Tuesday, October 28, 2025

 ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

                *శివ దర్శనం*

*కార్తీకమాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం.*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

 శ్రీ గుప్తేశ్వర స్వామి వారి ఆలయం- కోరాపుట్ -ఒడిశా.
ఈ ఆలయం ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా లోని జైపూర్ నుండి 55 కిలోమీటర్ల దూరం లోని రామగిరి కొండ నుండి10 కిలోమీటర్ల దూరం లోని పవిత్ర శబరి నది ఒడ్డున ఉన్నది.

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ,సీతమ్మతల్లి మరియు లక్ష్మణునితో కలిసి అరణ్యవాసం చేస్తూ దండకారణ్యంలో పర్యటిస్తూ ఈ కొండపై నివసించిన సందర్భంలో శివుని గూర్చి తపస్సు చేయగా ప్రత్యక్షమైన పరమేశ్వరుడు అరణ్య వాసం దిగ్విజయంగా పూర్తి చేస్తారని శ్రీరామునికి వరం ఇచ్చి, శ్రీరాముని కోసం భువిపైకి దిగివచ్చిన సందర్భంగా ఇక్కడే లింగాకృతిలో త్రేతాయుగం, ద్వాపర యుగాలలో గుప్తంగా ఉండి కలిలో భక్తులకు వెల్లడి అవుతానని చెప్పినట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది..

శ్రీరాముని కొరకు శివుడు భువిపైకి వచ్చిన నేపథ్యంలో ఈ కొండ రామగిరిగా పిలవబడుతుంది అని శివయ్య చెప్పినట్టు చరిత్ర.

కొండపై ఎత్తైన ప్రదేశంలో ఉన్న కొలను *సీతాకుండం* గా పిలుస్తారు.ఇక్కడి నీరు అత్యంత పరిశుభ్రంగా ఎప్పుడూ ఉండటం విశేషం.  సీతమ్మవారు త్రేతాయుగంలో స్నానమాచరించిన పుణ్యతీర్థరాజంగా ప్రసిద్ధి.

ప్రకృతి అందాలు నడుమ, ప్రశాంత వాతావరణం లో గుహలో 10 అడుగుల లోతులో వెలిసిన శివలింగ స్వరూపం ఆరు(6) అడుగుల ఎత్తు,పది (10) అడుగుల వెడల్పులో పెద్ద లింగం స్వయంభూగా కొలువై ఉండి, భక్తులకు కొంగుబంగారంగా మారి దర్శనమిస్తున్నారు.

*దాదాపు 2 యుగాలు గుప్తంగా ఉన్న స్వామి* *కలి యుగంలో వెల్లడి అయిన సందర్భం..*


17 వ శతాబ్దంలో రాజా విక్రమదేవ్ పరిపాలనలో ఈ రామగిరి ప్రాంతానికి పాత్రో అనే ప్రత్యేక అధికారి ఉండేవారు. మాంసాహారం ఎక్కువ ఇష్టపడే పాత్రో తన కోసం ఒక గిరిజన యువకుడిని ప్రతీరోజూ మాసం అందించేందుకు నియమించారు.

రోజూలానే ఒకరోజు వేటకు వెళ్లిన ఆ యువకుడు  ఒక లేడిని బాణంతో కొట్టగా ఆ లేడి దండకారణ్యం లో ప్రాణభయంతో పరుగు పెట్టి ఎవరూ ప్రవేశించ వీలులేని ఈ గుహలోనికి ప్రవేశించింది. లేడిని  అనుసరిస్తూ యువకుడు ఈ గుహ లోనికి వెళ్లగా అక్కడ శివలింగం కనిపించింది. వెంటనే లేడిని వదిలి పాత్రో కు ఈ విషయం చెప్పడం, వెంటనే రాజుకు తెలియజేయడం, జరిగాయి.

మర్నాడు వీర విక్రమదేవ్ రాజు పరివారంతో  గుహలోనికి వెళ్ళే వీలు ఏర్పాటుచేసుకుని గుహలోకి వెళ్లి చూస్తే మహాశివలింగంను దర్శించి, పరవశించి, ఇన్నాళ్లు గుప్తంగా ఉండి ఆనాడు వెల్లడైన స్వామి వారిని *గుప్తేశ్వర స్వామి* గా పిలవడంతో ఆ పేరు స్థిరపడింది.

నాగాభరణంతో ఉన్న లింగస్వరూపంలో ఉన్న స్వామివారికి కామధేనువు స్వయంగా పాలు విడిచి అభిషేకం నిర్వహించింది అని అందుకు గుర్తుగా లింగం పైన ఉన్న గుహ ఆవు పొదుగు రూపంలో ఇప్పటికీ ఉంటుంది.అక్కడ నుండి శుద్ధ జలం చుక్కలుగా స్వామిని అభిషేకిస్తూ ఉంటుంది.
  
భక్తులు  స్వామి ముందు తమ మనోభీష్టం చెప్పి చేతులు చాచితే పైనుండి పడే జలం చేతిలో ఒక చుక్కపడినా తమ కోర్కెలు నెరవేరుతాయని దర్శించిన వారి అనుభవం నుండి అందుతున్న నిత్య నిదర్శనం..

*మేఘసందేశ* కావ్యం లో:-

మహాకవి కాళిదాసు రచించిన మేఘసందేశ కావ్యంలో ఈ దండకారణ్యం,రామగిరి కొండ మరియు గుప్తేశ్వర్ మహాదేవ్ గురించి వివరించి తమవంతు స్వామికి అక్షరార్చన చేశారు.

అద్భుతమైన దివ్యత్వం..గుప్తేశ్వర్ మహాదేవ్ దర్శనం..
......
*ఓం నమః శివాయ 🙏*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

No comments:

Post a Comment