*అకారణ కలహం*
-- *పోస్ట్ కార్డ్ కథ*
గుమ్మంలో పడున్న పేపర్ తీసి గబగబా లోపలి పేజీల్లో వెతికాడు సుధాకర్. పేపర్ మూసేసి విసురుగా లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. కాస్త టీ నా మొహాన పోస్తే నేను స్నానానికి వెళ్తాను అన్నాడు విసుక్కుంటూ. ఎదురుగా ఉన్న టీపాయ్ మీద టీ పెట్టి మౌనంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది సునంద.
టీ తాగి స్నాననికి వెళ్ళి వచ్చిన తరవాత విసుక్కుంటూనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పెసరట్లు, అల్లం పచ్చడి వేసి ప్లేట్ ఎదురుగా పెట్టింది. పెసరట్టుమీద తట్టెడు అల్లం ముక్కలు వేసి చచ్చావుగా ఇంకా ఈ అల్లం పచ్చడి దేనికి ? ఎన్నిసార్లు చెప్పాలి? పెసరట్టుతో పాటు ఉప్మా చెయ్యి ఈ అల్లం పచ్చడి వద్దు అని ? గట్టిగా కసురుకున్నాడు సుధాకర్.
రవ్వ లేదు. అయిపోయింది
అయిపోయేంతవరకూ ఏం చేస్తున్నట్టు ? ఎన్నిసార్లు చెప్పాలి సరుకులు ఉన్నాయో లేదో ముందు చూసుకుని తెచ్చిపెట్టుకోవాలి కదా ? పెద్దపెద్దగా అరుస్తూ తిడుతున్నా పట్టించుకోకుండా వాషింగ్ మషీన్ లో బట్టలు తీసి ఆరెయ్యడానికి డాబా పైకి వెళ్ళబోయేసరికి గుమ్మంలో అమ్మా నాన్న!
రండి నాన్నా లోపలికి, అక్కడే ఉండిపోయారే అని నవ్వుతూ లోపలికి పిలిచి సోఫాలో కూర్చోమంది.
అప్పటివరకూ అక్కడే ఉండి చూస్తున్న పెద్దాయన నిశ్చేష్టుడై లోపలికి రావడానికి కూడా భయపడ్డాడు ఒక్క క్షణం.
అత్తమామల్ని కూడా చూసి పట్టించుకోకుండా నా వాలెట్ ఎక్కడ చచ్చింది..? ముందు అదెక్కడుందో చూసి అఘోరించు. టైం అవుతోది. నేను ఆఫీస్ కి వెళ్ళాక ఎలాగూ పనీ పాటా ఉండదుగా.. తీరిగ్గా కూర్చుని సోది చెప్పుకుందువు గాని అన్నా ఏం పట్టించుకోకుండా డెస్క్ లో ఉన్న వాలెట్ తీసి ఇచ్చింది వాళ్ళ అమ్మానాన్నలకి మంచి నీళ్ళిచ్చి సోఫాలో కూర్చోబెట్టింది సునంద.
ఏం పెంపకమో.. ఇలాగేనా పెంచేది అమ్మాయిల్ని
అని సీరియస్ గా అత్తా మామలవైపు తిరిగి అనేసరికి మీరిక ఆఫీసుకి వెళ్ళండి, అరిచింది చాలు గాని అని తనూ అంతే గట్టిగా అనేసింది సునంద.
సుధాకర్ వెళ్ళిపోయాడు.
అంతవరకూ ఏం జరగలేదు అన్నంత కేజువల్ గా ఫేసు పెట్టి "ఏంటీ చెప్పా పెట్టకుండా ఇలా సడన్ సర్ప్రైజ్ ?" అని నవ్వుతూ పలకరించిన కూతుర్ని విస్తుపోయి చూస్తున్నారు ఆ దంపతులిద్దరూ!
వాళ్ళు అనుకుంటున్నది గ్రహించి.. సునంద నవ్వుకుంటూ వెళ్ళి న్యూస్ పేపర్ తెచ్చి లోపలిపేజీలో గ్రహబలం కాలమ్ తీసి చూపించింది "ధనూరాశి వాళ్లకి అకారణ కలహం" అని!
ఇది మీ అల్లుడు గారి జాతకాల పిచ్చి డాడీ.. *అకారణ కలహం* ఆఫీసులో ఎక్కడ జరిగిపోతుందో అని నాతో దెబ్బలాడేసి అలా వెళ్లిపోయారన్న మాట. మీరేం కంగారు పడకండి అంది నవ్వుతూ!
"ఓర్నాయనోయ్... ఇలాంటాళ్ళు కూడా ఉంటారా" అని విస్తుపోవడం మళ్ళీ వాళ్ళవంతే అయ్యింది పాపం.
సాయంత్రం సినిమా టిక్కెట్లు పట్టుకుని పళ్ళిలికించుంటూ వచ్చిన అల్లుణ్ణి చూసే వరకూ నమ్మకం కుదరలేదు అత్తా మామలకి. సినిమా తరవాత హోటల్ లో భోజనం చేస్తూ అందరూ ఒకటే నవ్వులు, "మా గొప్ప అల్లుడువి దొరికావయ్యా" అని!
--శ్రీనూ వాసా
15-APR-2022
No comments:
Post a Comment