Saturday, August 8, 2026

 ఎవరు గురువు?

 ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వ్యాసమహర్షి పుట్టినరోజు. ఆయన మొదటి పేరు కృష్ణ ద్వైపాయనుడు. గాసటబీసటగా ఉన్న వేదరాశిని నాలుగు భాగాలుగా విభజించి, ఓ కొలిక్కి తెచ్చాడాయన. 18 పురాణాలను, భారత, భాగవతాలను రచించి జాతికి మహో పకారం చేశాడు. వ్యాసమంటే వివరించడం, విరివిగా రచనలు చేయడమనే అర్థంలో ఆయనకు వేదవ్యాసుడనే పేరు స్థిరపడింది. ఆధ్యాత్మిక శాస్త్రాలలో విద్వాంసుడై, ఆత్మ విద్యను అవగతం చేయగల భారతీయ పరమగురు పరంపరకు ప్రతినిధిగా ఆయన గుర్తింపు పొందాడు. అందుకు కృతజ్ఞతగా, వ్యాసమహర్షిని స్మరించేందుకు అనువుగా ఈ పౌర్ణమిని గురుపూర్ణిమగా, వ్యాస పున్నమిగా పెద్దలు తీర్మానించారు. వ్యాసుణ్ని నాలుగు ముఖాలు లేని బ్రహ్మగా, రెండే చేతులు ఉన్న శ్రీమహావిష్ణువుగా, మూడో కన్నులేని పరమశివుడిగా పేర్కొన్నారు. బాదరాయణ (వ్యాస) భగవానుడన్నారు. ఈరోజు ఎవరెక్కడ గురుపూజలు నిర్వహిం చినా అవన్నీ వ్యాసమునికే చెందుతాయని ప్రకటించారు.

ఎవరి గురు శబ్దానికి అజ్ఞానాంధకారాన్ని తొలగిం చేవాడన్న అర్థం అందరికీ తెలిసిందే. క్రమంలో గురి, రుజ... అనే రెండు పదాలు ముఖ్య భూమిక వహిస్తాయి. కటాక్షంతో మనకు ఆత్మవిద్య పట్ల గురి కుదు రుతుందో, ఎవరి సమక్షంలో మన సమస్త భయసందేహాలు మటుమాయమై మనసును అక్షయమైన ప్రశాంతత ఆవరిస్తుందో, ఎవరి మౌనం సైతం అంతులేని ప్రశ్నలకు సరైన జవాబులను ప్రసాదిస్తుందో, మనసుల్లో సత్యాన్ని ఆవిష్కరిస్తుందో- ఆయనే మన గురువు! దక్షిణామూర్తి, దత్తాత్రేయాదుల గురుస్తుతులు, గురుగీతాది బోధనలు, రమణ మహర్షి వంటి సద్గురు చరిత్రలు అధ్యయనం చేస్తున్నప్పుడు మనసు తేటపడి, అద్భుతమైన నిశ్శబ్దం పేరుకున్నప్పుడు గురు చైతన్యంతో మనకు పరిచయం ఏర్పడుతుంది. గురుభావం స్థిరపడుతుంది. ఆ తరహా అనుభూతి ఎవరి సన్నిధిలో లభిస్తుందో, దాంతో గుర్తింపు యావ అడుగంటి 'నేను' అనేది నశిస్తుందో- ఆయనే మన అసలైన గురువు! ఆ అనుభూతి పట్ల తొలిసారిగా గురి కుదిర్చిన గురువును స్మరించాల్సిన రోజు ఇది!

రుజ- అంటే రోగం. తినకూడనిదాన్ని తిన్నప్పుడు, అనరానిదాన్ని అన్నప్పుడు, వినరాని దాన్ని విన్నప్పుడు, చేయకూడనిది చేసినప్పుడు- మనశ్శరీరాలకు అస్వస్థత ఏర్పడుతుంది.

ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలు బాధిస్తాయి. మనసులో చెడు ఆలోచనలు పెరిగి- అటు మనసూ ఇటు దేహమూ రెండూ రుజాగ్రస్తమైన దుస్థితిలో మనల్ని కాపాడే పరమౌషధం- గురువాక్యం! అది మన పాలిట అమృత సంజీవని. ఆ బలవర్ధకమైన గురు కృప సిద్ధించాలంటే- ముందు మనకు గురువు పట్ల అచంచలమైన గురి కుదరాలి. అలా గురి కుదరగానే రుజను దూరం చేసే 'గురు' శబ్దం ఎంత ఉదాత్తమైనదో, ఎంతటి బల వత్తరమైనదో మనం గ్రహించేందుకే ఈ వ్యాసపూర్ణిమలూ, గురుపూజలూను!

గమ్యం, గమనం రెండూ స్పష్టంగా బోధించి, మనసులో జ్ఞాన కౌముదులను విర బూసేలా చేసే పూర్ణిమే- గురుపున్నమి. ఆ చల్లని వెన్నెలలకు కారకుడు, ప్రేరకుడైన మునిచంద్రుడు పుట్టినరోజే వ్యాసపూర్ణిమ!

ఎర్రాప్రగడ రామకృష్ణ

No comments:

Post a Comment