*మార్గదర్శకులు మహర్షులు -15*
🪷
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి
*వసిష్ఠమహర్షి -1*
వసిష్ఠమహర్షి చరిత్ర చిత్రమైనది. ఆయన సత్యగుణంలో ఆగ్రగణ్యుడు. లోకంలో అందరికంటే అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని పొందినవాడాయన. బ్రహ్మదేవుడి కి కూడా ఆగ్రహం ఉంది. రజోగుణం ఉంది. కాని ఈయనలో లేవు. అంటే వసిష్ఠుడు ఆ గుణంలో బ్రహ్మ దేవుడికంటె అధికుడు. అంతటి మహాత్ముడాయన. ఈయనది ఒక జన్మకాదు. శరీరం పోగొట్టుకొని బ్రహ్మ దేవుడి వద్దకెళ్ళి మళ్ళీ శరీరం తెచ్చుకున్న వాడు. కాబట్టి ఆయనది మొదటి జన్మ, రెండవ జన్మ అని చెప్పవలసివస్తుంది. ఆయన వ్యక్తిరూపంలో అలాగే ఉన్నారు. అదే చిత్తము, అదే వ్యక్తి. శరీరంపోతే, మరొక శరీరం తెచ్చుకున్నారంతే. ఈ గాథ నిమిచక్రవర్తి యజ్ఞవిషయంలో జరిగింది.
బ్రహ్మ ముఖం నుంచి నవబ్రహ్మలు సృష్టి కోసమే బహిర్గతం చేయబడ్డారు. వారిలో వసిష్ఠుడు ఒకరు. ఈయన సప్తర్షులలో కూడా ఒకరు. ఇక్ష్వాకువంశానికి కులగురువు. త్రిలోకపూజ్యురాలైనటువంటి మహా పతివ్రత అరుంధతికి ఈయన భర్త. సృష్టిప్రారంభంలో, సంతానబాహుళ్యం కావాలని బ్రహ్మ సంకల్పించాడు. కాని అలా జరుగలేదు. అసలు సంతానం కోరుకుని, అది లభించకపోవటం అనేది బ్రహ్మచరిత్రతోటే ప్రారంభమైంది. అందుకు ఆయన చాలా దుఃఖపడ్డాడట.
బ్రహ్మ తన మానసపుత్రులుగా ఋషులను సృష్టిస్తే, వాళ్ళు సంతానాన్ని అభివృద్ధి చేయలేదు. ఆ కారణంచేత ఆయన మరల ప్రజాపతులను సృష్టించాడు. భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, మరీచి, దక్షుడు, అత్రి, వసిష్ఠుడు - వీరందరూ ఈ ప్రజాపతులు. వీరే నవబ్రహ్మలుగా విఖ్యాతిచెందారు. వీళ్ళు మాత్రం బ్రహ్మ యొక్క ఉద్దేశ్యాన్ని గౌరవించారు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చారు. అంతకుపూర్వం, బ్రహ్మ యొక్క మానసపుత్రులుగా జన్మించిన నారదాదులు, ఆయన అభిప్రాయంతో ఏకీభవించక, తమకు ఈ జగత్సృష్టితో సంబంధంలేదని తమ స్వవిషయం (మోక్షం) గురించి ఆలోచించుకున్నారు. వాళ్ళు తమను సృష్టించిన బ్రహ్మయొక్క సంకల్పము, ఆజ్ఞలను పరిపాలించవలసిన ధర్మాన్ని కాకుండా తమ ఆత్మధర్మమును ఆశ్రయించటం తమ కర్తవ్యంగా భావించారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
వీరివలె కాకుండా, తరువాత బ్రహ్మ సృష్టించిన నవబ్రహ్మలైన వసిష్ఠాదులు, ఆయనకు కృతజ్ఞులై వర్తించి ఆయన ఉద్దేశ్యాన్ని అవలంబించారు. ఈ భేదాన్ని మనం గమనించవలసి ఉంది.
📖
వసిష్ఠుడు దక్షప్రజాపతి కుమార్తె అయిన ఊర్జ అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఏడుగురు సంతానం కలిగారు. వాళ్ళు విరజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహు, సవనుడు, అనహుడు, సుతపుడు, శక్రుడు అనే వాళ్ళు. శక్రుడు అంటే ఇంద్రుడని కూడా అర్థం ఉంది. అయితే ఈ శక్రుడు మాత్రం వసిష్ఠుడి కుమారుడైన ఒక ఋషి.
ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క సమూహం సప్తర్షులుగా ఉంటారు.
ఈ వసిష్ఠమహర్షి యొక్క సంతానం ఏడుగురూ కూడా 'ఉత్తమ' మన్వంతరం లో (ఉత్తముడనే మనువునుండి ప్రవర్తిల్లిన మన్వంతరమని అర్థం) సప్తర్షులైనారట. వసిష్ఠుడియొక్క ఔన్నత్యం నారదుడికంటే ఈ విషయంలో ఎక్కువ అని చెప్పవలసి వస్తుంది. నారదుడు "నాకెందుకీ సంసారం?" అనుకొని వైముఖ్యంతో వెళ్ళిపోయాడు. అంటే, బ్రహ్మ వీరిని సృష్టించి, సంసారంలో ప్రవేశించి సంతానాన్ని భూమిపై వృద్ధిచేయమంటే, ఆత్మజ్ఞానాన్ని అన్వేషిస్తామని ఈ సంసారం అనే నరకం తమకొద్దిని నారదాదులు వెళ్ళి పోయారు. అలాకాక, వసిష్ఠాదులు బ్రహ్మ చెప్పిన పని చేసి కృతార్థులయ్యారు. అందువల్ల వసిష్ఠుడు మహోన్నతుడని చెప్పాలి. తనయొక్క ఆత్మ దర్శనయోగ మందు, తపస్సుకు పూర్వమే ముందుగా ఋణములన్నీ తీర్చుకున్నాడాయన. బ్రహ్మ తన మాట వినని నారదాదులను శపించి, వారు వద్దన్న సంసారాన్ని వారికి ఇచ్చాడు. తాను చెప్పిన పనిని నెరవేర్చిన వసిష్ఠుణ్ణి, నిస్సంగుడిగా చేసి ఆయన బ్రహ్మజ్ఞాని అయ్యేటట్లు అవకాశం ఇచ్చాడు. వసిష్ఠుడు సంసారమందున్న నిస్సంగుడు. సంసారం వల్ల ఆయన బాధింపబడలేదు. తన జ్ఞానమార్గంలో తాను వెళ్ళనేవెళ్ళాడు.
📖
వసిష్ఠుడు కొంతమంది సంతానాన్ని కన్న తరువాత, అన్ని గుణములను వర్జించి అగ్నిరూపుడై ఘోరమైన తపస్సు చేసాడు. అగ్నిస్వరూపాన్సే పొందాడు. అంటే, ఇక ఈ ప్రపంచంలో ఏదోషమూ ఆయనదగ్గరకి రాదు. తన తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు, అప్సరసలు వంటివారెవ్వరూ ఆయనను సమీపించలేరు. మనుష్యులు తపస్సు చేసినప్పుడు, వాళ్ళ తపస్సు అగ్నివలె ప్రకాశిస్తేనే వీళ్ళు భయపడ్డారు. అటువంటిది వసిష్ఠుడు సాక్షాత్తు అగ్నే అయ్యాడు. ఆయన ఆశ్రమం సృష్టిమొత్తా నికే రెండవ బ్రహ్మలోకంలా ఉండేది. ఆయన ఆశ్రమంలో ఆయనను సేవించే శిష్యులు వాలఖిల్యులు అనే బ్రహ్మర్షులు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆయన అలా ఉండగా, అయోధ్యను పరిపాలించే ఇక్ష్వాకుకుల మూలపురుషు డైన ఇక్ష్వాకువు అనే రాజు వసిష్ఠునివద్దకు వచ్చి ఆయనను ప్రార్థించి, తన ఇంటికి తీసుకునివెళ్ళి కొంతకాలం ఆయనను సేవించి, ఆయన కరుణకు పాత్రుడై, "మహాత్మా! నేటి నుంచి నా వంశానికి, కులానికి మీరు గురువై మా వంశక్షేమాన్ని, మా ధర్మాన్ని దయచేసి రక్షించవలసింది" అని అర్థించాడు.
వసిష్ఠమహర్షి త్రికాలవేది. భవిష్యత్కాలం లో ఈ ఇక్ష్వాకు వంశంలో ధర్మపరిపాలన జరుగుతుందని, విష్ణువు భూలోకానికి రాదలచుకుంటే యోగ్యమైనవంశం ఇదే అవుతుందని గ్రహించి, ఆ వంశస్థులందరికీ ఆయన కులగురువయ్యాడు. ఇక్ష్వాకుని తరువాత ఆతడివంశంలో నిమి అనేవాడు రాజ్యానికివచ్చి, తండ్రివలెనే వసిష్ఠుడిని గౌరవిస్తూ వచ్చాడు. నిమిచక్రవర్తికి వెయ్యి సంవత్సరాలపాటు సత్రయాగం చెయ్యాలని బుద్ధి పుట్టింది.
(ఇతిహాసపురాణాలలో ఇటువంటి వేల సంవత్సరాల లెక్కలు వచ్చినపుడు మనం విమర్శించడానికి వీలులేదు. దశరథుడు 80వేల సంవత్సరాలు జీవించాడని ఒక చోట పురాణంలో ఉంది. అవి ఏమి శరీరాలో, ఆనాటి కాలమానమేమిటో మనకు తెలియదు. ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఆ విషయాలు అబద్ధాలు అనటానికి మనవద్ద సరైన సాక్ష్యాధారాలు లేవు. నిజమని నమ్మితే మనకొచ్చిన నష్టం ఏమీలేదు).
ఆ విధంగా నిమిచక్రవర్తి సత్రయాగం చేయడానికి సంకల్పించి, తమ కుల గురువైన వసిష్ఠుని వద్దకువెళ్ళి, "తమరు ఈ యాగానికి హోతగా ఉండవలసింది మహాత్మా!" అని అడిగాడు.
నిమి కోరికను మన్నిస్తూ వసిష్ఠుడు, "నీ యజ్ఞంలో హోతగా ఉండటానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. కాని ఇంతకుముందే ఇంద్రుడు తాను యజ్ఞం చేస్తున్నట్లు నాకు చెప్పి, నన్ను హోతగా ఉండమని కోరాడు. అతడు 700 సంవత్సరాలు యజ్ఞం చేస్తానన్నాడు. నేను సరేనని వాగ్దానం చేసాను. కాబట్టి ముందు ఆయన యజ్ఞం పూర్తయిన తరువాత నీ యజ్ఞానికి హోతగా వస్తాను" అని చెప్పాడు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment