Saturday, October 18, 2025

 🔥అంతర్యామి 🔥
# భయాన్ని తెలుసుకుంటే...

☘️మనం భయపడాల్సింది భయానికేనంటారు రూజ్వెల్ట్. పిరికివాళ్లు తమ మరణానికి ముందే ఎన్నోసార్లు మరణిస్తారని, ధైర్యవంతులు మరణాన్ని ఒక్కసారే ఎదుర్కొంటారని షేక్ స్పియర్ అంటాడు. అభద్రతా భావం భయానికి మూలకారణం, సహజంగానే పిరికివాళ్లు ప్రతి చిన్నదానికీ భయపడిపోతారు. ధైర్యశాలురు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటూ ముందుకువెళ్తారు.

☘️ప్రాణికి జీవితం మీద ఆపేక్ష సహజం. మరణానికి భయపడని ప్రాణి ఏదీ ఉండదు. కానీ జ్ఞానిని రోగ మృత్యు భయాదులు దరిచేరలేవు. 'పుత్రాదపి ధనభాజాం భీతిః' అంటారు శంకరులు. డబ్బున్న వాడికి దాన్ని ఎక్కడ నాశనం చేసేస్తాడోనని కొడుకంటేనే భయమట. అధిక సంపద అందరినీ అనుమానించేట్టు చేస్తుంది. కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. 'ఉన్న ఊరివాడికి కాటి భయం- పొరుగూరి వాడికి నీళ్ల భయం' అనో సామెత. సాధారణంగా ప్రతి ఊళ్లోనూ నీటి అవసరాలను తీర్చడానికొక చెరువు, దహన సంస్కారాలు నిర్వర్తించడానికి శ్మశానం తప్పనిసరిగా ఉంటాయి. ఊరివాడికి వల్లకాడు ఎటు ఉంటుందో తెలుసు కాబట్టి రాత్రుళ్లు అటువైపు పోడు. పొరుగూరి నుంచి వచ్చిన వాడికి ఈ ఊళ్లో శ్మశానం ఎక్కడుందో తెలియదు కనుక ఆ భయం ఉండదు. కానీ నీరున్న ప్రాంతం చీకట్లో కనపడదు, కొత్త కాబట్టి లోతు తెలియదు. అందుకే అతడికి నీటి  భయం.

☘️జీవితంలో భయపడని వారుండరు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో విషయం మనల్ని భయపెట్టే ఉంటుంది. ధైర్యవంతుడు అంటే అసలు భయపడని వాడు కాదని, భయాన్ని జయించినవాడని అంటారు. భయాన్ని ఎదుర్కొనడంలోనే జీవితరహస్యం ఉంది. ఆధ్యాత్మిక గురువులు భయం అనేది కేవలం ఆలోచనే అంటారు. రకరకాల పరిస్థితులను ఊహించుకుని బెదిరిపోవడమే తప్ప భయాలన్నీ నిజాలు కావంటారు. రోగం వస్తుందేమోనని భయం, ప్రమాదం జరుగుతుందేమోనని భయం. అయిన వారు దూరమవుతారేమోనని భయం. మన చేతిలో లేని విషయానికి భయపడీ ప్రయోజనమేంటి? పడవ నడపగలిగినవాడు తుపానుకు భయపడడు. భయాన్ని అధిగమించాలంటే ఎరుక ఉండాలి. ఎత్తైన కొండ శిఖరాన్ని చూసి 'అమ్మో అంతెత్తు ఎక్కగలనా' అనుకుంటే ఎవరూ ఎక్కలేరు. ఎక్కాలన్నది మీ కోరిక. పైకి ఎక్కి అక్కడి నుంచి చుట్టూరా పరచుకున్న అందాలను చూడాలని ఆశ. ఆది నెరవేర్చుకోబోతున్నానన్న ఆలోచనని మదినిండా నింపుకోవాలి. కొండ శిఖరాన్ని కాకుండా విశాలంగా ఉన్న కింది భాగాన్ని చూడాలి. అక్కడి నుంచి ఒక్కో అడుగూ వేయడం మొదలెడితే శిఖరం పాదాక్రాంతం కాదూ?

☘️భయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు తెలియని దాని గురించి భయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ విషయం గురించి మనసు భయపడుతోందో దాని గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం తెలుసుకుంటే సహజంగానే భయం తగ్గుతుంది. పెరిగే వయసూ ముంచుకొస్తున్న వృద్ధాప్యమూ కొందరిని భయపెడతాయి. కాలాన్ని ఆపడం మన చేతుల్లో లేదనీ శరీరం అనిత్యమనే జ్ఞానం తొలి వయసులోనే పొందిన వాళ్లు మలివయసులోనూ భయపడరు.🙏

✍️-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి

🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺

No comments:

Post a Comment