Saturday, October 25, 2025

 7️⃣8️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*32 యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్l*
 *సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతస:ll*

అలా కాకుండా ఎల్లప్పుడూ నా మీద దోషారోపణ చేస్తూ, నా చేత చెప్పబడిన మతమును విశ్వసించని వారు అచేతసులు అంటే బుద్ధిహీనులు, సర్వజ్ఞానవిమూఢులు అంటే ఏ మాత్రము జ్ఞానము లేని మూఢులు, నష్టాన్ అంటే అన్ని విధములా నష్టపోయినవారు అవుతారు.

భగవానుడు పైన చెప్పబడిన శ్లోకాలలో ఆధ్యాత్మ మార్గము, నిష్కామ కర్మ బోధించాడు. వాటిని శ్రద్ధతో ఆచరించమన్నాడు. అసూయను, అనుమానాలను దగ్గరకు రానివ్వవద్దు అని అన్నాడు. అటువంటి వారు సమస్త కర్మబంధనముల నుండి విముక్తులు అవుతారు అని అన్నాడు. అలా కాకుండా, ఎవరైతే పైన చెప్పిన మతమును ద్వేషిస్తారో, తృణీకరిస్తారో. అనుసరించరో వారు బుద్ధిహీనులు, అజ్ఞానులు, విమూఢులు, మతి లేని వాళ్లు అని తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే వారికి ఈ ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉండదు. ఎల్లప్పుడూ ప్రాపంచిక కర్మల యందే ఆసక్తి కలిగి ఉంటారు. ధనం సంపాదించడం, దాచుకోవడం, సంసారములో పడి ఉండటం, తన భార్య, పిల్లలు, బంధువులు వీరి కోసమే జీవిస్తుంటారు. ఎల్లప్పుడూ దుఃఖము అనుభవిస్తుంటారు. వీరికి ఆధ్యాత్మికత అంటే విముఖత. దేవుడు, దైవం, భగవద్గీత ఇప్పుడెందుకులే దానికి ఇంకా చాలా టైముంది అని అంటుంటారు. అటువంటి వారికి ఈ లోకంలో సుఖం ఉండదు. పరలోకంలో సుఖం ఎటూ ఉండదు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. వీళ్లంతా బాగా చదువుకున్న వాళ్లు అంటే ఉదర పోషణార్థము ధనం సంపాదించడానికి తగిన చదువు చదువుకున్నారు. మహాపండితులు, మరి కొందరు వేదములు వల్లెవేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. అన్నీ ఫలితాన్ని ఆశించి మాత్రమే చేస్తుంటారు. వీరికి భగవంతుని ఎడల భక్తి శ్రద్ధ ఉండవు. చేసే పనుల మీద నిష్కామ భావన ఉండదు. ఇటువంటి వారికి ఆత్మజ్ఞానము అసలే ఉండదు. వీరినే పరమాత్మ అజ్ఞానులు, నష్టజాతకులు విమూఢులు, అని అన్నాడు. పాజిటివ్ గా చెప్పాలంటే కర్మలను, భక్తిశ్రద్ధలతో, నిష్కామంగా ఆచరించాలి. అసూయ ద్వేషములను వదిలిపెట్టాలి. లేకపోతే నష్టం సంభవిస్తుంది. అని పరమాత్మ భావన.

ఈ విషయాన్ని కొంచెం లౌక్యంగా చెప్పుకోవాలంటే క్రమశిక్షణతో పని చేయడం చాలా కష్టం. ఎగ్గొట్టడం చాలా సులభం. 10.30 కు ఆఫీసుకు వెళ్లాలి. 5 దాకా శ్రద్ధతో పనిచేయాలి. ఇది నియమం, క్రమశిక్షణ. కాని కొన్ని ఆఫీసులలో మొదటి 15 నిమిషాలు ఎక్స్ క్యూజ్, ఒక గంట లేట్ పర్మిషన్, అప్పుడైనా రాగానే సంతకం పెట్టి కాంటీన్కు వెళ్లడం, అరగంట తరువాత రావడం ఇలా ఎవరికివారు నియమాలను ఏర్పరచుకుంటారు. అంటే ఎవరికీ ఠంచనుగా 10.30 కు ఆఫీసులో ఉండాలి అన్న నియమం ఎవరూ పాటించరు. వీరికి తెలియదా అంటే అంతా తెలుసు. అంతా మేధావులే. పని తెలిసిన వాళ్లే. కాని శ్రద్ధ లేదు. ఇంకొంత మంది తాముచేసే పనిలో లోపాలు వెదుకుతూ ఉంటారు. వాళ్ల కళ్లకు మంచి కనిపించదు. ఏ ఫైల్ తీసుకున్నా దానిని ఎలా తిరగ్గొడదామా అని తమ మేధాశక్తి నంతా వినియోగిస్తారు. ఫైల్ పుటప్ చేయడానికి నోట్ రాయాలి. తిరగ్గొట్టడం తేలిక. అలాగే కొంతమంది న్యాయాధికారులు ఉంటారు. ఏ కేసు వచ్చినా అందులో నేరస్తుడిని ఎలా నిర్దోషిగా నిరూపిద్దామా అని చూస్తుంటారు. దోషిగా నిరూపించడం కష్టం. నిర్దోషిగా నిరూపించడం సులభం. వారిని అక్విటల్ టైప్ అంటారు. అంటే కేసు పూర్వాపరాల బట్టి కాకుండా, తమ మనస్తత్వం బట్టి పని చేసేవాళ్లు. అలాగే, సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి, ఉదయించే సూర్యుడికి నమస్కరించి, సంధ్యావందనం చేసి భగవంతుని ధ్యానం చేయడం మంచి పని. ఇది చాలా కష్టం. తొమ్మిది గంటలకు లేవడం చాలా తేలిక. పైగా ఎందుకు లేవడం లేదో లక్ష కారణాలు చెబుతారు. ఇటువంటి వారి గురించి పరమాత్మ ఈ శ్లోకంలో చెబుతున్నాడు. అటువంటి సోమరులు, తప్పులు వెదికే వారు, పని ఎగ్గొట్టేవారు, వారు బాగా చదువుకున్నా, తెలివి గలవారైనా, మూర్ఖులు, విమూఢులుగా పరిగణింపబడతారు. వారికి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే ఉంటారు. అటువంటి వాడికి విచక్షణా జ్ఞానం ఉండదు. ధర్మానికి అధర్మానికి తేడా తెలియదు. చేయాల్సిన పని చేయకూడని పని తేడా తెలియదు. తనకు తెలిసిందే వేదం అనుకుంటూ ఉంటాడు. అటువంటి తెలిసి తెలియని విమూఢుల గురించి ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ.
(సశేషం)

*_🌹యోగక్షేమం వాహామ్యహం 🌹_*

 (రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)                                               P194

No comments:

Post a Comment