*సండే స్టోరీ*
*మశకం*
🦟 🦟 🦟 🦟🦟🦟
రచన : కొడవటిగంటి కుటుంబరావు
విక్రమ శకం, శాలివాహన శకం, క్రీసు శకం, వీటన్నిటికన్నా ప్రాచీనమైనది మశకం. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రులు చెప్పబడి ఉన్నందునే మనం చంకలు గుద్దుకుని "అబ్బో మనం చాలా పాతకాలపు మనుషులం" అని తెగ విర్రవీగుతున్నాం. కాని దోమలు ఋగ్వేదం లోనే చెప్పబడి ఉన్నాయి.
(నేను ఋగ్వేదం చూశానని కాదు, చూడటమేమిటి? చదివినా అది నాకు అర్ధంకాదు. విమానాల దగ్గిర నుంచి ఉన్న వేదాలలో దోమల ప్రసక్తి లేకపోయిందా అని) అనార్యమైన శాస్త్ర దృష్టితో చూచినా మనిషి అనే కీటకంకన్నా ముందు పుట్టినది మశక మనే కీటకం.
అరణ్యవాసాలు చేసిన హరిశ్చంద్రుడూ, రామలక్ష్మణులూ, పాండవులూ మొదలైన ప్రాచీనులు దుర్భరమైన దోమల బాధను అనుభవించి ఉండాలి, కాని ఈ విషయం ఎవరూ బయటపెట్టలేదు, ఎప్పుడూ అడవుల్లోనే ఉండే మునీశ్వరులు దోమల బాధపడలేకనే గడ్డాలూ, మీసాలూ పెంచేసుకున్నారు. ఋష్యాశ్రమాలలో వటువులకు మాత్రమే దోమల బాధ ఉండేది, తపోధనంతో బాటు కేశసంపద కూడా అలవరుచుకున్న ఋషి పుంగవులు దోమలు తమ కేసి వచ్చినప్పుడు "అహ్హహః” అనేవాళ్ళు.
🦟
అరణ్యాలలోనే గాక అయోధ్య, హస్తినా పురం, ఇంద్రప్రస్థం, మిధిలా మొదలైన పురాణ నగరాలలో కూడా దోమలుండేవని నా నమ్మకం. ఈ విషయాన్ని కూడా పురాణాలు రాసినవారు దాచిపెట్టారు. మొత్తానికి నన్నడిగితే, ప్రాచీనకాలపు కవులకన్నా ఋషులే దోమల విషయంలో ఎక్కువ నిజాయితీ కనబరిచారు.
"పిపీలికాది బ్రహ్మ పంతం” అన్నారు ఋషులు, పిపీలిక అంటే నిఘంటువుల్లో ఏం అర్థం చెబుతున్నారో తెలీదుగాని, దానికి అసలైన అర్థం దోమే. మరి కవులేమన్నారూ "హస్తిమ శకాంతరం" అన్నారు. వాళ్ళకి దోమలు కనిపించినపు డల్లా ఏనుగులు జ్ఞాపకం వచ్చేవి కాబోలు! "మహా గణాః పలాయంఠే మళ కానాంతకాగతిః' అన్నారు.
🦟
ఇలా వాళ్ళకి దోమతో పాటు ఏనుగులు ఎందుకు జ్ఞాపకం వస్తాయా అని నేను సైకో ఎనలైజు చేసి చూస్తే అందుకు కారణం వారికి దోమలంటే భీతేనని తేలిపోయింది. నిజానికి ఆ కవులు దోమను చిన్నచూపు చూడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. మానవులు ఏనుగులను మచ్చిక చేశారు. వాటిని అదుపులో ఉంచడానికి అంకుశాలు కనిపెట్టారు. వాటి మీద ఎక్కి సవారీ చేశారు, మరి ఒక్క దోమనయినా మచ్చిక చేశారా? దోమలు మనం చెప్పినట్టు వినేందుకు ఒక్క సాధనమైనా కనిపెట్టారా? ఏనుగు మీద సవారీ చెయ్య వచ్చునన్నది మనుషులు గ్రహించింది దోమల నుంచి కాదా? అవి సృష్ట్యాది నుంచీ ఏనుగుల మీద సవారీ చేస్తూనే ఉన్నాయి. పట్టుమని పది దోమలు తగులుకుని కుట్టడం మొదలుపెడితే ఐరావతంలాటిది వెర్రెత్తి లోకం మీద పడేది. వెర్రెత్తిన ఏనుగులను శంకరా రాగంతో దారికి తేవచ్చు (“తాన్ నేన్"). కాని దోమలను నిగ్రహించడానికి అటు హిందూస్తానీలో గానీ ఇటు కర్నాటకంలో గాని ఒక్క రాగం కూడా లేదు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అవును ఎందుకుంటుందీ? వుండటానికి వీల్లేదు. ఏనుగులంటే వాటికి పురాతన ఓటమి అంటూ ఉన్నది, మనం ఏనుగు ఎదుట నిలబడి శంకరా రాగం పాడడం ప్రారంభించిన కాస్సేపటికి అది ఆరోహణా వరోహణలను అంచనా కట్టి "అది శంకరా.. రాగమా ఏమిటి చెప్మా!” అనుకుంటుంది. అనుకోగానే శంకరుడు జ్ఞాపకంవచ్చేస్తాడు. ఆ మాఫ్ కాన్షస్ నెస్ లో శంకరుడు తమ పూర్వికుణ్ణి చంపేసిన చరిత్ర ఘట్టం కొట్టుకువస్తుంది. దాంతో అంత పెద్ద ఏనుగూ చల్లబడి చలిమిడి ముద్దలా అయిపోతుంది.
ఇటువంటిది దోమల విషయంలో ఎంత మాత్రమూ సాధ్యంకాదు. వేదాల్లో గాని, పురాణేతిహాసాల్లోగాని ఒక గొప్ప దోమాసురుణ్ణి చంపిన వాడెవడూలేడు. జంబూ ద్వీపం లోనే కాదు, సప్త ద్వీపాల్లో నూ లేదు. అదీగాక దోమకి స్వరజ్ఞానమూ అవీ ఉన్నట్టు రుజువు కాలేదు. హిస్టరీలో కూడా దోమ సున్నామార్కులు తెచ్చుకుంటుందనే మనం అనుకోవచ్చు. హిస్టరీ రాకపోవడం దోమకి మహాబల మిచ్చింది. పురాణాల్లో ఏముందో తెలీక పోవడం సనాతన వాదులకు బలమిచ్చి నట్టు దోమలకు చరిత్ర నుంచి నేర్చుకునేదే మీలేదు. వాటికి సృష్టి రహస్యమే తెలుసు. మానవ జాతిలో సగం చచ్చిపోతుందన్నా మనం ఠారెత్తిపోతాం, యుద్దాలు వద్దు మొర్రో అంటాం, అణు బాంబులు మొదలుకుని పెన్సిళ్ళు చెక్కుకునే చాకులు దాకా అన్నీ నిషేధించమంటాం.
🦟
వాటికి లక్ష్యం లేదు. భూమ్మీద ఉండే దోమలన్నీ వచ్చినా ఫరవాలేదు. ఒక్క ఆడ దోమ ఒక్క మగదోమ మిగిలితే చాలు కొల్లేటినీ, కొడంబాకాన్ని, విజయనగరాన్ని, విశాఖపట్టణాన్నీ అవలీలగా తమ జాతితో నింపెయ్యగలవు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఈ సంగతి ప్రతి పిల్లదోమకీ తెలుసు. బతకటం చాతకాదు, మనం చావుకి భయ పడతాం, ఏ రష్యాలోనో చచ్చినవాళ్ళని కూడా కొందరిని బతికిస్తున్నారట, ఫలానా ప్రమాదకరమైన రోగాలకి మందు కనిపెట్టా రట అంటూ మనం చంకలు గుద్దుకుంటాం. ఈ విధంగా విజ్ఞానంతో చావు నుంచి తప్పించుకుంటున్న ప్రతి ఒక్క ప్రాణికీ కనీసం ఓ వెయ్యిమంది కార్లకింద పడి చస్తున్నారు. పారిశ్రామిక ప్రమాదాల్లో చస్తున్నారు, ఆకలికి మాడి చస్తున్నారు. వీటికి విరుగుడు కనిపెట్టలేనందుకు మనకి సిగ్గయినా లేదు. ఐతే దోమలు మటుకు చావును లక్ష్యపెట్టవు. ఒక్క చుక్క రక్తం కోసం అవి ప్రాణాలొడ్డుతాయి. వాటికి ఘనంగా బతకటమే ముఖ్యం.
నిజంగా అవి ఘనంగానే బతుకుతాయి. నేను వాటి జీవితం గురించి, అద్భుత శక్తులను గురించి చాలా రకాల పరిశోధనల ను చేసి ఉన్నాను, నా పరిశోధనల ఫలితాలను నాస్తికులూ, అనార్యులూ అయిన శాస్త్రజ్ఞులు ఒప్పకపోతే అది నా తప్పుకాదు.
🦟
ఇతర ప్రాణుల లాగా కాదు, దోమలకు ఆహారం ఉండి తీరాలనే నిర్బంధం ఏమీ లేదు. మనం ఓ వారంరోజుల పాటు ఇల్లు తాళం పెట్టిపోతే దోమలు ఖాతరు చెయ్యవు. అవి మన రక్తం తాగటం అవసరం కొద్ది కాదు. సగం మన మీద వాటి ఆధిక్యత నిరూపించటానికీ, సగం నిషాకోసమూనూ.
మాదకద్రవ్యాలు మనకు ఆనందం చేకూర్చేది మెదడును మొద్దుబార్చే సంగతి అందరికీ తెలుసు. దోమలు స్వతహాగా మనకన్నా తెలివితేటలు గలవి. అందుచేత మన రక్తం తాగటంచేత వాటికి తాత్కాలి కంగా మెదడు మొద్దుబారిపోతుంది. అప్పుడు వాటికి నిషా వస్తుంది. రక్తం బాగా తాగి కైపెక్కి తూలుతూ నృత్యాలు చేస్తూ ఎగిరేటప్పుడు పల్లటీలు కొట్టే దోమలను నేను కళ్ళారా చూశాను.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
వాటి తెలివి తేటలను గురించి శంకించే వాళ్ళు పరమ నాస్తికులని నా దృఢ విశ్వాసం. మనం ఎప్పుడు బొత్తిగా అసహాయ స్థితిలో ఉంటామొ వాటికి తెలుసు. మననీ మన అలవాట్లనూ, మన అశక్తతనూ అవి కాచి వడగట్టాయంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు, మన రెండు చేతులూ పని మీద ఉన్న సమయం చూసి అవి యధేచ్ఛగా మనని కుడతాయి. రాసుకునేటప్పుడు కలం పట్టుకున్న చేతి మీద దోమవాలి నన్ను వెక్కిరించటం అనేకసార్లు జరిగింది. నేను చల్లగా కలం జారవిడిచే సమయానికి దోమ లేచి పోతుంది. నాబోటి చతుర్ణేత్రుల సంగతి దోమకు తెలుసు. అది కళ్ళజోడు బద్దీకి కణతకూ మధ్య చేరి నిశ్చింతగా రక్తపానం చేస్తుంది. దాన్ని కొట్టాలంటే కళ్ళజోడుకు ప్రమాదం. మళ్ళీ మనం నలభై రూపాయలు పోసి (1963లో ) కళ్ళజోడు కొనుక్కోలేమని దానికి తెలుసు.
🦟
దోమ మన ఛాయలకు వచ్చినప్పుడల్లా కుట్టటానికే వచ్చిందనుకోనవసరంలేదు. మనకు వాటిపై శత్రుత్వం ఉండి, అవి కనిపిస్తేనే తిక్కరేగే మనస్తత్వం ఉన్నప్పుడు మనపని పాడుచెయ్యటానికీ, మనని పీడించటానికి అవి మన ముందు ఆడతాయి. మనం వాటిని కొట్టటానికి యత్నిస్తే ఏదో గట్టి వస్తువు చాటుకి పోతాయి, మన చేతికి చచ్చే దెబ్బ తగులుతుంది. దోమలను కొట్టటానికి యత్నించేవాళ్ళు సిరాబుడ్లూ, సిగిరెట్టు పీకలు వేసే ట్రేలు, పడగొట్టటం జగద్విదితం. దోమలు నిజమైన దివ్య దృష్టితో మనం చేసే పనులన్నీ గమనించి అర్థం చేసుకోవటమే గాక చేయబోయే పనులు కూడా సరిగా ఊహిస్తాయి.
ఏ కారణం చేతనో ఇంకా నేను పరిశోధించ లేదు. ఈ రహస్యం కనుక్కున్నాక పద్మశ్రీ బిరుదుకు అర్జీ పెట్టుకుందామని అనుకుంటున్నాను. దోమలకు మగవారి మీద ఎక్కువ పగ. అవి ఆడవాళ్ళ నెత్తి మీద సుమారు రెండు మూడు అంగుళాల ఎత్తున, ఎగురుతూ ఉంటాయి, కాని కుట్టవు. వాళ్ళ తలలో నుంచి వచ్చే సువాసన వాటికి నిషా ఇస్తుందా ? లేక వాళ్ళ మొగుళ్ళను కవ్వించటానికి అవి అలా చేస్తాయా? ఇంకా తెలియలేదు. తెలియగానే అంతర్జాతీయ శాస్త్ర సమ్మేళనానికి పంపించేస్తాను.
🦟
మనిషికి లేని మహత్తరశక్తులన్నీ దోమలకి ఉన్నట్టు నేను రుజువు చేసుకున్నాను. ప్రాచీన మహర్షుల లాగా అవి వాయు భక్షణ చేస్తాయి. యోగాభ్యాసాలు చేసేవారు ఎన్నెన్ని ఆసనాలు వేస్తారో అంతకి రెట్టింపు అవీ చేస్తాయి. అందుచేత వాటికి గరిమ లఘిమ వగైరా అష్టసిద్ధులూ ఉన్నాయని నా నమ్మకం. అవి తేలుకుట్టి నంత బాధ కలిగించగలవు. ఎప్పుడు మన రక్తం తాగినదీ తెలియరాకుండా, దద్దురెక్కిన తరువాత మాత్రమే తెలిసే లాగా కూడా కుట్టగలవు. అవి ఎగురుతూ ఎగురుతూ అకస్మాత్తుగా 90 డిగ్రీలూ 180 డిగ్రీలూ కూడా మళ్ళగలవు.
మన విమానాలలో ఈ ఫీటు చెయ్యగల విమానాలు ఉన్నాయా అని నేను అడుగుతున్నాను. ఇంతకంటే గొప్ప విశేషమేమంటే అలవోగ్గా ఎగిరిపోయే దోమ, నేను తనను గమనిస్తున్నానని తెలిసి, అదృశ్యం కావటం నేను లక్షసార్లు చూశాను. [ఒకటి రెండు తక్కువసార్లే చూసి ఉంటాననుకోండి, నిక్కచ్చిగా చెప్పాలంటే] అదే విధంగా చేతిలో చిక్కి అదృశ్యమైన దోమలు కూడా ఉన్నాయి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
దోమలు మనకు చిక్కనే చిక్కవని మనం వాటిని చంపలేమని నేననను. కాని అవి చావదలుచుకున్నప్పుడే మనకి చిక్కుతాయా అని నా అనుమానం. ఒక రోజు నేను రాసుకుంటుంటే ఒక దోమ వచ్చి కాగితాల మీద వాలింది. ఆలోచన పాడుచేసుకోవటం ఇష్టంలేక తోలేశాను, పోయి మళ్ళీ వచ్చింది. మళ్ళీ తోలాను. "నన్ను చంపరా బాబు" అన్నట్టు అయిదారుసార్లు వచ్చి అక్కడే వాలింది. ఆఖరుకు చంపి దాని కోరిక తీర్చాను, ఉత్తమ లోకాలకే వెళ్ళి ఉంటుంది.
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుణ్ణి గురించి ఏమన్నాడు. మనం నిద్రపోయే
టప్పుడు వాడు మేలుకుంటాట్ట. మనం మేలుకున్నప్పుడు వాడు నిద్రపోతాట్ట. దోమలకున్న స్థిత ప్రజ్ఞత్వం గురించి ఇంకా మనకి సందేహమెందుకూ?
🦟
దోమలని నిర్మూలించటానికి మందులు కనిపెడుతున్నారు, కనిపెట్టామని కూడా అంటున్నారు. అజ్ఞానం- కల్తీలేని అజ్ఞానం.
డి, డి, టి, తీసుకోకండి. నిజంగా తీసుకో కండి. చెడ్డ విషం. దాన్ని అరవ భాషలో టి. టి. టి. అని రాసి టి. డి. డి. అని చదవాలి. నేషనల్ ఇంటెగ్రేషన్ దృష్టిలో పెట్టుకుని ఆ మాట రాశాను గాని, అరవ భాషకీ దోమల ప్రసక్తికీ సంబంధం ఉందని కాదు. ఈ డి. డి. టి. [లేక టి, డి, డి.] కొట్టితే కొన్ని దోమలు చచ్చేమాట నిజమే అయితే, వెనకటి కో రాక్షసుడి రక్త బిందువు పడ్డ చోటల్లా రాక్షసులు పుట్టుకొచ్చేవారట! ఆ విధంగా టి. టి. టి. లేక టి. డి. డి. కొట్టిన మర్నాడు ఇంకా రెట్టింపు దోమలుంటాయి, అంచేత ఈ టీ, డి. డి. కాకపోతే డి. డి. డి. యుద్ధ వార్తల్లోలాగా, ఇంతమంది శత్రువులను చంపామని చెప్పటానికి పనికొస్తుందే గాని, అంతిమ విజయం చేకూర్చే సాధనం మటుకు కాదు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇకపోతే, దోమ తెరలున్నాయి. ఇవి కృత యుగం నుంచీ మనకున్నాయి. (చూడుము పౌరాణిక చిత్రాలు] దోమతెరలు కట్టుకున్నంత మాత్రం చేత దోమలు కుట్టకుండా పోతాయనుకోవటం భ్రమ. అరవంలో హిట్టయిన చిత్రాలు తెలుగులో డబ్ చేస్తే హిట్టవుతాయని అనుకోవడంలాటిది. కడుపుతో ఉన్నమ్మ కనక మానదన్నట్టు దోమ తెరలో దూరిన వాడు బయటకు రాకుండా ఉండడు. అప్పుడు దోమలు వాడి చేత భరతం పట్టిస్తాయి.
🦟
దోమలు కుడితే నిద్ర బొత్తిగా పట్టని వాళ్ళకి దోమతెర నిద్రమాత్రల్లే ఉపయోగించవచ్చు. కాని అందులోనూ ఒక పేచీ ఉంది. చాలా మందికి దోమతెరలో పడుకోవడం సరిగ్గా చేతకాదు. చెయ్యిగాని, కాలుగాని చెంప గాని, చివరకు అరికాలైనా సరే దోమతెరకు ఆనిందో, అలాటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న దోమలు రాజకీయ బేతాళకథలు చదివినట్టుగా విరగబడి నవ్వి తుగిడీలు తుగిడీలుగా వచ్చి రక్తపానం చేసేస్తాయి.
🦟
న్యాయం చెప్పాలంటే దోమతెర దోమలకు కూడా ఒకప్పుడు ప్రమాదమే. అది ఒక్కసారి దోమలకు బోనులాగా కూడా అవుతుంది. మనం దోమతెరని ఎంత జాగర్తగా పరిచేసి, ఏ రాత్రి వేళ నిద్రలో పొర్లి దోమతెర అంచు లేపేస్తాం. వెంటనే దోమలు లోపలికి రావటానికి సందు ఏర్పడుతుంది. అందులో నుంచి దోమల మందలు శ్రీశ్రీ గేయం పాడుకుంటూ తోసుకుని లోపలికొచ్చేస్తాయి. లోపల వాటికి మహ వెచ్చగా, సౌకర్యంగా ఉంటుంది. తాగటానికి అమృతభాండంలా మనిషి ఉంటాడు. ఒళ్ళు పై తెలియకుండా అన్నీ తాగేస్తాయి, వాటికి కై పెక్కి, తల తిరిగిపోతుంది. అవి వచ్చిన దారి ఎటో మరిచిపోతాయి. ఇంతలో ఒళ్ళంతా తరుక్కుంటూ అమృతభాండం లేచి కూచుంటుంది. పాపం దోమలు పారిపోలేక దోమ తెరలో చిక్కుకుపోయి, వీరమరణం పాలవుతాయి...
రాత్రి నేను నా దోమతెరలో రెండు వేల ఒక చిల్లర దోమలను చంపాను. అంత భారీగా జీవహింస చేసే అవకాశం నాకు మళ్ళీ లభించదు. అది నాకు అన్ని విధాలా శివరాత్రి, ఆ లేచిన లేపటం తెల్లవారిన దాకా జాగారం చేశాను.
🦟
నా కింకొక అనుమానం కూడా ఉంది. దోమలు విధి యొక్క ఏజెంట్లని. మానవ పాపులను హింసించడానికీ, మతులు పోగొట్టటానికీ, తప్పుడు రాతలు రాసేవాళ్ళకి అంతరాయాలు కలిగించడా నికీ, రోగాలు తెప్పించటానికీ బ్రహ్మదేవుడు వీటిని సృష్టించి పంపిస్తాడేమో. మిగిలిన ఏ విషయంలోనైనా నేను నాస్తికత్వం ఒప్పుకుంటాను కాని దోమల విషయంలో నేను ఏ మూఢ విశ్వాసమైనా అవలంబిం చటానికీ ప్రచారం చెయ్యటానికి సిద్దంగా వున్నాను.
అలాంటివి ఏవైనా మీకు తెలిస్తే నాక్కూడా చెప్పండి.
🦟 🦟 🦟 🦟 🦟
*దోషంబులెంచిన 🦟దోమలు కుట్టబడును*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment