Tuesday, November 25, 2025

 ఇంకేం కావాలి!
*************
మనిషి పుట్టుక గుట్టు 
శాస్త్రజ్నులకొదిలి పెట్టు!
ఏదో ఒకరోజు వాళ్ళు 
ఆ గుట్టు రట్టు చేస్తారు!

కోతినుండి వచ్చామా?
నర వానరాలమా?
నర సింహాలమా?
వాళ్లుతప్పక తేల్చేస్తారు!

ఆ డార్విన్ మహాశయుని
పరిణామ సిద్ధాంతం
'తప్పు' అనిచెప్పటానికి
ఎందుకింత ఆరాటం!

ఎందుకోమనుపాలకులు
ఈ సృష్టి 'దేవుడి'దేనని
పునర్జన్మ పూర్వజన్మల్ని
'నిజం'చెయ్యాలనేమో!

ఎందుకంత ఉబలాటం?
దేవుడివ్యాపారం-దెబ్బ
తింటుదని భయమా?
అజ్ఞానమే ఆనందమా?

ఎలా 'పుట్టారు' అన్నది
పాలకుల సమస్య కాదు!
ఎలా జీవిస్తున్నారన్నది
పాలకులుచెయ్యాల్సింది

కులమత వివక్ష లేకుండా
దేశాన్ని పాలించాలి!
ఇది లౌకిక రాజ్యం!కాని
వీళ్ళదంతా అలౌకికం!

అజ్ఞానం లో ప్రజలుంటే
వీళ్ళకెంత ఆనందమో!
మాయలు మంత్రాలతో
అబద్ధాలే వీళ్లకు ఇష్టం!

ఐనా 'పైన' ఒకడుండి
పాలనా పగ్గాలు పట్టి
పార్వతీపరమేశ్వరులు
పాలిస్తే ఇంకేం కావాలి!

ప్రజాస్వామ్యమూవద్దు
మనుస్మృతీ వద్దు
చట్ట సభలూ వద్దు
దొంగ ఓట్లు అసలే వద్దు!  

భక్తిసంకీర్తనలతో
ముక్కోటి దేవతలతో
నిత్యాన్నదానాలతో
నా దేశంవెలిగి పోవాలి!

పాలక ప్రతిపక్షాలు లేని
నాయకుల గోలే లేని-ఆ
విశ్వనాయకుడి పాలన
కంటే-ఇంకేంకావాలి!
        ********
-తమ్మినేని అక్కిరాజు
        హైదరాబాద్
       25-11-2025

No comments:

Post a Comment