Friday, April 17, 2026

 *అహంకారం*
               ➖➖➖

*అహంకారం తొలగితేనే జ్ఞానం వెలుగుతుంది.```

*మనిషి జీవితంలో అహంకారం ఒక నిశ్శబ్ద శత్రువు. అది మనసులో పెరిగితే మనం ఎదగడం కాదు, క్రమంగా కూలిపోవడం ప్రారంభమవుతుంది.

*“నేను చేశాను, నేనే గొప్ప” అనే భావన ఎప్పుడైతే మనలో పుట్టుతుందో, అక్కడే ఆధ్యాత్మిక ఎదుగుదల ఆగిపోతుంది. 
ఈ సత్యాన్ని తెలియజేయడానికి ఒక గాఢమైన సంఘటనను గుర్తుచేసుకోవచ్చు..

*మహాభారతం యుద్ధ భూమి అయిన కుఱుక్షేత్రంలో అర్జునుడు మరియు కర్ణుడు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. అర్జునుని రథసారథిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు.

*యుద్ధంలో ఒక విచిత్రం జరిగింది. కర్ణుడు బాణం వేస్తే అర్జునుని రథం వెనక్కి వెళ్తుంది. కానీ అర్జునుడు బాణం వేస్తే కర్ణుని రథం ఇంకా ఎక్కువ దూరం వెనక్కి కదులుతుంది. ఇది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
అతని మనసులో సందేహం మొదలైంది:
“నేను తక్కువ శక్తివంతుడినా? లేక కర్ణుడు గొప్పవాడా?”

*ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం అద్భుతం..
“కర్ణుడు ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు. కానీ నీతో పాటు హనుమంతుడు ఉన్నాడు, నేనూ ఉన్నాను. అయినా కర్ణుడు చూపుతున్న శక్తి అసాధారణం. అందుకే అతను గొప్ప వీరుడు.”
ఈ మాట అర్జునుని అహంకారాన్ని కొంత తగ్గించింది.

*కానీ మనసు పూర్తిగా శుద్ధి కావడానికి మరో సంఘటన జరిగింది..
ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుని ఒక బ్రాహ్మణుని దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో సాత్వికుడు, అహింసా వ్రతధారి. కానీ అతని నడుములో ఒక పదునైన కత్తి ఉండేది.
*అర్జునుడు ఆశ్చర్యపడి అడిగాడు:
“మీరు హింస చేయరని చెబుతారు, మరి ఈ కత్తి ఎందుకు?”
*బ్రాహ్మణుడు చెప్పాడు:“నాకు నలుగురు శత్రువులు ఉన్నారు. వారు కనిపిస్తే వారిని శిక్షించడానికే ఈ కత్తి.”
*అర్జునుడు ఆశ్చర్యంతో ఆ నలుగురి పేర్లు అడిగాడు..

*బ్రాహ్మణుడు చెప్పసాగాడు..
*1.మొదటివాడు — నారదుడు. ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ నా దేవునికి విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు.

*2.రెండవది — ద్రౌపది. సమయమూ కాలమూ చూడకుండా భగవంతుని పిలిచి ఆయన నిద్రను భంగం చేసింది.

*3.మూడవది — ప్రహ్లాదుడు. భగవంతుడిని రక్షణ కోసం ఇబ్బందుల్లోకి నెట్టాడు.
ఇవి విన్న అర్జునుడు చివరి పేరు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు.

*బ్రాహ్మణుడు అన్నాడు..
*4.“నాలుగవ శత్రువు… అర్జునుడు.”

*అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
“అతను ఏం చేశాడు?” అని అడిగితే, సమాధానం వచ్చింది:
*“తన దేవుడినే రథసారథిగా పెట్టుకొని యుద్ధంలో నడిపించాడు.”

*ఆ క్షణంలో అర్జునుని గర్వం పూర్తిగా కూలిపోయింది. అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది..

*“నేను” అన్న భావన ఉన్నంతవరకు భక్తి పరిపూర్ణం కాదు. మనిషి ఎంత గొప్పవాడైనా, భగవంతుడి ముందు అతను ఒక చిన్న బిందువే. భక్తి అంటే  చూపించడం కాదు, అర్పణ చేయడం. నిజమైన భక్తి అంటే “నేను చేస్తున్నాను” అనే భావనను వదిలేయడం. భగవంతుడు ప్రేమను చూస్తాడు, అహంకారాన్ని కాదు. 
అర్పణలో జీవితం కలిస్తేనే ఆత్మకు శాంతి కలుగుతుంది.
అహంకారం తగ్గిన చోటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు
    
    🌷🙏🌷```

No comments:

Post a Comment