Friday, April 24, 2026

కథ : *ఇది కదా ప్రేమంటే!*

 కథ : *ఇది కదా ప్రేమంటే!*
(16.07.2021 సహరి వారపత్రికలో ప్రచురితమైన కథ)
రచన : *సూర్య గండ్రకోట*
                                           …..
దాదాపు ముప్ఫైఏళ్ళ తర్వాత, రవీంద్రభారతిలో ఓ సాహిత్య సభలో కృష్ణని చూసింది హంస. 

కాసేపు పరీక్షగా చూశాక అతన్ని కాలేజీలో తన క్లాస్‌మేట్‌గా అని గుర్తుపట్టి, తన సీట్లోంచి లేచి వచ్చి, అతని పక్కన ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంటూ “హల్లో! మీరు కృష్ణ కదూ!” అంటూ పలకరించింది. అతడు ఆమెను గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. 

‘హంస... కాలేజీలో చదువుకునే రోజుల్లో తను గాఢంగా ప్రేమించిన పడతి. పదహారు, పదిహేడేళ్ళ పరువంలో ఉన్న ఆమె అద్భుత సౌందర్యానికి తను దాసోహమయ్యాడు. ఆ రోజుల్లో ఆమెకోసం తన మనసు ఎంతగానో పరితపించిపోయేది. ఎన్నోసార్లు ఆమెకు తన ప్రేమను తెలియజెయ్యాలని తహతహలాడాడు. కానీ ధైర్యం సరిపోలేదు. చూస్తుండగానే మూడేళ్ళూ గడిచిపోయాయి. 

ఫైనలీయర్లో ఉండగా ఆమె తన దగ్గరికి వచ్చి, తన పెళ్ళి శుభలేఖ తన చేతిలో పెట్టినప్పుడు తన గుండె బ్రద్దలైంది. తన పిరికితనానికి తనని తానే నిందించుకున్నాడు. కానీ అప్పటికే అవకాశం చేజారిపోయింది. ఆ బాధలో తన ఫైనలీయర్ పరీక్ష కూడా పోయింది. తర్వాత సప్లిమెంటరీ రాసి ఏదో డిగ్రీ పూర్తయిందనిపించాడు. అంత దెబ్బ తగిలాక కోలుకోవటం చాలా కష్టమైంది. 

ఆ తర్వాత తన జీవిత పయనంలో రాజీతో పెళ్ళితో రాజీ పడిపోయాడు. కాలక్రమంలో ఇద్దరు కొడుకులు పుట్టుకురావటం వాళ్ళ పెంపకం, చదువులూ, ఉద్యోగాలూ, పెళ్ళిళ్ళూ ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు ఏనాడూ హంస గుర్తుకు రాలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇలా కనిపిస్తుందని ఎన్నడూ అనుకోలేదు కూడా. అప్పటికీ ఇప్పటికీ వయస్సులో తేడా తప్ప ఆమె అందంలో ఏమీ మార్పు లేదు’ అనుకున్నాడు ఆమెను చూసి.   

“ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి హంసగారూ! మీలో ఏమాత్రం మార్పు లేదు సుమా!” అన్నాడు నవ్వుతూ.

“మీరైనా కొంచెం తటపటాయించారేమో గానీ, నేను మిమ్మల్ని చూడగానే గుర్తు పట్టాను. అఫ్‌కోర్స్ మీలో చాలా మార్పు వచ్చింది. అయినా నేను మరచిపోలేదు చూశారా? నేనే వచ్చి పలకరించానుగా” అందామె నవ్వుతూ. అదే నవ్వు. ఆ నవ్వు చూస్తుంటే అతని మనసు తీయగా మూలిగింది. 

అతను మెల్లిగా లేస్తూ, “పదండి అలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ గొడవలో మనం ఏం మాట్లాడినా వినబడదు” అన్నాడు. ఆమె అతన్ననుసరించింది. 

బయటికొచ్చాక లాన్‌లో నడుస్తూ “చెప్పండి. ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? మీవారేం చేస్తుంటారు?” అడిగాడతడు.

ఆమె కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి, అంతలోనే తేరుకుని, “మావారు ఒక ఏక్సిడెంట్లో చనిపోయి అయిదేళ్ళయింది” అంది. ఆమె ముఖంలో బాధావీచికలు అతన్ని కలవరపెట్టాయి.

“ఓ... సారీ. మిమ్మల్ని బాధ పెట్టాను” అన్నాడు నొచ్చుకుంటూ.

“అహ... అదేం లేదులెండి. అదొక దురదృష్ట ఘటన. అంతే.”

“మరి పిల్లలు...?”

“ఒక్కతే అమ్మాయి. పెళ్ళయి భర్తతో కలిసి వెళ్ళి, అమెరికాలో సెటిలైంది. ఎప్పుడో నాలుగైదేళ్ళకు ఒకసారి వస్తుంటుంది. వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు వచ్చింది. మళ్ళీ ఈ మధ్య ఒకసారి వచ్చి వెళ్ళింది. అంతే” 

“ఓ.. ఇప్పుడిక్కడ ఒక్కరే ఉంటున్నారన్నమాట.”

“అవును. నా సంగతి సరే. మరి మీ గురించి చెప్పలేదు” అందామె. 

“మీకూ నాకూ పెద్ద తేడా ఏమీ లేదులెండి. పోయినేడాది మా ఆవిడ పోయింది. పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. ఓ ప్రైవేటు కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా జీవనం సాగిపోతోంది.” అన్నాడు.

“అంటే దాదాపుగా ఇద్దరమూ ఒకే బోటులో, ఒకే బాటలో ప్రయాణిస్తున్నామన్నమాట. డబ్బుకేమీ కొదవలేకుండా ఆయన పుష్కలంగా సంపాదించిపెట్టి వెళ్ళిపోయారు. కాలక్షేపానికి ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాను. సాహిత్యం మీద అభిరుచితో ఇలా సభలకూ, సమావేశాలకూ హాజరవుతూవుంటాను.” 

“చూశారా విధి ఎంత విచిత్రమైనదో. ఎప్పుడో కాలేజీ రోజుల్లో కలిపింది. మళ్ళీ ఇప్పుడు, ఇక్కడ, ఇలా. విచిత్రం కదూ. ఇంతకూ మీరుండేదెక్కడ?”

“మియాపూర్లో. మరి మీరు..?”

“నేను ఉప్పల్‌లో ఉంటాను.”

“ఓ. మీరు తూర్పు, నేను పడమర అన్నమాట. అలా అంటుంటే మన కాలేజీ రోజుల విన్న ‘తూర్పూ పడమర ఎదురెదురూ, నింగీ నేలా ఎదురెదురూ’అన్న పాట గుర్తుకొచ్చింది” అంది గలగలా నవ్వుతూ. 

అతడు కూడా నవ్వేసి, “అవి కలవని దిక్కులేమో గానీ, మనం ఎప్పుడనుకుంటే అప్పుడు కలవొచ్చు. కాదంటారా?” అన్నాడు.

ఆమె జవాబివ్వకుండా చిన్నగా నవ్వేసింది.

ఆ తర్వాత కాసేపు తమ కాలేజీ కబుర్లు చెప్పుకున్నారు. అప్పటి తమ స్నేహితుల గురించీ, క్లాసులో జరిగిన ఫన్నీ సంఘటనల గురించి ముచ్చటించుకున్నారు. 

అలా మాటల్లోనే దాదాపు గంటన్నర గడిచిపోయింది. లోపల సభ అయిపోయి, జనం బయటికి రావటం కనిపించింది. అది చూసిన ఆమె అతనితో “చూశారా... మాటల్లో పడి టైమే మరచిపోయాం. మిమ్మల్నిలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకేనండీ. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం” అంటూ లేచింది. 

“ఎట్లా వచ్చారు. ఏదైనా వెహికిల్ ఉందా?”

“ఊఁ... ఉంది. చాలా కాస్ట్లీ వెహికిల్. అదే మెట్రో ట్రైన్. ఇంటికి దగ్గర్లోనే స్టేషన్. ఎక్కడికెళ్ళాలన్నా హాయిగా ట్రైన్ ఎక్కేస్తా” ముత్యాలు రాలుతున్నట్లుగా నవ్వుతూ అనేసి “మరి మీరు...?” అనడిగింది.

“డిటో... నాకూ అదే అలవాటు. ఉప్పల్ స్టేషన్లో దిగి, ఆటోలో ఇంటికెళ్ళిపోతా. సిటీలో స్వంత వెహికిల్ నడపటం పెద్ద నరకయాతన” అన్నాడు.

“అవును నిజం. ఓకేనండీ. మళ్ళీ కలుద్దాం” అంటూ ఆమె లేచింది.

“మెట్రో స్టేషన్‌కేగా పదండి. నాదీ అదే దోవగదా!” అన్నాడు ఆమె వెనకనే లేస్తూ.

ఇద్దరూ స్టేషన్‌కి చేరుకున్నాక, ఎదురెదురు ప్లాట్‌ఫాంలు కాబట్టి లిఫ్ట్ దగ్గర విడిపోయారు. వెళ్తూ వెళ్తూ ఒకరి ఫోన్ నంబర్ ఒకరు తీసుకున్నారు.
*** 

ఆ తర్వాత కొన్నాళ్ళపాటు అడపాదడపా ఇద్దరూ ఫోన్లో సంభాషించుకున్నారు. ఎక్కువగా ఇద్దరూ సాహిత్యం మీద చర్చ సాగించేవాళ్ళు. అలాగే అప్పుడు మార్కెట్లో విడుదలయ్యే పత్రికల్లో వచ్చే కథలు, నవలల మీద కూడా వారి చర్చ కొనసాగుతుండేది. ఆమెనుంచి ఫోన్ కాల్ వస్తే చాలు అతడు పరవశించిపోయేవాడు. ఎంత ముఖ్యమైన పనులున్నా సరే, అన్నీ పక్కనబెట్టి, ఆమెతో ముచ్చట్లలో మునిగిపోయేవాడు. యాభై ఏళ్ళు దాటిన అతడు ఆమెతో ఫోన్ మాట్లాడేటప్పుడు మళ్ళీ తన ఇరవైల్లోకి జారుకునేవాడు. 

మెల్లిమెల్లిగా అతని మనసు అతని స్వాధీనం తప్పిపోవటం మొదలైంది. ‘ప్రస్తుతం తామిద్దరూ ఎవరూ తోడులేని ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి సదభిప్రాయమూ, గౌరవమూ ఉన్నాయి. ఆమె మీద తనకు ఎనలేని అనురాగం ఉంది. యుక్తవయసులో పిరికితనం మూలంగా ఆమెను తను దూరం చేసుకున్నాడు. జీవిత చరమాంకంలోనైనా ఆమెతో కలిసి జీవించగలిగితే తన జీవితం సార్థకమైనట్లే. అప్పుడు తను చెయ్యలేని సాహసాన్ని ఇప్పుడు చేస్తే... ఏది ఏమైనా ఇప్పటికైనా తన హృదయాన్ని ఆమె ముందు పరిచి, ఆమెను తన జీవిత సహచరిగా చేసుకోవాలి’ అన్న ఆలోచనలతో అతని అంతరంగంలో ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు.
***

ఓసారి అతడు ఏదో పనిమీద బి.హెచ్‌.ఇ.ఎల్.లో పనిచేసే తన స్నేహితుడ్ని కలవటానికి బయల్దేరాడు. మెట్రో ఎక్కాక, అతడామెకు ఫోన్ చేసి ఆ సంగతి చెప్పటంతో, “ఎట్లాగూ మీరు మియాపూర్ స్టేషన్లోనే దిగాలి. ఆ పక్కనే మా ఇల్లు. ఒకసారి వచ్చి మా ఇంటిని పావనం చెయ్యొచ్చుకదా!” అందామె. 

అతడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తన కోరిక తెలియజెయ్యటానికి ఇంతకన్నా గొప్ప అవకాశం రాదనుకున్నాడు.

గేటు దగ్గరే నిలబడి సాదరంగా అతన్ని ఇంట్లోకి ఆహ్వానించిందామె. ఆమె వెనుకే హాల్లోకి ప్రవేశించిన అతనికి, ఎదురుగా నిలువెత్తు ఫోటో ఒకటి దర్శనమిచ్చింది. అడగకుండానే తెలిసిపోయింది ‘అది ఆమె భర్త ఫోటో’ అని. 

ఆమె కిచెన్లోకి వెళ్ళి వేడి వేడి కాఫీ తీసుకొచ్చింది. ఒక సిప్ చేశాక “అమృతం అనేది ఎక్కడో దేవతల దగ్గర ఉందంటారు గానీ, అది ఇక్కడే మీ చేతిలోనే కాఫీ రూపంలో ఉందండీ” అన్నాడతడు నవ్వుతూ.

“మరీ మునగచెట్టు ఎక్కించెయ్యకండి. ఏదో నాకు చేతనైనంతలో చేశాను” అందామె. 

“లేదు. నేను నిజమే చెబుతున్నాను. కాఫీ సూపర్‌గా ఉంది” అన్నాడతడు నిజాయితీగా. 

“ఆమె థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్” అంది. ఆ తర్వాత కొద్దిసేపయ్యాక “రండి మా ఇల్లు చూద్దురుగాని” అంటూ లేచిందామె. 

అతడామె వెంట నడిచాడు. “మాది త్రిబుల్ బెడ్ రూం ఇండిపెండెంట్ హౌస్. పెళ్ళైన కొత్తలో మావారు ఎంతో ఇష్టంగా కట్టించిన ఇల్లిది. అందుకే ఆయన లేకున్నా, నేనీ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా. ఈ ఇంటిని వదిలిపెట్టలేను. ఇంకో చిన్న డబుల్ బెడ్రూం అపార్టుమెంట్ కూడా ఉంది కానీ, ఈ ఇల్లంటే ఆయనకు ప్రాణమని నేను ఇక్కడే ఉంటున్నాను. ఇంటిని నీట్‌గా ఉంచటం మావారి ప్రత్యేకత. అన్నీ ఒక పద్ధతిలో ఉండాలి. ఇల్లంతా చూస్తే మీకే అర్థమౌతుంది” అంటూ ఇంట్లోని ఒక్కొక్క గదీ చూపించటం మొదలుపెట్టింది. 

ఆ గదులను చూస్తున్న అతని కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఎటు చూసినా హంస తన భర్తతో తీయించుకున్న ఫోటోలు కనిపించాయి. ఆమె ఆ ఇల్లంతా తిప్పి, చూపిస్తున్నంతసేపూ ఆమె తన భర్త గురించే మాట్లాడింది. చివరిగా “భౌతికంగా ఆయన ఇప్పుడు లేకపోవచ్చు. కానీ నేనెప్పుడూ ఒంటరితనాన్ని ఫీల్ కాలేదు. ఎందుకంటే అనుక్షణం ఆయన నాపక్కనే ఉన్నట్లుంటుంది” అందామె.

ఆ మాటలు విన్న అతనికి చర్నాకోలతో కొట్టినట్లయింది. ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన భర్తను అనుక్షణం మనసులో నిలుపుకుని బ్రతుకుతున్న ఆమెకూ, భార్య గతించి ఒక్క ఏడాదైనా కాకముందే మరో స్త్రీ సాంగత్యం కోసం వెంపర్లాడే తనకూ ఉన్న వ్యత్యాసాన్ని తలచుకుంటే అతనికి సిగ్గు అనిపించింది. 

తనపై అమితమైన ప్రేమాభిమానాలను కురిపించిన తన భార్యతో తనకున్న అనుబంధం గుర్తుకురాగా, అతనికళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడు ఆమె నుంచి వీడ్కోలు తీసుకుని అక్కడ్నుంచి బయటపడ్డాడు.
***సమాప్తం***

No comments:

Post a Comment