Saturday, November 1, 2025

 *అరుణాచల శివ*

“ఈ అరుణాచలాన్ని చూసి ఇది రాళ్ళతో, చెట్లూ చేమలతో కూడిన సాధారణ పర్వతమని భావించవచ్చు. ఇది పరమేశ్వరుని స్వరూపం” అని ఎల్లవేళలా హెచ్చరించేవారు.
శ్రీ రమణులు.

అనలాచలసంకాశం యదిదం లింగముల్టితమ్, అరుణాచల మిత్యేద తదిదం ఖ్యాతిమేప్యతి ॥ అత్ర తీర్థంచ బహుధా భవిష్యతి మహత్తరమ్, ముక్తిరప్యత, జంతూనాం వాసేన మరణేనచ ॥
అత్ర సంస్మృ తి మాత్రేణ ముక్తిర్భవతి దేహినామ్ ||

"అరుణగిరి వాసం, మరణం - రెండూ ముక్తి దాయకం. ఇది గొప్పతీర్థం.

ఇక్కడ *నన్ను స్మరించినంత* మాత్రాన ముక్తి కలుగుతుంది" అని శివపురాణంలో సాక్షాత్తు *పరమేశ్వరుని* వచనం.

"అరుణం - శక్తి - పార్వతి డైనమిక్ ఫోర్స్. అచలం నిశ్చలాత్మ శివుడు (స్టాటిక్ ఫోర్స్). సగుణ నిర్గుణాల ఏకరూపం ఇది” అని రమణుల మాట.

సూర్యుని నుండి విడివడి భూమి అగ్నిమయంగా ఉన్న దశ నుండి చల్లారుచూ
రాగా ఏర్పడిన ప్రథమ పాషాణమయ స్థానమిది" 
అని భూగర్భ శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలిన విషయం.

ఇది ఆసియా ఖండంలో భాగం కాదని, ఇప్పటి మహా సముద్రంలో మునిగిన లెమోరియా ఖండం (కుమారి ఖండం)లో ఒక భాగమనీ, హిమాలయాల కన్నా ప్రాచీన పర్వతమని వారు వివరించారు. మన పురాణకథలలోని సత్యాన్ని ధృవపరచే శాస్త్ర విషయాలివి.

గంగాచ మూలభాగస్థా యమునా గగనస్థితా, సోమోద్భవ శిరోభాగే సేవంతే శోణ పర్వతః ||

గంగ, యమున, నర్మదాది నదులన్నీ ఈ పర్వతాన సూక్ష్మరూపంలో ఉన్నాయని స్కాంద పురాణం చెప్తోంది.

అరుణాచలం చుట్టూ వివిధ దేవతలు, దిక్పాలకులు, గ్రహ దేవతలు, ప్రతిష్ఠించి అర్చించిన శివలింగా లున్నాయి. 

పార్వతి, ఇంద్రుడు, బ్రహ్మాదులు, జడభరతుడు మొదలైన వారంతా అరుణగిరి ప్రదక్షిణ చేసి తరంచారని పురాణాలు చెప్తున్నాయి. విష్ణు పురాణంలో అరుణగిరి సుదర్శన చక్రంగా వర్ణించారు. (సుదర్శనుడు అగ్నితత్త్వమే కదా) అందుకే వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవులు 
ఈ గిరిని ప్రదక్షిస్తారు.

"ఇది భూమికే హృదయం. సత్యస్వరూపం జ్ఞాన తేజస్సు. శ్రేష్ఠ తమం” అని ఋగ్వేద మంత్రాలు అరుణగిరిని కీర్తించాయి.

అరుణాచలం కొన్ని యోజనాల వరకూ అనంత శక్తిని ప్రసరిస్తుంటుంది. ఈ పర్వతాన్ని ప్రదక్షిణ చేసేవారికి ఈ శక్తి ప్రభావం వల్ల ఇహపరాలు సిద్ధిస్థాయి. సూక్ష్మ దృష్టిగల వారికి శివుడు ఈ పర్వతాన జ్యోతి స్వరూపునిగా సాక్షాత్కరించిన వైనాలు చాలా ఉన్నాయి.

శివుని జ్యోతి రూపంగా దర్శించి, అర్చించే ఉత్సవం కార్తీక పూర్ణిమ (కృత్తికా నక్షత్రం) నాడు నిర్వహిస్తారు. ఈ రోజు కొండపై వెలిగించిన దివ్యజ్యోతిని దర్శించడానికి అసంఖ్యాక జనవాహిని తరలి వస్తుంది.

అంతేకాక పారమార్థికమైన ఆత్మజ్ఞానాన్ని సైతం ప్రసాదించే శక్తి ఈ క్షేత్రానికి ఉంది.

No comments:

Post a Comment