Wednesday, November 26, 2025

 రామాయణం, మహాభారతం యొక్క అనేక సంచికలు వాటి విలువను పెంచుతున్నాయా లేక తగ్గిస్తున్నాయా? ప్రతి ప్రాంతంలో వేర్వేరు కథలు — ఇది వైవిధ్యమా లేక అయోమయమా?
ఇపుడు మనకంతా చరిత్ర దృష్టి. విశ్వాసం తక్కువ. అందుచేత యథార్థకథ ఏమిటి? ఇన్నిన్ని రచనలు ఒకే కథ ఆధారంగా పుడితే వీటిలో నిజమెంత? అని అనుమానం. వాల్మీకి రామాయణం గూడా అన్ని రామాయణాలలో ఒకటి.. అందులోనూ నిజాలకంటే ఆ కవి ఊహలే ఎక్కువగా చేరిఉంటాయి అని మన నమ్మకం. (మెజారిటీ)

అసలు రామాయణం జరిగిందా? వాల్మీకి ఏ కాలం వాడు? ఆయన భాష అంత ప్రాచీనంగా కనిపించదే —అంటాం.

ఇవన్నీ గత 100 సంవత్సరాల నుంచే.

అప్పటివరకూ కేవలం భక్తి. పండితులలోనూ పామరులలోనూ పురాణగాథలు యథార్థాలు , ప్రత్యక్షర సత్యాలు —మనకు అర్థం కానంతమాత్రాన అవి ఆక్షేపించదగినవి కాదు— అని వాటిపై పరమవిశ్వాసం.

అందుచేతనే ఆ భక్తితో చూచి , ఆ కథలను తమ తమ భాషల్లో తమ సంతృప్తి కోసం వ్రాసుకొన్నారు. జానపదులు తమకు తోచిన మార్పులు ఆ భక్తి తీవ్రతలో చేసుకొని పులకించారు.

ఆ పురాణపురుషులూ మనవంటి వాళ్ళే. ఎన్ని బాధలు పడ్డారు అని విచారం. వాళ్ళు ఆదర్శమైన వాళ్ళు. ఒక్క తప్పూ చేయరు అని తమకు సందేహంగా అనిపించిన కథాఘట్టాలు కొంచెం మార్చి చెప్పుకొని అపారభక్తిని చాటుకొన్నారు.

లక్ష్మణరేఖలు , ఊర్మిళాదేవి నిద్ర ఇలాంటివే.

సులోచన కథ వాల్మీకి చెప్పలేదు. ఆ వ్యక్తి పేరే రామాయణంలో లేదు.

ఇంద్రజిత్తు భార్య అనీ , ఆమె తన మామను రావణుణ్ణి రణరంగమధ్యం నుండి తన భర్త ఇంద్రజిత్తు కళేబరం తెప్పించి ఇస్తే సహగమనం చేస్తాననీ అంటుంది అని — రంగనాథ రామాయణంలో ఒక కల్పన.

రావణాసురుడు ఆమె మాట తిరస్కరిస్తాడు.

ఆమె అపరిమిత భక్తితో రాముణ్ణి ఆశ్రయిస్తుంది. ఆయన ఆమె పాతివ్రత్యానికి ఆనందించి ఆ ఏర్పాటు చేయిస్తాడు. రాముడి గొప్పతనం చాటే కల్పన ఇది.

ఇలాంటి కల్పనలు రామకథ ఆధారంగా పుట్టిన నాటకాలలోనూ కావ్యాలలోనూ కనిపిస్తాయి..అవి మూలకథకు వివరణలేగానీ సవరింపులని ఆ రచయితలు అనుకోలేదు. అచంచలభక్తి అందరిలో ఏర్పడి ఉత్తమమార్గంలో అందరూ నడిచి శాంతిపొందడమే అందరి లక్ష్యమున్నూ.

ఆ విధంగా పురాణకథలు ఆత్మానందసంధాయకాలుగా మార్పు చేయబడ్డాయి గానీ సంశయాత్మకులను చేయడం కోసం కాదు.

అసలు జరిగిందో లేదో అనే బుద్ధి వారిలో ఉండే ఉంటే ఇన్నిన్ని రకాల ఊహలు చేసుకోరు.

పురాణపాత్రలు నిజమనే విశ్వాసం అతిగాఢంగా ఉండబట్టే ప్రతి ఊరిలో ఆలయాలు, అందరికీ ఆ రామయ్య ఆ కృష్ణయ్య , ఆ సీతమ్మల పేర్లే .

కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నములు . కల్పితాలు కాలక్షేపానికే. ఉబుసుపోకకే అని తలచిన రోజులవి.

ప్రజలకు నీతి , ధర్మం భక్తి బోధించేవే గొప్పవి. అవే శాశ్వతంగా నిలిచేవి . ఇంకా మాట్లాడితే * కావ్యాలాపాంశ్చ వర్జయేత్* — కేవలం సత్కథలున్న పురాణాలే చదవాలి. చదివించుకొని వినాలి. పురాణ ప్రవచనాలు మనలను మంచిదారిలో పెడ్తాయి అని సత్ వైపు నడిచే ధర్మదృష్టి అందరిలోనూ ఉండినది.

నాటకాలు వ్రాశారు. ప్రదర్శన సౌలభ్యం కోసం చిరు మార్పులు చేసుకొన్నారు . లోకసంగ్రహార్థమే ఆ మార్పులు. అందరూ సన్మార్గంలో నడవడమే రచనల లక్ష్యం.

యథాకాల ప్రబోధ కవిరాజుల ఆంతర్యం.

పురాణ కథలు చదివి , విని ఆనందంతో భావుకులైన జనులు అనేక రకాల కల్పనలూ జోడించుకొన్నారు..

తమకు అర్థమైన విధంగా ఆ కథలకు మరికొన్ని ఊహలు చేర్చుకొని ఆనందించారు.

తులసీదాసు రామచరితమానస్ లో ఎన్నో మార్పులు.

దానికి .ఆయన సమాధానం* స్వాంతస్సుఖాయ* అని. నా ఆనందం కోసం నాకు తోచిన విధంగా రామకథ చెప్పుకొన్నాను అని.

అదిప్పుడు దేవుని మందసంలో పూజలందుకొంటూ ఉన్నది. నిత్యమూ పారాయణయై ప్రజలను ఉదాత్తమార్గంలో నడుపుతున్నది. ఇందులో ఎవరూ రెండో మాట అనలేరు.

తాము నమ్మిన విశ్వాసాలకు భిన్నంగా అలనాటి పుణ్యపురుషులు అలాంటి పనులు చేసి ఉండరని భక్తితో తమ ఊహలను చేర్చుకొని సంతోషించారు.

ఎన్ని ఊహలు చేసినా పురాణపురుషులకు మహిమ జతచేసేవే గానీ కించపరిచేవిగా ఉండలేదు.

నాడు ఆ చేసుకొన్న మార్పులవల్ల సమాజశ్రేయస్సు కలిగింది. చెడుపేమీ జరగలేదు. ప్రజలు సంశయాంధకారంలో పడక సుఖంగా జీవించారు.

No comments:

Post a Comment