కథ
*ప్రేమ - ప్రేరణ*
– కర్లపాలెం హనుమంతరావు
విశాఖపట్నం బీచ్ రోడ్డులో సముద్రపు గాలి హోరుమంటోంది. 'సాగర్ హైట్స్' పదిహేనవ అంతస్తు వద్ద తాడుకి వేలాడుతూ, చేతిలోని వైపర్‌తో అద్దాలను చకచకా తుడుస్తున్నాడు పాతికేళ్ల కాశీనాథం. గాలి ఎంత విరుచుకుపడుతున్నా, గ్లాస్ క్లీనర్‌గా ఆకాశాన్ని తాకే ఆ ఎత్తులో భయం లేకుండా పని చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
అద్దం మెరుస్తున్న ప్రతిసారీ కాశీనాథం మనసు ఒక్కక్షణం వెనక్కి మళ్లుతుంది... సరిగ్గా ఒకటిన్నర సంవత్సరం క్రితంనాటి ఆ ఉదయరాగ దృశ్యం వైపు!
ఆరోజూ ఇలాంటి ఒక ఉదయమే. పదిహేనవ అంతస్తు అద్దం తుడుస్తుండగా, పైనుంచి గాజు ముక్కలాంటి సన్నటి కేకతో పాటు ఏదో వస్తువు జారి కింద పడింది.
అది ఒక గులాబీ షోల్డర్ బ్యాగ్. దాన్ని వడుపుగా పట్టుకుని, తలెత్తి చూసాడు. ఏ బాల్కనీ నుంచి జారిపడిందో అర్థం కాలేదు.
గదికి తిరిగి వచ్చాక ఆ బ్యాగ్‌ను తెరిచి చూసిన క్షణం కాశీనాథం గుండె ఆగిపోయినంత పనైంది. అందులో కొన్ని రూపాయల నోట్లు, కొంత స్త్రీలు వాడే మేకప్ సామాను, ఒక ఫోటో! ఒక డ్రాయింగ్ పేపర్ చుట్టగా చుట్టబడి ఉంది.
ఆ ఫోటోలో ఉన్న యువతికి సుమారు ఒక ఇరవై .. ఇరవై ఏళ్ళుంటాయేమో! భుజం నిండుగా హుందాగా శాలువా! ప్రకాశవంతమైన కళ్ళు, పెదవులపై చిరునవ్వు.
కాగితం విప్పి చూస్తే... తాడుకి వేలాడుతూ చేతిలో వైపర్ పట్టుకుని అద్దాలు తుడుస్తున్న ఒక యువకుడి పెన్సిల్ స్కెచ్!
ఆ రోజు నుంచి ఆ పింక్ బ్యాగ్, ఆ ఫోటో, ఆ బొమ్మ కాశీనాథం ప్రపంచంగా మారిపోయాయి. ప్రతీరోజూ పక్క ఎక్కే ముందు ఆ ఫోటో వైపే చూస్తుండిపోయేవాడు. తోటి కుర్రాళ్ళు ఆటపట్టిస్తూ, "ఏంట్రా కాశీ... ఎవరా పిల్ల.. నీ కలల రాణి ? కాబోయే భార్యామణా ?" అని అల్లరి చేసేవాళ్ళు.
కాశీనాథం ఉడుక్కుంటూ "అలా నవ్వకండిరా బాబూ! ...బాధేస్తుంది." అని మొత్తుకొనేవాడు.
కాలం గడిచి పోతోంది.
రవీంద్ర భారతిలో జరగబోయే 'నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్' గ్యాలరీ హాల్ అద్దాలు క్లీన్ చేసే కాంట్రాక్టు కాశీనాథం పనిచేసే 'సిల్వర్ గ్లాస్' కంపెనీకి దక్కింది. కాశీనాథం గ్యాలరీలో అద్దాలు క్లీన్ చేసే పనిలో మునిగి ఉన్నాడు.
ఎత్తైన ఏటవాలు అద్దాలను క్లీన్ చేయడానికి రోప్ లను సర్దుకుంటుండగా, కాశీనాథం చూపు గ్యాలరీ గోడలకు వేలాడుతున్న ఒక పెద్ద పెయింటింగ్‌పై పడింది.
నోరు వెళ్ళ బెట్టాడు కాశీనాథం.
ఆ పెయింటింగ్ ... అచ్చంగా తన దగ్గరున్న పింక్ బ్యాగ్‌లోని పెన్సిల్ స్కెచ్‌కి నకలే! కాకపోతే అది పెన్సిల్ స్కెచ్ ... ఇది రంగులు అద్దిన ఆయిల్ పెయింటింగ్!
దానివంకే దీక్షగా చూస్తోన్న కాశీనాథంతో "దానికే బాయ్ ..
నేషనల్ లెవెల్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందీ! సాయంత్రం పురస్కార ప్రదానం కూడా ఉంది" అన్నాడు పక్కనే పని చేస్తున్న సుందరం.
కాశీనాథం గుండె వేగంగా కొట్టుకోసాగింది.
ఆ బొమ్మ వేసింది తన దగ్గరున్న ఫోటోలోని అమ్మాయే! అంత అందమైన చిత్రాన్ని గీసిన అమ్మాయి ఇంకెంత అందంగా ఉండి ఉండాలి ?! ఆమెను ఎలాగైనా చూడాలి" అని నిశ్చయించుకున్నాడు కాశీనాథం.
సాయంత్రం అయింది. ఆడిటోరియం జన సముంద్రంగా ఉంది.
కాశీనాథం గ్యాలరీ చివరి వరుసలో, చీకటి నీడల్లో నిలబడి ఉత్కంఠగా చూస్తున్నాడు.
ఉపన్యాసాలు గట్రా ముగిసినాక పురస్కార ప్రదానం ప్రారంభమయింది.
"ఇప్పుడు... జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైన ఈ అద్భుత కళాఖండాన్ని గీసిన ఆర్టిస్ట్ మిస్ మేఖలను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం..." అన్న ప్రకటనతో ఆడిటోరియం ప్రేక్షకుల కరతాళధ్వనులతో మారుమోగింది.
ఆ ఫోటోలోని యువతి చిరునవ్వులు చిందిస్తూ వేదికపైకి నడుచుకుంటూ వచ్చింది.
ఆమెవంకే కన్నార్పకుండా చూస్తున్నాడు కాశీనాథం.
ముఖ్య అతిథి గౌరవనీయులు సాంస్కృతిక శాఖామాత్యులు నెమ్మదిగా మైకు ముందుకు వచ్చి ఆమెకు పుష్పగుచ్ఛం అందించారు. వారు శాలువా కప్పుతుంటే ఆమె వినయంగా శిరసు వంచి తన భుజం మీది శాలువా తప్పించింది.
హాలు మరోసారి కరతాళ ధ్వనులతో మారుమోగింది. కానీ, ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది.
కాశీనాథం గుండెలయితే పూర్తిగా జారిపోయాయి. చిత్రకారిణి మేఖలకు చేతులు రెండూ పూర్తిగా లేవు! కత్తెరతో కత్తిరించినట్లు మోచేతి పై వరకే ఉండడం కాశీనాథాన్ని పూర్తిగా కలవరపరిచింది.
పురస్కారం అందుకున్న ఆ యువతి మైక్ ముందుకు వచ్చి నిలబడింది. ఒక్క క్షణం ఆగి, ప్రశాంతమైన స్వరంతో మాట్లాడటం ప్రారంభించింది.
"ఈ జాతీయ పురస్కారం అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. కానీ, రెండు చేతులూ లేని నాలాంటి యువతికి ఈ చిత్రం వేయడానికి ప్రేరణ ఇచ్చింది మాత్రం ఒక శక్తిమంతుడు. ఆ మహానుభావుడికి ఈ వేదిక మీదుగా సవినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఒకటిన్నర సంవత్సరం క్రితం... ఒక రైలు ప్రమాదంలో నా రెండు చేతులూ కోల్పోయాను. జీవితంపై ఆశ పూర్తిగా వదిలేసుకున్న కాలం అది. ఇంట్లో కూర్చుని కూర్చుని బోరుకొట్టి మా ఫ్లాట్ బాల్కనీలో నిలబడి ఉండగా ఒక అద్భుతం కంటబడింది. మా పంతొమ్మిది అంతస్తుల కాంప్లెక్స్ కింద ఏ ఫ్లోరో తెలీదు కానీ .. దాని కారిడార్ కి తాళ్ళతో కట్టి వున్న చెక్క పలక మీద నిలబడి ఒక యువకుడు అద్దాలు తుడుస్తున్నాడు. అతనిని ఆ స్థితిలో చూసి నా గుండె ఆగినంత పనయింది. ఆ తడబాటులో పిట్టగోడ మీద పెట్టిన నా పింక్ బ్యాగ్ కిందకు జారిపడిపోయింది.
పర్సు పోయినందుకు బాధ కలగలేదు ఆ క్షణంలో. రెండు కాళ్లూ మోకాళ్ల వరకు లేకపోయినా... విధి కల్పించిన వైకల్యాన్ని ధిక్కరిస్తూ, కృత్రిమ కాళ్ల ఆధారంతోనే ఆ వేళ్ళాడే ప్లాంక్ మీద నిలబడి ఏకాగ్రతతో పని చేస్తున్న ఆ ధైర్యశాలిని చూస్తూ అలాగే నిలబడిపోయాను."
సభలో ఒక్కసారిగా ఊపిరి బిగబట్టినంత నిశ్శబ్దం!
ఆమె సంభాషణ కొనసాగించింది.
"విధి నా చేతులు తీసేస్తే, అతని కాళ్లు తీసేసింది. కానీ అతని కళ్లలోని ఆత్మవిశ్వాసం, ఆ శ్రమ నాలో జీవించాలనే ఆశను రేకెత్తించింది. ఆత్మస్థైర్యానికి మరో రూపంగా కనిపించే అతనినే మనసులో ఉంచుకుని, నా వీల్ చైర్ మీదే కూర్చుని మర్చిపోయిన పాతకళను తిరిగి సాధన చేశాను. ఆనాడు నేను ప్రత్యక్షంగా చూసిన ధీరోదాత్తతకు రంగులద్ది గీసిన చిత్రమే ఇది! నాలో ధైర్యాన్ని నింపిన ఆ అజ్ఞాత శ్రామిక వీరునికి ఈ పురస్కార గౌరవాన్ని అంకితం చేస్తున్నాను !"
ఆడిటోరియం అంతా ఆగకుండా హర్షధ్వానాలే ... హర్షధ్వానాలు !
తాను ఒక అపరిచిత యువతిలో అర్ధాంగిని చూస్తే ... ఆ సంస్కారి మాత్రం తనలో మూర్తీభవించిన ఆత్మ విశ్వాసాన్ని దర్శించింది!
చివరి వరుసలో నిలబడిన కాశీనాథం కళ్లనుండి అశ్రువులు ధారగా కారుతున్నాయి... పశ్చాత్తాపంతో!
30-07-2026
No comments:
Post a Comment