*ఉడత సాయం*
పూర్ణిమ పెమ్మరాజు
చదవండి
‘‘ఇంకెంత టైం పడుతుంది?’’ ఫ్లైట్ దిగిన గంటలో అప్పటికి నాలుగోసారి అడుగుతున్న మూర్తికేసి ఆశ్చర్యంగా చూశాడు రాజేష్.
‘‘ఇంకో గంటలో వెళ్ళిపోతాం సార్, ముందుకెళ్ళి కత్తిపూడి దగ్గర రైట్ తీసుకుంటే కోనసీమలోకి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాక సుమారుగా ఒక అరగంటలో వెళ్ళిపోతామండీ రోడ్డు బాగుంటే’’ డ్రైవర్ ఓపిగ్గా చెప్పాడు సమాధానం.
‘‘సర్, ముందొచ్చే రెస్టరెంట్ దగ్గర కాస్త ఫ్రెష్ అవుతారా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయి ఉంటారు ఎయిర్‌పోర్ట్‌కి రావడానికి. దిగుతూనే రోడ్డు జర్నీ, రాజమండ్రిలో మా ఇంట్లో కాసేపు ఆగి లంచ్ తిని వెళ్దామన్నా మీరు వినలేదు. కనీసం మా ఇంటికి కూడా రాలేదు’’ కొంచెం కినుకగా అంటున్న రాజేష్‌ని చూసి చిరునవ్వు నవ్వాడు మూర్తి.
‘‘ఎందుకు రానోయ్ మీ ఇంటికి. నువ్వు చేసిన ఉపకారానికి ఎలా థాంక్స్ చెప్పాలో కూడా తెలీట్లేదు. ఇప్పుడు నువ్వు కనుక్కున్న అడ్రస్‌లో ఉన్న వాళ్ళని, నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా... అందుకే, నువ్వు
ఈ డిస్ట్రిక్ట్‌కి జాయింట్ కలెక్టర్‌గా ఉన్నావు అని తెలియగానే నీకు కాల్ చేసి హెల్ప్ అడిగాను. నువ్వు నన్ను నిరాశ పరచలేదు. వారంలో నేను ఇచ్చిన డీటెయిల్స్‌తో వాళ్ళ అడ్రస్ కనుక్కున్నావు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి, వాళ్ళని కలిశాక- మీ ఇంటికి వచ్చే నేను మా ఇంటికి వెళ్తాను, సరేనా. అయితే ఒకసారి వెళ్ళి చూసేదాకా నాకు ఆత్రుత ఆగదు’’ ఆప్యాయంగా తన పూర్వ విద్యార్థిని చూస్తూ వివరణ ఇచ్చాడు మూర్తి.
‘‘అయ్యో, మీరు నాకు థాంక్స్ చెప్పడం ఏమిటి సర్, నేను ఇప్పుడు ఇలా ఉన్నా అంటే అది మీవల్లే కదా. మీరు చెప్పిన డీటెయిల్స్‌తో రికార్డులు అన్నీ తీయించి అడ్రస్ అయితే కనుక్కున్నా కానీ వెళ్ళి చూస్తే తప్ప, అక్కడ ఉన్నది మీరు అనుకున్న వాళ్ళా కాదా అని తెలీదు, అందుకే నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది. ఇంతకీ ఎవరు సర్ ఆవిడ, మీకేమవుతారు? అడ్రస్ దొరికింది అనగానే, ‘ఇంపార్టెంట్ మీటింగ్’ అని ఢిల్లీ వెళ్ళిన మీరు అది కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంత అర్జెంటుగా వచ్చారంటే... మీకు బాగా కావలసినవాళ్ళా..?’’ రాజేష్ ప్రశ్నకి మూర్తి మనసు యాభై సంవత్సరాల వెనక్కి పరుగు తీసింది.
* * *
‘‘ఈ అబ్బాయి ఎవరు... తన చేత నీళ్ళు తోడిస్తున్నావెందుకు?’’ అడిగింది కస్తూరి, వీరమ్మని. బావిలో నుంచి నీళ్ళు తోడుతున్న పది సంవత్సరాల పిల్లాడిని చూస్తూ.
‘‘నా పెద్ద గుంటడు సూరిగాడు అమ్మా, ఇంట్లో ఉండరా అయ్యా అంటే వినకుండా ఊరి బయట పోరంబోకులతో కలిసి ఈత కొడుతున్నాడు. ఆల్లంత సరైనోళ్ళు కాదు. చీట్లపేకా, బీడీ అన్నీ- ఈడికి మప్పేస్తారేమో అని బయమేసి నాతో పనికి తెచ్చుకుంటున్నా, కనీసం సాయం ఉంటాడని. ఈ రెండేళ్ళు పొతే మునసబుగారు జీతగాడిగా పెట్టుకుంటామన్నారు. అందాకా ఈడిని కాపలా కాయాల నేను. మా ఆయనేమో పొలం పనులకి పొతే మాపటికి గానీ రాడు. ఈడికన్నా చిన్న పిల్లలిద్దరితో బెంగేటి నేదు. ఆల్లు బానే ఇంటి దగ్గర ఆడుకుంటారు. ఈ గాడిదతోనే చిక్కయిపోనాది’’ గిన్నెలు తోముతూ చెప్పుకుపోతోంది వీరమ్మ.
‘‘అదేంటి వీరమ్మా, పిల్లాడిని బడికి పంపొచ్చు కదా... ఈ పనుల్లో పెట్టడం ఎందుకు ఇప్పటి నుంచే’’ ఇంటి దగ్గర ఉన్న తన చిన్న తమ్ముడు గుర్తొచ్చి కలుక్కుమంది కొత్తగా పెళ్ళి అయి కాపురానికి వచ్చిన కస్తూరికి.
‘‘బళ్ళో ఏసినానమ్మా, కానీ పోడు బడికి.
ఈ ఊరికీ పక్కూరికీ కలిపి మధ్యలో బడి ఉంది. ఐదో కళాసు దాకా ఉన్నాది. ఈడిని నాలుగు దాకా అక్కడికి ఎలాగో అలా పంపాను. అక్కడికి పోడు, ఎల్లినా సదవట్లేదని అయ్యోరు కొట్టారని వచ్చేశాడు. మళ్ళీ పోలేదు. అయినా మా వోల్లు ఎవరూ పోరు బళ్ళోకి. మాకెందుకమ్మా ఈ సదువు. ఎక్కడోక్కడ పన్లో ఎడితే ఆడి సావు ఆడు సస్తాడు.’’
ఇంకా పసితనం పోని సూరి మొహం చూస్తే జాలేసింది కస్తూరికి.
‘‘పోనీ, ఒక పని చెయ్యి, నా దగ్గర ఉంచు వాడిని, అయ్యగారు పొద్దున్న వెళ్తే ఎప్పుడు వస్తారో తెలీదు. నాకు ఈ కొత్త ఊరులో ఒక్కదాన్నే ఉండాలంటే గుబులుగా ఉంది. నాకు తోడుగా ఉంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఏరా ఉంటావా ఇక్కడ’’ అడిగింది కస్తూరి.
‘‘ఓ, ఉంటా. అమ్మా, నేను ఇక్కడ ఉంటానే, ఇక్కడ కరెంటు బల్బ్ ఉంది, రేడియో పెట్టె ఉంది, పాటలు వస్తాయంటే అందులో, అమ్మా నన్నిక్కడ ఉండనియ్యీ’’ వేడుకోలుగా అడిగాడు సూరి.
‘‘మీ దగ్గర ఉంటా అంటే నాకేం బాధమ్మా, మీ పున్నెమా అని కాస్త మంచి బుద్ధి వస్తే అదే చాలు. నా పని అయింది. నేను ఇంటికి పోతున్నా, ఒరేయ్ నువ్వేం యాగీ సెయ్యకుండా సక్కగా ఉండాల’’ సూరికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది వీరమ్మ.
‘‘అమ్మగారూ, నన్నేం పని చెయ్యమంటారు. చెప్పండి, చిటికలో చేసేస్తాను. తరువాత రేడియో పెట్టెలో పాటలు వచ్చినప్పుడు నాకు వినిపిస్తారా’’ ఆశగా అడుగుతున్న సూరిని చూసి చిరునవ్వు నవ్వింది.
‘‘నువ్వేం చెయ్యక్కర్లేదు, రేడియోలో పాటలు అప్పుడే రావు ఇంకా టైమ్ ఉంది. ఈలోపు నేను ఒక కథ చెప్పనా, వింటావా?!’’
‘‘ఓ, కథా, చెప్పండి... నాకు చాలా ఇష్టం కథలు’’
‘‘ఒక అడవిలో ఒక సింహం ఉందిట. ఆ అడవికి అదే రాజు. దానికి ఎవరూ ఎదురు చెప్పకూడదు. తనకన్నా బలవంతులు ఎవరూ లేరని దానికి మహా గర్వం. ఆ అడవిలో కనిపించిన ప్రతి జంతువునీ తినేస్తుందిట. అన్నిటికీ అదంటే భయం. ఒకసారి దానికి ఒక కుందేలు ఎదురుపడింది. సింహాన్ని చూడగానే కుందేలుకి అర్థమైంది- తనకి చావు మూడిందని. కానీ తెలివిగా ఆలోచన చేసి, అదే సింహం దగ్గరకు వెళ్ళి, ‘నమస్కారం రాజుగారూ, అమ్మయ్య... మీరు కనిపించారు. నేను చస్తే మీ చేతిలోనే చావాలని మీ దగ్గరకే పరిగెత్తుకొస్తున్నాను’ అని చెప్పిందిట. సింహానికి అర్థం కాలేదు. ‘అదేమిటీ, నా చేతిలో చావడం కోసం రావడం ఏమిటీ’ అని అడిగింది. ‘ఇన్నాళ్ళ నుంచీ- మాకు రాజు మీరు. ఇక్కడ అందరికన్నా బలవంతులు. కానీ, కొత్త సింహం వచ్చి నేనే మీ రాజుకన్నా బలవంతుడిని అందండీ. దాని నుంచి తప్పించుకుని మీ దగ్గరకే పారిపోయి వస్తున్నా’ అని చెప్పింది. అది విని సింహానికి కోపం వచ్చింది. ‘నాకన్నా బలవంతులు ఎవరు ఇక్కడ, నాకు చూపించు. నేను చంపేస్తాను’ అని రంకెలేసింది. అప్పుడు కుందేలు నుయ్యి దగ్గరకి తీసుకెళ్ళి, ‘చూడండి, ఇందులో ఉంది’ అని చూపించింది. సింహం వంగి చూస్తే తన ప్రతిబింబమే కనిపించింది. కానీ దానికి తెలీక అది వేరే సింహం అనుకుని దాన్ని చంపేద్దామని ఎగిరి నూతిలోకి దూకి చచ్చిపోయింది. అడవిలో జంతువులన్నీ ఆనందంతో పండగ చేసుకున్నాయి. ఇంత తెలివైనదానివి, నువ్వే రాజుగా ఉండమని కుందేలునే రాజుని చేశాయి.’’
‘‘కథ ఎలా ఉంది?’’ అడిగింది కస్తూరి.
‘‘బాగుంది అమ్మగోరూ.’’
‘‘ఒక ప్రశ్న అడుగుతా చెప్పు. ‘నూతిలో పడితే చచ్చిపోతాన’ని సింహానికి తెలీదుకానీ, కుందేలుకి తెలుసు... ఎలా?’’ కస్తూరి ప్రశ్నకి తెల్లమొహం వేసి బుర్ర అడ్డంగా ఊపాడు సూరి.
‘‘ఎలా అంటే... కుందేలు చక్కగా బడికి వెళ్ళి చదువుకుంటోంది. అందుకని దానికి తెలుసు. సింహం చదువుకోలేదు, అందుకే దానికేం తెలీదు’’ కస్తూరి మాటలకి పకపకా నవ్వాడు సూరి.
‘‘కుందేలు బళ్లోకి వెళ్తుందన్నమాట, ఇంకో కథ చెప్తారా ఇలాంటిది’’ ఆశగా అడిగాడు సూరి.
‘‘ఇప్పుడు నాకు వంట చేసుకునే పని ఉంది. నువ్వో పని చెయ్యి... ఈ పుస్తకంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయ్. చదువుతూ ఉండు. ఎక్కడన్నా అర్థంకాకపోతే అడుగు- నేను చెప్తాను. ‘పంచతంత్రం’ బొమ్మల పుస్తకం తెచ్చి ఇచ్చింది.
‘‘నాకు చదవడం బాగా రాదమ్మా.’’
‘‘నాలుగు దాకా బడికి వెళ్ళావంటే అ, ఆలూ గుణింతాలూ వత్తులూ వచ్చే ఉంటాయి కదా.’’
‘‘సరిగా రావు’’ సిగ్గుగా తల దించుకున్నాడు సూరి.
‘‘పర్లేదు, ఇప్పుడు నీకేం పరీక్ష కాదుగా ఇది. కూడబలుక్కుంటూ ఎంత వస్తే అంత చదువు. అస్సలు తెలీకపోతే నన్ను అడుగు చెప్తా. ఒక కథ చదివి చూడు. నీకెంత అర్థం అయిందో నాకు చెప్పు. అర్థం కానిది నేను చెప్తా’’ చాలా అనునయంగా చెప్పిన కస్తూరి మాటలకి ఉత్సాహంగా తలూపి పుస్తకం అందుకున్నాడు సూరి.
* * *
‘‘ఏంటోయ్... ఈ పిల్లలూ హడావుడీ.
వాళ్ళకి ప్రైవేట్ చెప్తున్నావా ఏమిటీ?’’ వరండాలో ఉన్న నలుగురు పిల్లల్నీ చూస్తూ అడిగాడు భానుమూర్తి కస్తూరిని.
‘‘అబ్బే... అదేం లేదండీ. సూరి కాస్త కథలు చదవడం నేర్చుకున్నాడు కదా ఈ పదిహేను రోజుల నుంచీ. తన స్నేహితులందరికీ చెప్పినట్టు ఉన్నాడు, వాళ్ళు ఆ కథలు వింటామని వచ్చారు. వీడు చదివి వినిపిస్తున్నాడు వాళ్ళకి’’ నవ్వుతూ చెప్పింది కస్తూరి.
‘‘బడికి వెళ్ళాల్సిన పిల్లలు, మానేసి ఇలా కాలం గడుపుతున్నారు’’ బాధగా అన్నాడు భానుమూర్తి.
‘‘చాలాసార్లు చెప్పానండీ బడికి పంపమని. పిల్లలకి ఇష్టం లేదు, తల్లిదండ్రులకి చదువు విలువ తెలీదు. కనీసం ఈ కథల కాలక్షేపం కోసం అయినా... చదవడం, రాయడం నేర్చుకుంటారేమో అని ఏదో ఒక ప్రయత్నం... నాకూ కాలక్షేపం. వాళ్ళకి రెండు ముక్కలు వస్తే మంచిదేగా’’ అంది కస్తూరి.
* * *
‘‘మనం నాటకం వేస్తామా అమ్మగారూ, నిజమా’’ ఆశ్చర్యంగా అడిగాడు సూరి.
‘‘అవును సూరీ. నువ్వూ, చదవడం వచ్చిన ఇంకో ఇద్దరు స్నేహితులూ కలిసి నాటకం వేద్దురుగానీ. మీరు చదివే కథలే నాటకంగా వేద్దాం. ఈసారికి నేను మాటలు రాస్తాను. వచ్చేసారి నుంచి మీరే రాయాలి వాటిల్లో డైలాగ్స్. ఇలా వెయ్యడం వలన చదవడం రాని పిల్లలకిగానీ మీ అమ్మ లాంటి పెద్దవాళ్ళకి కానీ సులువుగా అర్థమవుతుంది కథ, సరేనా’’ కస్తూరి మాటలు విన్న పిల్లల ఆనందానికి హద్దులు లేవు.
‘‘అమ్మగారూ, మేము చదవడం నేర్చుకుంటే మా చేతా వేయిస్తారా నాటకం’’ ఉత్సాహంగా అడుగుతున్న పిల్లల్ని చూసి పొంగిపోయింది కస్తూరి.
‘‘తప్పకుండా, కానీ మీకు బాగా చదువు రావాలంటే మీరంతా బళ్ళోకి వెళ్ళాలి. అయ్యగారు వెళ్ళి బళ్ళో మాస్టారుతో మాట్లాడతారు. మీరు పొద్దున్న అక్కడకి వెళ్ళి సాయంత్రం నా దగ్గరకి రండి. అలా అయితే ప్రతి వారం మన అరుగు మీదే చిన్న నాటకం వేసుకుందాం. ఎవరెవరు శ్రద్ధగా బళ్ళోకి వెళ్ళి చదువుతున్నారో చూసి, నెలకి ఒకళ్ళకి చిన్న బహుమతి ఇస్తాను.’’
సూరి తప్ప, పిల్లలంతా ఉత్సాహంగా తలూపారు.
‘‘నేను వెళ్ళనమ్మగారూ, నేను మీ దగ్గరే ఉంటాను. నాకు చదివి ఉద్యోగం చెయ్యడం నచ్చదు. నేను గేదెలు కాసుకుంటా, నాకు అదే ఇష్టం’’ మొండిగా అన్నాడు సూరి.
‘‘చదువు ఉద్యోగం కోసం కాదు సూరీ... జ్ఞానం కోసం. నువ్వు గేదెలే పెంచాలనుకున్నా కూడా ఆ పని ఇంకా ఎంత బాగా చెయ్యాలో తెలుసుకోవడం కోసం. నీ జీవితం సుఖంగా ఉండాలంటే కనీస చదువు అవసరం. చదవడం, రాయడం, రోజువారీ లెక్కలు చూసుకోగలిగేంత చదువు అన్నా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. నిన్ను ఎవరన్నా సులువుగా మోసం చేయగలుగుతారు. నీలో చాలా తెలివితేటలు ఉన్నాయి సూరీ. ఏదైనా ఒక్కసారి చెప్తే పట్టేస్తావు. నీ తెలివికి చదువు తోడైతే నువ్వు బాగా పైకెళ్తావు అనిపిస్తోంది నాకు. నాకోసం అయినా నువ్వు బడికి వెళ్ళాలి’’ ఆప్యాయంగా చెప్తున్న కస్తూరి మాటలు కాదనలేక అయిష్టంగానే తలూపాడు సూరి.
* * *
‘‘అమ్మగారూ, మీరు ఊరెళ్ళిపోతున్నారా?’’ ఏడవ తరగతి పరీక్షలు అయిపోయి వేసవి సెలవలు అంతా కస్తూరితో గడపొచ్చనుకున్న సూరికి- భానుమూర్తికి బదిలీ అయి కస్తూరి వాళ్ళు వెళ్ళిపోతారన్న వార్త పిడుగులాగా తగిలింది.
‘‘అయ్యగారికి బదిలీ అయింది కదా, వెళ్ళాలి మరి, నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పకూడదు. బడికి వెళ్ళాలి. వచ్చే ఏడు సెలవులు ఇచ్చినప్పుడు నా దగ్గరకి వద్దువుగాని, ఉత్తరాలు రాస్తాను నేను. నువ్వు కూడా రాయి. ఛ, అలా ఏడవకూడదు’’ సూరి కన్నీళ్ళు తుడిచింది కస్తూరి.
‘‘నిజంగా ఉత్తరాలు రాయాలి మరి.’’ తలూపింది కస్తూరి.
* * *
కస్తూరి వెళ్ళిన నెల తరవాత ఉత్తరం వచ్చింది సూరికి. ఆత్రంగా చదవడం మొదలెట్టాడు.
‘‘ప్రియమైన సూరికి, ఆశీస్సులతో కస్తూరి రాయునది. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. మేము ఇక్కడకి చేరుకుని, ఇల్లు వెతుక్కుని సర్దుకోడానికి సమయం పట్టింది. అందుకే వెంటనే ఉత్తరం రాయలేకపోయాను. పోయిన వారం మీ బడిలో పనిచేసే మాస్టారుగారు అయ్యగారికి ఒక పెళ్ళిలో కలిశారట. అయ్యగారు నీ గురించి అడిగితే, ‘నువ్వు ఇదివరకు అంత హుషారుగా, శ్రద్ధగా చదవ[ట్లేదు’ అని చెప్పారట. అందుకే వెంటనే ఉత్తరం రాస్తున్నాను. నువ్వు నాకు మాట ఇచ్చావు బడికి వెళ్తా అని. కానీ వెళ్ళి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఏం ఉపయోగం చెప్పు. నాకు తెలుసు- నువ్వు ఉద్యోగం చెయ్యడం కోసమే చదువు అనుకుంటున్నావని, కాదు సూరీ... ఇదివరకు కూడా చెప్పాను, చదువు జ్ఞాన సముపార్జన కోసం. నువ్వు చదువుతూ ఉంటేనే నీకు ఏ విషయం మీద ఆసక్తి ఉందీ, ఏది నీకు ఉపయోగకరమైనదీ తెలుస్తుంది.
అసలు నీకు చదువు కావాలా వద్దా అని నువ్వు నిర్ణయించుకోడానికి అయినా నీకు కనీస చదువు కావాలి. నాకు ‘మాట ఇచ్చా కాబట్టి’ అని కాకుండా శ్రద్ధగా చదవడానికి ప్రయత్నించు.
కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉన్న ఆనందం నీకే అర్థమవుతుంది.
ఇంకో విషయం సూరీ, మీ గూడెంలో ముందు నువ్వు నా దగ్గరకి వచ్చి కథల పుస్తకాలు చదవడం మొదలెట్టగానే ఇంకో పదిమంది నిన్ను చూసి వచ్చారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది... ఇంతమందికి చదువు మీద ఆసక్తి కలగడానికి నువ్వే కారణమయ్యావు. మీ అందరూ కలిసి ఇదివరకులానే ప్రతీ వారం చిన్న నాటకం వెయ్యండి. మీరు ఇన్నాళ్ళూ చదివిన పంచతంత్రం, నీతి కథ]లు, బాల రామాయణం, బాల భారతం... అన్నీ మీ మాస్టారుగారికి ఇచ్చి పంపిస్తున్నా. ప్రతి వారం అందులోనుంచి ఏదో ఒక కథ తీసుకుని ప్రయత్నించండి. వినోదంతోపాటు అందులో చదువు ప్రాముఖ్యత ఏదో ఒక రకంగా తెలిసేలా ప్రయత్నించండి. అప్పుడు నీతోపాటు అందరూ బాగా చదువుకుంటారు.
మరి నేను ఉంటాను. నేను డెలివరీకి మా అమ్మా వాళ్ళింటికి వెళ్తున్నాను. కొన్నాళ్ళు ఉత్తరం రాయలేకపోవచ్చు. కానీ, నా ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయి. నువ్వు జీవితంలో బాగా పైకి రావాలనీ పేరు ప్రఖ్యాతులు సంపాందించాలనీ దీవిస్తూ... కస్తూరి
* * *
‘‘ఇప్పుడు అర్థమైంది సర్, మీరెందుకు ఇంత ఉద్వేగంగా ఉన్నారో’’ ఉత్తరం చదివిన రాజేష్ అన్నాడు.
‘‘ఈ ఉత్తరం తరవాత అయ్యగారికి మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ నుంచి వాళ్ళతో కాంటాక్ట్ మిస్ అయింది. వేరే స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారట.
వాళ్ళని కలవాలని చాలా ట్రై చేశాను.
చివరకి నీ పుణ్యమా అని కలుస్తున్నాను’’ అభిమానంగా చూస్తూ చెప్పాడు మూర్తి.
‘‘అయ్యో సర్, భలేవారే, మీకు ఈ రకంగా అన్నా ఉపయోగపడ్డాను... అదే చాలు నాకు. అదిగో ఇల్లు వచ్చేసింది. మీతోపాటు నాకు కూడా ఆవిడని కలవాలని అంతే ఆత్రంగా ఉంది’’ కారు దిగుతూ చెప్పాడు రాజేష్.
* * *
‘‘నిజంగా, మా సూరివేనా నువ్వు... సారీ, మీరు...’’ కస్తూరికి ఆశ్చర్యానందాలతో మాట తడబడుతోంది.
‘‘నన్ను ‘మీరు’ ఏమిటి అమ్మగారూ, ఇదివరకులాగా ‘ఏరా’ అనండి.’’
ఖరీదైన కారులో సూటూబూటూ వేసుకుని దిగిన సూర్యనారాయణని చూస్తుంటే ఆనందం పొంగుకొచ్చింది కస్తూరికి.
‘‘ఎంత పెద్దవాడివయ్యావురా, మీ అయ్యగారే ఉంటే ఎంత సంతోషించేవారో, నిన్ను చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీ అమ్మ ఎలా ఉంది, ఏం చేస్తున్నావు నువ్వు?’’
‘‘మీరు వీకే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ గురించి టీవీలో పేపర్‌లో చూసే ఉంటారు కదా... అవి నావేనమ్మగారూ. ‘వీకే’ అంటే ‘వీర కస్తూరి ఇన్‌స్టిట్యూట్.’ మా అమ్మ పేరూ మీ పేరూ కలిపి పెట్టాను. దేముడి దయ, మీ ఆశీర్వాదంతో అది టాప్ ఇన్‌స్టిట్యూట్‌గా మారింది. మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలాచోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. అన్నట్టు... డెయిరీ ఫామ్ కూడా పెట్టా అమ్మగారూ, చిన్నప్పుడు గేదెలు కాచుకుంటా అనేవాడిని కదా’’ నవ్వుతూ చెప్పిన సూరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కస్తూరి.
‘‘మీ గురించి ఏం చెప్పలేదు అమ్మగారూ... ఎలా ఉన్నారు, పిల్లలూ అయ్యగారూ...’’
అర్ధోక్తిగా ఆపాడు సూర్యనారాయణ.
‘‘ఆయన వెళ్ళిపోయి ఐదేళ్ళు అయింది. ఇద్దరు పిల్లలు విదేశాలలో ఉన్నారు. తమ దగ్గరే ఉండమంటారు కానీ, నాకు ఈ ఇల్లూ ఈ ఊరూ వదిలి వెళ్ళాలని లేదు. అందుకే ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను. పక్క వాటా అద్దెకి ఇచ్చాను. వాళ్ళు మంచివాళ్ళు, తోడుగా ఉంటారు. ఈ చుట్టుపక్కల అందరూ నాకు బాగా అలవాటు. అందుకని నాకు ఇక్కడే బాగుంటుంది’’ నవ్వుతూ చెప్పింది కస్తూరి.
‘‘ఈ పిల్లలు...’’ టీవీ చూస్తున్న నలుగురు పిల్లలని చూసి అడిగాడు సూర్యనారాయణ..
‘‘వీళ్ళ అమ్మలు పొలం పనులకి వెళ్తారు.
ఈ పక్కనే వీళ్ళ ఇళ్ళు. వాళ్ళు పని నుంచి వచ్చేదాకా అటూ ఇటూ తిరక్కుండా ఇక్కడ కూర్చోమంటాను.’’
‘‘అయితే ఇప్పటికీ మీరు ఇదివరకులానే వీళ్ళకి కథలూ అవీ చెప్తున్నారా’’ నవ్వుతూ అడిగాడు సూర్యనారాయణ.
‘‘ఇప్పుడు నేను చెప్పే ఆ కథలు ఎవరు వింటారు, టీవీ పెడితే చాలు వీళ్ళకి. అప్పుడు మీతోనే అయిపోయింది ఆ కథలూ నాటకాలూ. అయ్యో, ఇలానే కూర్చో పెట్టేశాను. ఉండండి వంట చేసేస్తాను, ఏ వేళప్పుడు బయలుదేరావో, తింటూ మాట్లాడొచ్చు’’ హడావుడిగా లేవబోతున్న కస్తూరిని ఆపాడు సూర్యనారాయణ.
‘‘మీ చేతి ప్రసాదం మహా భాగ్యం అమ్మా, తప్పకుండా తింటాను, కానీ ఇప్పుడు నేను వచ్చిన పని వినండి. వచ్చేవారం మా ఇన్‌స్టిట్యూట్ యాన్యువల్‌డే. మీరు తప్పకుండా రావాలి. నాతో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు సరే అంటే ఇప్పుడే బయలుదేరిపోదాం హైదరాబాద్‌కి.’’
‘‘వచ్చే వారం కదా, తప్పకుండా వస్తాను. ఇప్పటికిప్పుడు అంటే రాలేను, నెమ్మదిగా నాలుగు రోజులు ఆగి వస్తాను. నాకూ నీ వైభవం చూడాలనే ఉంది. మా చిన్న సూరి ఇంత పెద్దవాడయ్యాడంటే ఎందుకు రాను. ముందు లేచి మీ ఇద్దరూ కాళ్ళూ చేతులూ కడుక్కు రండి’’ కస్తూరి వంట ఇంట్లోకి కదిలింది.
* * *
కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోతోంది. స్టేజీ మీద కూర్చున్న కస్తూరికి కలలో ఉన్నట్టు, ఏమి అర్థం కానట్టు ఉంది. యాన్యువల్‌డే చూడ్డానికి అనుకుని వచ్చిన కస్తూరికి- తానే ముఖ్య అతిథి అని పల్లకిలో తీసుకు రావడం, స్టేజీ మీద కలెక్టర్ పక్కన కూర్చోపెట్టి పాద పూజ చెయ్యడం... ఇవన్నీ చాలా ఇబ్బందిగా, సంకోచంగా ఉన్నాయి. ఏమి మాట్లాడాలో తెలీకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇంతలో ‘మన గౌరవ ముఖ్య అతిథి కస్తూరిగారు ఇప్పుడు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు’ అని అనౌన్స్‌మెంట్ విని, నెమ్మదిగా లేచి మైక్ అందుకుంది కస్తూరి.
‘‘అందరికీ నమస్కారం, నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు. మా సూరి... క్షమించాలి సూర్యనారాయణ యాన్యువల్‌డే చూడ్డానికి రమ్మంటే వచ్చాను కానీ... నాకెందుకు ఈ సత్కారం, ఈ సన్మానం... నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను చేసింది ఏమీ లేదు.
తన చేత ఓనమాలు దిద్దించింది లేదు, చదువు చెప్పింది లేదు. నాకు తెలిసిన కథలు ఏవో నాలుగు చెప్పాను అంతే. ఈ మాత్రానికే నన్ను ఇంత అందలం ఎక్కించడం తన పెద్ద మనసుకి నిదర్శనం తప్ప, నా గొప్పేం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తోంది. శ్రీరాముడు లంకకి వెళ్ళడానికి అందరూ సముద్రం మీద వారధి కడుతున్నారట. పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకుని వచ్చి వానరులు అంతా వారధి కడుతుంటే, అక్కడ ఉన్న ఒక చిన్న ఉడత తానూ సాయం చేద్దామనుకుని అక్కడ ఉన్న ఇసుకలో దొర్లి రాళ్ళ మధ్య ఆ ఇసుకని దులిపిందట. దాన్నే ‘ఉడత సాయం’ అంటారు. నేను ఏమన్నా చేశానూ అంటే, ఆ ఉడత సాయమే, సూరి తానే కష్టపడ్డాడు, ఇంత పైకి వచ్చాడు. అతని జీవితం స్ఫూర్తిదాయకం. మీ పిల్లలందరూ తన జీవితం నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. నాకు ఇంతకన్నా మాటలు రావట్లేదు.’’
కస్తూరి పక్కకి వచ్చి మైక్ తీసుకున్నాడు సూర్యనారాయణ.
‘‘అమ్మగారు ఇప్పుడు ఉడతసాయం అంటే ఏమిటో మీకు చెప్పారు కదా, నాకు తెలిసిన ఉడత సాయం గురించి నేను చెప్తాను వినండి. ఉడత- తన దగ్గరున్న గింజలు తరవాత తిందామని భూమిలో బొరియలు తవ్వి దాస్తుంది కానీ తరవాత మర్చిపోతుంది. అవే మొలకెత్తి, పెరిగి పెద్దయి వృక్షాలవుతాయి. ఆ ప్రకారం- మన భూమి మీద ఉన్న లక్షలకొద్దీ చెట్లూ అడవులూ ఉడతలు నాటినవే. అలానే అమ్మగారు మాలో- చదువు మీద ఆసక్తి అనే విత్తనం నాటారు. అది నాలోనూ నా స్నేహితులలోనూ పెరిగి పెద్దది అయి ఇప్పుడు ఈ వనంగా మారింది. మా గూడెంలో అందరూ ఇప్పుడు విద్యావంతులే, చాలామంది ఈ ఇన్‌స్టిట్యూట్‌లో పార్టనర్స్ కూడా. ఆ వయసులో మాకు చదువు మీద ఆసక్తి కలిగించకపోతే నేను ఇప్పటికీ గేదెలు కాచుకుంటూ, మిగిలినవాళ్ళు ఏ పాలేరు పనులో చేస్తూ ఉండిపోయేవాళ్ళం. నేను సభాముఖంగా అమ్మగారికి చేసుకుంటున్న విజ్ఞప్తి ఏమిటంటే- మీరు మా స్కూల్‌లో చిన్నపిల్లలకి, మాకు చెప్పినట్టే కథలూ అవీ చెప్పండి. ఈ జనరేషన్ వాళ్ళకి ఆ నీతి కథలూ పంచతంత్రాలూ తెలియాల్సిన అవసరం ఉంది. ఒప్పుకుంటారా అమ్మగారూ...’’ ఆశగా అడుగుతున్న సూర్యనారాయణని చూస్తే చిన్నప్పటి సూరినే గుర్తొచ్చి చిరునవ్వు నవ్వింది కస్తూరి.
‘‘అవన్నీ నువ్వు ఈజీగా చేసుకోగలవు సూరీ... నేనే చెప్పక్కర్లేదు మీ స్కూల్స్‌లో పిల్లలకి. నేను ఇక్కడ ఉండాలని నువ్వు ఇలా అడుగుతున్నావు- అంతే. కానీ నువ్వు అంటున్నట్టు నేను చెప్పిన నాలుగు ముక్కలు నిజంగా నీకంత ఉపయోగపడ్డాయంటే- ఇప్పటికీ అలా చెప్పాల్సిన పిల్లలు మా ఇంటిచుట్టూ ఉన్నారు. వాళ్ళేదో కాలక్షేపం చేస్తున్నారులే టీవీ చూస్తూ అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇలా- ఇంత నిబద్ధతతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళల్లో ఒక్క సూర్యనారాయణ ఉన్నా ఇంకో పెద్ద వనం తయారవుతుంది.
నన్ను ఇంకోసారి ప్రయత్నించనీ.’’
కరతాళధ్వనులతో మోగిపోతున్న సభతో తనూ చెయ్యి కలిపాడు సూర్యనారాయణ మూర్తి.
👉 Collected by : @Sairam
👉 Credits: Eenadu magazine 🌺
*whatsapp /courtesy*
No comments:
Post a Comment