🌸 మనసు శుద్ధి – జెన్ ప్రతిధ్వని
(డా. తుమ్మల దేవరావ్, ఓల – నిర్మల్)
ఇంటి మూలల్లో పేరుకుపోయిన దూళిని ఊడ్చినట్టు,
మనసు మూలల్లో కూర్చున్న ఆలోచనలను ఊడ్చేయాలి.
పాత జ్ఞాపకాలు వాడిన ఆకుల్లా కూలిపోనివ్వు,
గాలి తాకిన మౌనంలో కొత్త పువ్వు పుడుతుంది.
ఇల్లు శుభ్రమైతే వెలుగు ఆహ్వానిస్తుంది,
మనసు శుభ్రమైతే నిశ్శబ్దం పూస్తుంది.
ఆ నిశ్శబ్దమే జీవితం యొక్క శ్వాస —
అది మాటలకీ అర్థాలకీ దాటి వినిపించే సత్యం.
దుఃఖాన్ని ఆరబెట్టండి
కన్నీటి చివరలో ధ్యానం మొదలవుతుంది.
ఆశలు దిగి వచ్చిన చోటే
శాంతి మొదలవుతుంది.
వదిలేయి...
నిన్నను, దానిలోని నీడలను,
వదిలేయి స్నేహపు బూడిదను,
ప్రేమ దహనాన్ని కాదు.
అన్నీ వదిలినప్పుడు మాత్రమే
నీవు మిగిలిపోతావు
అది ‘నీవు’ కాదు,
అనంతం.
నీ హృదయం ఒక వాయిద్యం కాదు,
అది ఒక శూన్యం
దానిని తాకిన గాలి మాత్రమే రాగమవుతుంది.
దానికి శిక్షణ అవసరం లేదు,
గుర్తు తెచ్చుకోవడమే సరిపోతుంది.
పాత నీటిని వదిలేస్తే కొత్త ఊట ఉద్భవిస్తుంది,
మలినం తొలగితే స్పష్టత కలుగుతుంది,
స్పష్టతలోనే కరుణ పుడుతుంది,
కరుణలోనే బుద్ధుడి మౌనం ఉంది.
హృదయం శుద్ధమైతే
ప్రపంచం నీ అంతరంగ ప్రతిబింబమవుతుంది
నిశ్శబ్దం ఆలయమవుతుంది,
శూన్యం సత్యమవుతుంది,
జీవితం జెన్ పుష్ప పరిమళ మవుతుంది.
No comments:
Post a Comment