Tuesday, October 21, 2025

 _*శ్రేయో మార్గం - ప్రేయోమార్గం*_
✍️ ఆచార్య మసన చెన్నప్ప
✳️🌹🥀🌻🪷✳️🌻🪷🥀🌹✳️

✳️ _*[ఈ ప్రపంచంలో మానవుడు నడుచుకునే మార్గాలు రెండున్నాయి•. ఒకటి శ్రేయోమార్గం కాగా, రెండోది ప్రేయోమార్గం. సామాన్య మానవుడు ఈ రెండు మార్గాల్లో ఉన్న భేదాన్ని గ్రహించడు. ఏ మార్గం మంచిదో, ఏ మార్గం చెడ్డదో కూడా అతని అవగాహనకు రాదు♪. కానీ విద్వాంసులు మోక్షసాధనమైన శ్రేయోమార్గాన్ని గుర్తించి, దాన్నే అనుసరిస్తారు♪. మందబుద్ధి కలిగినవారు ధన సంపాదనలోనూ, ధన సంరక్షణలోనూ కాలం గడుపుతూ ప్రేయోమార్గంలో నడుస్తారు. ఈ రెండు మార్గాల మధ్య వైరుధ్యాన్ని గురించి కఠోపనిషత్తు చెబుతోంది♪.]*_
      🪷┈┉┅━❀🌀❀┉┅━🪷

🪷 _*ఆధ్యాత్మిక ఆనoదాన్ని ఇచ్చేది "శ్రేయోమార్గo"♪. సాoసారిక సుఖాన్ని కలిగించేది "ప్రేయోమార్గం"♪.*_

✅ _*శ్రేయస్సును కలిగించే మార్గం ప్రారంభంలో కష్టంగా ఉంటుంది కానీ, చివరిలో శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది♪. ఇక ప్రేయస్సును కలిగించే మార్గం ప్రారంభంలో సుఖదాయకంగా ఉండి, చివరిలో దుఃఖాన్ని అనుభవింప చేస్తుంది♪.*_

🪷 "ప్రేయోమార్గం"  అంటేనే ప్రియమైందని అర్థం♪. ఈ మార్గం మానవుణ్ణి ఎల్లవేళలా తన యోగక్షేమాల్లో మునిగేలా చేస్తుంది♪. అందువల్ల అతనికి శ్రేయోమార్గం దూరమవుతుంది♪. ఒక్కమాటలో చెప్పాలంటే, -  _*సాంసారిక సుఖానుభవమే "ప్రేయోమార్గం" ... ఆధ్యాత్మిక సుఖానుభవమే "శ్రేయోమార్గం"*_ .... అని కఠోపనిషత్తులో నచికేతునికి యముడు ప్రబోధిస్తాడు.

✳️ _*విద్య - అవిద్య*_ 💐

🪷 ఎవరు లౌకిక సుఖాలలో అనురక్తులవుతారో వారికి ఆధ్యాత్మిక జ్ఞానం కొరవడుతుంది♪. వైరాగ్య భావన కలిగి ఎవరు ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తారో వారికి క్రమంగా ఈశ్వరీయ జ్ఞానం అలవడుతుంది♪. శ్రేయోమార్గం దొరుకుతుంది♪. లౌకిక సుఖాలకు అలవాటు పడ్డవారికి సంపాదన ముఖ్యం. ఎక్కువ సంపాదన చేయాలనే తృష్ణ వారిని దుఃఖంలో పడవేయవచ్చు♪. కానీ, వారు ఈ  విషయాన్ని మోహం వల్ల తెలుసుకోలేరు♪.

🪷 వైదిక పరిభాషలో ప్రేయస్సును ‘అవిద్య' అని, శ్రేయస్సును 'విద్య' అని పిలుస్తారు♪. అవిద్య కారణంగానే ఫలాపేక్షతో పనులు చేస్తూ సామాన్యులు సుఖాలవైపు పరుగెత్తుతారు. విద్వాంసులు మాత్రం విద్యను ఆశ్రయించి, పరమేశ్వరుని వైపు దృష్టి పెడతారు. అయితే కొంతమంది చదువుకున్న వారు కూడా ప్రేయోమార్గంలో నడుస్తూ, తామే అంతా తెలిసినవారమని... తమకంటే గొప్పవారెవరూ లేరని భావిస్తారు. ఇలాంటివారినే కఠోపనిషత్తు 'పండితమ్మన్యులు' అని పేర్కొంటుంది. వీరు కుటిలమార్గంలో నడుస్తూ...అజ్ఞానం వల్ల గుడ్డివాని చేత కొనిపోబడే గుడ్డివారివలె పరిభ్రమిస్తారని తెలియస్తుంది కఠోపనిషత్తు♪. 

_*అవిద్య యామంతరే వర్తమానాః ధీరాః పండితమ్మన్యమానాః దంద్రమ్యమాణాః పరియంతి మూఢాః అంధేనైవనీయమానా యథాం౬ధాః*_  (2-5)

🪷 మనిషి ధనంమీద వ్యామోహాన్ని పెంచుకుని, వివేకాన్ని కోల్పోతాడు♪. అప్పుడతనికి ఇతరుల ధనాన్ని దోచుకోరాదు, అక్రమంగా దాచుకోరాదు అనే విషయాలే జ్ఞప్తికి రావు•. ఒకవిధంగా అలాంటివారికి దారాపుత్ర పౌత్రాదులు, ధనధాన్యాలే సర్వస్వం♪. ఈ కారణంగానే వారు చివరికి మృత్యువు పాలై జననమరణ చక్రంలో తిరుగుతారు. ఇదంతా ప్రేయోమార్గంలో నడిచేవారి పరిస్థితి•. ఇంకా వీరి గురించి చెప్పాలంటే వీరికి తిండితిప్పలు తప్ప ఆత్మవిచారం పట్టదు•. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించరు♪. ఎవరైనా జ్ఞానోపదేశం చేస్తే, వినరు. నిజానికి ఆత్మ గురించి చక్కగా తెలియచేసే అద్భుత వ్యక్తులు లోకంలో లేకపోలేదు. కానీ అట్టివారిని ప్రేయోమార్గంలో నడిచేవారు పట్టించుకోరు.

✳️ _*అసలు సంపద*_ 💐

🪷 యమాచార్యుడు నచికేతునికి ఆత్మోపదేశం చేస్తూ, _*“ఆత్మజ్ఞాని మాత్రమే ఆత్మను గూర్చి చెప్పగలడు. బ్రహ్మనిష్ఠ గలిగినవారి ఉపదేశం ఏమాత్రం సంశయానికి తావీయదు. ఆత్మ అన్నింటికంటే సూక్ష్మమైంది. ఊహకు, తర్కానికి ఆత్మ అందదు. ఆత్మవిదుల ఉపదేశం మాత్రమే ఆత్మతత్త్వాన్ని తెలియచేయగలదు. ఇంద్రియాలను వశంలో ఉంచుకుని మనస్సును ఆత్మలో స్థిరంగా ఉంచాలి. దీనికే ''అధ్యాత్మ యోగ'మని పేరు. ఇట్టి యోగాన్ని అనుసరించిన వారిదే శ్రేయోమార్గం. ఈ మార్గంలో నడిచినవారికి హర్షశోకాలుండవు. ద్వంద్వాతీత స్థితి కలుగుతుంది. పరమాత్మ తత్త్వం బోధపడుతుంది" అని తెలియచేశాడు.

✳️ _*[మనిషికి కోరికలున్నంత వరకు శబ్దాది విషయాల మీద అనురాగం ఉంటుంది♪. కోరికలను నశింప చేసుకున్నప్పుడే అతడికి జననమరణాలు తప్పుతాయి. ప్రేయోమార్గంలో నడిచేవారిది పితృయానం. మళ్లీ వారికి జన్మ ఉంటుంది. శ్రేయోమార్గంలో నడిచేవారిది దేవయానం. వారు యోగమార్గంలో నడుస్తూ, వివేక వైరాగ్యాల వల్ల జీవాత్మను సుషుమ్నానాడి ద్వారా బ్రహ్మరంధ్రానికి పంపించి, ఆ తర్వాత దాని నుంచి కూడా బయటపడి పరమాత్మలో చేరిపోతారు. దీనికే ముక్తి అని పేరు. శ్రేయోమార్గంలో నడిచేవారికి ఇంతకంటే గొప్ప ప్రయోజనం లేదు♪.]*_

🪷 ప్రేయోమార్గంలో వెళ్లేవారు జనన మరణ చక్రంలో తిరుగుతుండగా, శ్రేయోమార్గంలో వెళ్లేవారికి పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. తద్వారా వారు మోక్షానందాన్ని పొందుతారు. ప్రేయోమార్గంలో నడిచేవారిని భోగులని, శ్రేయోమార్గంలో నడిచేవారిని యోగులని పిలుస్తారు. భోగులు అవిద్యలో ఉండగా, యోగులు విద్యచే ప్రకాశిస్తారు. ప్రేయోమార్గంలో నడిచేవారికి అన్ని సంపదలూ కావాలి. శ్రేయోమార్గంలో నడిచేవారికి ఒక్క ఆధ్యాత్మిక సంపద ఉంటే చాలు.

🪷 ప్రేయోమార్గం భోగులది. శ్రేయోమార్గం యోగులది. ప్రేయోమార్గంలో నడిచేవారికి పునర్జన్మ ఉంటుంది. శ్రేయోమార్గంలో నడిచేవారు పునర్జన్మను పొందరు. ప్రేయోమార్గం అవివేకానికి చెందినది. శ్రేయోమార్గం వివేకానికి చెందింది. ఇంద్రియనిగ్రహం లేనివారు శ్రేయోమార్గంలో నడవలేరు. అందుకే శ్రేయోమార్గంలో నడిచేవారి సంఖ్య ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ప్రేయోమార్గంలో వెళ్లేవారు ప్రకృతి బంధనాల్లో చిక్కుకుని, దుఃఖాలను కొనితెచ్చుకుంటారు. కానీ శ్రేయోమార్గంలో వెళ్లేవారు ప్రకృతి బంధనాలను ఛేదించుకుని, దేవలోకగాములు అవుతారు. ప్రేయోమార్గంలో నడిచేవారు లోకంలోని సిరిసంపదలను శాశ్వతమని భావిస్తారు. శ్రేయోమార్గంలో నడిచేవారి దృష్టిలో ప్రపంచ పదార్థాలన్నీ అనిత్యమైనవే. వీరు నిత్యానిత్య పదార్థాల తారతమ్యం తెలుసుకుని, నిత్యపదార్థాల్లో నిత్యమైన, సత్యమైన పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు. కర్తవ్య కర్మలను వేదవిహిత కర్మలను ధర్మాలుగా భావించి ఫలాపేక్ష లేకుండా నిర్వహిస్తారు. ప్రేయోమార్గంలో నడిచేవారు సకాములు. శ్రేయోమార్గంలో నడిచేవారు నిష్కాములు. ఎవరు నిష్కాములో వారిని ప్రకృతి బంధించదు. కానీ ఫలాపేక్ష కలిగినవారిని ప్రకృతి ఎన్నడూ విడిచిపెట్టదు. పైగా దుఃఖాన్ని కలిగిస్తుంది.

✳️ _*ఆత్మాన్వేషణ మార్గం*_ 💐

🪷 శ్రేయోమార్గంలో నడిచేవారు ఋగాది వేదాలు ఏ పరమ తత్త్వాన్ని గూర్చి వర్ణిస్తున్నాయో తెలుసుకుంటారు. ఇంద్రియాలను నిగ్రహించుకుంటారు. పరమేశ్వరుని నామమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తారు. బ్రహ్మచర్యాది వ్రతాలను ఆచరిస్తారు. శ్రేయోమార్గంలో వెళ్లేవారికి పరమేశ్వర వాచకమైన ఓంకారమే ఆలంబనం. 

_*ఏతదాలంబనం శ్రేష్ఠం*_ 
_*ఏతదాలంబనం పరం*_ 
_*ఏతదాలంబనం జ్ఞాత్వా*_ 
_*బ్రహ్మలోకే మహీయతే*_

🪷 సర్వశ్రేష్ఠమైన ఓంకారాన్ని స్మరిస్తూ, సూక్ష్మములలోకెల్లా సూక్ష్ముడైన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటూ, యోగమార్గంలో నడుస్తూ, మోక్షానందాన్ని కైవసం చేసుకునే యోగ్యత కేవలం శ్రేయోమార్గంలో నడిచేవారికే ఉంటుంది. ప్రేయోమార్గంలో వెళ్లేవారికి ఆత్మతత్త్వం బోధపడదు. నిజానికి ఆత్మకు చావుపుట్టుకలు లేవు. అది నిత్యమైంది. శాశ్వతమైంది. కేవలం శరీరం నశిస్తుంది కానీ, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది.

🪷 సామాన్యులు తమ శరీరమే ఆత్మ అనుకుంటారు. శరీరంతోపాటు ఆత్మ కూడా నశిస్తుందని భావిస్తారు. ఆత్మ అణువుకంటే సూక్ష్మమైనది. పరమాత్మ ఎంత సూక్ష్ముడో అంత గొప్పవాడు. అతడు ప్రాణుల హృదయాల్లో ఉంటాడు. ఎవరైతే దృష్టాదృష్ట విషయభోగ రూప ఫలాపేక్ష కలిగి ఉంటారో వారికి పరమాత్మ స్వరూపం తెలియదు. ప్రేయో (భోగ మార్గంలో నడిచేవారికి కేవలం శ్రవణం వల్ల, బుద్ధివల్ల పరమాత్మ అందడు.

🪷 శ్రేయోమార్గంలో వెళ్లేవారు జీవాత్మను రథస్వామిగా, దేహాన్ని రథంగా, బుద్ధిని రథసారధిగా, మనస్సును పగ్గంగా, నేత్రాది ఇంద్రియాలను గుర్రాలుగా, శబ్ద స్పర్శ రూప రస గంధాలను మార్గాలుగా భావించి, తాము చేరవలసిన గమ్యస్థానం ఒక్క పరమాత్మయే అని నిశ్చయిస్తారు. నిజానికి వీరే జీవన్ముక్తులు. ప్రేయోమార్గంలో నడిచేవారికి ఇంద్రియాలు వశంలో ఉండవు. కపటాది దుర్గుణాలు ఉండడం వల్ల మనస్సు వశం తప్పి జనన మరణ రూపమైన సంసారంలోనే ఉండిపోతారు.

✳️ _*ఉత్తిష్ఠత జాగ్రత*_ 💐

🪷 ఇంద్రియాల కంటే విషయాలు, విషయాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే మహత్త్వత్వం, మహత్తత్వం కంటే ప్రకృతి సూక్ష్మం. సూక్ష్మమైన ప్రకృతి కంటే జీవాత్మ సూక్ష్మం. సూక్ష్మమైన జీవాత్మ కంటే పరమాత్మ సూక్ష్మం. పరమాత్మ కంటే ఇంకేదీ సూక్ష్మమైనది లేదని శ్రేయోమార్గంలో నడిచేవారు తెలుసుకుంటారు. పరమాత్మ అన్ని పదార్థాలలో సూక్ష్మరూపంలో ఉండి ప్రకాశించడు. కానీ శ్రేయోమార్గంలో నడిచేవారి బుద్ధికి పరమాత్మ అందుతాడు. 

_*ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్ నిబోధత*_  (2-14)

🪷 మరణించిన తర్వాత మనం ఉంటామా; ఉండమా అన్న నచికేతుని ప్రశ్నకు యమాచార్యుడు... జీవుడు శాశ్వతుడని, అతడే శరీరంలోకి ప్రవేశించిన అతిథి అని, ఒక జన్మ నుంచి మరో జన్మకు ప్రయాణిస్తాడు కనుక, ఒక గూటి నుంచి మరో గూటికి వెళ్లే హంసలాంటి వాడని సమాధానమిస్తాడు. 

🪷 శ్రేయోమార్గంలో నడిచేవారు (యోగులు) కర్మఫలాలను అనుభవిస్తున్నప్పటికీ, యోగమార్గంలో నడుస్తూ... మొదట జీవాత్మ 47 స్వరూపాన్ని, ఆ తర్వాత తమకు సమీపంలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుని పరమశాంతిని పొందగలుగుతారు అని కఠోపనిషత్తు స్పష్టం చేస్తోంది.

Courtesy: 'భక్తి' మాసపత్రిక

       ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు 

✳️🥀🌹🌻🪷✳️🥀🌹🌻🪷✳️

No comments:

Post a Comment