Love: అది నిజమైన ప్రేమ కాదు..! జిడ్డు కృష్ణమూర్తి విభిన్న నిర్వచనం
Jiddu Krishnamurti Philosophy: ప్రేమ అంటే కేవలం అనుబంధం లేదా భావోద్వేగం కాదని.. అది స్వేచ్ఛ, భయరాహిత్యం, అవగాహనతో కూడిన జీవన స్థితి అని ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చెబుతారు. అసూయ, స్వాధీన భావం, భయం, ప్రతిఫల ఆశ ఉన్న చోట నిజమైన ప్రేమ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రేమను అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆయన ఆలోచనలు నేటికీ ఎంతో ప్రాసంగికంగా ఉన్నాయి.
Love: అది నిజమైన ప్రేమ కాదు..! జిడ్డు కృష్ణమూర్తి విభిన్న నిర్వచనం
Jiddu Krishnamurthy
Janardhan Veluru
Janardhan Veluru
Updated on: Jul 27, 2026 | 6:14 PM
ప్రేమ అంటే ఏమిటి? అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అనుబంధమా? లేక అంతకంటే గొప్ప జీవిత సత్యమా? ప్రేమను మన కవులు ఎన్నో రకాలుగా నిర్వచించారు. అయితే ప్రపంచ ప్రసిద్ధ భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి తన సిద్ధాంతంలో ప్రేమను పూర్తిగా భిన్నమైన కోణంలో నిర్వచించారు. ప్రేమ అనేది భావోద్వేగం, బంధం కానే కాదు.. అది స్వేచ్ఛ, అవగాహన, స్వార్థ రహితం కలిసిన ఒక జీవన స్థితి అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రేమ అంటే స్వాధీన భావన కాదు
జిడ్డు కృష్ణమూర్తి ప్రకారం..చాలామంది ప్రేమ పేరుతో స్వాధీన భావాన్ని పెంచుకుంటారు. అయితే “నువ్వు నాదానివి” అనే ఆలోచన, అధికారం చెలాయించడం, ఎదుటి వ్యక్తిని నియంత్రించేందుకు ప్రయత్నించడం ప్రేమ కాదని ఆయన చెప్పారు. ఆయన సిద్ధాంతం ప్రకారం.. నిజమైన ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది. ప్రేమించే వ్యక్తిని బంధించాలనే కోరిక ఉండదు.
ప్రేమ ఉన్న చోట భయం ఉండదు
జిడ్డు కృష్ణమూర్తి తరచూ చెప్పిన ముఖ్యమైన అంశం ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. కోల్పోతామనే భయం, తిరస్కరిస్తారనే ఆందోళన, అనుమానం, అసూయ వంటి భావాలు ప్రేమను నాశనం చేస్తాయంటారు ఆయన. ప్రేమ అనేది భయానికి వ్యతిరేకమైన స్థితి అని ఆయన భావించారు.
అసూయ ప్రేమకు శత్రువు
ప్రేమ పేరుతో చాలామంది అసూయ సహజమని భావిస్తారు. కానీ జిడ్డు కృష్ణమూర్తి దృష్టిలో అసూయ అనేది ప్రేమకు విరుద్ధమైన భావం. ఎవరినైనా కోల్పోతామనే భయం వల్లే అసూయ పుడుతుందని, అది ప్రేమ కాదు, అభద్రతా భావానికి సంకేతమని ఆయన వివరించారు.
ఆధారపడటం ప్రేమ కాదు
ఒక వ్యక్తిపై పూర్తిగా భావోద్వేగపరంగా ఆధారపడటం ప్రేమ కాదని కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మన ఆనందం, మనశ్శాంతి, జీవితాన్ని పూర్తిగా మరొక వ్యక్తిపై ఆధారపరిస్తే అక్కడ బాధ, నిరాశ, భయం తప్పవని ఆయన చెప్పారు. నిజమైన ప్రేమలో ఇద్దరూ స్వతంత్ర వ్యక్తులుగానే ఉంటారు.
ప్రేమ ప్రతిఫలం ఆశించదు
ప్రేమిస్తే ఎదుటివారు కూడా అదే విధంగా ప్రేమించాలి.. గౌరవించాలి. మన కోసం ఏదైనా చేయాలనే ఆశలు పెట్టుకోవడం సహజమే అయినప్పటికీ జిడ్డు కృష్ణమూర్తి దృష్టిలో అది నిజమైన ప్రేమ కాదు. ప్రేమ అనేది ఎలాంటి షరతులు, లాభనష్టాల లెక్కలు లేకుండా ప్రవహించే భావన అంటారు.
“ప్రేమ పువ్వులా వికసిస్తుంది. అది ఎవరికోసం కాదు; అది తన స్వభావం వల్ల వికసిస్తుంది.” ఈ భావన ద్వారా ప్రేమ అనేది షరతులు లేని స్థితి అని ఆయన తెలియజేశారు.
ప్రేమ నేర్చుకునేది కాదు
జిడ్డు కృష్ణమూర్తి ప్రకారం ప్రేమ అనేది పుస్తకాల ద్వారా నేర్చుకునేది కాదు. ఎవరో నేర్పేది కూడా కాదు. మనసు భయం, కోపం, అసూయ, స్వార్థం వంటి భావాల నుంచి విముక్తి పొందినప్పుడు ప్రేమ సహజంగా వికసిస్తుందని ఆయన చెప్పారు.
జిడ్డు కృష్ణమూర్తి ప్రేమ తత్వం చెప్పే సందేశం
నేటి యాంత్రిక జీవితంలో ప్రేమను చాలామంది సంబంధాలు, అంచనాలు, స్వాధీన భావాలతో ముడిపెడుతున్నారు. అయితే జిడ్డు కృష్ణమూర్తి ప్రేమను ఒక ఉన్నతమైన చైతన్య స్థితిగా చూశారు. ప్రేమ గురించి ఆయన చెప్పిన ఆలోచనలు నేటికీ ఎంతో ఆచరణయోగ్యంగా ఉన్నాయి. ప్రేమను కేవలం భావోద్వేగంగా కాకుండా, స్వేచ్ఛ, అవగాహన, కరుణ, భయరాహిత్యంతో కూడిన జీవన విధానంగా చూడాలని ఆయన సూచించారు. మనలోని స్వార్థం, భయం, అసూయ తొలగినప్పుడే నిజమైన ప్రేమను అనుభవించగలమని ఆయన తత్వం చెబుతోంది.
జిడ్డు కృష్ణమూర్తి గురించి..
ఆంధ్రప్రదేశ్ మననపల్లెలో 1895 మే 11న జన్మించిన జిడ్డు కృష్ణమూర్తి.. 1986 ఫిబ్రవరి 17న మరణించారు. తత్వవేత్త, రచయిత, వక్తగా తన బోధనలు, సిద్ధాంతాలతో ఆయన..మానవ మనస్తత్వం, స్వేచ్ఛ, ధ్యానం, విద్య, అత్మజ్ఞానం తదితర అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిలో కొత్త ఆలోచనలు రేకెత్తించారు. ఆయన బోధనల ప్రధాన సందేశం ఒక్కటే.. నిన్ను నీవు తెలుసుకో, నిజమైన మార్పు నీలో నుంచే ప్రారంభమవుతుంది
https://tv9telugu.com/lifestyle/what-exactly-is-love-from-jiddu-krishnamurtis-teachings-and-thoughts-1874767.html
No comments:
Post a Comment