Monday, August 10, 2026

 నలదమయంతుల కథ

భాగం:12

నేను ఆయనను రాజ్యభ్రష్టునిగా చేస్తాను. అప్పుడతను దమయంతితో నివసించలేడు. ఇందు కనుగుణంగా నీవు కూడా జూదంలో పాచికల్లో ప్రవేశించి నాకు సహాయం చేయాలి', అనగా ద్వాపరుడు కలి మాటలను స్వీకరించాడు.

కలి ద్వాపరులిద్దరూ నలుని రాజధాని నగరానికి వచ్చివున్నారు. నలునిలో ఏదో ఒకదోషం కనిపెట్టాలనుకున్న వారిద్దరూ 12 సంవత్సరాల వరకూ ఏ దోషమూ నలమహారాజువద్ద చూడలేకపోయారు.* 

*ఒకరోజు నలరాజు సంధ్యా సమయంలో లఘుశంకకు వెళ్ళవలసివచ్చి, వెళ్ళి వచ్చాక కాళ్ళు కడుగకుండానే ఆచమనముచేసి, అలాగే సంధ్యావందన కార్యక్రమాలు నిర్వర్తించడానికి కూర్చుండిపోయాడు. 

ఈ అపవిత్రతను గమనించినవాడై కలి నలుని శరీరంలో ప్రవేశించాడు. అలా నలశరీరంలో ప్రవేశించినదే తడవుగా కలి రెండవ రూపాన్ని ధరించినవాడై పుష్కరుని వద్దకు వెళ్ళి చెప్పాడు.

"నీవు నలునితో ద్యూత మాడుము. నా సహాయంతో నీవు నలుని ఓడిస్తావు. ఆ విధంగా నిషధదేశ రాజ్యాన్ని హస్తగతం చేసుకో.” 

పుష్కరుడు కలిమాటలు విని నలుని వద్దకు వెళ్ళాడు. ద్వాపరుడు పాచికల రూపం ధరించి పుష్కరునితో వెళ్ళాడు. పుష్కరుడు బలవంతపెట్టగా నలుడు పాచికలాడుటకు అంగీకరించెను.

పుష్కరుడు నలునితో ద్యూతమాడడం ప్రారంభించాడు. కలి తన శరీరంలో ప్రవేశించి వున్నందువలన నలునికి అంతా దుష్టఫలితమే ఎదురుకాజొచ్చింది. నిత్యనైమిత్తిక కార్యక్రమాలకు విఘాతం ఏర్పడింది. పాలనాకార్యక్రమాలకూ విఘాతం ఏర్పడింది.

No comments:

Post a Comment