Tuesday, November 4, 2025

 🌷చుక్కల తోటలో ఎక్కడున్నాడో?🌷

ఇందిర.వెల్ది,
రాష్ట్ర పన్నుల అధికారి,
హైదరాబాదు,
తెలంగాణా రాష్ట్రం.
9247478080.

పాల మీగడకు ప్రాణం పోస్తే?
గులాబీ వర్ణానికి గుండె తగిలిస్తే?
అద్దానికి అందాన్ని ఆయువుగా ఊపిరిలూదితే?
పుట్టాడో పూర్ణ పురుషుడు.
అతడే ఘట్టమనేని శివరామకృష్ణుడు.

అక్కినేనికి అహో!
గొప్ప సన్మానం.
వెండితెర వేల్పులకు జనుల నీరాజనం.

నేనే కథానాయకుడినైతే?
అమ్మా,నాన్నలు కలలుగన్న ఒక్క ఇంజనీరేమిటి?
సమస్త వృత్తులలోనూ పరకాయ ప్రవేశం చేయవచ్చును.

అంతే!
తెలుగు సినీ కళామతల్లికి దొరికిందో నట శేఖరం.
తేనె మనసుల నుండి శ్రీశ్రీ వరకు ప్రవహించిన పద్మభూషణం.

ఆపైన ఎన్నెన్నో తొట్టతొలులకు పుట్టిల్లైనాడు ఈ బుర్రిపాలెం బుల్లోడు.
తొలి జేమ్స్ బాండ్ సినిమా,
తొలి కౌబాయ్ సినిమా,
తొలి ఫుల్‌స్కోప్ సినిమా,
తొలి 70 ఎంఎం సినిమా,
తొలి తెలుగు రంగుల సాంఘిక చిత్రం,
తొలి ఓఆర్‌డబ్ల్యు కలర్ సినిమా ,
తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం,
ఆఖరికి ఇద్దరు కథానాయకులకు,
ఒక కథానాయకికి తండ్రిగా రికార్డే కాదు,
గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన ఏకైక తెలుగు దర్శకులరాలికి భర్త కూడా మన శివరామకృష్ణుడే సుమీ!

ఒక సంవత్సరంలో 18 సినిమాలు, 10 సంవత్సరాలలో 100 సినిమాలు చేసిన మేటి! మన కిరాయి కోటిగాడు ఒక్కడే ఇప్పటి వరకు.

అందం, చందం,అభినయం, రూపలావణ్యం కలబోసిన ఈ " *గాజుల కిష్టయ్య* "ను చూసి మగవాళ్ళు కూడా మనసుపారేసుకునేవాళ్ళట.
అభిమానాన్ని చాటుకోవడానికి
ఒకటా రెండా ఏకంగా
2500 సంఘాలను స్థాపించుకున్నారట పాపం.
పైగా?
30 వేల మంది అభిమానులు 400 బస్సులలో మద్రాసు నగరానికి తరలివచ్చారట మన *అసాధ్యున్ని* *అవేకళ్ళ* "తో చూడటానికి. 

నాకో చిన్న సందేహం!😂
క్షణం తీరిక లేకుండా,
మూడు షిప్టుల పని,
నిద్రపోతున్నా నటించిన మన **సర్దార్ కృష్ణమ నాయునికి* 
ఇందిరమ్మతోనే కాదు, విజయనిర్మలతోనూ *పండంటి కాపురం* చెయ్యడానికి సమయం ఎప్పుడు దొరికింది చెప్మా?

ద్వికళత్రాన్ని జీవితంలోకి ఆహ్వానించిన పురుషులు,
మొదటి భార్యను నట్టేట ముంచుతారంటారు కానీ మన *ప్రతిభావంతుడు* మాత్రం ఆపైనే 5 అమృతసమమైన పళ్ళను అమ్మ ఇందిరకు కానుకగ ఇచ్చాడు సుమా!
నిజమే ఇతను *ముద్దాయి* కాదు, *కృష్ణ పరమాత్మ* .

ఇతను బయటేమో బహు సిగ్గరి అంతకు మించి మొహమాటస్తుడు కానీ సినిమాల్లో మాత్రం విప్లవవీరుడు *అల్లూరి సీతారామ రాజు,* ఆపైన *అమాయకుడు* ఇంకా *అఖండుడు.* 

అభిమానలకో ప్రశ్న ఇప్పుడు!
123 దేశాలలో ట్రెజరర్ హంట్ పేరిట విడుదలైన కృష్ణ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం?
 *మోసగాళ్ళకు మోసగాడు.* 

నష్టమొస్తే నాకు,
లాభమొస్తే మీకు అనే నటులెవరైనా తారసపడ్డారా నిర్మాతలకు ఎప్పుడైనా? లాభమొస్తే వేతనం తీసుకుంటాడట.
నష్టమొస్తే మరో సినిమా ఉచితంగా చేసి పెడతాడట.
అందుకే కాబోలు మన " *ఖైదీ రుద్రయ్య"* ను నిర్మాతల మిత్రుడన్నారు అందరు.

సినిమాల్లో 345 చిత్రాలలో కథానాయకునిగా నటించి,
దర్శకునిగా 15 సినిమాలను మెప్పించి,
నిర్మాతగా 2 సినిమాలను లాగించి,
ఎడిటర్ గా ఒక సినిమాను కత్తిరించి,
నిజ జీవితంలో ఉత్తమ కుమారునిగా,సోదరునిగా,
భర్తగా,తండ్రిగా,తాతగా బహుపాత్రలు పోషించిన మన 
 *మాయదారి మల్లిగాడు* 
నవంబర్ 15,2022 నాడు మనందరినీ వదలి మహత్తర లోకాలకు తరలిపోయిన ఈ లోక్ సభ మాజీ ఎం.పి  *భళే మోసగాడు* సుమీ!

No comments:

Post a Comment