*కామాక్షి అనే పదానికి అనేక రకములైన అర్థములు చెప్పబడి ఉన్నాయి. కామాక్షి అనేది లలితా సహస్రనామములలో ఒక నామముగా చెప్పబడింది.*
దానికి భాస్కరరాయల వారు రెండు అర్థములు చెప్పి ఇది కాంచీ పురాధిష్ఠాత్రికి గల ప్రత్యేక నామమని వివరించారు. ఈ విషయం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉంది.
అమ్మవారికి ఈ పేరు బ్రహ్మగారు ఉంచారట.
అలా ఉంచడానికి గల కారణం కూడా వివరించబడి ఉంది.
“సర్వజ్ఞా సాక్షిభావేన తత్తత్కామమాపూరయత్, ఇతి దృష్ట్వా చరితం దేవ్యా బ్రహ్మలోక పితామహః, కామాక్షీతి తదా నామ దదౌ కామేశ్వరీతిచ” సర్వజ్ఞురాలైన ఆ తల్లి అందరికీ సాక్షిగా ఉండి వారి సకల కామములను పూరిస్తుంది. ఈ విషయం చూచినబ్రహ్మగారు ఆమెకు కామాక్షి అనే నామాన్ని ఇచ్చాడు.
భాస్కర రాయలవారు రెండు అర్థాలు చెప్పారు అనుకున్నాం కదా! దానిలో మొదటి అర్థం అందమైన నేత్రములు కలది అన్నది. కనుల అందం చూడాలంటే కంచిలో కామాక్షి అమ్మవారి కనులనే చూడాలి. అందులో అమ్మవారికి చందనకాపు చేసినపుడు జరిగే దీపారాధనలలో అమ్మవారి కనులు తిప్పుతున్నట్లు కనుపాపలు కదులుతున్నట్లు కన్పిస్తుంది.
అట్టి మనోజ్ఞమైన సౌందర్యం చూచి ఆనందించవలసిందే – మాటలకు అందేది కాదు.
వారు చెప్పిన రెండవ అర్థం కామేశ్వరుడే కనులుగా కలది అన్నది. కామేశ్వరునే నిరంతరం దర్శించడం వలన కామేశ్వరాకృతిని పొందినదని భావం.
అయితే కామాక్షీ చరితాన్ని వివరించే కామాక్షీ విలాసంలో ఈ నామానికి ఏమి అర్థం చెప్పారో చూద్దాం.
మనం పూర్వం చెప్పుకొన్నట్లు కకార అకార మకార ప్రతిపాదితులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మూడు కన్నులతో సృజించింది కాబట్టి ఆమెకు కామాక్షి అన్న పేరు వచ్చింది. కాంచీపురంలో నివసిస్తూ తనను ఆశ్రయించిన వారి సర్వ కామములను పూరించి తుదిన మోక్షపదవిని ఇస్తుంది కాబట్టి కామాక్షి. కామమునకు పునర్జన్మను ప్రసాదించింది ఆమె కటాక్ష నిరీక్షణమే కదా! ఒక్క మదనుణ్ణే కాదు, తన కటాక్ష ప్రసారణం వలన ఆమె కోటి మదనులను సృష్టించింది.
అందువలన కామాక్షి అయింది. మూక మహాకవి అంటారు. శివుని కంటి వేడి చేత బూడిద అయిపోయిన శృంగార బీజరాశిని (మన్మథుడు) అంబిక యొక్క ప్రేమతో తడపబడి దృష్టిపాతమనే పొలము తిరిగి మొలకెత్తిందట.
శ్రీకామకోటి శివలోచన శేషితస్య, శృంగార బీజ విభవ స్వపునః ప్రవాహే!
ప్రేమాంభసార్ద్ర మచిరాత్ప్రచురేణశంకే కేదారమంబ తవకేవల దృష్టిపాతం!!(కటాక్ష -19)
ఆమె త్రిమూర్తులనే కాదు. వారి పత్నులను కూడా తన కటాక్ష ప్రసారం చేత జనియింపచేసింది.
మహాలక్ష్మీ తంత్రం ఈ విషయం విశదంగా వివరిస్తుంది. మహాగౌరిని తన తృతీయ నేత్రం నుండి తేజః పుంజం రూపిణిగా సృజించింది. తన కుడి కంటితో బ్రహ్మను, ఎడమ కంటితో విష్ణుమూర్తిని చూచి ‘గా’ నామధారిణి అయిన సరస్వతిని, ‘మా’ రూపధారిణి అయిన లక్ష్మిని జనింపజేసింది. అందువలన కూడా ఆమె కామాక్షి అయింది.
ఆమె కంటి చూపుతో ఆమె లక్ష్మీ సరస్వతులను మన్మథుని, భువనములను సృష్టించడమే కాదు, ఆమె కంటి చూపు సోకిన మానవుడు స్వయంగా విష్ణువు, బ్రహ్మ, మన్మథుడు అయిపోతాడంటారు మూకకవి.
“వాగీశ్వరీ సహచరీ నియమేన లక్ష్మీః భ్రూవల్లరీ వశకరీ భువనానిగేహామ్!
రూపం త్రిలోక నయనామృత మమృతేషాం కామాక్షి! యేషు తవ వీక్షణ పారతన్త్రీ!! (కటాక్ష – 27)
అమ్మా! నీ చూపెవరి యందు వివశమై పడుతుందో వారికి సరస్వతి సహచరిగా, లక్ష్మి కనుసైగను అనుసరించి సేవచేయునదిగా, భువనమే ఇల్లుగా, రూపము త్రిలోకనయనామృతముగా మారిపోతుంది.
No comments:
Post a Comment