యోగక్షేమం వహామ్యహం గురించి వింటున్నాం. దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ... అన్నవి ఆర్యోక్తులు. ఇవన్నీ ఆచరించడం భగవంతుణ్ని సేవించడంతో సమానం. ఒక మహాకవి అన్నట్టుగా తల్లిదండ్రులు విషమని తలచేవాళ్లు కొందరైతే, గురువులకు పంగనామాలు పెట్టేవాళ్లు ఇంకొందరు. ఒకప్పుడు చుట్టాలు వస్తున్నారంటే ఇంటిల్లి పాది సంతోషించేవారు. మన పట్ల ప్రేమాభిమానాలు ఉండబట్టే వస్తున్నారని భావించేవారు. వాళ్లకి సకల సదుపాయాలు సమకూర్చి, భోజన వసతుల్లో ఎటు వంటి ఇబ్బంది లేకుండా చూసేవారు.
ఇటీవల కాలంలో భార్య తరపు వాళ్లు వస్తే భర్త, భర్త తరపు వాళ్లు వస్తే భార్య ముఖం ముడుచుకోవడం గురించి తరచూ వింటున్నాం. వాళ్ల వైఖరికి అనుగుణంగా పిల్లలు కూడా ప్రవర్తించడం, ఏ మాత్రం సమర్థనీయం కాకపోయినా... సహజం! ఇటు వంటి కారణాల వల్ల పిల్లలు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ఆత్మీయానురాగాలనే కాక పెద్దల మార్గదర్శకత్వాన్నీ కోల్పోతు న్నారు. పెద్దవాళ్లు కూడా తమ మూడోతరం వారసులైన చిన్నారుల బాల్య చేష్టలు చూసే భాగ్యానికి నోచుకోవడం లేదు.
పూర్వపు రోజుల్లో ఇప్పటిలా క్షణాల్లో పను లైపోయే వసతులేవీ లేవు. అయినా కష్టమ నుకోకుండా కట్టెల పొయ్యిమీదే మట్టి, రాగి, కంచు వంటి పాత్రల్లో అతిథి, అభ్యాగతులకు వేడివేడిగా వండి పెట్టేవారు. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో పెద్దవాళ్లు అన్నం వండిన పాత్ర పూర్తిగా తుడిచి పెట్టేయకూడదని అంటారు. దానర్థం గబుక్కున అతిథులెవరైనా వస్తే వెంటనే వడ్డించడానికి ఉండాలని.
ఆతిథ్యం గురించి, దాని ప్రాముఖ్యం గురించి మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. పాండవుల అరణ్యవాస సమయంలో ఒకరోజు, మహాకోపిష్టి అని పేరొందిన దుర్వాస మహాముని, తన శిష్యబృందంతో అతిథిగా వస్తాడు. అప్పటికే పాండవుల భోజనాలు అయిపోవడంతో అక్షయపాత్రను శుభ్రం చేసి బోర్లించేసింది ద్రౌపది. ఆ పాత్రని కావాల్సినంత సేపు వాడుకున్నాక ఒకసారి శుభ్రం చేసి పెట్టేస్తే ఇంక ఆ పూటకి అది పనిచేయదు. దాంతో ముని బృందానికి ఆతిథ్యం ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు ధర్మరాజుకు. దుర్వాసుడి ఆగ్రహానికి గురికాక తప్పదని భయపడ్డాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. ద్రౌపది అక్షయ పాత్రని శుభ్రం చేసే సిన విషయం ధర్మరాజు ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని పట్టుకుని బాగా వెతికి, అందులో ఒక మూల దాగి ఉన్న ఒక అన్నం మెతు కుని తీసుకుని తింటాడు. సకల భువనభాండాల్నీ తనలో ఇముడ్చుకున్న భగవంతుడికి కడుపు నిండిపోయింది. అంటే సమస్త జీవకోటికి ఆకలి తీరిపోయింది. అక్కడ నదీస్నానానికి వెళ్లిన దుర్వాసుడు, ఆయన శిష్యులు ఏమీ తినకుండానే భుక్తాయాసంతో ఆపసోపాలు పడసాగారు. ఆ విధంగా పాండవులను కాపాడాడు శ్రీమన్నా రాయణుడు. తనని నమ్ముకున్నవారి యోగక్షేమాలను తానే స్వయంగా చూసుకుం టానని (యోగక్షేమం వహామ్యహం) శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి తెలిపాడు.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment