ప్రాచీన తెలుగు నేలపై *#అగస్త్య సంస్కృతి*
వ్యాసరచన - డా|| జివి పూర్ణచందు గారు
‘సంస్కృతుల వలస’ ఆదినుండీ ఉంది. వేదయుగంలోనూ ఉంది. తమ సాంస్కృతిక వెలుగుల్ని చీకటి ఖండాలకు ప్రసారం చేయాలని, సప్తసముద్రాల్నీ కాంతిమయం చేయాలనీ, అనాగరికుల్ని ఙ్ఞానమూర్తుల్ని చేయాలనీ వేద ఋషులు కోరుకున్నారు. ఆ ఋషులందరి సమష్టి ప్రతినిధిగా అగస్త్యుడు వారి కోరికని ఆచరణలో పెట్టాడు. సప్తర్షులలో ఒకడై వెలుగొందాడు.
ఆ రోజుల్లో కూడా వారి ఆచారాలను, ఆలోచనలను, వారు ప్రబోధించే ధర్మాలను వ్యతిరేకించిన వాళ్లున్నారు. అడుగడుగునా వాళ్లకి అవరోథాలే ఎదురయ్యాయి. దస్యులు, దానవులు ప్రధాన శత్రువులయ్యారు. బలప్రయోగం లేదా తత్త్వబోధనతో వాళ్లని అగ్ని, బలిపీఠాల ముందు మోకరిల్లేలా చేయాల్సి వచ్చేది. ఋగ్వేద ఆర్యులు చెప్పే ఈ కొత్త జీవిత విధానాల్ని చాలా మంది వినయపూర్వకంగా ఏమీ అంగీకరించలేదు. అడవుల్లో, కొండల్లో, లోయల్లో, సరసుల్లో, నదులమీద, సముద్రాలమీద సంఘర్షణలు నిత్యకృత్యం అయ్యాయి. మన పురాణేతిహాసాల్లో ఆనాటి సంఘర్షణల మూలాలు ప్రతిబింబిస్తాయి. అవి చారిత్రక యుగాలకన్నా ముందు నాటివి. చరిత్రకందనివి కూడా! ఈ సంఘర్షణల్లో ఎందరో ఋషిసత్తములు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెందరో వారి వ్యతిరేకులూ అశువులు బాశారు.
అయినా, యాత్ర ఆగలేదు. ఆ క్రమంలో వారి దృష్టి దక్షిణ దిశ మీదకు మళ్లింది. దక్షిణానికి చేరటం అసాధ్యం అన్నారంతా! వింధ్య పర్వత శ్రేణులు సూర్యకాంతిని అడ్డగించగలంత ఉన్నతితో గర్వించి ఉన్నాయి. పైగా దక్షిణాదిలో అసురుల్ని ఎదుర్కోవటమూ కష్టం" అన్నారు. దక్షిణాదికి వెళ్ళటం అంటే చావుని కొనితెచ్చుకోవటమే ఆ రోజుల్లో. అందుకే దక్షిణ దిక్కుకి యముణ్ణి అధిదేవతను చేశారు. చావుకు భయపడితే విజయం ఎలా దక్కుతుందీ? "వెడితే దక్షిణాదికే వెళ్ళాలి!" అన్నాడు అగస్త్యుడు. తొలి ఆర్యుల సాహసోపేత చైతన్యానికి ఒక నిర్దిష్ట చిహ్నంగా మారేందుకు ఆయన తన సన్నద్ధత ప్రకటించాడు. ఆయన పొడుగరేమీ కాదు, కానీ అందగాడు. ఎంతటి అందగాడంటే అప్పటి ప్రపంచ సుందరి అనదగిన విదర్భ రాకుమారి ‘లోపాముద్ర’ ఆయన్ని కోరి వరించింది. మహా ఙ్ఞానవంతుడు, ధైర్యవంతుడు, సాహసవంతుడు. కండలుదేరిన దేహం, పెద్ద తెల్లగడ్డం, చేతిలో కమండలం. ఆయన పుట్టుకే ఒక చిత్రం. ఊర్వశి కారణంగా మిత్రావరుణుల బీజ సంయోగం వలన జన్మించి మైత్రావరుణుడయ్యాడు. ఆయన్ని కుంభసంభవుడని, కలశజ అనీ, కుంభయోని అనీ పిలుస్తారంతా!
పంచాప (ఐదునదుల ప్రదేశం-పంజాబ్) నుండి గంగా మైదానాలకు ఆర్యగణాలు విస్తరిస్తున్న రోజులవి! తమ పశువులకు కొత్త పచ్చిక బయళ్లను వెదుక్కొంటున్నారు ఆర్యజనసామాన్యం. తమ ఙ్ఞానాన్ని అనాగరికులకు పంచాలని ఋషి పరంపర ఉవ్విళ్ళూరుతోంది. వీరందరికీ కొత్త స్థావరాలు అవసరం అయ్యాయి. వాటి కోసం అన్వేషణ మొదలైంది. ఈ అందరికీ ‘అగస్త్యుడు’ ఆశాకిరణం అయ్యాడు.
వింధ్యను పలకరించి, తన యాత్ర లక్ష్యం చెప్పాడు. తనకు సహకరించమని కోరాడు. దారి ఇవ్వాలని శాసించాడు, వింధ్యుడు తలవంచాడు. అగస్త్యుడు అవలీలగా వింధ్య దాటాడు. ‘అగము’ అంటే పర్వతం. గమనం లేనిది, కదలనిది అని! దాన్ని జయించాడు కాబట్టి, ఆయన్ని అగస్త్యుడన్నారు, దక్షిణదిక్కుని అగస్త్యుడి దిక్కు అన్నారు. అక్కడి నుండి దక్షిణాదిన ‘అగస్త్య యుగం’ ఆరంభం అయ్యింది. ‘అగస్త్య’ సంస్కృతి కొత్త చిగుర్లు తొడిగింది.
అగస్త్యుడి బృందం వింధ్య దాటి దండకారణ్యంలోకి ప్రవేశించింది. ఇక్కడ అగస్త్యుడు నడిచిన ప్రతీ పాదముద్రా ఈనాటికీ పదిలంగా ఉంది. ఈ దక్షిణాదిలో ప్రతి మజీలీలోనూ ఆయన ఏర్పరచిన ఆశ్రమాలను అగస్త్యధామాలంటారు. ఒక్కో ధామానికీ ఒక్కో అగస్త్యభ్రాత నిర్వాహకుడు. జూనియర్ అగస్త్యులన్నమాట. ఈ అగస్త్యధామాలు అగస్త్యుడు గెలిచిన విజయ చిహ్నాలు!
ఆంధ్రులెవరు?
దండకారణ్యం ఆనాడు పెద్ద కీకారణ్యం. కాకులు దూరని కారడవి లాంటిది. ఎంత నడిచినా మనుషులు కానరాలేదు. నడవగా నడవగా ఎక్కడో ఏ గోదావరి ఒడ్డునో, కృష్ణ ఒడ్డునో మనుషులు కనిపించారు. వాళ్లని తన వేదభాషలో ‘అంథ్’ అని పిలిచాడు. వేదభాష ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందింది. ఈ కుటుంబ మూలభాష (ప్రోటో ఇండో యురోపియన్ భాష) లో ‘అంథ్’ అంటే మనిషి అని! Anthropology(మానవసంబంధ శాస్త్రం)లో Anth (Anthos) అంటే మనిషి. అలా ఇక్కడ నివసించే మనుషులు ఆంధ్రులయ్యారు.
తరువాతి కాలాల్లో ఈ మనిషి అనే అర్థాన్ని మరుగుపరచి గుడ్డి, చీకటి ముందుకొచ్చాయి. తన తప్పిదాల వలన రెండు కళ్ళూ పోగొట్టుకున్న అంధకుడనే వాడి సంతతి ఆంధ్రులనీ, విశ్వామిత్రుడి శాపం పొందిన అతని నూర్గురు కొడుకుల్లో ఆంధ్రుడనే వాడు ఉన్నాడని, వాడి సంతతే ఆంధ్రులనీ ఇలా అపప్రథ నిచ్చే కథలతో ఆంధ్రుల్ని అవమానించారు. తెలుగు నేల నేలిన ప్రథమ రాజవంశం శాతవాహనులు తమని ‘ఆంధ్రభృత్యులు’గా పేర్కొన్నారని తెలిశాక కూడా ఈ గుడ్డి కథల్ని బోధించటం ఆపలేదు. ఆప్టె సంస్కృత నిఘంటువు -भृत्याः అనే పదానికి of a dynasty of kings రాజవంశం అని అర్థాన్నిచ్చింది. ఆంధ్రభృత్య అంటే ఆంధ్రరాజవంశం అని!
ఋగ్వేదంలోని 350 పదాలను ఏరి, ఇవి ఇండో ఆరియన్ లేదా ఇండో యూరోపియన్ భాషాకూటమికి చెందని అరువుపదాలు (loan words)గా ఎఫ్ బి జె క్వీపర్ గుర్తించాడు. ఇవి ద్రావిడ లేదా ముండా భాషాపదాలు కావచ్చునన్నాడు. పుత్ర, మీన తాళ లాంటి పదాలు వీటిలో ఉన్నాయి. ఇవి తెలుగు పదాలని కోరాడ రామకృష్ణయ్యగారు 1920ల్లోనే నిరూపించారు. అగస్త్య సంస్కృతి కారణంగా రూపొందిన ఆర్యాంధ్రుల ద్వారా వేదభాషలోకి ఆనాటి తెలుగు పదాలు ప్రవేశించాయి.
తెలుగుతో పోలిస్తే, తమిళంలో సంస్కృత పదాలు తక్కువ. బ్రాహ్మణ అంటే పిరమిణ అని తమిళీకరించి, తమిళ భాషపై సంస్కృత ప్రభావం లేదనిపించుకునే ప్రయత్నాల్ని తమిళులు ఎక్కువ చేశారు. కానీ, తెలుగు వారు సంస్కృతాన్ని దేవభాషగా గౌరవించారు.తమిళ పండితుడు ప్రొఫెసర్ సుబ్రమణ్య మలయాండీ తమిళనాడులోని వైగై నదీలోయలో వర్ధిల్లిన తమిళ నాగరికత, ఆంధ్రప్రదేశ్ లోని తుంగభద్రా నదీలోయలో వర్ధిల్లిన తెలుగు ప్రజల నాగరికత సమాంతరంగా సాగి, ఈ రెండు నాగరికతలూ క్రీ.పూ. 4000-3000 నాటి సింధునదీ లోయ నాగరికతతో బరాబరిగా తులతూగాయని ఆధారాలతో సాక్షాత్తూ చిత్రలిపి ముద్రల సాక్ష్యంగా నిరూపించాడు.
అగస్త్యుడి ఆర్యాంధ్రులు
అగస్త్యుడి కారణంగా తమ భాషా సంస్కృతుల్ని నిలుపుకుంటూనే సంస్కృతాన్ని (వేదభాష), వారి దేవతల్ని, వారి ఆరాధనా క్రమాన్ని కూడా గౌరవించినవారు ఆర్యాంధ్రులు. ఇక్కడ ఆర్యాంధ్రులు ఏర్పడ్డ కాలానికి ఉత్తరాదిన ఆర్యకుటుంబాలు ఇంకా వలస జీవులుగా (nomads), పశుపోషకులుగానే జీవిస్తున్నారు. ఆహార సేకరణే తప్ప ఆహారోత్పత్తి పైన వారికి ధ్యాస లేదు. వలస జీవితంలోంచి స్థిరజీవితంలోకి మళ్ళితే వ్యవసాయాదులు సాధ్యం అయి, ఆహారోత్పత్తి ఒనగూరుతుంది. ఆర్యాంధ్రులు ఆ సమయానికి వ్యవసాయం, పశుపోషణతోపాటు వర్తక వాణిజ్యాలు నిర్వహించగలిగే స్థాయికి చేరుకున్నారు. ఎవరివలన ఎవరు లాభం పొందారు? ఆర్యులే ఆంధ్రుల్లో అధికంగా కలిసిపోయారు. ఆదాన ప్రదానాలు కొత్తతరంలో కొత్త చైతన్యం నింపాయి.అలా తయారైన తరమే ఆంధ్రార్యులు.
సైన్స్ ఆఫ్ మ్యాన్ జర్నల్(1901)లో సర్జాన్ ఇవాన్స్ `Southem India was Probably the Cradle of the human race' దక్షిణ భారతదేశం నాగరక జాతులకు పుట్టిల్లు కావచ్చు" అన్నాడు ‘Investigations in relation to race show it to be possible that southern India was once the Passage ground by which the ancient progenitors of Northern and Meditenanean races procceeded to the parts of the globe which they now inhabit-జాతులమీద చేసిన పరిశోధనల్లో దక్షిణభారత దేశంలో అత్యంత ప్రాచీన కాలంలో ఉత్తరాదిలోని ప్రాచీనజాతులు మరియు మెడిటరేనియన్ జాతుల మూలపురుషులు నివసించేవారు. వీళ్ళు దక్షిణభారత దేశం నుంచే ప్రపంచమంతా విస్తరించి స్థిరపడ్డారు” అని!
1925లో టి.ఆర్ శేష అయ్యంగార్ “ది ద్రవిడియన్ ఇండియా” గ్రంథంలో డా॥ సి. మక్లీన్స్ రూపొందించిన Manual of Administration of the Madras Presidency గ్రంథాన్ని ఉటంకిస్తూ, “చరిత్రకు అందని అత్యంత ప్రాచీన కాలంలో పరమ నాగరకులైన ప్రజలు బంగాళాఖాతం తీరంలో నివసించారు. వాళ్ళు సమస్త ప్రపంచాన్నీ ప్రభావితం చేయగలిగిన మహోన్నతస్థితిలో ఉన్నారు" అన్నాడు. మొత్తం మీద సింధు నగరాలకన్నా పూర్వమే దక్షిణ భారతదేశంలో నాగరకత వుంది. నగరాలు వున్నాయి. నావికులు ఉన్నారు. ఎగుమతులు దిగుమతులు జరిగాయి. భాష వుంది, సంస్కృతి వుంది. దేవతలున్నారు.... అనేది దీని సారాంశం.
తెలివాహనదీ తీరాన అంధకపురంలో ఆంధ్రుల తొలి తెలుగు రాజధాని ఏర్పడిందని సిరిణిజ జాతకగ్రంథంలో చెప్పిన అంశానికి, కృష్ణా, గోదావరీ పరీవాహక ప్రదేశమైన దక్కన్లో మొదటి నాగరక మానవుడు నివసించాడని డా॥ హాల్ ప్రభృతులు పేర్కొన్న అంశానికీ దగ్గరి సంబంధమే వుంది. అగస్త్యుడు వచ్చే నాటికి ఇక్కడ పరిస్థితి ఇది!
ఇంకో మాట చెప్పాలి. వింధ్యను దాటి అగస్త్యుడు వచ్చిన దారి ‘వన్ వే ట్రాఫిక్’ కాదు. ఆ దారినే ఆర్యాంధ్రులు ఉత్తరాదికి బయలుదేరి ఆంధ్ర సంస్కృతినీ పరిచయం చేయగలిగారు. నేరుగా సింధునగరాలదాకా ఉత్తరాదిలో వారి యాత్ర సాగింది!
ఎక్కడికక్కడ కొత్త సంఘర్షణలు, కొత్త సంలీనాలు జరిగాయి. రెండు జాతులు పరస్పరం సంఘర్షిస్తే గెలిచిన వారికి ఓడిన వారు బానిసలౌతారు. ఆ బానిసల ద్వారా గెల్చిన వారు సంతానం కంటారు. ఆ సంతానానికి ఆ రెండు జాతుల మిశ్రమ లక్షణా లుంటాయి. రెండు జాతుల ఆచార వ్యవహారాలు, భాష, ఆరాధనా విధానాలన్నింటా మిశ్రమ లక్షణాలు ఏర్పడతాయి. ఋగ్వేద కాలంలోనే ఇదంతా జరిగి ఉండాలి. ఋగ్వేదంలో ద్రావిడ పదాలు చేరటం ఇందుకు సాక్ష్యం.
రామాయణంలో తెలుగునేల
రాముడు అరణ్యాలకు వెళ్ళాలని మాత్రమే కైక కోరింది. దక్షిణానికే వెళ్ళాలని అడగలేదు కదా! రాముడు దక్షిణాదినే ఎంచుకున్నాడు. అగస్త్యుడు నడిచిన మార్గానే నడిచాడు.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వాల్మీకి రామాయణం అరణ్యకాండలో అగస్త్యుడు అసురసంహారం చేసి తన ఙ్ఞానజ్యోతిని ఇక్కడ ఎలా వెలిగించారో చక్కగా వివరించారు. సంక్షిప్తంగా ఇక్కడ ఉదహరిస్తాను:
సీతారామ లక్ష్మణులు అరణ్యంలో వరుసగా మహర్షుల ఆశ్రమాలను సందర్శిస్తూ కాలం గడపసాగారు. సుతీక్ష్ణుడనే మహర్షి ఆశ్రమం సందర్శించాక, రాముడు-"మహర్షీ! ఇక్కడ అగస్త్యమహర్షి ఆశ్రమం ఉన్నదని విన్నాను, దానికి దారి చెప్పండి" అని కోరాడు. సుతీష్ణుడు “ఇక్కడకు నాలుగు యోజనాల దూరంలో రావిచెట్ల గుంపు కనిపిస్తుంది. అక్కడో విశాలమైన బయలుంది. అక్కడ పుష్ప ఫలవృక్షాలు చాలా ముమ్మరంగా ఉన్నాయి. చెరువులు తామరపూలతో, కలువ పూలతో హంసలతో, చక్రవాకాలతో కడు రమ్యంగా ఉంటాయి. అక్కడ అగస్త్యభ్రాత ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక రాత్రి ఉండి మర్నాడు చీకటితోనే అడవి నానుకుని వెడితే ఆమడ దూరాన అగస్త్యాశ్రమం కనిపిస్తుంది. అక్కడ సీతకూ నీకూ లక్ష్మణుడికీ చాలా ఊరట కలుగుతుంది” అని చెప్పాడు. అగస్త్యభ్రాత ఆశ్రమం దాకా వెళ్ళాక సీతకూ, లక్ష్మణుడికీ రాముడు అగస్త్యుడి కథ చెప్పాడు. ఇల్వలుడు వాతాపి లాంటి వ్యక్తుల్ని అగస్త్యుడు ఎలా అంతం చేశాడో వివరించాడు. “మహాతపస్సు చేసి మృత్యువుని జయించి అగస్త్యమహర్షి దక్షిణ దిక్కుని మునులు నివసించేలా చేశాడు” అన్నాడు రాముడు. ఋషి ధర్మాల్ని పరివ్యాప్తి చేయటం అగస్త్యుడి లక్ష్యం. అందుకు శ్రమించటం అగస్త్యుడి సంస్కృతి. ఆ సంస్కృతిని కొనసాగించాడు రాముడు. "రావణవధ తరువాత అగస్త్యుడు దక్షిణాదికి వచ్చి ఏ విజయాన్ని సాధించాడో నేనూ రావణుణ్ణి వధించటం ద్వారా ఆ విజయాన్నే సాధించాను” అన్నాడు. అగస్త్యుడి ఆర్యనీకరణాన్ని వ్యతిరేకించిన ఇలవలుడు మలప్రభ నదీతీరానికి చెందినవాడు. మలప్రభ అనేది కృష్ణానదికి ఉపనది. ఇప్పుడీ ప్రాంతాన్ని కర్ణాటక భాగల్పట్టు జిల్లాల్లోని ఐహోల్ అంటూన్నారు. కాగా దాని పక్కనే ఉన్న బాదామి వాతాపి స్థావరం. బిడ్డకు పాలిచ్చాక “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అని తారంగం కొట్టించి నిద్ర పుచ్చుతుంది తెలుగుతల్లి. ఆ విధంగా పుట్టిన ప్రతీబిడ్డా పరోక్షంగా అగస్త్యుణ్ణి స్మరిస్తాడు.
అగస్త్య భ్రాత అశ్రమం తరువాత సీతారామలక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని చేరారు. అగస్త్యుడు వారిని సమాదరించాడు. దిశానిర్దేశం చేశాడు. ఇంద్ర వరుణాది దేవతల దివ్యాస్త్రాలన్నీ చూపించి, వీటిని ఏ ఏ దేవత తనకు ప్రసాదించాడో వివరించాడు. వాటన్నింటినీ రాముడికి అందించాడు. అక్కడకు నాలుగు ఆమడదూరంలో ఐదు మర్రిచెట్లున్న ప్రాంతం ఉంది. అది నివాస యోగ్యమైన ప్రాంతం. అక్కడ ఇప్పుడు నీ అవసరం ఎంతైనా ఉంది. అక్కడ నివసించమని సూచించాడు. అలా సీతారామలక్ష్మణులు గోదావరి తీరాన పంచవటి చేరారు. ఈ కథనిబట్టి అగస్తుడు శ్రీరాముణ్ణి యుద్ధ సన్నధ్ధుణ్ణి చేసి పంపాడని అర్థం అవుతోంది. పంచవటిలోనే శూర్పణఖ పరాభవం, సీతాపహరణం లాంటి సన్నివేశాలు జరిగాయి.
వేదకాలంలో మొదలైన ఆర్యనీకరణం రామాయణకాలంలోనూ ఆ తరువాత బౌద్ధయుగంలోనూ కొనసాగింది. ఆర్యనీకరణానికి అగస్త్యుడు ప్రతిరూపం. జాతక కథల్లో బుద్దుడు తాను ఒక జన్మల్లో అగస్త్యుణ్ణని చెప్పుకున్నాడు. ఎక్కడ ఆర్య సంస్కృతిని ప్రవేశపెట్టాలన్నా అగస్త్యుడి అవసరం ఉంది. ఒక్కోయుగంలో ఒక్కోవ్యక్తి అగస్త్యుడి అవతారం ఎత్తారు. రామాయణంలో రాముడే ఆ బాధ్యత నిర్వహించాడు. మరింత దక్షిణానికి వెళ్ళినప్పుడు అక్కడ భాషాపరమైన సంస్కరణల బాధ్యతను తలకెత్తుకున్నాడు. దక్షిణాది సంస్కృతి మరియు నాగరికతల ప్రతినిధిగా, బ్రాహ్మణ మేథావిగా వైఙ్ఞానికుడుగా, వైద్యుడిగా బాషావేత్తగా అగస్త్యుడు బహుముఖీనమైన పాత్ర పోషించాడు. ఆర్య ద్రావిడ సంస్కృతుల సమ్మిశ్రితమైన ‘ఆంధ్రార్య సంస్కృతి’ ఇక్కడ ప్రారంభమైంది. ద్రవిడియన్ల స్థావరాలలోకి ఇండోఆర్యన్లు చొచ్చుకొచ్చినకొద్దీ వైదిక, పూర్వ ద్రావిడ భాషలమధ్య ఆదానప్రదానాలు ముమ్మరంగా సాగాయి. Dravidian Loans appear only gradually in the next stages ie., when Indo Aryan culture penetrates Dravidian Territory అని చరిత్రవేత్తలు భావించారు.
చివరిగా ఒక మాట
ప్రొఫెసర్ ఎమెనో గారిని ఉటంకిస్తూ "ఇండియా యాజ్ ఎ లిటరరీ ఏరియా" అనే వ్యాసంలో CIIL, మైసూరు పూర్వపు సంచాలకుడు కె, నారాయణ్ ఇలా వ్రాశారు: Dravidianization of Sanskrit in some of its structural features must lead to the partial conclusion that, a sufficient proportion of certain generations of Sanskrit Speakers learned their Sanskrit from person whose original Dravidian linguistic traits were translated into Indo Aryan-” -ఏ ద్రావిడ భాషా పదాలు సంస్కృతంలోకి చేరిపోయాయో ఆ ద్రావిడ భాషకు చెందిన వారి ద్వారా...సంస్కృతాన్ని, వేదభాష మాతృభాషగా కల్గిన ప్రజలు నేర్చుకోవాల్సి వచ్చిందని ప్రొఫెసర్ ఎమెనో స్పష్టీకరించినట్లు అర్థం అవుతోంది. ప్రోటో తెలుగు భాషతో సంస్కృతంలోకి ఆదాన ప్రదానాలు ఎక్కువగా జరిగాయి. కాబట్టి, ఎమెనూ గారు చెప్పిన ఆ ద్రవిడ భాష తెలుగే అయి ఉండాలి. అగస్త్యుడి లక్ష్యం నెరవేరింది కూడా మొదట ఇక్కడే కదా!
ద్రావిడులు, ముండాజాతి ప్రజలూ ముందుగానే స్థిర జీవితం ప్రారంభించారని వ్యవసాయం నేర్చారని ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం. లాంగల=నాగలి, హలః=నాగలి, కుద్దాల=పలుగు, ఖల=కల్లము, ఉలూఖల:=రోలు, శూర్పః=చేట, పల్లె=చిన్నగ్రామం-లాంటి వ్యావసాయిక పదాలను బుగ్వేదం ద్రావిడ భాషలోంచే స్వీకరించింది. ఆర్యులు ద్రావిడ/ ముండా ప్రజలనుంచే వ్యవసాయాన్ని నేర్చారనటానికి ఇవి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆర్యులకన్నా ముందే ద్రావిడులు సాధించిన వ్యావసాయిక, వైజ్ఞానిక ప్రగతి ముఖ్యమైంది. అగస్యుణ్ణి అధ్యయనం చేయటం అంటే తెలుగు ప్రాచీనతను తవ్వి తలకెత్తుకోవటమే!
ఆగస్త్యుడి కథలో మరో కోణం ఉమ్ది. ఆయన పరమ శివభక్జ్తుడు. శైవధర్మాలను తెలుగు నేలమీద పరివ్యాప్తం చేసింది ఆయనే! ఇక్కడి అత్యంత ప్రాచీన శివాలయాల స్థలపురాణాలను పరిశీలిస్తే అగస్త్యుడి పాత్ర అర్థం అవుతుంది. తరువాతి కాలంలో పురోగమించిన వైష్ణవ సాహిత్యంలోనూ అగస్త్యుడిది సమాన గౌరవ స్థానమే! తెలుగువారి ఆధ్యాత్మిక చింతనకు అగస్త్యుడు ప్రేరకుడు, కారకుడు కూడా!
No comments:
Post a Comment