తొలి పర్వదినం
కాలపురుషుడైన శ్రీమహావిష్ణువు దక్షిణాయనం ప్రారంభమైన ఆషాడశుద్ధ ఏకాదశి నుంచి, కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటాడు. ఈ ప్రారంభ దినాన్ని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, దేవశయన ఏకాదశిగా పిలుస్తారు. తొలి ఏకాదశి ప్రాశ స్త్యాన్ని పద్మ పురాణం వివరిస్తుంది. ఈ రోజు తులసీదళాలతో ఏకాదశ వ్రతం చేసి ఉపవాస దీక్ష ఆచరించడం ఆనవాయితీ. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా భక్తితో ఉండటమే. సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి. ప్రతి ఏకాదశికీ ప్రత్యేకత ఉన్నా, తొలి ఏకాదశి మాత్రం విశేష ప్రాధాన్యం కలిగిన పర్వదినం. సర్వాంతర్యామి అయిన శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ నాలుగు నెలల్లో మహాశి వుడు లోకపాలన చేస్తాడని, హరి నిదురిస్తే హరుడు మేల్కొంటాడని భక్తులు నమ్ముతారు. ఈ కాలంలో ధ్యానం, మౌనం, ఉపవాస వ్రతాలు, పితృ కార్యాలు చేస్తారు. వర్షరుతువు కావడం వల్ల చాతుర్మాస దీక్షలో ఉన్న భక్తులు నాలుగు నెలలూ ఎక్కడికి ప్రయాణం చేయరు. సాత్విక ఆలోచనలతో గడుపుతూ సాత్విక ఆహారం స్వీకరిస్తారు. పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన కాలం కాబట్టి శ్రావణమాస వ్రతాలు, కార్తీక దీక్షలు ఆచరిస్తారు. శాస్త్రీయంగా చూస్తే జులై నెల నుంచి సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా ప్రయాణం చేస్తాడు. అది దేవతలకు రాత్రి కాలం అంటారు. ఉత్తరాయణం వారికి పగటి కాలం.
తొలి ఏకాదశి గురించి పౌరాణిక గాథలెన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. వరాహ పురాణం ప్రకారం, కృతయుగంలో మురాసురుడనే రాక్షసుణ్ని సంహరించే క్రమంలో అలసిన శ్రీమహావిష్ణువు ఒక గుహలో నిద్రించాడు. ఆయన శరీరం నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించి రాక్షసుణ్ని సంహరిం చింది. ఆమెనే విష్ణుప్రియ, ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆమె తన పేరిట ఒక తిథి ఏర్పడాలని, ఆరోజున దైవస్మరణలో గడిపిన వారికి సద్గతులు ప్రాప్తించాలని ప్రార్ధించగా, శ్రీహరి వరమిచ్చాడట. నాటి నుంచి ప్రజలు ఏకాదశి వ్రతం చేసుకుంటున్నారు. పేలాల పిండిని స్వీకరించి ఉపవాస దీక్షను విరమించడం ఆనవాయితీ. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే, అన్నానికి ఎలాంటి లోటు ఉండదని నానుడి. ఉపవాసం, జాగరణం రెండూ చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వస్తుందనీ, తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయనీ భక్తుల నమ్మకం. మనిషికి అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు ఉంటాయి. వాటన్నింటినీ ఏకోన్ముఖం చేస్తుంది అంతరేంద్రి యమైన మనసు. ఈ పదకొండింటిని కలిపి ఏకాదశిగా భావిస్తారు పెద్దలు.
మనిషిలోని దుర్మార్గపు ఆలోచనలకు, హింసాత్మక ప్రవృత్తికి ప్రతీకే మురాసురుడు. ఉపవాస దీక్షతో 'ఏకాదశి'ని మనలోనికి ఆహ్వానించడం ద్వారా చెడును జయించాలి. చాతుర్మాసం పాడి పంటలు శోభిల్లే తొలి కాలం కూడా. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ చేసుకునే మొదటి పండుగ ఈ ఏకాదశి.
శేషభట్టర్ మురళీ వేంకటాచార్య
No comments:
Post a Comment