*ఉన్నామని తెలిసేలా...*
గడ్డి మేస్తున్న ఖడ్గమృగం కొమ్ము మీద ఈగ వాలింది. కొంచెంసేపయ్యాక ఇక బయల్దేరతానంది. ఖడ్గమృగం దానివైపు ఆశ్చర్యంగా చూసి ‘నువ్వెప్పుడు వచ్చావు? నేనసలు చూడనే లేదే. ఇప్పుడు వెళ్తాను అంటున్నావు. వచ్చిన విషయమే నాకు తెలియనప్పుడు నువ్వు ఉన్నా వెళ్లినా తేడా లేదు’ అంది. తన ఉనికిని గుర్తించని ఖడ్గమృగం వైపు అయోమయంగా చూసి ఈగ ఎగిరిపోయింది. మన ఉనికి ఈ లోకం అనే ఖడ్గమృగం మీద వాలిన ఈగ లాంటిది కాకూడదు.
‘అంతములేని యీ భువనమంతయు పురాతన పాంథశాల; విశ్రాంతి గృహంబు; నందు నిరుసంజెలు రంగుల వాకిళుల్’... అంటారు కవి దువ్వూరి రామిరెడ్డి. వేచి ఉండే ప్రయాణికులు తమ వంతు రాగానే ఆ జాగా ఖాళీ చేసి వెళ్లిపోతారు. సూర్యుడు వేకువ గుమ్మం నుంచి ఉదయించి సాయంత్రమనే ద్వారం లోంచి మాయమైనట్టు మనుషులు కూడా జనన మరణ వాకిళ్ల నుంచి ప్రవేశ నిష్క్రమణలు జరుపుతారు. కన్ను తెరచి మూసే మధ్యలో ఆ జీవనకాలంలో మన స్థానమెక్కడ? ఉనికి ఏంటి? ఖడ్గమృగం కొమ్ము మీద ఈగలా నిష్క్రమిస్తామా? మన ఉనికిని బలంగా చాటుకుని వెళ్లిపోతామా అనేది వ్యక్తి ఆలోచన, సంస్కారాలను బట్టి ఉంటుంది. అసలు మనమంటూ లేకపోయినా, మన ఉనికిని ఎవరూ గుర్తించక పోయినా ఈ ప్రపంచంలో పెద్దగా మార్పు రాదని అనుకోకూడదు.
మన వల్ల ఒక పేదవాడికి తిండి దొరకవచ్చు. ఒక నిస్సహాయుడికి ఆసరా కావచ్చు. మంచి బిడ్డలా, మంచి తండ్రిలా కుటుంబాన్ని సంతోషపెట్టవచ్చు. మన కారణంగా ఒక మొక్క చెట్టుగా మారవచ్చు. ఒక గుడో బడో రూపుదిద్దుకోవచ్చు. కాబట్టి మన ఉనికి ఎప్పుడూ నిరర్థకం కాకూడదు. మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలాల్లాగా కొన్ని కోట్లమందికి మనం తెలియక పోవచ్చు. కానీ పరిమితంగా అయినా మన చుట్టూ ఉన్నవారైనా గుర్తించేలా, తదనంతరం కూడా మనల్ని తలుచుకునేలా జీవించాలి. మన జీవితం ఎప్పుడు ఎవరికి ఎలా ప్రేరణనిస్తుందో తెలియదు.
రాముడు పురుషోత్తముడు. ఆయనలా ఉండాలంటారు. అలా రాముడి ఉనికి సార్థకమైంది. రామాయణం చదివినవారు కొంతమంది అయినా రావణుడిలా జీవించకూడదని సద్గుణాలు అలవరచుకుంటారు. మన ఉనికి మంచి చేస్తే సమాజం, కుటుంబం, స్నేహితులు గర్వంగా చెప్పుకొంటారు. చెడు చేస్తే తిట్టుకుంటారు. అందువల్ల మనిషి బాధ్యతగా మెలగాలి. కుటుంబానికీ సమాజానికీ భారం కాకూడదు. జీవించి ఉన్నప్పుడు, తదనంతరం కూడా తమ ఉనికిని గొప్పగా నిలబెట్టుకోగల వాళ్లు మహనీయులే.
మన అస్తిత్వానికంటూ ఒక ప్రయోజనం లేకపోతే ఖడ్గమృగం మీద వాలిన ఈగతో సమానమే. కనీసం కుటుంబసభ్యులైనా మనను చూసి పాఠాలు నేర్చుకోవాలి. తమను తాము తీర్చిదిద్దుకోవాలి. మానవత్వం గలవాడు కాబట్టే మనిషయ్యాడు. ఆ మానవత్వపు బాటలో జీవితమంతా పయనిస్తే- ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా మనిషి ఉనికి సార్థకమవుతుంది.
~శివలెంక ప్రసాదరావు
No comments:
Post a Comment