Wednesday, November 26, 2025

 బొమ్మ 💐

ఆ ఊళ్ళో నిజానికి నా బంధుమిత్రులెవరూ లేరు. అయినా వెళ్తాను. ఆ ఊరిలో హైస్కూలు చదువుకి, కాలేజీ చదువుకి నాకున్న ఒకే ఒక అనుబంధం రామరాజుగారు. నాకు ఎంత సాయం చేశారో చెప్పలేను. అప్పట్లో ఊరంతటికీ ఆయన పెన్నిధి. పెళ్ళిళ్లు, పేరంటాలు,   రోగాలు,  నొప్పులు ఏది వచ్చినా రాజుగారి జేబుకే భారం పడేది. ఆయనేమీ బాధపడేవారు కాదు. ఆవిడ సరేసరి. రాజుగారికి తోటలూ దొడ్లూ చాలా వుండేవి. పిల్లా జెల్లా లేరన్నమాటే గాని, ఊరంతా ఆయన కుటుంబమే. ఊరికి కొద్ది దూరంలో కొబ్బరితోటలో వుండేది వాళ్ల యిల్లు. నాలుగు దూలాలతో, రెల్లు కప్పుతో చాలా ఠీవిగా వుండేది. ఇంట్లో పాతకాలపు సామాను చక్కటి పోషణతో ముచ్చటగా వుండేది. బయట విశాలమైన అరుగులు అద్దాల్లా వుండేవి. నేను చదువుకునే రోజుల్లో రాజుగారు నడివయస్సులో వుండేవారు. ఎంతో హుందాగా, పెద్దరికంగా ఊరి వ్యవహారాలు పరిష్కారం చేసేవారు. ఊళ్లోకి ఎవరు వచ్చినా ఆతిథ్యం రాజుగారిదే. ఊరేగింపులూ, ఉత్సవాలూ ఆయన జరిపించాల్సిందే.

దాదాపు ఇరవై ఏళ్ల తరువాత రాజు గారింటికి వెళ్లాను. ఇల్లు కళ తప్పింది. ఆనాటి వైభవం ఎంత వెదికినా లేదు. రాజుగారి దంపతులు వయసు మీదపడ్డా యింకా కొంచెం ఓపిగ్గానే  వున్నారు. నన్ను గుర్తుపట్టారు. ఆప్యాయంగా పలకరించారు. నా కళ్లు ఇంటిని, లోపల వస్తువులను పరిశీలనగా చూస్తున్నాయి. పై కప్పుకు వేసిన రెల్లు చెదపట్టి పోయింది. గోడలు చవుడూరుతున్నాయి. ముందుండే అరుగులు, తీర్చిదిద్దిన ముగ్గుల ఆనవాళ్లు కూడా లేవు. ఇంట్లో వస్తువులేవీ మునుపటి కళతో కనిపించడం లేదు. ఆయనలోనూ ఠీవి తగ్గింది. నన్ను పలకరించి, ఆమాటా యీమాటా చెబుతున్నాడే గాని రాజుగారు కాలు కాలిన పిల్లిలా తిరగడం నేను గమనించాను. నేను వద్దు వద్దంటున్నా, ఆవిడ ఏవేవో వంటలు చేసేస్తోంది. రాజుగారు హడావిడిగా చెప్పులు వేసుకుని, చేతికర్ర ఒక చేసంచితో బయలుదేరారు. "ఊళ్లోకి వెళ్లొస్తా, కొంచెం తొందర పని వుంది, రాగానే భోజనం చేద్దాం" అంటూ వెళ్లిపోయారు.

నేను అప్పట్లో కూడా ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా పూజా మందిరంలో కొలువున్న రాధాకృష్ణుల విగ్రహాన్ని చూడకుండా వెళ్లేవాణ్ణి కాదు. పంచలోహాల బొమ్మ అది. చిన్నదేగాని, కళ ఉట్టిపడుతూ వుంటుంది. నేను సరాసరి మందిరం దగ్గరకు వెళ్లి చూశాను. ఆ బొమ్మ లేదు. ఆ వెలితి నా గుండెల్లో ప్రతిఫలించింది. అడుగుదామనుకున్నాను. మాట పెదవి దాటి రాలేదు. రెండు రకాల తీపి వంటకాలతో ఆ ఇల్లాలు నాకు భోజనం పెట్టింది. ఆయన బోలెడు కబుర్లు చెప్పారు. ఆమె బోలెడు సంగతులు అడిగింది. మరి కాసేపు వుండి బయలు దేరాను. ఇద్దరికీ శిరసు వంచి నమస్కరించాను. ఆమె నా చేతిలో చిన్న కాగితం పొట్లం పెట్టింది. ఏమిటన్నట్లు చూశాను. “ఏం లేదు నాయనా, ఇన్నాళ్లకు వచ్చావు. పైగా యెంతో ప్రయోజకుడివైనావు. ఒక పంట్లాము, చొక్కా కుట్టించుకో, కాదనకు" అన్నది. కాదంటే నొచ్చుకుంటారని, తీసుకున్నాను.

ఊళ్లోకి వచ్చి బస్టాండ్లో నిరీక్షిస్తున్నాను. పక్కనే చిన్న తనఖా షాపు వుంది. అక్కడ జనం గుమిగూడి ఏదో చోద్యం చూస్తుంటే, నేనూ వెళ్లాను. అక్కడ రాధాకృష్ణుల పంచలోహాల బొమ్మని షాపు యజమాని ప్రదర్శిస్తున్నాడు. “పెద్దాయన యింతకుముందే అమ్మేసి వెళ్లాడు. ఇంకా ధర కూడా నిర్ణయించలేదు. ముందొక వెయ్యి రూపాయలు యిమ్మని తీసికెళ్లాడు” చెబుతున్నాడు యజమాని. “ఆ రాజుగారు చచ్చినా మారడు, అంతే” అన్నాడు శ్రోత.

No comments:

Post a Comment