Tuesday, September 1, 2026

 *వాతాపి – ఇల్వలుడు*🌺

ఇల్వలుడు – వాతాపి అనే రాక్షసులు బలవంతులు, శత్రుభయంకరులు. వారు మణిమతీ పురంలో వైభవోపేతంగా నివసిస్తూండేవారు. వారిలో అన్నగారు ఇల్వలుడు. అతడు ఒకనాడు ఒక విప్రుడిని భక్తితో పూజించి, “నాకు సమస్తమైన కోరికలు నెరవేరే మంత్రాన్ని ఉపదేశించండి” అని కోరాడు. కాని విప్రుడు అట్టి మంత్రోపదేశం చేయకపోవటంతో మరలిపోయి, కామరూపుడైన తన తమ్ముడు వాతాపిని మేకగా మార్చి ఆ మేక మాంసం వండించి, ఆ బ్రాహ్మణుడికి విందు చేశాడు. ఆ బ్రాహ్మణుడి పొట్టలో ఉండే ఆ పౌరుడిని “ఓ వాతాపీ రమ్ము” అని ఇల్వలుడు ప్రీతితో పిలిచాడు. ఆ విధంగా బ్రాహ్మణుడు మరణించాడు. అప్పటి నుండి తన దగ్గరికి అతిథులుగా వచ్చే విప్రులను యమపురికి పంపుతుండేవాడు.

ఇది ఇలా ఉండగా అదే అడవిలో బ్రహ్మచర్య దీక్ష చేస్తూ కఠోర తపస్సు చేస్తున్న అగస్త్య మహాముని ఉండేవాడు. ఒకనాడు లేత తామర చిగురుటాకును ఆధారంగా చేసుకొని తలక్రిందులుగా వ్రేలాడుతున్న తన పితృదేవతలను చూచి “ఈ విధంగా మీరు ఉండటానికి కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. అపుడు పితరులు “మేము నీ పితృ దేవతలం. నీవు వివాహం చేసుకోక, సంతానం ఒల్లక గొప్ప నిష్ఠతో బ్రహ్మచర్యం పాటిస్తూ తపస్సు చేస్తున్నావు కదా. ఆ కారణం చేత మాకు ఉత్తమ గతులు లేకుండా పోయాయి. నీవు వివాహం చేసుకొంటే పిల్లల్ని కంటే మాకు పుణ్యగతి లభిస్తుంది” అన్నారు. 

భారతీయ సంస్కృతి, వాఙ్మయం గృహస్థాశ్రమానికి ప్రాధాన్యతనిస్తూ, జీవితం పండాలన్న సమాజం అభివృద్ధి చెందాలన్నా, మనిషికి ఇహపర సుఖాలు లభించాలన్నా ప్రతి వ్యక్తి వివాహం చేసుకోవాలి. సంతానాన్ని కనాలి. చతుర్విధ పురుషార్ధాలని సాధించాలని పేర్కొంది. 

పితరులు చెప్పిన మాట విని అగస్త్యుడు సరేనన్నాడు. అగస్త్యుడు ఒకసారి విదర్భ రాజుకు తన తపోమహిమ చేత ఒక కూతురును పుట్టించాడు. ఆమె పేరు లోపాముద్ర. నీటిలో పద్మం వలె, విరాజిల్లుతున్న ఆమెను ఎందరో రాకుమారులు వరించ దలచారు, కాని అగస్త్యుడి భయం చేత పెండ్లాడటానికి ముందుకు రాలేకపోయారు. విదర్భరాజు ఆమెకు తగిన వరుడిని వెదుకసాగాడు.

ఒకనాడు అగస్త్యుడు లోపాముద్రను తనకిచ్చి వివాహం చేయమని విదర్భ రాజును కోరినాడు. దానికి విదర్భ రాజు దంపతులు ఇష్టపడలేదు. వారు తమలో తాము ‘ఇతడు నిరుపేద బాపడు అడవిలో ఆకులూ, అలములు తింటూ, నార బట్టలు కట్టుకొని బ్రతికేవాడు. భోగభాగ్యాలతో తులతూగుతున్న నా కూతురుని ఇతడికిస్తే యేమి సుఖపడుతుంది. ఒప్పుకోకుంటే శపిస్తాడేమో? ఎలా చేయాలి’ అని చింతించసాగారు. 

అపుడు లోపాముద్ర వారి మనసునెరిగి, వారితో “మీరు మిక్కిలి చింతించకుండా ఈ ఋషీశ్వరుడికి నన్నిచ్చి పెళ్ళి చేయండి.” అన్నది. తల్లిదండ్రులకై ఇది ఆమె చేసిన త్యాగంగా మరియు అగస్త్యుడిపై అభిమానంగా చెప్పుకోవచ్చును. వారి వివాహం ఘనంగా జరిగింది. వస్త్రాభరణాలు, అలంకారాలు తీసివేసి, నారచీరలు, జింక చర్మం ధరింపజేసి భార్యను తీసుకొని అగస్త్యుడు గంగాతీరం వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకొంటున్నాడు. 

ఒకనాడు ఆమె సౌందర్యానికి పరవశుడై శృంగార భావంతో అగస్త్యుడు లోపాముద్ర దగ్గరికి చేరగా, అతడి అభిప్రాయం గ్రహించి సిగ్గుపడింది. అతడితో “భర్త భార్యను సంతానార్థమై పొందటం సహజమే. కాని నాదో చిన్న కోరిక. నన్ను శోభాయమానమైన వస్త్రాభరణాలతో అలంకరించుము. నీవు కూడా మైపూతలతో, పూలదండలతో, ఆభరణాలతో అలంకృతుడవై నాకు గర్భాదానం చేయుము” అని కోరింది. 

కూతురికి భోగాలు సమకూరవు అని విదర్భ రాజ దంపతులు వివాహానికి ఒప్పుకోకపోతే శపించబడే వారేమో. నాకు లోపాముద్ర భర్తను యద్ధస్థితిలో అంగీకరించింది. నేడు భర్తలో రసోల్లాసం కలుగగానే ఆమెలోని భోగలాలసత్వం సాధారణ స్త్రీ వాంఛా పైకి వచ్చింది. కీలెరిగి వాత పెట్టింది. ముట్టొచ్చినప్పుడే చంక నెక్కాలని పెద్దలు చెప్పారు. భార్య అడిగిన దాన్ని యే భర్త కాదనలేడు. దానికి శపించనూ లేడు. పైగా ఇప్పుడు అగస్త్యుడికి భార్య అవసరం కూడా.

అప్పుడు అగస్త్యుడు “నా తపస్సు మాత్రమే నా దగ్గర ఉన్న ధనం. వేరు ధనం లేదు. తపస్సుతో ధనాన్ని సృష్టించవచ్చు. కాని నేను తపస్సును వ్యర్థం చేయను” అని పలికి ధన సంపాదనకై ప్రయత్నం ప్రారంభించాడు. 

ముందుగా శ్రుతపర్వుడు అనే రాజు దగ్గరకు వెళ్ళి, “నీవు పోషించవలసిన వారి పోషణకు భంగం కలుగకుండా నాకు ధనము నిమ్ము” అన్నాడు. ఆ రాజు అగస్త్యుని పూజించి “నా ఆదాయ వ్యయములు సమానంగా ఉన్నాయి. మిగులు ధనం లేదు” అని చెప్పాడు.

ఆపై వారిరువురు బ్రథ్నశ్వుడి దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు అగస్త్యుని పూజించి “నా ఆదాయ వ్యయాలు సమానం” అని పలికాడు. ఇప్పుడు ఆ ముగ్గురు పురుకుత్సుని కొడుకైన త్రసదస్సుని దగ్గరికి వెళ్ళారు. అతడూ అగస్త్యుని పూజించి అదే సమాధానం చెప్పాడు. చెప్పిన తరువాత “ఈ మణిమతి పట్టణంలో ఇల్వలుడనేవాడు తన తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. అతడు పెద్ద ధనవంతుడు. అతడు మన కోరిక తీర్చగలడు” అని తెలిపాడు.

అందరూ ఇల్వలుడి దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణుడి రాకకు ఆనందించిన ఇల్వలుడు ఎప్పటిలాగే వాతాపిని పచనం చేయించి, ఆ మాంసాన్ని అగస్త్యునికి ఆహారంగా సమర్పించాడు. ఆ విషయం గ్రహించిన ఆ ముగ్గురు రాజులు “ఇల్వలుడు బ్రాహ్మణులకు వాతాపిని ఆహారంగా పెట్టి ఆపై వారి పొట్టలను చీల్చి చంపుతాడు” అని తెలిపారు. “కావున ఈ ఇంటిలో తండి తినరాదు. డబ్బు ఇస్తే తీసుకొని వెళదాం” అన్నారు. 

సముద్రం నీళ్ళను శోషింపచేసిన శక్తి సంపన్నుడైన అగస్త్యుడు వారి మాటలకు భీతిల్లలేదు. సరికదా, పీకల వరకు చక్కగా భోజనం చేశాడు. ఇల్వలుడు ఎప్పటివలెనె తమ్ముడిని పిలిచాడు. ఆ సంగతి గుర్తించిన అగస్త్యుడు పొట్టను నిమురుకుంటూ గర్రన తేన్చాడు. అంటే వాతాపి అగస్త్య మహర్షి పొట్టలో జీర్ణమైపోయాడు. ఇల్వలుడు అగస్త్యుడికి మహిమకు భయపడి, విషాదం చెంది ఖిన్నుడైనప్పటికీ తన మోసం బయట పడకుండా పైకి సంతోషాన్ని ప్రకటిస్తూ, “మీకేం కావాలి కోరుకోండి” అన్నాడు. 

అగస్త్యుడు “ఈ రాజన్యులతో నేను ధనార్థినై వచ్చాను. నీవు ధనాఢ్యుడివని విన్నాను” అన్నాడు. “అలాగే మీరు కోరినట్లే చేస్తాను” అన్నాడు ఇల్వలుడు. 

అగస్త్యుడు “పదివేల ఆవులు, పదివేల బంగారు నాణాలు ఒక్కొక్క రాజుకు ఇమ్ము. వారొక్కొక్కరికి ఇచ్చినదానికి రెట్టింపు గో ధనాన్ని, బంగారు తేరును నాకిమ్ము” అన్నాడు. 

ఇల్వలుడు రాజులకు అలాగే ఇచ్చాడు. అగస్త్యుడికి విరావ, సురావాలు అనే గుర్రాలను కట్టిన బంగారు తేరును ఇరవైవేల ఆవులను, ఇరవై వేల బంగారు నాణాలను ఇచ్చాడు. ఆ విధంగా రాజులు కూడా తగిన సంపదలు పొంది, అక్కడి నుండి నిష్క్రమించారు. 

అగస్త్యుడు ఆ సంపదతో లోపాముద్ర కోరిక నెరవేర్చాడు. ఆపై అగస్త్యుడు “పదిమందితో సమానులయిన వందమంది కొడుకులు కావాలా? నూరు మందితో సమానులయిన పదిమంది కొడుకులు కావాలా? వేయిమంది కొడుకులు కావాలా? వేయిమందికి సాటియైన ఉత్తముడైన ఒక కొడుకు కావాలా?” అని లోపాముద్రను అడిగాడు. 

“వేయిమందితో సమానుడు, బలశాలి, బుద్ధిశాలి అయిన కొడుకు కావాలి. బుద్ధిహీనులు వేయిమంది కొడుకులు ఉన్న లాభమేమిటి?” అని పలికింది.

ఆమె కోరిన వరము నిచ్చి లోపాముద్రకు గర్భాదానం చేశాడు అగస్త్యుడు. ఆపై లోపాముద్రకు దృఢస్యుడు, వాడికి ఇధ్మవాహుడు పుట్టి, అగస్త్యుడు పుత్ర పౌత్రులతో వృద్ధి చెందాడు. అతడి పితరులు ఉత్తమ లోకాలు పొందారు.

గృహస్థాశ్రమం ఎంత గొప్పదైనా ధనం లేకుంటే దాన్ని వెళ్ళదీయడం కష్టం. గృహస్థాశ్రమ నిర్వహణ చేత పితరులు తృప్తి పొందుతారు. లోపాముద్ర పతివ్రతా, తపస్వి భార్య అయినా సాధారణ స్త్రీలా ఐహిక వాంఛలు కోరటం, అగస్త్యుడు తపస్వియైనా భార్య కోరిక నెరవేర్చడానికి తపోశక్తి వ్యర్థం చేయక, సాధారణ వ్యక్తిలా ధన సంపాదన ప్రయత్నం చేయటం, భార్య కోరిక భర్త తీర్చాలన్న ధర్మాన్ని నెరవేర్చటానికి గడప గడప దొక్కటం,  వంటి అంశాలు కలిగినది ఈ కథ.

‘జీర్ణం.. జీర్ణం.. వాతాపి జీర్ణం’ అని ఒకప్పుడు తమ పిల్లలకు పాలు పట్టి, పొట్ట నిమురుతూ పాడేవారు. అంటే ఏది తిన్నా ఎలాంటి ప్రమాదం రాకుండా జీర్ణమైపోవాలని భావించేవారు.

అరణ్య పర్వం ద్వితీయాశ్వాసం లోనిది.
రోమశుడు ధర్మజునికి చెప్పిన కథ.        *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment