అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-189.
306d3.;2910e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣8️⃣9️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️```
(సరళమైన తెలుగులో)```
*7. విజ్ఞాన యోగము.*
(ఏడవ అధ్యాయము)
_________________________
*12. వ శ్లోకము:*
*”యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యేI*
*మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి” ॥12॥*
“మానవులలో సాత్విక, రాజసిక, తామసిక భావాలు ఉన్నాయి. వాటిని నేనే కలిగిస్తున్నాను. కాని ఆ భావాలు నాలో నుండి వచ్చినా, ఆ భావాలలో నేను లేను.”
```
ఇప్పటి దాకా కృష్ణుడు బాహ్య ప్రపంచంలో అంటే పంచభూతములతో నిర్మితమైన ప్రకృతిలో ఉండే విషయాలు అంటే సూర్యచంద్రులు, అగ్ని వాటి తేజస్సు, జలము, వేదములు, ఓంకారము, పౌరుషము, భూమి, తపస్సు, మొదలగు బాహ్య ప్రపంచములో ఉన్న వస్తువులలో నేను ఉన్నాను అని చెప్పి, ఇప్పుడు అంతరంగ ప్రపంచంలో అంటే మనలో ఉండే సూక్ష్మ ప్రపంచము వాటిలో ఉండే విషయాల గురించి వివరిస్తున్నాడు.
ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి. అవే మనలో కూడా ఉన్నాయి. వాటి పేర్లు సత్వ, రజస్ తమో గుణాలు.
ఈ గుణాలను బట్టి మనం ఈ ప్రపంచంలో కర్మలు చేస్తుంటాము.
ఈ మూడు గుణాలతో కూడిన భావాలను కూడా నేనే అని అంటున్నాడు పరమాత్మ. మూడు గుణాలు దైవస్వరూపాలే. కాని ఏ గుణం ఎంచుకోవాలో తేల్చుకోవాల్సింది మానవుడు. మనం ఏ గుణం ఎంచుకుంటే దానికి అనుగుణంగానే మనలో భావాలు కలుగుతాయి. ఆ భావాలకు అనుగుణంగా కర్మలు చేస్తాము. ఆ కర్మలకు తగిన ఫలితం వస్తుంది.
ఈ మూడు గుణాలు తనలో నుండి వచ్చినా, ఆ గుణములలో నేను లేను అని మెలిక పెట్టాడు పరమాత్మ. అంటే ఆ మూడు గుణాలు పరమాత్మలో ఉన్నాయి. పరమాత్మ నుండి ప్రకృతి ఆవిర్భవించినపుడు, ఆ గుణాలు కూడా ప్రకృతిలో ప్రవేశించాయి. అవే గుణాలు ప్రకృతిలో ఒక భాగమైన మానవునిలో కూడా ప్రవేశించాయి. ఈ మూడు గుణములకు కారణం మాత్రము పరమాత్మ అయినా, ఆ మూడు గుణములు పరమాత్మలో నుండి వచ్చినవే అయినా, ఆ గుణములలో తాను లేడు అంటే ఆ మూడు గుణముల ప్రభావం పరమాత్మ మీద లేదు. కాని ఆ మూడు గుణములతో మానవులు ఏమి సంకల్పించినా, ఏమిచేసినా, ఆ కర్మలతో, కర్మఫలములతో తనకు సంబంధము లేదు, తాను బాధ్యుడు కాడు అని స్పష్టంగా వివరించాడు.
తనకు అవసరమైన వస్తువు కావాలి అనుకోవడం సాత్విక భావము. ఉన్నవన్నీ నాకే కావాలి అని అనుకోవడం రాజసిక భావము. అవి లేకపోతే నేను బతకలేను అనే మోహంలో పడటం తామసిక భావము. ఈ మూడు భావాలకు అనుగుణంగా మానవులు ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు రజోగుణము బలపరాక్రమములు వీరత్వము, సూచిస్తుంది. అవి కూడా పరమాత్మ తత్వములే అని తన బలపరాక్రమాన్ని ఇతరుల మీద చూపించి చితక బాదితే, పోలీసులు కేసుపెడతారు. "అదేవిటండీ! ఇవి అన్నీ పరమాత్మ విభూతులు అండీ, నేను ఆ పరమాత్మ విభూతి అనుసరించి వాడిని కొట్టాను. నన్నెందుకు పట్టుకున్నారు" అంటే అందరూ నవ్వుతారు. ఇంకా నాలుగు తంతారు. అదే రాజసిక ప్రవృత్తితో బలహీనులను, దీనులను రక్షించవచ్చు. వారికి అండగా నిలువ వచ్చు వారికి సాయం చేయవచ్చు. తనకు ఉన్న బలపరాక్రమాలతో, వీరత్వంతో, వారిని ఆదుకోవచ్చు. అలా చేసిన వాడిని జనం అంతా పొగుడుతారు. ఆకాశానికి ఎత్తుతారు. కాబట్టి రాజసిక ప్రవృత్తి, రాజసిక భావాలు పరమాత్ముడిలో నుండి వచ్చినా, వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది మానవుల విచక్షణమీద ఆధారపడి ఉంటుంది. ఒక సారి సత్వ, రజస్, తమోగుణములు పరమాత్మలో నుండి వెలువడిన తరువాత, వాటిని సద్వినియోగం చేసుకోవడమో, దుర్వినియోగం చేసుకోవడమో మానవుల ఇష్టం. అందుకే వాటిలో నేను లేను అని పరమాత్మ ముందే సూచించాడు.✍️```
```(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏
No comments:
Post a Comment