Sunday, April 26, 2026

మూడు వరాలు

 మూడు వరాలు


పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు . అతని భార్య కురూపి . తన పేదరికం కన్నా భార్య కురూపిత్వమే అతన్ని అమితంగా బాధించేది . ఒక రోజు అతను నదికి వెళ్లి స్నానం చేసి , సూర్యనమస్కారాలు చేసాడు . ఆ తర్వాత అక్కడే కూర్చుని సూర్యుని వైపు చూస్తూ నిన్నందరూ లోకబంధవుడనీ , భక్త సులభుడనీ అంటారు కదా ! నాకు మాత్రం వరాలనెందుకు ఇవ్వవు ? అంటూ ప్రార్ధించాడు. అది చూసి జాలిపడ్డ సూర్యుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడకు వచ్చాడు . అతనికి మూడు కొబ్బరికాలిస్తూ , " నీకు మూడు వరాలిస్తున్నాను . నీకు ఏది కావలిస్తే అది కోరుకుని కొబ్బరికాయ కొట్టు , వెంటనే అది ఫలిస్తుంది . అలాగని అన్నీ ఒక్కసారే కోరుకోనక్కరలేదు . నీకు కావలసినప్పుడు కోరుకోవచ్చు " అని చెప్పాడు .

అతను పరమానందంతో ఆ కొబ్బరి కాయలనందుకున్నాడో లేదో , ఆ బ్రాహ్మణుడు అదృశ్యమైపోయాడు.

అతనికి దూరంగా భార్య నీళ్ళబిందెతో కనిపించింది. ఎండపొడ ఆమె మీద పడుతోంది . భార్య మరీ అనాకారిగా కనిపించింది . దాంతో ఇక ఉండబట్టలేక , తన భార్య అతిలోక సుందరిగా మారిపోవాలంటూ , ఒక కొబ్బరి కాయ కొట్టాడు . అంతే! ఆమె అద్భుత సౌందర్యరాశిగా మారిపోయింది . సరిగా అదే సమయంలో రాజుగారు రధం మీద వెళుతూ , ఆమెను చూశాడు. ఇంతటి అందగత్తె తన అంతఃపురంలో ఉంటె బాగుండుననిపించింది, ఆమెను చెయ్యి పట్టుకుని రథంలో కూర్చుండబెట్టుకుని , అక్కడినుంచి వేగంగా వెళ్ళిపోసాగాడు . అది చూసిన బ్రాహ్మణుడు తన భార్య ఒక పెద్ద ఎలుగుబంటిలా మారిపోవాలనుకుంటూ , మరో కొబ్బరికాయ కొట్టాడు . రథంలో ఉన్న ఆమె ఎలుగుబంటిగా మారిపోవడంతో రాజుకు మతిపోయింది . కొంపదీసి ఈమె ఏమయినా మంత్రిగత్తె ఏమో అనుకుంటూ , రధం మీదినుంచి ఒక్క తోపు తోసేసి , వేగంగా వెళ్ళిపోయాడు .

ఆ భల్లూకం తన మీదికి రాసాగింది . దాంతో దిక్కుతోచని ఆ వ్యక్తి తన వద్ద ఉన్న చివరి కొబ్బరికాయ కూడా కొట్టి , ఆమె తిరిగి ఎప్పటిలా మారిపోవాలని కోరుకున్నాడు . వెంటనే అతని భార్య తిరిగి మామూలుగా కురూపిలా మారిపోయింది . భగవంతుడే కనికరించి , మూడు వరాలనిచ్చినా, ఆ మూడు వరాలు అతని పాలిట నిష్పలంగా మారిపోయాయి . అతను బీదవాడిగా , ఆమె అనాకారిలా మిగిలిపోయారు . ఎమైనా , సద్వినియోగం చేసుకునే నేర్పు మనలో లేనప్పుడు , ఎన్ని వరాలనిచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పడానికి ఇది ఉదాహరణ . అతను తెలివితేటలను , వివేకాన్ని ఉపయోగించి ఉంటె తన జీవితాన్ని మార్చి వేసే వరాలను కోరుకుని ఉండేవాడు . అందుకే మనిషికి విద్య , వివేకం , వివేచన ముఖ్యమని చెప్పారు పెద్దలు .

--డి.వి.ఆర్. భాస్కర్

No comments:

Post a Comment