Wednesday, November 5, 2025

 *తెలివి - వివేకం*
తెలివికి వివేకానికి తేడా ఉంది. ప్రతి జీవికీ దాని స్థాయి తెలివి దానికుంటుంది. దాంతోనే అవి కూడు, గూడు సంపాదించుకుంటాయి. శత్రువు నుంచి రక్షణ పొందుతాయి. అయితే ఆ తెలివిని ఎందుకు ఎలా వాడాలో నిర్ణయించుకునే సామర్థ్యమే వివేకం. అది మనిషికి మాత్రమే సొంతం. మనిషి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి వివేకం అవసరం. సకల జీవులు ఆ పరమాత్ముడి అంశతో జన్మించినవే అనే వివేకం, లోకానికి తగిన మేలుచేస్తూ జీవించాలనే జ్ఞానాన్ని ఇస్తుంది.

బాల్యంలో ఎవరికీ జీవితం గురించి ఏ విధమైన అవగాహనా ఉండదు. ఏ సమయానికి ఎలా నడచుకోవాలో ఏమీ తెలియదు. అవన్నీ పెద్దలే పిల్లలకు నేర్పుతారు. ఇంటా బయటా ఎక్కడ ఎలా ఉండాలో, ఏవి తినవచ్చో ఏవి తినకూడదో, ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలో... అన్నీ ఇతరులను చూసి కొన్ని, అనుభవంతో మరికొన్ని నేర్చుకుంటారు. ఆ విషయ పరిజ్ఞానం గురించి మన పెద్దలు, శ్రేయోభిలాషులైన పూర్వికులు వివేకంతో మార్గదర్శకత్వం చేశారు. అయితే స్వార్థం మితిమీరినప్పుడు వివేకం నశిస్తుంది. జీవితమంటే ఆధ్యాత్మిక, భౌతిక అనుభూతుల కలయిక. ఆ రెండింటి ప్రగతికీ వివేకం అవసరం. ‘వినదగునెవ్వరు చెప్పిన’ అని సుమతీ శతకకారుడు అన్నట్లు ఎవరి మాటైనా వినవచ్చు. చేయదగింది, చేయకూడనిది అని విశ్లేషించుకుంటూ ధర్మాధర్మ విచక్షణతో వివేకిగా ఉండాలి. ఎవరైనా ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకోవడం సహజమే. ఆ కోరిక వల్ల పరుల శ్రేయస్సుకు భంగం కలిగినట్లైతే అది ధర్మమైన కోరిక కాదు. ధర్మంగా, నిర్భయంగా జీవించడానికి వివేకమే మార్గదర్శకం అవుతుంది. వివేకవంతుల ఉనికి లోకానికి శ్రేయోదాయకం.
మనిషి వివేకవంతమైన జంతువు అని ఆంగ్లంలో నానుడి. కొన్ని జంతువులలో సైతం వివేకాన్ని గమనించవచ్చు. పెంపుడు జంతువులు తమ యజమాని ఆదేశాలను అర్థం చేసుకుంటాయి. అతడి అనుమతి లేకుండా ఏ పనీ చేయవు. ఆహారం తమ ఎదురుగా ఉన్నా తినమని చెబితే కానీ ముట్టుకోవు. ఆ వివేకం నేర్పేవారు ఉండరు కాబట్టే వీధికుక్కలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాయి. అట్లాగే నేడు కొందరి ప్రవర్తనలోనూ వివేకం కొరవడుతోంది. దానివల్ల సమాజం అస్తవ్యస్తమవుతోంది.

ఇతరులకు ఇబ్బంది కలుగకుండా తమ అవసరాలూ ఆకాంక్షలపై కొంత అదుపు పాటించడం వివేకవంతుల లక్షణం. అదే ఆధ్యాత్మిక సాధనలో ‘లోకా సమస్తా సుఖినోభవంతు’ అనే భావనను అర్థవంతం చేస్తుంది. ఆ సాధనలో అంతర్భాగమైన దైవభక్తిని ప్రబోధించడంతో పాటు లోకానికి సరైన మార్గదర్శకత్వం వహించిన నరేంద్రుడు వివేకానందుడిగా ఆదర్శప్రాయుడు అయ్యాడు. పరుల శ్రేయస్సు సైతం ప్రధానం అనే వివేకమే మానవత్వం. జీవులలో మానవుడు వివేకవంతుడు అనే భావనకు అదే ప్రామాణికం.
~దువ్వూరి రామకృష్ణ వర ప్రసాదు

No comments:

Post a Comment