@ జ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును @
నా శత్రువు
నోరు విప్పకుండా చేయగల
బలం బలగం అధికారం నాకు ఉన్నప్పటికీ ......
అతను
తన అభిప్రాయాలు
వెల్లడించే స్వేచ్ఛను నేను హరించును.
చివరికి
అతని మాటలు
నాపై విమర్శలైనా సరే ....
అదే ప్రజాస్వామ్యం
అంటాడు అబ్రహాం లింకన్
**********
ఇదీ ...
నా దృఢమైన నమ్మకం
దీనిని ఎవ్వరూ కదిలించనే లేరు
ఇదీ ...
నా అచంచలమైన విశ్వాసం
దీనిని ఎవ్వరూ పెకిలించివేయలేరు
అని భావించే హక్కు
నిస్సందేహంగా నీకు ఉంది
నీవైన నమ్మకాలనూ
నీవే అయిన విశ్వాసాలనూ
ప్రచారం చేసుకునే స్వేచ్ఛా నీకు ఉంది
*********
అదే సమయంలో
నీ నమ్మకాలకు
వ్యతిరేకమైన నమ్మకాలూ
నీవైన విశ్వాసాలను
ప్రగతి నిరోదకాలని బావించే భావాలూ
కలిగి ఉండే హక్కు
ఇతరులకూ ఉంది
నీ భావజాలానికి వ్యతిరేకంగా
వారిదైన భావజాలాన్ని ప్రచారం చేసుకునే
స్వేచ్ఛ ఇతరులకూ ఉంది
ఇది గుర్తించి గౌరవించాలి
ఆ బాధ్యత నీపై ఉంది సుమీ ....
**********
నా నమ్మకాలను
ఇంకెవ్వరూ వ్యతిరేకించ కూడదు
నా విశ్వాసాలను
ఇంకెవ్వరూ విమర్శించకూడదు
అలా చేసే వారిని
దుర్భాషలాడతాను
వారిపై భౌతిక దాడులకు తెగబడతాము
వ్యక్తిత్వ హననాలకూ వెనుకాడము
అంటే ....
అది ప్రజాస్వామ్య స్ఫూర్తికీ
రాజ్యాంగపు ఆదర్శాలకూ విరుద్ధం
***********
నీ నమ్మకాలూ
నీవైన విశ్వాసాల కారణంగా
తరతరాలుగా
వంచింపబడిన వారూ
అణచివేయబడ్డవారూ
అడ్డూ అదుపూ లేనే లేని
పీడనా దోపిడీ కి గురియైన వారూ
ప్రశ్నిస్తారు
పూర్తిగా తిరస్కరిస్తారు
హెచ్చు స్వరంతో ఒకింత కరుకుగానే
వాటిని మరి
తిండీ బట్టా ఇల్లూ
ఆత్మగౌరవమూ సామాజిక స్థాయీ
అన్నీ చక్కగా అమరి ఒక రకమైన కంఫర్ట్ జోన్ లో
హాయిగా ఉన్న వారికి
వీరి మాటలు అసందర్భ ప్రేలాపనల్లా తోచవచ్చు గాక
హృదయ విదారకమైన అనుభవాల నుంచి భళ్ళున వెలికి వచ్చిన లావా ప్రవాహాలు వారి మాటలు
అవి అర్థం చేసుకోవాలంటే
సానుభూతి సహానుభూతీ అవసరం మరి
*********
తెలుసా మీకు
సత్యం తన గొంతు విప్పిన ప్రతిసారీ
తీవ్రాతి తీవ్రంగా గాయపడిపోతాయి అసత్యం మనోభావాలు
భూమి విశ్వానికి కేంద్రం కాదన్నప్పుడూ
భూమి గుండ్రంగా ఉంది బల్లపరుపుగా కాదన్నప్పుడూ
జీవాన్నీ మనిషినీ సృష్టించింది భగవంతుడు కాడు
ఏక కణ జీవి నుండి బహుకణ జీవీ .... మనిషీ పరిణామం చెందాడని అన్నప్పుడూ
ఇదిగో ... అచ్చం ఇలానే గాయపడిపోయాయి
యూరోపులోని రోమన్ కేథలిక్ చర్చీ పీఠాధిపతుల మనోభావాలు
యజ్ఞ యాగాదులూ అర్థం లేనివన్నప్పుడూ
ఆత్మా పరమాత్మల ఉనికిని తిరస్కరించినపుడూ
అర్థం పర్థం లేని జంతుబలులనూ హింసనూ వ్యతిరేకించినపుడు
ఇదిగిదిగో .... ఇలానే గాయపడిపోయాయి వైదిక మతావలంబకూల ఆశ్రమ పీఠాలు
బురకా హిజాబ్ కూడదన్నప్పుడూ
తలాక్ తలాక్ తలాక్ ను చట్టం నిషేదించినపుడూ
మతం పేరుతో మారణహోమం తీవ్రవాదం అమానవీయమూ హేయమూ అన్నప్పుడు
ఇదిగిదిగో..... ఇలాగే గాయపడి పోయాయి ఉలేమాల మదరసాల.... మనోభావాలు
*****
ఒకటి మాత్రం నిజం
నిలవ నీరులా మురిగిపోయిన జీవన విధానం ఎంతమాత్రం సంస్కృతీ అనబడదు
సంస్కరించబడిన జీవన విధానం మాత్రమే సంస్కృతీ అని పిలవబడుతుంది.
అశాస్త్రీయతా అమానవీయతా నిండిన సంప్రదాయం ఆచారం ఎన్నటికీ సదాచారం సత్సాంప్రదాయమూనూ అనిపించుకోదు
శాస్త్రీయతా మానవీయతా పుణికిపుచ్చుకున్నది మాత్రమే అనుసరణీయమైన సత్సాంప్రదాయమూ సదాచారమూనూ
అజ్ఞానం సంకుచిత్వం మూఢత్వం అంధత్వం ఉన్మాదం పెంచి పోషించే ఏ మతమూ సమ్మతం కాదు.
స్నేహం ప్రేమ సమైఖ్యత సుహృద్భావం సానుభూతీ సహానుభూతీ సమిష్టి తత్వం సహకారభావం జ్ఞానం విజ్ఞానం శాస్త్రీయతా విశాలభావం ఎదయెదలో పాదుకొల్పే మతం మాత్రమే సకల సమ్మతమౌతుంది
గురజాడ అన్నట్లు
మతములన్నియు మాసిపోవును
జ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment