ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అన్నామలై స్వామి ఇలా సెలవిచ్చారు...
ఎచ్చమ్మాళ్ మనవరాలు ఎప్పుడు ఆశ్రమానికి వచ్చినా, ఉచ్ఛారణా దోషాలను సరిచేస్తూ ఆ అమ్మాయి చేత 'ఉపదేశ సారం' ని బిగ్గరగా చదివించేవారు భగవాన్.
"ఆధ్యాత్మిక దృష్టి ఏ మాత్రం లేకుండా లౌకిక వ్యవహారాలలో బాగా ఆసక్తి ఉన్న ఆ అమ్మాయి చేత ఎందుకు ఆ పుస్తకం భగవాన్ చదివిస్తున్నారు?" అని భగవాన్ని అడిగాను.
భగవాన్ "భవిష్యత్తులో సమస్యలు వచ్చినప్పుడు ఈ పద్యాలు ఆమెకి తోడుగా ఉండి సహాయపడతాయి" అన్నారు.
అనేక దశాబ్దాల(దాదాపు 40 సంవత్సరాల తర్వాత...) తర్వాత ఈ మధ్యనే ఆమెని కలిశాను. ఇప్పుడు ఆమె వృద్ధురాలు. భగవాన్ చదివించిన పాఠాల గురించి ఆమెకి గుర్తు చేశాను.
"ఆ పద్యాలన్నీ నా జ్ఞాపకాలలో ముద్రపడిపోయాయి. భగవాన్ దయవల్ల ఈ మధ్యనే వాటి అర్ధం కొంచెం కొంచెం బోధపడుతోంది" అని ఆమె అన్నది!
****
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒకసారి పల్లెటూరి నుండి వచ్చిన భక్తుల బృందానికి 'అరుణాచల స్తుతి పంచకం' పుస్తకాన్ని ఇచ్చి చదువుకోమని చెప్పారు భగవాన్.
వారు వెళ్ళిన తరవాత ఒక ఆశ్రమ భక్తుడు ఇలా అడిగారు :
భగవాన్! వారికి అంతగా చదువు రాదుకదా! అలాంటి వారికి ఈ సంస్కృతం ఏమి అర్థమవుతుంది?
మహర్షి :
వారికి అర్థం కావలసిన అవసరం లేదు. ఆ పద్యాలను మళ్ళీ మళ్ళీ జపించడం ద్వారా జపించినవారికి ప్రయోజనం కలుగుతుంది. అంతే.
****
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
గురుసాహచర్యం అంటే కలిసి వేదాధ్యయనం, సాధన చేయడం. అది జ్ఞానులకు వర్తించదు కాని అది శిష్యులకు(సాధకులకు) వర్తిస్తుంది. కానీ గురువు ఎడల భక్తిశ్రద్దలు కొంత తక్కువయినందువల్ల అనుగ్రహం చిరకాలానికిగాని ఉపయోగానికి రాదు. అయితే కొంత ఆలస్యమయినా చివరకు గురు అనుగ్రహం శిష్యుల(సాధకుల) అన్ని ఆటంకాలను తొలగిస్తుంది.
అయితే శిష్యుడు(సాధకుడు) అవిరామకృషి, వేదాధ్యయనం, అనేకరూపముల దైవారాధనము గురు సన్నిధిలో చేపడతాడు. వీటి వల్ల అతడు జ్ఞానోన్ముఖుడు(అంతర్ముఖుడు) అవుతాడు.
చివరకు అర్థమయ్యేది ఏమంటే రాముడు సదా విష్ణువే. నిత్యమైన దాని ఎఱుకయే జ్ఞానము.
***
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒక విదేశీ వనిత :
భగవాన్! పూర్ణ శరణాగతి అంటే మన చుట్టూ ఉన్న గోల, గందరగోళమూ, ధ్యానంలో ఉన్నాసరే ఒప్పుకోవలసిందేనా? కాక ఏకాంత ప్రదేశంలో ఏ కొండ గుహన్నా చూచుకోవలెనా? శ్రీ భగవాన్ కూడా అలా చేశారు గదా?
మహర్షి :
ఎక్కడికి పోవటం, ఎక్కడికి రావటం? ఆత్మ పంచభూతాల చేత బాధింపబడదు. అది అనంతం, నిత్యం, స్థిరం. అది ఎక్కడికని కదిలి పోగలదు?
****
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ప్రశ్న :
భగవాన్! ఆత్మసాక్షాత్కారం చేసే ప్రయత్నాలలో ఆధ్యాత్మికంగా భగవాన్ సహాయాన్ని కోరడం న్యాయమేనా!
మహర్షి :
ఆత్మను దేహమని అనుకోవటంలో ఉన్నది పొరపాటు అంతా. మీరు, భగవానును దేహం అనుకుంటే మీరు ఆ దేహాన్ని అడగవచ్చు.
మీరు ఎవరిని భగవాన్ అన్నారో, వారిని మొదట అర్థం చేసుకొండి. వారు దేహం కాదు, ఆత్మ.
No comments:
Post a Comment