Saturday, August 8, 2026

 నల దమయంతుల కథ

దమయంతీ స్వయంవరం - వివాహం

భాగం:3

అంతే దమయంతి చెంత ప్రత్యక్షమయ్యాయి. దమయంతి ఆ హంసల్ని చూచీ చూడగానే ఎంతో ప్రసన్నురాలైంది. 

వాటిని పట్టుకోవడానికి పరిగెత్తుతూ వెళ్ళింది. దమయంతి ఏ హంసనైతే పట్టుకోడానికి వెళ్ళిందో, ఆ హంస “ఓ దమయంతీ! నిషధ దేశంలో నలుడనే రాజున్నాడు. 

ఆయన అశ్వినీ కుమారుడంతటి అందగాడు. మానవులలో అతనివంటి అందచందాలు గలవాడు మరొక్కడు లేడు. ఆయన మూర్తీభవించిన మన్మథుడు. 

నీవే కనక అంతటి గొప్ప వ్యక్తికి భార్యవైతే నీ జన్మ, నీ సౌందర్యం సార్థకములవుతాయి. దేవతలను, గంధర్వులను, మనుష్యులను, నాగజాతివారిని, రాక్షసులను మేమెందరినో తిరిగి తిరిగి చూచాము. కాని, నలునితో సమానుడైన అందగాడిని మాత్రం ఎక్కడా చూడలేదు.

నీవు స్త్రీలలో రత్నానివి; అతడు పురుషులలో భూషణము వంటివాడు. మీ ఇద్దరి 'జంట' అపూర్వమైనది.”

అప్పుడు దమయంతి "హంసా! ఇవేమాటలు నీవు నలునితో కూడా చెప్పాలి సుమా” అంది. ఆ హంస నిషధ దేశానికి తిరిగి వెళ్ళి దమయంతీ సందేశాన్ని నలునికి తెలిపింది.

హంసనోట నలమహారాజు కీర్తిప్రఖ్యాతులు విన్న దమయంతి ఆయనను గాఢంగా ప్రేమించసాగింది. 

ఇక రాత్రీ పగలూ ఆమెకు నలమహారాజు ధ్యాస వినా మరొకటి లేదు. నలునిపై రక్తి, ఆసక్తి కూడా పెరిగిపోయినవి. నలుని మననధ్యానాదులలో ఆమె శరీరం శుష్కించి పోతోంది. ఇప్పుడామె నలుని ప్రేమకు వివశురాలైంది.

No comments:

Post a Comment