Friday, October 10, 2025

 6️⃣3️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*12. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాl*
 *తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్త్కేస్తేన ఏవ స:ll*

యజ్ఞముల వలన దేవతలు తృప్తిచెందుతారు. వారు మానవులకు కోరకుండానే వరాలు ప్రసాదిస్తారు. దేవతలు ప్రసాదించిన వరములను అనుభవిస్తూ కూడా, ఆ వరముల ద్వారా వచ్చిన ఫలములను దేవతలకు కృతజ్ఞతా భావంతో ఎవరు నివేదించ కుండా తానే అనుభవిస్తాడో, వారు దొంగలతో సమానము.

యజ్ఞయాగములు చేస్తే వర్షములు కురుస్తాయి. పంటలు పండుతాయి. ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. పండ్లు ఫలములు కాయకూరలు దుంపలు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. వాటిని మానవులు తృప్తిగా అనుభవిస్తారు. ఆ అనుభవించేటప్పుడు, ఆరగించేటప్పుడు కనీసం తాను తినబోయే పదార్థమును ఆ దేవతలకు నివేదించకపోతే, వారు దొంగలతో సమానము అంటున్నాడు పరమాత్మ, తగిన మూల్యం చెల్లించకుండా ఊరికే లాక్కునే వాడిని మనం దొంగ అంటాము. ఇక్కడ కూడా అంతే. ఈ భూమి మనది కాదు, మనం పుట్టక ముందు ఈ భూమి ఉంది. మనం చచ్చిన తరువాత కూడా ఉంటుంది. ఆ భూమిలో పండిన ధాన్యము, పండ్లు మనవి కావు, సూర్యరశ్మి, వర్షము(నీరు), గాలి, నేల మొదలగు దేవతలు ఇచ్చినవి. వారు ఇచ్చిన వాటిని వారికి నివేదించడం మానవుని కనీస ధర్మము. కృతజ్ఞతాభావంతో తాను తినబోయే దానిని భగవంతునికి, దేవతలకు నివేదించడమే మనము దేవతలకు చెల్లించే మూల్యము. ఒక్క భగవంతునికే కాదు, సాటి మానవులకు, జంతువులకు, పక్షులకు, చిన్ని చిన్ని కీటకములకు కూడా పెట్టాలి. ఎందుకంటే సకల ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి. దానినే భూతదయ అని అంటారు. అన్నం వండుకున్న తరువాత భగవంతునికి నివేదించడం, అతిథులకు అన్నం పెట్టడం, మనము తినే దాంట్లో ఒక ముద్ద తీసి పక్కనపెట్టడం దీని కిందికే వస్తాయి. కాబట్టి మనకు సమస్త ఐశ్యర్యములను ప్రసాదించిన పరమాత్మకు, ప్రకృతి దేవతలకు కృతజ్ఞత చూపించడం మానవుని కనీస కర్తవ్యము.

ఎవరైతే యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తి పరుస్తాడో, భగవంతుడు అతనికి అంతులేని ఐశ్చర్యములను ప్రసాదిస్తాడు. ఎవరైతే భగవంతుడు ఇచ్చిన దానిని అనుభవిస్తూ, తిరిగి దానిని భగవంతునికి నివేదించకుండా తింటాడో వాడు దొంగతో సమానము. మానవులు యజ్ఞములు చేస్తారు. మంచి కర్మలు చేస్తారు. వారికి భగవంతుడు కోరిన కోరికలు ప్రసాదిస్తాడు. అటువంటి మానవుడు భగవంతుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. భగవంతుడు తనకు ఇచ్చిన దానిని తిరిగి భగవంతునికి నివేదించాలి. భగవంతునికి నివేదించడం అంటే సాటి ప్రాణులకు పెట్టడం, అతిధులకు పెట్టడం, జంతువులకు పెట్టడం, వృక్షములను నీరుపోయడం లాంటివి. ఇవే పంచమహాయజ్ఞములు అని అంటారు. ( దేవ యజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, భూత యజ్ఞము. మానుష యజ్ఞము) ఇవి చేయని వాడు భగవంతుని సాత్తును దొంగిలించిన వాడవుతాడు.

ఇక్కడ దొంగ అంటే ఒక వస్తువును ఊరికే తీసుకురావడం. మనకు అన్నము మొదలగు ఆహార పదార్థములు, వర్షములు కురిపించి, భూమిని సారవంతము చేసి, పంట మొక్కలలో జీవమును నింపి, భగవంతుడు ఇస్తున్నాడు. దానికి గాను మనం ఏమి చేయాలి. ఓ భగవాన్ నీ దయవలన నేను ఆహారం తింటున్నాను అని తాను తినే ఆహారమును పరమాత్మకు సమర్పించి తరువాత తాను తినాలి. అలాగే పితృదేవతలకు, సాటి మానవులకు, జంతువులకు, పెట్టాలి. ఇలా పెట్టకుండా అంతా తానే ఆరగించేవాడు దొంగ. ఈ రోజుల్లో ప్రతిరోజూ దేవునికి దీపారాధన చేసి, వండిన పదార్థములను దేవునికి నివేదించి, కొంత భూతములకు పెట్టి, తరువాత తినే వాళ్లు ఎంతమంది ఉన్నారు. తాను తినేముందు పరమాత్మకు నివేదించకుండా తినేవాడు, ఎంత విద్వాంసుడైనా ధనవంతుడైనా, గొప్పవాడైనా రాజైనా, భగవంతుని దృష్టిలో అతడు దొంగతో సమానము. మరి దొంగకు శిక్ష పడాలి కదా. ఈ రోజుల్లో సంభవించే అతివృష్టి, అనావృష్టి, అగ్నిప్రమాదాలు భూకంపాలు, తుఫానులు ఇటువంటివి అన్నీ శిక్షలే. కాబట్టి మనకు ఉన్నది ఈశ్వరునికి అర్పించడం, అతిథులకు అన్నం పెట్టడం, పేదవారికి, లేని వారికి ఉన్నంతలో సాయం చేయడం, సాటి జంతువులకు ఆహారం పెట్టడం, చెట్లను సంరక్షించడం, ప్రకృతిని ఆరాధించడం, భగవంతుని మీద భక్తి కలిగి ఉండటం, పరోపకార దృష్టి అలవరచుకోవడం ఇవన్నీ భగవంతునికి మనం చూపే కృతజ్ఞతాభావము. ఏ దోషమునకైనా, నేరానికైనా, పరిహారం ఉంటుంది. చివరకు హత్య పాతకానికి కూడా పరిహారం ఉంటుంది కానీ కృతఘ్నుడికి అంటే చేసిన మేలు మరిచిపోయే వాడికి, పరిహారం అంటూ ఏమీ లేదు. కాబట్టి మనం ఆ పరమాత్మకు, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు అన్నీ సమకూర్చే పంచభూతములకు, వాటి అధిష్ఠానదేవతలకు, సతతం కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఆ కృతజ్ఞతను ఎలా చూపించాలి అనే విషయం తరువాతి శ్లోకంలో వివరిస్తున్నారు.
(సశేషం)

*🌹 యోగక్షేమం వాహామ్యహం🌹* 

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P161

No comments:

Post a Comment