Friday, October 24, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

    మహర్షి విరూపాక్ష గుహలో ఉన్న రోజులవి; ఒకరోజు రాత్రి ఒక సాధువు మహర్షి దర్శనానికి వచ్చారు. మహర్షికి ప్రసాదంగా గంజాతో తయారుచేసిన భంగు తీసుకువచ్చి మహర్షి ముందు పెట్టారు.
      
    మహర్షి వద్దకు ఎప్పుడూ వచ్చిపోయే తిరువణ్ణామలై ఊరిలోని ఒక భక్తుడు ఇది చూసి "ఇదేమిటి! ఇది ఎవరి కోసం తెచ్చావు!" అని ప్రక్కనే ఉన్న నీళ్లలో పారేసాడు. మహర్షి 'ఎందుకు పారేసావు? అది ఎవరికి ఇష్టమో, వారు సేవిస్తే సరి; నీకు ఆ శ్రమ ఎందుకు?' అని అన్నారు.
        
    ఆ రోజు రాత్రి ఆ భక్తుని ఇంటి గోడ ఏ కారణం లేకుండానే కూలిపోయింది. ఆ భక్తునికి భయం వేసి, ఉదయాన్నే మహర్షి వద్దకు పరుగెత్తుకుని వచ్చి ఇలా అన్నాడు :
    
   "భగవాన్! నన్ను క్షమించండి! మీ వద్ద అనవసరమైన చనువు తీసుకున్నాను; నిన్న రాత్రి ఆ సాధువు పట్ల నేను చేసిన అపరాధమును దయతో క్షమించి, నన్ను ఈ భయం నుండి విముక్తుడిని చేయండి! 
 
    అందుకు మహర్షి "సరి, సరి; మహర్షి అందరివారు;  మీకు మాత్రమే మహర్షి సొంతం అనుకుంటే సరిపోతుందా!భయపడకు! అంతా సరి అవుతుందిలే!" అని సెలవిచ్చారు.

No comments:

Post a Comment