లంకలోనే ఉన్న సీతకు ఎటువంటి రక్షణ కల్పించకుండా, లంకను దహనం చేసి హనుమంతుడు తిరిగి ఎలా రాగలడు?
హనుమ వెంటనే అలా బయలుదేరడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం:
1. లంకకు నిప్పు పెట్టే ఆలోచనే లేదు హనుమకు. ఆయన తోకకు నిప్పు పెట్టడం వలన అనుకోకుండా జరిగిన విషయం అది.
2. హనుమ తన తొందరపాటు పని వలన సీతమ్మకు ఎంత కష్టం వచ్చింది, సీతమ్మను కూడా ఈ మంటలు బాధ పెట్టి ఉంటాయా అని చాలా బాధపడ్డారు.
3. మళ్ళీ వెనక్కి వెళ్ళి సీతమ్మను చూసి ఆమె క్షేమంగా ఉండడం గమనించి సంతోషించారు.
4. సీతమ్మ " చాలా శ్రమ పడ్డావు, ఓ రోజు విశ్రాంతి తీసుకుని వెళ్ళవచ్చు కదా " అని కూడా అన్నారు హనుమతో.
5. హనుమ " నా భుజాల మీద కూర్చో తల్లీ, క్షణాలలో రాముని వద్దకు చేరుస్తాను " అంటే సీతమ్మ రకరకాల కారణాలు చెప్పి తనతో అలా రాను కాక రాను అని తెలియచేసారు.
6. ఇక ముఖ్యమైన అసలు విషయం - సీతమ్మ మొదటగా హనుమతో కొద్దిసేపు మాట్లాడినప్పుడే మూడుసార్లు గుర్తు చేసారు " ఇంక రెండు నెలలే సమయం ఉంది. ఈ లోపులో రాముడు వచ్చి రావణుడిని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళడానికి. రెండు నెలల సమయం అయి పోగానే నేను ప్రాణాలు వదిలేస్తాను. గుర్తు పెట్టుకో " అని.
సీతమ్మ అంత సూటిగా చెప్పిన తరువాత అక్కడ ఎలా ఉండగలరు హనుమ.
దీనిలో ఓ ధర్మసూక్ష్మం కూడా ఉంది. లంకాదహనం అయాక సీతమ్మకు ఏమయినా హాని జరగలేదు కదా అనుకుని హనుమ " నాగ్నిః అగ్నౌ ప్రవర్తతే " - అగ్నిని అగ్ని ఏమి చేయగలదు , నా అమాయకత్వం కాకపోతే అనుకుంటారు.
సీతమ్మ అగ్ని. సీతమ్మ తనను తాను కాపాడుకో గలరు. హనుమకు ఆ విషయం తెలుసు.
శుభమస్తు.
No comments:
Post a Comment