Friday, June 26, 2026

 బుద్ధి... భావం!

కళ్లు చూసే దృశ్యాన్ని, చెవులు వినే మాటని, నాసిక ఆఘ్రాణించే వాసనని, చర్మం పొందే స్పర్శను, నాలుక పొందే రుచినీ మనసు విశ్లేషిస్తుంది. ఒక భావం పురుడుపోసుకుంటుంది. అది ఎలాంటిది అన్నది మనిషి మనసుకు, బుద్ధి ఇచ్చే తర్ఫీదు మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధి సవ్యంగా ఉంటే, మనిషి సవ్యంగా ఉన్నట్టే. మోక్షం కోసం ప్రయత్నించేవాళ్లు తపస్సుతో మనసును కట్టడి చేయాలని చూసేది అందుకే. సంకల్పబలానికి మూలం మనసులోని భావమే!

విగ్రహాన్ని దేనితో రూపొందించినా, దేవుడనే భావంతో శ్రద్ధాభక్తులతో సేవిస్తే భగవం తుడి అనుగ్రహం లభిస్తుంది. పరమాత్ముడు మనిషి భావంలోనే కొలువై ఉంటాడు. సిద్ధి పొందడానికి అదే హేతువు అవుతుంది. 'భావములోన బాహ్యమునందున గోవింద, గోవిందయని కొలువవో మనసా' అంటాడు అన్నమయ్య. భగవంతుణ్ని బాహ్యంగానే కాదు అంతరంగంతోనూ ఆరాధించాలి. అప్పుడే మనిషి తన్మయత్వ స్థితికి చేరుకుంటాడు. కొత్తగా వచ్చిన వ్యక్తి- ఈ ఊరు మంచిదా? చెడ్డదా? అని ఊళ్లోని వ్యక్తిని ప్రశ్నిస్తే 'మీరు మంచివారా? చెడ్డవారా? అన్నదాని మీద అది ఆధారపడి ఉంటుంద'ని జవాబిస్తాడు. ఇది మనందరికీ తెలిసిన కథ. మనిషిని బట్టే సమాజం. సమాజం అంటే మనుషుల సమూహమే కదా! ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో- 'రాజ్యంలో మంచివాళ్లెవరైనా ఉంటే తీసుకురా, వరమిస్తాను' అన్నాడు. దుర్యోధనుడు రోజంతా వెతికి ఒక్కరు కూడా కనిపించకపోవడంతో నిరాశతో తిరిగొచ్చి-ఒక్కరంటే ఒక్కరు కూడా మంచివాళ్లు కనిపించ లేదంటూ పెదవి విరుస్తాడు. కృష్ణుడు ధర్మరా జును పిలిచి 'రాజ్యంలో చెడ్డవాళ్లెవరైనా ఉంటే తీసుకురా, నీకు వరమిస్తాను' అన్నాడు. ధర్మరాజు రోజంతా వెతికి రాజ్యంలో ఒక్క చెడ్డవాడు కూడా లేడన్న సంతృప్తితో తిరిగొచ్చి-రాజ్యమంతా వెదికినా ఒక్క చెడ్డవాడూ కనిపించ లేదు' అన్నాడు. దుర్యోధన, ధర్మరాజుల మనోభావాల మధ్య ఉన్న వ్యత్యాసమది. అంటే 'బావా, 'యద్భావం తద్భవతి' అన్నట్టు మనిషి మంచివాడయితే లోకం మంచిదవుతుంది. చెడ్డవారికి అందరూ చెడ్డగానే కనిపిస్తారు. ఇది అక్షర సత్యం.
మనుషులు మోసపోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఎదుటి వ్యక్తి గురించి మనసు వేసే అంచనాలే కారణం. శ్రీరాముణ్ని మనసా, వాచా నమ్మాడు గనకనే ఆంజ నేయుడు రామభక్త హనుమాన్గా మన్ననలందుకున్నాడు. విభీషణుడు చూడగలిగిన రామయ్యలోని ధర్మమూర్తిని... లంకేశ్వరుడు, అతడి ఇతర సోదరులూ తమ బుద్ధి మాంద్యంతో చూడలేకపోయారు. నేలకూలారు. ఒక్కోసారి మన తప్పుడు అంచనా లను పెద్దల మాటలు సరిచేస్తాయి. గురువులు మనిషి బుద్ధిని సరైన మార్గంలో పెట్టి దిశానిర్దేశం చేస్తారు. ప్రార్థనలు, పుణ్యతీర్థాల్లో మునకలు, గురువుల పట్ల విశ్వాసం, వైద్యులపై నమ్మకం- వీటిలో మనిషి భావమెలా ఉంటే, అలాంటి ఫలితమే దక్కుతుం దని కరుణశ్రీ తెలుగుబాల శతకంలో విశదపరిచారు.

మనిషి మనుగడకు భావమే ఆలంబన. అది నిర్మలమైనదైతే, మనిషి స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఈ భువిలో మనగలుగుతాడు. ముక్తిని పొందగలుగుతాడు.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

No comments:

Post a Comment