*🧘♂️1-వేమన పద్యము🧘♀️*
*(నిగూఢ తత్వ వివరము)*
*ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున*
*త్రిపుటికి మధ్యంబునందు*
*దీపము తానై జపియించు రామ మెవడురా*
*తపసిని గనుగొన్న వాడు ధన్యుడు వేమా!!*
*భావము:-*
*శరీరములో శిరోభాగమున ఆత్మ నివాసమై ఉన్నది. శిరస్సు నందు మూడు గుణములకు మధ్యన గుణ చక్రమునకు ఆధారమై ఉన్న బ్రహ్మనాడిలో ఆత్మ నివాసమై ఉన్నది. సర్వజీవరాసుల శరీరమందు కూడా ఈ విధముగనే ఉన్నదని తెలియ వలయును.*
*నోటిలోని చిన్న నాలుకను అందరు చూచి ఉందురు. దానినే ఉప జిహ్వయని కూడ అందురు. ఉపజిహ్వకు పై భాగమున మూడు గుణములకు మధ్యన ఆత్మ ఉన్నది. కావున ఆ విషయము తెలియు నిమిత్తము ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున త్రిపుటికి మధ్యంబున అన్నారు.*
*శరీరములో ఆత్మ ఉన్నపుడే జీవాత్మ ఉండగలడు. ఆత్మచైతన్యము చేతనే శ్వాస ఆడుచున్నది. ఆత్మ లేనపుడు శ్వాస ఆడదు.*
*జీవాత్మ శరీరములో ఉండవలయునని ఎంత ప్రయత్నము చేసిన ఆత్మ వెడలిన వెంటనే జీవాత్మ కూడ పోవలసి యుండును. ఎందరు ఎన్ని ఆసుపత్రులు తిరిగిన, ఎంత డబ్బు ఖర్చుపెట్టిన ఆత్మ ఉండు వరకే జీవాత్మ శరీరమునందు ఉండును.*
*శరీరమునకు అంతటికి వెలుగు నిచ్చి కదిలించునది ఆత్మే. కావున దానిని దీపముగ వేమన పోల్చాడు. ఆత్మ శరీరమందున్నపుడే శ్వాస చలించు చుండును.*
*ఆత్మ చైతన్యము బ్రహ్మనాడి కేంద్రముల ద్వారా బయటి నరములకు చేరి అక్కడి నుండి ఊపిరితిత్తులకు ప్రాకి ఊపి రితిత్తులను కదిలించుచూ శ్వాస ఆడునట్లు చేయుచున్నది.*
*శ్వాస శబ్దము ఉశ్చ్వాస యందొక రకము, నిశ్చ్వాస యందొక రకముగ ఉన్నది. కావున "రా" అని "మ" అని రెండు శబ్దములుగా ఉన్నదన్నారు. దీనికి కారణమైన ఆత్మను తెలిసినవాడు గొప్పవాడని చెప్పుచు జపియించు రామ మెవడా తపసిని గనుగొన్నవాడు ధన్యుడు వేమా! అన్నారు.*
*శిరోభాగములో శిరస్సు మధ్యన ఉండి శరీర జీవనముకు శ్వాస కారణమైన ఆత్మను తెలిసినవాడు పరమాత్మను చేరగలడను వివరమును పై పద్యమందు వేమనయోగి పొందుపరచాడు.*
*త్రిపుటి అనగా మూడు గుణభాగములని తెలియవలయును. మధ్య అనగా గుణభాగ మధ్యన గల బ్రహ్మనాడి అని తెలియవలయును. దీపమనగా ఆత్మని, రామమని జపియించు తపసి అనగా సోహం శబ్దమునకు కారణమైన ఆత్మని తెలియవలయును.*
No comments:
Post a Comment