Sunday, February 1, 2026

 మొన్న జనవరి 26 న పద్మశ్రీ పురస్కారం పొందిన తమిళ రచయిత్రి శివ శంకరి 1979 లో రాసిన కథ ఇది. ఇప్పటికీ రెలేవేన్స్ ఉందా అంటే ఉందనే చెప్పాలి. నాకు ఎందుకు నచ్చిందో తెలీదు.కానీ ఈ కథ లో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. అదేమిటో మీకు తెలిస్తే నాక్కాస్త చెప్పండి

సెప్టిక్   // శివ శంకరి //

‘అయ్యర్ ఇంటి’ ఆవరణలో కూర్చుని ధనభాగ్యం వేరుశనగకాయలు  వలుస్తోంది. ఆమె ఒక్కో కాయను  నేలకేసి కొట్టి పగులగొట్టి, లోపల ఉన్న గింజలను  ఒక వెదురు చాటలో వేస్తోంది..

ధనభాగ్యంకు మురికివాడ లోని మిగిలినజనాలకు , బ్రాహ్మణులు ఎక్కువగా ఉండే మరగదపురం అగ్రహారంలోని ఆ పది ఇళ్ళూ ‘అయ్యర్ ఇళ్లే ’. వాళ్ళు ఒక్కో ఇంటికి ఒక్కో పేరు పెట్టుకున్నారు—పెద్దయ్యర్, చిన్నయ్యర్, మేడ మీద అయ్యర్, పూజారి అయ్యర్, మూల ఇంటి అయ్యర్ ఇలా.

 అక్కడ ఉన్న ఒకే ఒక్క అయ్యంగార్ రామచంద్రన్  (విష్ణువును ఆరాధించే బ్రాహ్మణ శాఖ)ఈ అయ్యర్ల కంటే భిన్నమైన వారు. అయినా రామచంద్రన్ కూడా వారి దృష్టిలో ‘నిలువు నామం ఉన్న తెల్లటి అయ్యర్’ మాత్రమే! మరగదపురంలో పేరున్నవి రెండే వీధులు—ఒకటి అగ్రహారం వీధి, రెండోది రెడ్డియార్ వీధి. ఆ ఊరి శివాలయం అందరికీ ఉమ్మడి దేవాలయం.మురికివాడలు,మాత్రం  ఊరికి దూరంగా, పెన్నార్ నదికి దక్షిణాన ఒక చిన్న ప్రాంతంలో ఉంటాయి.అక్కడ ‘మదురై వీరన్’ అనే గ్రామ దేవత ఆలయం వుంది. ఆ మధురై వీరన్ ఆ మురికివాడలో నివసించే జనానికి రక్షకుడు. నడిపించే దేవుడు

ధనభాగ్యం వేరు శనగ కాయలు వలుస్తున్న చోట ఒక నీడ పడింది. తలెత్తి చూస్తే  ఆమె కూతురు మల్లిక

“ఇప్పుడు  నొప్పి ఎలా ఉంది?  కాస్త తగ్గిందా? కులాసాగా ఉందా? నేను సిద్ధం చేసిన వేడి నీళ్లతో స్నానం చేశావా?”కూతురును చూడగానే ప్రశ్న మీద ప్రశ్న గుప్పించింది ధనభాగ్యం

“ఉమ్...” అంటూ మల్లిక  మెల్లగా తలూపింది. ఆమె తల్లిలా మామూలుగా కూర్చోకుండా , కాళ్లు మడుచుకుని కింద కూర్చుంది. ఆమె నిండు గర్భిణి కావడంతో అలా కూర్చోవడం కొంత హాయిగా వుంది ఆమెకి. కానీ ఆ హాయి ఎంతో సేపు నిలువలేదు. హాయికి బదులుగా,  కొంచెం అసౌకర్యం మల్లికను ఇబ్బంది పెట్టింది . కడుపులో ఒక రకమైన నొప్పి

“ఈ ఎండలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను పంపిన జావ  తాగావా?”మళ్ళీ అడిగింది ధన భాగ్యం

మల్లిక ధనభాగ్యం పెద్ద కూతురు. వారి కుల ఆచారం ప్రకారం ఆమె తన మేనమామను (ధనభాగ్యం తమ్ముడిని) వివాహం చేసుకుంది. ఆమె మరగదపురం పక్కనే ఉన్న సాలైమేడు అనే గ్రామంలో ఉంటుంది. ఆమె భర్త రైతు. ఇది మల్లికకు మొదటి ప్రసవం కావడంతో, ప్రసవం  అయ్యే వరకు తన దగ్గరే ఉంచుకోవాలని ధనభాగ్యం నిర్ణయించుకుంది. ఆమె వచ్చి పది రోజులైంది. ధనభాగ్యం లెక్క ప్రకారం ప్రసవానికి ఇంకా వారం రోజులు టైమ్ ఉంది, కానీ మల్లిక పడుతున్న ఇబ్బంది చూస్తుంటే రేపో మాపో కాన్పు వస్తుంది అనిపిస్తుంది  

మల్లిక కొన్ని పప్పులు తీసుకుని నోట్లో వేసుకుంటూ, “ఎంతసేపని పడుకుంటాను? ఒళ్లంతా బిగుసుకుపోతోంది. కొంచెం అటూ,ఇటూ నడవమని రసమ్మ చెప్పింది, అందుకే వచ్చాను. ఇంతకీ ఈ పప్పులు ఎందుకు వలుస్తున్నావు?” అని అడిగింది.

“అమ్మగారి  చెల్లి ప్రసవం కోసం మద్రాసు వెళ్ళింది. ఆమెకు వేరుశనగ ఉండలంటే చాలా ఇష్టమట. అయ్యర్ గారు ఈరోజు మద్రాసు వెళ్తున్నారు, అందుకే అమ్మగారు చెల్లెలి కోసం ఇవి చేసి పంపించాలనుకున్నారు .”

వారి మాటలు విని ఇంటి యజమానురాలు పంకజం కిటికీలోంచి బయటకు చూసింది. “ఎవరది ధనభాగ్యం?”

“నేనేనమ్మా! నా కూతురు వచ్చింది!”

పంకజం ఒక గిన్నెలో  మజ్జిగ చిలుకుతూ బయటకు వచ్చింది. “ఓ! మల్లికవా! ఎందుకు ఇబ్బంది పడతావు తల్లీ? నిన్న రాత్రంతా నీకు నడుము నొప్పిగా ఉందని విన్నాను... ఇంట్లో ప్రశాంతంగా పడుకోవచ్చు కదా?”

“ఏమోనమ్మా... కూర్చున్నా, పడుకున్నా నొప్పి తగ్గట్లేదు. ఏదో తెలియని నొప్పి నిరంతరం ఇబ్బంది పెడుతోంది.”

“కంగారు పడకు తల్లీ! అలాగే ఉంటుంది. నీ కడుపులో ఇంకో ప్రాణం పెరుగుతోంది కదా! నీ కడుపు బాగా కిందకు దిగినట్టు కనిపిస్తోంది, రేపో,మాపో  పుట్టేస్తుందిలే!”

పంకజం లోపలికి వెళ్లి ఐదు నిమిషాల్లో అల్యూమినియం గ్లాసుతో వేడి కాఫీ తెచ్చింది. “ఇది తాగు, బాగుంటుంది!” అని గ్లాసు అక్కడ పెట్టి, ధనభాగ్యంతో ఇలా అంది: “అయిపోయిందా? త్వరగా కానివ్వు, అయ్యర్ గారు వెళ్ళే సమయం అవుతోంది. పొయ్యి మీద బాణలి పెట్టి ఇసుక వేడి చేయి!”

ధనభాగ్యం లేచి యజమానురాలు చెప్పినట్టు చేసింది. ఇనుప పొయ్యి వెలిగించి, జల్లించిన ఇసుకను బాణలిలో వేసి వేడి చేసింది. ఇసుక వేడెక్కగానే వేరుశనగ గింజలు  వేసి వేయించడం మొదలుపెట్టింది. పంకజం తన జల్లెడతో వచ్చి ధనభాగ్యం పక్కన కూర్చుని ఇసుక నుంచి గింజలను  వేరు చేయడం మొదలుపెట్టింది.

“నా చిన్న చెల్లి సీతకు ఈ వేరుశనగ ఉండలంటే ప్రాణం! ఒక్కొక్కటిగా తినదు, ఒకేసారి మూడు నాలుగు చేతిలోకి తీసుకుని పుస్తకం చదువుతూ తింటుంది. ఇప్పుడు తను గర్భవతి. తనకి ఇష్టమైనవి చేసి పెట్టాలని ఉన్నా, తను చాలా దూరంలో ఉంది. ఇప్పుడే మద్రాసు వచ్చింది. అందుకే తిరట్టు పాలు, మురుకులు చేశాను, ఇప్పుడు ఈ ఉండలు చేస్తున్నాను. మా వారు పొలం నుంచి రాకముందే ఇవన్నీ చేసి సంచీలో సర్దేయాలి  , లేదంటే ఆయనకు కోపం వస్తుంది.”అన్నది పంకజం

తన చెల్లి కోసం పిండివంటలు తయారీలో హడావిడి పడుతూనే  పంకజం ఒక్కసారిగా మల్లిక వైపు చూసి వెంటనే ధనభాగ్యం వైపు తిరిగి ,

“ధనం, మల్లికను టౌన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఒకసారి మంచి లేడీ  డాక్టర్‌కు చూపించకూడదూ!  నిన్నటి నుంచి నొప్పితో బాధపడుతోంది కదా!” అంది.

“ లేడీ డాక్టరా!  ఎందుకమ్మా!? నేను ఆరుగురిని కన్నాను కదా! ఎప్పుడూ డాక్టర్ మాట ఎరుగను. అసలా ఆలోచనే లేదు.  ప్రసవం ఏమంత పెద్ద విషయమని? నేను పొలం లో  పని చేస్తూనే పిల్లల్ని కనేదాన్ని. పొలం లో పని చేస్తున్నప్పుడు నొప్పులు వస్తే గట్టు మీదకు వచ్చే  అట్టే కాళ్లారజాపి కూర్చునేదాన్ని, అలా బిడ్డ బయటకు వచ్చేసేది. దీనికి డాక్టర్లు ఎందుకు? అవసరమైతే మన ఊరి మంత్రసాని ఉంది కదా!” అంది ధనభాగ్యం.

.ధనభాగ్యం చెప్పిన మాటలు విన్నాక ఆమెకు బిడ్డ కాన్పు విషయం లో ఇంకేమి చెప్పినా ప్రయోజనం లేదని భావించి ,పంకజం తాను సగం వొలిచిన వేరుశనగ గింజలు ధనభాగ్యానికి ఇచ్చి త్వరగా పనికానివ్వమని చెప్పి లోపలకు వెళుతూ
“కానీ కాలం మారుతోంది ధనం... మన రోజుల్లా కాదు ఇప్పుడు. ఏవైనా ఇబ్బందులు వస్తే చూసుకోవడానికి నిపుణులు ఉంటారు. నా ఉద్దేశం చెప్పాను, మిగతాది నీ ఇష్టం” అని చెప్పి పంకజం తన పనిలో పడిపోయింది

ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకు మల్లికకు నొప్పులు మొదలయ్యాయి. ధనభాగ్యం కొన్ని నీళ్లు కాగబెట్టి , పాత బట్టలు సిద్ధం చేసింది. తన కులదైవానికి దణ్ణం పెట్టుకుని మల్లిక నుదుట  పవిత్రమైన విభూతి పూసింది. ధనభాగ్యం ఆరుగురు పిల్లలను కన్నా ఇంత ఇబ్బంది పడింది ఎప్పుడూ లేదు. నొప్పులు వచ్చినపుడు కాస్త గట్టిగా ఒకటికి రెండు సార్లు పుష్ చేస్తే ప్రసవం జరిగిపోయేది.  కానీఇప్పుడు మల్లికను చూస్తే మాత్రం కొంచెం ఆందోళనగా వుంది.   రాత్రి 9 గంటలైనా ప్రసవం కాకపోవడంతో ధనభాగ్యం కంగారుపడి ఊరి మంత్రసానిని పిలిపించింది

“ఏంటే మల్లికా ! అంత యాక్షన్ చేస్తున్నావు?” అంటూ మంత్రసాని గంభీరమైన స్వరంతో లోపలికి వచ్చింది. ఆమెకు ఎటువంటి శిక్షణ లేదు, కానీ ఊళ్ళో ఎవరికి ప్రసవం కావాలన్నా ఆమెనే దిక్కు.

మంత్రసాని మల్లిక కడుపును రెండు చేతులతో గట్టిగా కిందికి రెండుసార్లు  నొక్కింది. “పుట్టేస్తాడులే!” అని తేల్చేసి వేడి నీళ్లు, బట్టలు సిద్ధంగా ఉన్నాయా? అని ధనభాగ్యాన్ని అడిగింది. .

ధనభాగ్యం అన్నీ సిద్ధంగా వున్నాయి అనటం తో

"అయితే చిన్నపిల్లలని, మగవాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పు.పక్కింటి రసమ్మనీ, చుక్కీ ని రమ్మని చెప్పు" అని ధనభాగ్యానికి పురమాయించింది. మంత్రసాని మాటలు ధనభాగ్యానికి చెపుతున్నట్టు కాక ఒక మహారాజు సేవకులకు ఆజ్ఞలు వేస్తున్నట్టు గట్టిగా,స్థిరంగా వున్నాయి.    

ధనభాగ్యం మారుమాట్లాడకుండా రసమ్మను, చుక్కీ ని పిలిచింది. వాళ్లిద్దరూ వచ్చాక కూడా ఒక అరగంట మల్లిక నొప్పులు పడుతుంటే అలాగే చూస్తూ కూర్చుంది మంత్రాసాని

ఆ తరువాత  రంగంలోకి దిగింది. ఆమె మల్లికను తన ముందు వైపుకు కూర్చోబెట్టి, మల్లిక నడుము వెనుక భాగంలో గట్టిగా తన్నమని చుక్కిని ఆదేశించింది. చుక్కి అలా చేస్తున్నప్పుడు, ఆమె స్వయంగా మల్లిక కడుపును కిందకు నొక్కుతూ, ఆ అమ్మాయికి మరింత ప్రసవ వేదన కలిగించి భయపెట్టడం కోసం అదే సమయంలో గట్టిగా అరిచింది.

అలా చేయడం వలన ఉపయోగం ఏమీ లేకపోయింది. అప్పుడు ఆమె రసమ్మను తన దగ్గరకు పిలిచి, ఆమె సహాయంతో మల్లిక పొడవాటి జుట్టును ముద్దగా చుట్టి, ఆ గర్భిణీ అమ్మాయి నోటిలో కుక్కింది. దాంతో ఆమెకు వాంతి వచ్చేలా అయ్యి, వాంతి చేసుకుంది. అదే సమయంలో చోక్కి మల్లిక నడుము వెనుక భాగంలో  గట్టిగా తన్నుతూనే ఉంది.

‘అంతే బిడ్డా, అలాగే ఉంటుంది! పద, వాంతి చేసుకో, బయటకు కక్కేయ్! అప్పుడే నొప్పులు తీవ్రమవుతాయి. బిడ్డ బయటకు వస్తుంది ’అంటూ గట్టిగా పెద్దగా మల్లికకు భయం కలిగేలా అరచినట్టు మాట్లాడసాగింది.

ఈ శారీరక, మానసిక నొప్పి ఒక పరాకాష్టకు చేరినప్పుడు మల్లిక  ప్రసవించింది. మల్లికకు కొడుకు పుట్టాడు.  

మంత్రసాని బిడ్డను బయటకు తీసి, చిన్న కొడవలితో బొడ్డు తాడును కోసి, దానికి నేర్పుగా ముడి వేసింది. ఆ తర్వాత బిడ్డను బోర్లా పట్టుకుని, ఏడిపించడం కోసం గట్టిగా చరిచింది. తర్వాత ఆమె తన వేలిని శిశువు నోటిలో పెట్టి శుభ్రం చేసింది. ఆమె ఆ నవజాత శిశువుకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించి, పరిచిన గుడ్డపై పడుకోబెట్టింది. ఆ తర్వాత మల్లిక దగ్గరకు వచ్చింది

మల్లికకు మాయ బయటకు రాలేదు. మాయ బయటకు రావడానికి పది నిమిషాలు వేచి చూసిన తర్వాత, మంత్రసాని దానిని చేతితో తీయడానికి పూనుకుంది. ఆమె తన చేతులను ఆ అమ్మాయి గర్భంలోకి పెట్టి, మాయ ముక్కలన్నింటినీ బయటకు తీసింది, ఆ సమయంలో మల్లిక  నొప్పితో విలవిలలాడిపోయింది.

మల్లిక అరుపులకు కోపం తెచ్చుకున్న మంత్రసాని ‘నోర్ముయ్యవే!ఈ ఏడుపేమిటి? ఈ గోలేమిటి? నేను ఎన్ని ప్రసవాలు చేసాను. ఎక్కడా ఇలా అరిచింది చూడలేదు.  నేను నా పని పూర్తి చేసే వరకు నిశ్శబ్దంగా ఉండు!’ అలా చెప్పి ఆమె మల్లికకు నడుము కింద భాగంలో శుభ్రంగా కడిగి, తల్లిని మరియు బిడ్డను గడ్డి పరుపుపై పక్కపక్కనే పడుకోబెట్టింది. మంత్రసాని తన పని పూర్తి చేసేసరికి సమయం పదకొండు గంటలకు దగ్గర పడుతోంది

మరునాడు  ఉదయం మల్లిక తీవ్రమైన నొప్పితో నిద్రలేచింది.  నిలబడటానికి కూడా ఓపిక లేదు. . ఉదయం 7 గంటలకు ధనభాగ్యం కొన్ని ఔషధ గుణాలున్న పొడుతలై ఆకులను నీటిలో మరిగించి, దానికి భవన నిర్మాణంలో ఉపయోగించే ఎర్ర ఇటుకను దొడ్డుగా పొడి చేసి కలిపి  మల్లికకు ఇచ్చి

'ప్రతిరోజూ ఈ నీటితో నీ శరీర కింది భాగాలను రెండుసార్లు కడుక్కో, అప్పుడు మంట తగ్గిపోయి, గాయం త్వరగా మానుతుంది!' అని  కూతురితో చెప్పింది.

ఆ రోజు మరియు తర్వాతి రెండు రోజుల పాటు మల్లికకు కేవలం రొట్టె, పాలు మాత్రమే ఇచ్చారు. మూడవ రోజుకు ఆమె లేచి కొద్దిగా నడవగలిగింది.

ఆ ప్రత్యేక ఔషధ నీటితో స్నానం చేయడానికి లేస్తూ, ఆమె తన తల్లిని, 'ఈ రోజు నువ్వు పనికి వెళ్లక్కర్లేదా?' అని అడిగింది.

" లేదు. వెళ్లడం లేదు , నిన్న రాత్రి అమ్మగారికి ఏదో ముఖ్యమైన కబురు వస్తే వెళ్లిందట. ఆమె తిరిగి వచ్చి నన్ను పిలిచే వరకు నేను పనికి వెళ్లనవసరం లేదని అంజలి వాళ్ళ ఆయనకు చెప్పి వెళ్లిందట . అంజలి ఇప్పుడే చెప్పింది. . బహుశా అమ్మగారి   చెల్లెలు ప్రసవించి ఉంటుంది, అందుకే ఆమె అంత హడావిడిగా వెళ్లి ఉంటుంది." అన్నది ధనభాగ్యం

ధనబాగ్యం బాలింతల కోసం చేసే పథ్యం అన్నం తయారు చేసింది.  అప్పుడే తల్లీ,బిడ్డా  క్షేమంగా ఉన్నారో లేదో చూడటానికి మంత్రసాని ఇంటికి వచ్చింది. బిడ్డ బొడ్డు మానిందో  లేదో చూడటానికి  చిన్నారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, బొడ్డు తాడు మిగిలి ఉన్న చోట బొడ్డుపై గట్టిగా నొక్కింది. ఆ బిడ్డ నొప్పితో బిగ్గరగా ఏడ్చింది.

‘కడుపులో గాలి ఏమీ లేదు, కానీ గాయానికి చీము పడుతోంది,’ అని ఆమె నెమ్మదిగా తనలో తాను గొణుక్కుంది. ఆమె తన గోటితో గుడిసె నేల మీద ఉన్న ఎండిన పేడ ముద్దను కొద్దిగా గీకి తీసి, దాన్ని ఆ పసికందు బొడ్డుపై పూసింది. ఆ తర్వాత మరుసటి రోజు తిరిగి వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది.

మరుసటి రోజు మల్లికను చూడటానికి వచ్చినప్పుడు ఆమె ఒక చిన్న కాగితపు పొట్లాన్ని తెచ్చింది. ‘నీ చిన్నారి కోసం ఈ “సిగార్ బూడిద” తీసుకురావడానికి నిన్న రాత్రి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? అసలు సిగార్ తాగేవాడిని కనుగొనడానికే చాలా శ్రమ పడాల్సి వచ్చింది! ఇప్పుడు ఇది దొరికింది కదా, దీన్ని పాప బొడ్డుపై పెడతాను, అది త్వరలోనే తగ్గిపోతుంది!’ అలా చెప్పి ఆమె ఆ బూడిదను కొద్దిగా నీటితో కలిపి గాయంపై రాసింది..
 
"ఏం భయపడకు. బిడ్డ బాగుంటాడు.  ఇప్పుడు చెప్పు  నీ  సంగతేంటి, నీకు  ఎలా ఉంది? గాయాలు బాగా మానుతున్నాయా? నువ్వు  రోజూ ఆ మూలికల నీటితో కడుక్కుంటున్నావా ? అలాగే చేస్తేనే  నొప్పి త్వరలోనే తగ్గిపోతుంది! నువ్వు  పూర్తిగా కోలుకుంటావు ! " అన్నది మంత్రసాని . మల్లిక సరే అన్నట్టు తలూపింది.

మంత్రసాని ఆమాటా,ఈమాటా చెప్పి వెళ్ళడానికి సిద్ధం అవుతుంటే

ధనభాగ్యం రెండు కొబ్బరికాయలు, అర డజను పసుపు అరటిపండ్లు, తమలపాకులు, వక్కలు, నాలుగు పెద్ద కొలతల బియ్యం, రెండు చిన్న కొలతల పప్పు మరియు ఒక కొలత వేరుశనగలతో పాటు రెండు రూపాయల నాణేలను కలిపి సంభారం తీసుకుని వచ్చి మంత్రసానికి ఇచ్చి సాగనంపింది.

ఒక వారంలోనే మల్లిక లేచి తిరగడం మొదలుపెట్టింది. తనను తాను, బిడ్డను మరియు ఇంటి పనులను అన్నీ సొంతంగా చూసుకోగలిగేంతగా కోలుకుంది.

తన యజమానురాలి  పంకజం నుండి ఎలాంటి కబురు రాకపోవడంతో కొద్దిగా ఆందోళన చెందిన ధనభాగ్యం, అసలు విషయం ఏమిటో స్వయంగా తెలుసుకోవడానికి పంకజం ఇంటికి వెళ్ళింది . వెళ్ళింది వెళ్ళినట్టే అరగంటలో వెనక్కు తిరిగి వచ్చింది.
ధనభాగ్యం కళ్ళ నుండి  కన్నీళ్లు ధారలుగా తున్నాయి.  దుఃఖం తో నోటి నుండి మాట రావడం లేదు

“ఏమైంది?” అని మల్లిక కంగారుగా అడిగింది.

“ఏమని చెప్పను తల్లి! అమ్మగారు మద్రాసు నుంచి వచ్చారు. సీతమ్మకు అందమైన ఆడపిల్ల పుట్టిందట కానీ రెండు రోజులకే ఆ బిడ్డ చనిపోయింది. అమ్మగారు తట్టుకోలేకపోతున్నారు.”

"ఏం చెప్పను? ఎలా చెప్పనే! అమ్మ మద్రాసు నుండి తిరిగి వచ్చింది, గుండె పగిలి పోయే వార్త తో వచ్చింది.  సీతమ్మకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టిందట , కానీ ఏదో తెలియని జబ్బు వల్ల ఆ పాప రెండు రోజుల్లోనే చనిపోయిందని చెబుతోంది! సీతమ్మ చాలా కుంగిపోయి, గుండె పగిలి మంచం మీద పడి ఉంటుందని  నా నమ్మకం! అమ్మ కూడా పూర్తిగా కుదేలైపోయింది...

ధనభాగ్యం తన మాట పూర్తి చేయకముందే,  మల్లిక అయ్యర్ గారి ఇంటి వైపు పరుగెత్తింది.

ఆ అమ్మాయిని చూడగానే పంకజం తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చింది.

 ‘మా చుట్టూ వున్న  అందరూ  సాధారణ ప్రసవాలు జరిగి, ఆరోగ్యవంతమైన బిడ్డను చేతుల్లోకి తీసుకుని బ్రతుకుతుంటే, ఇలాంటిది మాకే  ఎందుకు జరగాలి? పైగా ఆమెకు వైద్యం చేసింది కూడా ఒక నిపుణురాలు, స్పెషలిస్టే కదా! అయినా చూడు ఏం జరిగిందో! బొడ్డులో,  చీము పట్టడం వల్ల పాపకు జ్వరం వచ్చి, సెప్టిసీమియా సోకింది... కొన్ని గంటల్లోనే పాప చనిపోయింది. మా ఇంటి మహాలక్ష్మి, మా చిన్న తల్లి వెళ్ళిపోయింది. మా ముద్దుల రాకుమారి చనిపోయింది!’  ’ పంకజం ఆపుకోలేని దుఃఖంతో ఏడవడం మొదలుపెట్టింది.

తన యజమానురాలి బాధను చూసి మల్లికకు కూడా ఏడుపొచ్చింది! ఏడుస్తూనే, మల్లిక ఒక్క క్షణం ఆగి, తన మనసులోని మాటలను బయటపెట్టింది.

‘ఇదేంటి అమ్మా? ఈ చీము పట్టడం ఏమిటి?ఈ "సెప్టిక్" అంటే ఏమిటి? దీనికి కొద్దిగా ఆవు పేడతో గానీ, సిగరెట్ బూడిదతో గానీ చికిత్స చేయలేకపోయారా? అంత  పెద్ద నగరంలో కొంచెం సిగరెట్ బూడిద కూడా దొరకలేదా? ఎంత జాలిగా ఉందో!’ అని ఆమె ఆవేదనతో అంది.

తన మాటల లోని తీవ్రమైన పర్యవసానాల గురించి ఏమాత్రం తెలియని మల్లిక, అమాయకంగా ఏడుస్తూనే ఉంది.

1979

శివశంకరి  తమిళ కథ కు తెలుగు అనువాదం వంశీకృష్ణ

No comments:

Post a Comment