దామోదర లీల అంటే ఏమిటి? దానికి ఎందుకంత ప్రఖ్యాతి?
దామం అంటే తాడు..చిన్నికృష్ణుడు నడుముకు పలుపు కట్టించుకొని నలకూబర మణిగ్రీవులకు శాపవిముక్తి ప్రసాదించడం ఒక లీల.
చిన్ని బాలుడు పెద్ద పెద్ద గంధర్వులకు నారదశాపం నుండి విడుదల కలిగించడం గొప్ప విషయంగా మనకు అనిపిస్తుంది. ఆ పరమాత్ముడికి వయసేమిటి ? పుట్టినపుడే తల్లిదండ్రులకు శంఖచక్రగదాధారియై దివ్యదర్శనం అనుగ్రహించాడు కారాగారంలోనే.
మట్టి తింటూ యశోదమ్మకు పదునాలుగు లోకాలూ తన నోట చూపించాడు. అపుడే మాయ కమ్మేస్తాడు. తాళ్ళు తడపలకు కట్టుబడినట్టు నటిస్తాడు. విప్పేయమని ఆగం చేస్తాడు.
ఇదీ దామోదర లీల అంటే..
కృష్ణయ్యను యశోద ఇంట్లో ఉండే పశువులను కట్టేసే పలుపుతో కట్టి , ఒక పక్క పడుంటాడు. పనులు చేసుకోవచ్చు. వీడితో వేగలేక ఛస్తున్నా. ఖర్మ! ఏలాంటి కొడుకు నా కడుపున పుట్టాడు? ఎప్పుడూ వీణ్ణి కనిపెట్టుకోనుండడంతోనే సరిపోతున్నది. వదిలేస్తే మట్టి పేడ పెంట తింటాడు. వీడి తిక్క కుదురుస్తా.. ఉండు ..అంటూ ఒక పెద్ద మెత్తటి పలుపు తీసుకొని ఈ రోలుకు జతచేసి కట్టేస్తే సరిపోతుంది అనుకొన్నది.
ఈ వైపు పిలగాడి నడుముకు కట్తే సరి!..అనుకొని ఆ తాడు నడుము చుట్టూ తెస్తూన్నది. ఈవిడకు ఎన్నిసార్లు హెచ్చరించినా తెలియడం లేదేమిటబ్బా ! అని నడుము పెంచలేదు గానీ తాడు ముడికి అందకుండా చేస్తున్నాడు…
ఆ తల్లి చాలా అలిసి పొయ్యింది.. విసుగొస్తున్నది . ఒక పక్క పొయ్యి మీద పాలు పొంగి పోతున్నాయి. ఆ లేగదూడ తల్లి కోసం ఆపకుండా రంకెలేస్తున్నది. ఈ తాడేమిటో అందడం లేదు. ఇంకోటి తెస్తా… అంటూ తన మీద తనకే కోపం వస్తూ లేవబోతూన్నది . కిష్టయ్య పోనీలే... ఈ సారికి వదిలేద్దాం అని తాడుకు దొరికేశాడు. అబ్బా. ఒక పనయింది.. అని కట్టేసి, ముంగురులు సర్దుకొంటూ పనిలో పడిపోయింది నందభామిని.
ఇంతలో ఫెళ్ళుమని భయంకర శబ్దం! ఇంట్లోనుంచి గబగబ వచ్చింది. ఎప్పటినుంచో ఉన్నాయి జంట మద్దిచెట్లు. అవి తటాల్న కూలి పడిపోయాయేమిటి? పెద్ద గాలీ లేదు , వానాలేదు. అయ్యో కిష్టయ్యనిక్కడ రోలుకు కట్టానే. రోలేది?? అని వెతుకుతున్నది. లేదు. ఎట్లా పోయింది?? అని చూడబోతే ఆ మద్దిచెట్ల మధ్యకు చేరింది.
అయ్యో పాపిష్టి దాన్ని ఎంత పని చేశాను. ఏడీ నా కిట్టు ఏడి?అని ఆందోళన పడి పోయింది.
ఊళ్ళో అందరూ అమ్మలక్కలూ మూగారు.
ఏంది?ఇంత పెద్దచెట్టు ఎట్లా కూలింది. గాలీ గీలీ ఏమీ రాలేదే —అని గబగబ వచ్చారు.
యశోదమ్మ నా కిట్టు ఎక్కడ ? ఎక్కడ? కనబడడే అని ఏడుస్తూ ఆ చెట్టు కొమ్మలు తోసేసుకుంటూ పోయింది. చిరునవ్వులు చిందిస్తూ కూర్చోనున్నాడు.
ఒక పక్క కోపం..ఒక పక్క ఆశ్చర్యం.
కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. ఒళ్ళంతా చెమట పట్టింది. కొడదామని చెయ్యెత్తింది. ఏడుపొచ్చేస్తున్నది.
సామాన్యుడివి కాదురా నువ్వు. నన్ను చంపడానికే పుట్టావు అంటూ ఎత్తుకొన్నది.
గోపెమ్మలందరూ ఏమమ్మా నీకు బిడ్డ కంటే పాడిపంట ఎక్కువా? ఒక్కగానొక్క బిడ్డను చూచుకోలేవా? ఇటువంటి దానివి ఎందుకు కన్నావు? పాపం చిన్న బిడ్డ.. ఎక్కడైనా కొమ్మలు గుచ్చుకొన్నాయో. చూడు. ఇంట్లో గుంజకు కట్టేసుకోగూడదా? .అసలు నీకు కట్టడానికి ఎట్లా చేతులొచ్చేయే— అంటూ కృష్ణుణ్ణి ఎత్తుకోడానికి చేతులు చాచుతున్నారు. యశోదమ్మకు వీళ్ళ వాళ్ల చేతులకు బిడ్డ నివ్వడం ఇష్టం లేదు.. ఈ చిన్ని కిష్టడు ఎత్తుకోమని వాళ్ళవైపు చేతులు చాచుతున్నాడు.
ఈ లోపల ఎక్కడికి పోయున్నాడో నందగోపయ్యవచ్చాడు. ఊళ్ళో ఎవరో చెప్పారు మీ పెరట్లో పెద్ద చెట్టు పడిపోయిందట్నే.. ఇక్కడే ఉన్నావే.. అది ఏ దూడల మీద పడిందో.. పో..తొందరగా అని తరిమారు అందరూ.
ఏమైందో. వెర్రిబాగులది. పోదాం అంటూ వచ్చాడు.
పెద్ద ఏడుపుతో వాకిటికి వచ్చింది పిచ్చితల్లి..
కృష్ణుడికి ఇంత జరిగిందా ఈ వేళ.
దిష్టి తీయవే ముందు..పద. అంటూ తొందర పెట్టాడా తండ్రి..
నాకా దిష్టి ..లోలోపల నవ్వుకున్నాడు పరమానందయ్య.
No comments:
Post a Comment