* కథ పేరు...నన్ను మన్నించండి నాన్నా !!
****************
నిన్న ఆఫీసులో ఉండగా "సీతారాంగారూ మీకు పోస్ట్" అంటూ పోస్ట్ మ్యాన్ లెటర్ ఆయన చేతిలో పెట్టి వెళ్ళాడు. బిజీగా ఉండటం చేత నిన్న చదవలేక పోయాడు సీతారాం.
ఈ రోజు ఉదయం ఇంకా న్యూస్ పేపర్ రాలేదు. వాట్సప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్ లు పెట్టి, అక్కర్లేని మెసేజ్ లు డిలీట్ చేస్తూ, టీపాయ్ మీద పడి వున్న నిన్నటి లెటర్ ను చేతిలోకి తీసుకొని ఓపెన్ చేశాడు... 'ఈ కాలంలో కూడా లెటర్ ఎవరు రాశారనుకుంటూ?' చదవసాగాడు.
"పూజ్యనీయులైన నాన్నగారికి మీ కొడుకు వాసు వ్రాయునది... సెల్ ఫోన్ తాకిడిలో, చివురుటాకు తుఫానుగాలికి రాలిపోయినట్లుగా, అడ్రస్ కోల్పోయిన ఉత్తరం ఎందుకు రాశాడనుకోకుండా.. తీరికగా, ఓపిగ్గా చదవగలరని ఆశిస్తాను.
నాన్నా! అమ్మా! నువ్వూ కలసి ఉరుకుల పరుగులతో ఉద్యోగాలు చేస్తూ నిరంతరం నా ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని శ్రమిస్తున్నారు. నేనెంతో అదృష్టవంతుడిని నాన్నా. మీ కడుపున పుట్టినందుకు!
కానీ తాతయ్య (మీ నాన్నగారు) ఏం పాపం చేశారో..? ఏడుపదుల వయసు దాటిన వృద్ధాప్యంలో కన్న కొడుకు, అంటే మీ వద్ద కాలక్షేపం చేస్తున్నారన్న ఆనందం లేకుండా మీ నిరాదరణ కు గురికావడం నిజంగా ఆయన దురదృష్టమే కదా నాన్నా!
. సీతారాం లెటర్ చదువుతూ,, "కాఫీ తాగుతారా " అంటూ వచ్చిన భార్య మీనాక్షితో 'వద్దని' చెప్పి లెటర్ పట్టుకొని రీడింగ్ రూంలోకి వెళ్ళాడు. "నాన్నా. మొన్నటి దసరా సెలవుల్లో మనింటికి నేను వచ్చినప్పుడు... గుర్తుందా?
అరోజు విజయదశమి. నీకూ, అమ్మకు కూడా హాలిడే. తాతయ్య మీ వద్దకు వచ్చి "చూపు సరిగ్గాలేదనీ, అకీరా ఐ హాస్పిటల్ కి తీసుకెళ్ళు రాముడూ " అని అడిగితే , మీరు పట్టించుకోలేదు. తీసుకెడతాననీ, తీసుకెళ్ళననీ ఏ విషయమూ చెప్పలేదు. అమ్మ టీ.వి. సీరియల్స్ లో పడి తాతయ్య బాధ వినిపించుకోలేదు.
మీకు తెలుసా నాన్నా! తాతయ్య రెండు కళ్ళూ షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్ కు గురై రెటీనా దెబ్బతింది. నెలకోసారైనా మత్తు లేకుండా కళ్ళకు ఇంజక్షన్ తీసుకుంటే చూపు రికవరీ అవుతుంది.
"అవునా నాన్నా! నాకు తెలియదే" సీతారాం మనసులో అనుకుంటూ లెటర్ మళ్ళీ చదవడం ప్రారంభించాడు.
'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం' కదా! నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకండి నాన్నా! పాపం తాతయ్య ఒక్కరే హాస్పిటల్ కి వెడుతుండగా "నే వస్తానంటూ" తాతయ్య ననుసరించాను. అప్పుడు తాతయ్య నా భుజంపై చేయి వేసి "వద్దురా మనవడా! తాతయ్య, మనవడికి చేయాలేగానీ... మనవడి చేత చేయించుకోకూడదు... నాపై నీకు ప్రేముంటే చాలు.. బాధ్యత మాత్రం మీ నాన్నదే సుమా!" అంటూ ఒక్కడూ అకీరా కంటి ఆసుపత్రికి వెళ్ళాడు. నిరంతరమూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే హైవే పై కనీ కనిపించకుండా తాతయ్య ఎలా వెళ్ళాడో ఊహించుకుంటేనే భయం వేసింది నాన్నా.
లెటర్ చదువుతున్న సీతారాం గుండె బరువెక్కుతోంది. నాన్నా నాకు చిన్నప్పుడు చెప్పావు గుర్తుందా? నీ చిన్నతనంలో నిన్ను కుక్క కరిస్తే బతకలేక బడి పంతులుగా తాతయ్య పని చేస్తున్న ఆ రోజుల్లో పది కిలోమీటర్లు సైకిల్ పై నిన్ను తీసుకెళ్ళి అక్కడ ఆసుపత్రిలో వైద్యం చేయించాడని చెప్పావు కదా! అప్పుడు తాతయ్య నిన్ను 'నాకెందుకులే' అని గాలికొదిలిస్తే (ఇప్పుడు నువ్వు తాతయ్యను
గాలి కొదిలేసినట్టుగా) నీ సంగతి ఏమయ్యేది? అభిమానవంతుడైన తాతయ్యకు నేను కనిపించకుండా నాకు తెలిసిన డాక్టర్ చేత మెడికల్ చెకప్ చేయించాను. అప్పుడు తెలిసింది నాన్నా ! ఆయనకు వచ్చిన కంటి జబ్బు గురించి !
నాన్నా!మీరు లేకున్నా, తాతయ్య ట్రీట్ మెంట్ ఆగలేదు. కానీ ఆయనకు మీపై నమ్మకం పోయింది. చెట్టంత కొడుకు దగ్గర ఉండి చూసుకుంటాడన్న భరోసా పోయింది. కష్టపడి పెంచి పెద్ద చేసిన కొడుకు కష్టకాలంలో ఆదుకుంటాడన్న ధైర్యం లేకుండా చేసింది. నేనెంత దూరంలో ఉన్నా , నాతో రోజులో.. .ఒక్కసారైనా వీడియో కాల్ మాట్లాడందే మీరు ఉండలేరు కదా... అదేమంటే 'కొడుకువు కదరా!' అంటారు. మరి తాతయ్యకు నువ్వు కొడుకువేగా? రోజులో.. ఒక్కసారైనా ఆయనకు నీతో మాట్లాడాలని ఉండదా నాన్నా?
నాన్నా! మా కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి తండ్రి హార్ట్ ఎటాక్ తో చనిపోతే పరామర్శగా మేమంతా వెళ్ళి "బాధపడకండి " అని ఊరడిస్తే ఆయనేమన్నాడు తెలుసా నాన్నా?
"వాసూ మా నాన్న, నిన్నటి వరకూ నా జీవితంలో ఒక భాగం. ఇప్పుడు ఒక జ్ఞాపకం. అంత సులువుగా మరచిపోలేను. మరచిపోనంటూ" బాధపడ్డారు.
మనిషిని కోల్పోయాక, మనిషిని గుర్తిస్తే ప్రయోజనం లేదు కదా నాన్నా! బ్రతికుండగానే బాగా చూడాలి. చూసుకోవాలి. టెక్నాలజీపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగాం కదాని, మనిషి నైతిక విలువలను, మానవ సంబంధాలను దూరం చేసుకోవడం అమానవీయం కదా నాన్నా. ఎలా అంటావా? మొన్న మా బాస్ మీటింగ్ లో చెప్పారు. "స్టేట్స్ లో స్థిరపడిన ఒక వ్యక్తి తన తండ్రి చనిపోతే 'చివరి చూపుకు రాననీ, రాలేననీ, వచ్చినా నాన్న బ్రతకడు కదా !'అని తేలికగా తీసి పారేసి మాట్లాడాడట. విచక్షణ, వివేకం, మానవసంబంధాలనూ మరిచేలా చేసే విద్య రాణించలేదనీ... మీరలా ప్రవర్తించకండని ' హితవు చెప్పారు. అప్పటివరకూ సెలవులొస్తే షికార్లు చేసే మా కుర్రకారంతా పేరెంట్స్ తో గడిపేందుకు ఊరిబాట పట్టాం. శ్రవణకుమారుడు పుట్టిన దేశంలో తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పుట్టగతులుండవు నాన్నా. మీతో సెలవుల్లో ఆనందంగా గడపాలని వచ్చిన నాకు తాతయ్య పట్ల మీరు చూపిస్తున్న నిరాదరణ చూసి తట్టుకోలేకపోయాను నాన్నా. మీరెప్పుడూ నాకు ఆదర్శమే. కానీ మీరు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలని.. ఉంటారని , మానవ సంబంధాల విలువలనూ కోల్పోరని ఈ లెటర్ రాశాను. తప్పయితే క్షమించండి. నన్ను మన్నించండి నాన్నా.
ఇట్లు
మీ వాసు
లెటర్ ఆసాంతం చదివిన సీతారాం, " బాబూ! తప్పు నువ్వు కాదు, నేను చేశాను. నా కళ్ళు తెరిపించావు. మీనాక్షి! ఆఫీసుకు ఫోన్ చేసి సెలవని చెప్పేసేయ్ అంటూ, నాన్నా అంటూ ఒక్కసారిగా గట్టిగా పిలిచాడు సీతారాం. హాస్పిటల్ ట్రీట్ మెంట్ కి వెడుతున్న ఆ పెద్దాయన అబ్బాయి అరుపులాంటి పిలుపుతో ఒక్కసారి ఆగాడు 'ఎందుకన్నట్లుగా?' ప్రశ్నార్థకంగా సీతారాంకేసి చూస్తూ!
సీతారాం అమాంతం ఆయన కాళ్ళపై పడి "
ఇన్నాళ్ళూ !మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు నన్ను మన్నించండి నాన్నా! మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాదంటూ" పెద్దాయనను కారులో కూర్చోబెట్టి, కారును హాస్పిటల్ కు బయలుదేరదీశాడు సీతారాం.
కొడుకు బాధ్యత గుర్తెరిగినందుకు పెద్దాయన కళ్ళు ఆనందంతో మెరిసాయి. 'తన కొడుకులో మార్పుకు మనవడే కారణం ' అని కూడా గ్రహించాడు.
**********
సమాప్తం
కథ నంబర్..7
ఈ కథ 2018 సాహితీ కిరణం మాస పత్రిక వారు నిర్వహించిన ముట్టురి కమలమ్మ జాతీయ స్థాయి దీపావళి చిన్న కథ ల పోటీలు బహుమతి గెలుచుకుంది.
No comments:
Post a Comment