Wednesday, October 1, 2025

****చూపున్న మాట ఈ హిస్టరీ.. చెరిగిపోదు! బ్రౌజింగ్‌ చరిత్రతో తస్మాత్‌ జాగ్రత్త! ఈ హిస్టరీ.. చెరిగిపోదు!

 చూపున్న మాట 

    ఈ హిస్టరీ.. చెరిగిపోదు!


బ్రౌజింగ్‌ చరిత్రతో తస్మాత్‌ జాగ్రత్త!

ఈ హిస్టరీ.. చెరిగిపోదు!

    ఓ పన్నెండేళ్ల పిల్లాడు ఆడుకుంటానంటూ తండ్రి ఫోన్‌ తీసుకుని ఇష్టారాజ్యంగా పోర్న్‌ వీడియోలు చూసేవాడు. ఈ విషయాన్ని గ్రహించిన తండ్రి ఎంత ప్రయత్నించినా ఆ అలవాటు మాన్పించలేకపోయాడు. ఫోన్‌ ఇవ్వకపోతే బాలుడు తిండి మానేసేవాడు. భయపడ్డ తల్లిదండ్రులు మానసిక వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు. పూర్వాపరాలు విచారించిన ఆ వైద్యుడు అసలు విషయం తెలుసుకొని నివ్వెరపోయాడు. పోర్న్‌ వీడియోలు చూసే అలవాటు ఆ తండ్రికి ఉండేది. ఇంటికి వచ్చి ఫోన్‌ పక్కన పెట్టగానే ఆటలాడుకునేందుకు అతని కుమారుడు ఫోన్‌ తీసుకునేవాడు. ఇంటర్నెట్‌ తెరవగానే పోర్న్‌ వీడియోల తాలూకూ చిత్రాలు కనిపించేవి. బాలుడు వాటిని చూడ్డానికి అలవాటు పడ్డాడు. 
    ఓ నడి వయసు వ్యక్తికి అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంది. వాటినే ఎరగా వేసిన నేరగాళ్లు ఆయన ఫోన్‌ నంబర్‌ తస్కరించారు. దాని ద్వారా ఓ మహిళను రంగంలోకి దింపి, అశ్లీల సంభాషణ చేయించి, దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టారు.

చేతిలో ఫోన్‌ ఉంది.. అందులో ఇంటర్నెట్‌ ఉంది కదాని... తోచిందల్లా చేస్తే... గూగుల్‌ ఉందని ఇష్టారాజ్యంగా బ్రౌజింగ్‌ చేసేస్తే... చిక్కుల్లో పడ్డట్టే... ఎందుకంటే...  మీ డిజిటల్‌ చరిత్ర చెరిగిపోయేది కాదు.

    మన బ్రౌజింగ్‌ చరిత్ర మనను వెంటాడుతుందన్న విషయం మరవకూడదు. మన బ్రౌజింగ్‌ హిస్టరీని దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు వడపోస్తూనే ఉంటాయి. బాలలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు చూడడం, పంచుకోవడం నేరం కాబట్టి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే పోలీసులు వారిని ఇట్టే పట్టేస్తారు. ఉగ్రవాద సంబంధ సమాచారం వెతికినా దర్యాప్తు సంస్థల కంట్లో పడతారు. 
    అంతర్జాల సంస్థలు కూడా మనం వేటి గురించి వెతుకుతున్నామన్న విషయాన్ని గుర్తించి వాటికి సంబంధించిన ప్రకటనలే మనకు కనిపించేలా చేస్తుంటాయి. ఇదంతా మార్కెటింగ్‌ వ్యూహం. అయితే అడ్డగోలుగా బ్రౌజింగ్‌ చేయడం వల్ల వ్యక్తిగతంగా అనేక నష్టాలు జరుగుతున్నాయి. 

    రుణం గురించి బ్రౌజింగ్‌ చేస్తే ప్రైవేటు రుణ సంస్థలే కాదు, నేరగాళ్లు కూడా రుణం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తుంటారు. ఒక తండ్రి రుణం కోసం బ్రౌజ్‌ చేస్తే ఆ తర్వాత అతని ఫోన్‌ వాడిన ఇంజినీరింగ్‌ కుమారుడికి ష్యూరిటీ లేకుండా రుణం ఇస్తామంటూ లోన్‌ యాప్‌ల నుంచి వచ్చిన ఆకర్షణీయమైన ప్రకటనలు వచ్చాయి. దాంతో రుణం తీసుకుని అప్పుల్లో కూరుకొని పోయాడు.
    ఇంకాగ్నిటో బ్రౌజర్‌ వాడితే ఎవరికీ తెలియదని అనుకుంటారు. ఇది తప్పు. బ్రౌజింగ్‌ హిస్టరీ ఉపకరణంలో మాత్రమే కాదు, సర్వీస్‌ ప్రొవైడర్‌ వద్ద కూడా పేరుకుపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్రౌజింగ్‌ హిస్టరీ మన వేలిముద్ర లాంటిది. మనం ఎప్పుడు ఏమి చూశామన్నది నమోదవుతూనే ఉంటుంది. 

అలా చేశారో...

    చేతిలో ఫోన్‌ ఉంది కదా అని ఏదిపడితే అది చూడకపోవడమే ఉత్తమం. మనకి ఏది అవసరమో అదే చూడాలి. 
    ఎప్పటికప్పుడు బ్రౌజింగ్‌ హిస్టరీ డిలీట్‌ చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల మన ఉపకరణం మరొకరు వాడినప్పుడు ముందు వాడిన వ్యక్తి బ్రౌజింగ్‌ చరిత్ర కనిపించదు. 
    అశ్లీల చిత్రాల మాటున సైబర్‌ నేరగాళ్లు పొంచి ఉంటారన్న సంగతి గుర్తుంచుకోవాలి. హనీట్రాప్‌ మాదిరిగా పాపప్‌ మెనూలతో కవ్విస్తారు. వాటిని క్లిక్‌ చేయగానే ఉపకరణంలో పాగా వేస్తారు. 
    నమ్మకమైన వెబ్‌సైట్లు మాత్రమే చూడాలి. తెలియని లింకులు వస్తే క్లిక్‌ చెయ్యొద్దు. వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వొద్దు

No comments:

Post a Comment