచి, చింగళరాజా తనకిచ్చిన పారితోషికములను గుఱించీ, తన పాండిత్య ప్రతిభను గురించీ, సభలో పొగుడుకుంటూ ఆ పద్యం రాసారు. నన్నూ అదే విధంగా రాయమంటారు వీరు. ఏం చేసేదీ ? అప్పుడు ప్రస్తుతం నవమణిమాలలో ఎనిమిదవదిగా ఉన్న 'భువిక్కుట్పొంగిడుం భువిచ్చొఱుంగవన్' అన్న పద్యం రాశాను._*

*_తాత్పర్యం ఏమంటే 'భూమికి అతిశయమగు, భూమినాథేశ్వరుని పురమైన తిరుచ్చుళియందు, పుణ్యాత్ముడైన సుందరమయ్యరనే పతికి, అళగమ్మ అనే సతికి జన్మించిన నన్ను, భూవిభుడైన అరుణాచలుడు తన హృదయ ముప్పొంగ, భువిని గల విషయములచే కలుగు తాపము నుండి తప్పించి, చిన్మయము జ్వలింప, తన్మయ ముప్పొంగ, తన పదము నాకిచ్చెను' ఇదే భావం. మిగతా ఏడు పద్యాలున్నూ ఇదే విధంగా ఏదో ఒక కారణం వల్లనే రాయడమయింది.” “ఆ కారణాలు కూడా ఏవో సెలవిస్తే” అన్నాను. “సరి సరి. నీకేమీ పనిలేదు” అని అంటూ ప్రసంగం తప్పించారు భగవాన్. ఇప్పటికి ఇంతే ప్రాప్తమని ఊరుకున్నాను !!_*
               *_-(సూరి నాగమ్మ)._*

🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

No comments:

Post a Comment